సత్తెనపల్లి ఘటనపై ప్రత్యేక దృష్టి
పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై రాజకీయాలు చేయవద్దన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు. దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సత్తెనపల్లి ఘటన పై ప్రత్యేక దృష్టి పెట్టింది సీఎంవో. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్క సారిగా ఇంత మంది ఎందుకు అనారోగ్యం పాలయ్యారు అని దర్యాప్తు చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు. రెండు వందల మంది విద్యార్థినులు అనారోగ్యం పాలైన ఘటనలో ఎవరిని ఉపేక్షించం అన్నారు. ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు…పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రస్తుతం మా మొదటి కర్తవ్యం అన్నారు. తల్లి దండ్రులు ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు. గురుకుల పాఠశాలలో అనారోగ్యం పరిస్థితుల నేపథ్యంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు.
చావడానికైనా రెడీ.. నోటీసులిచ్చినా భయపడను
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులిచ్చారు. ఈ విషయమై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోను అప్ లోడ్ చేశారని రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఇదే తరహ కేసులు రాజాసింగ్ పై నమోదు కావడంతో రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ ను నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద పోలీసులు గత ఏడాది ఆగస్టు 25న అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టు 2022 నవంబర్ 9న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇకపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని కూడా కోర్టు సున్నితంగా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను రాజాసింగ్ ఉల్లంఘించి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
మెగా గ్రాండ్ గా లాంచ్ అయిన నాని నెక్స్ట్ మూవీ
దసరా టీజర్ తో పాన్ ఇండియా రేంజులో హీట్ పెంచిన నాని, తన 30వ సినిమాని మొదలు పెట్టాడు. కూల్ బ్రీజ్ లాంటి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకి రానున్న నాని, 30వ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. విజయేంద్ర ప్రసాద్, బుచ్చిబాబు సన, డీవీవీ దానయ్య, కిషోర్ కుమార్ తిరుమల లాంటి నాని కొల్జ్ సర్కిల్ గెస్టులుగా వచ్చి ‘నాని 30′ లాంచ్ ఈవెంట్ కి మరింత స్పెషల్ చేశారు. మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లాంచ్ కి ఆమె వస్తుందని చాలా మంది వెయిట్ చేశారు కానీ మృణాల్ రాకపోవడంతో డిజప్పాయింట్ అయ్యారు.’నాని 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో నాని, ఒక పాపతో కూర్చోని ‘నాని 30’ గురించిన డీటైల్స్ ని చాలా ఇంటరెస్టింగ్ గా చెప్పాడు. గడ్డంతో ఉండను, మీసాలు ఉంచను, జుట్టు మాత్రమే ఉంచుతాను అని తన లుక్ గురించి హింట్ ఇచ్చిన నాని… చెప్పినట్లుగానే కర్లీ హెయిర్ తో, గడ్డం లేకుండా లవర్ బాయ్ లా కనిపించాడు. ఈ సినిమాని ‘శౌర్యువ్’ డైరెక్ట్ చేస్తున్నాడు.
అప్పుడు కరువుతో విలవిల.. నేడు జలాశయాలు కళకళ
ఏపీలో వైసీపీ, టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. వివిధ అంశాలపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు, ఎల్లోమీడియా కథనాలపై మండిపడ్డారు. వ్యవసాయం గురించి పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. అవగాహన లేకుండా తెలుగు దేశం.పార్టీ.కి ప్రయోజనం కలిగించేందుకు రాసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో రైతులు కరవుతో విలవిల లాడారు. రైతులకు ఉన్న సాగునీరు కూడా అందించలేక పోయారన్నారు మంత్రి కాకాణి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు 70 శాతం కరవు మండలాలే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మండలాన్ని కూడా ప్రకటించ లేదు. పశువులకు ఆహారం. నీళ్లు లేక రైతులు అమ్ముకున్నారు. జగన్ హయాంలో జలాశయాలు పూర్తి గా నిండుతున్నాయి.. వర్షాలు కురవడంతో రైతులు సమృద్దిగా పంటలు పండించుకుంటున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.
కోలుకుంటున్న తారకరత్న.. లిక్విడ్స్ పంపుతున్న వైద్యులు
బెంగళూరు నారాయణ హృదయాలయలో నటుడు తారకరత్నకు వైద్యం అందుతోంది. విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఉందంటూ నిన్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు NH వైద్యులు. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాలతో సపోర్టు తో చికిత్స కొనసాగుతోంది.. ఏక్మో సపోర్టు తారకరత్నకు అందించలేదని నారాయణ హృదయాలయ వైద్యులు స్పష్టం చేశారు. తారకరత్న పరిస్థితిని కుటుంబానికి నిరంతరం తెలియజేస్తున్నామన్నారు వైద్యులు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Bangalore Narayana Hrudayalaya) ఆసుపత్రికి ఒక్కొక్కరుగా వెళుతున్నారు. బాలకృష్ణ (Bala Krishna) దగ్గరుండి మరీ తారకరత్నను (TarakaRatna) చూసుకుంటున్నారు. శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కూడా తారకరత్నకు చికిత్సనందిస్తున్న ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కుటుంబీకులకు సూచించారు. భర్తకు గుండెపోటు రావడం, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుమిలిపోతున్న తారక రత్న భార్య అలేఖ్యారెడ్డిని ఓదార్చుతూ, ధైర్యం చెబుతూ చల్లా భార్య సుప్రియారెడ్డి కూడా బెంగళూరులోని ఆసుపత్రిలోనే ఉన్నారు. తారకరత్న ఆరోగ్యంపై ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మీట నొక్కగానే సమస్త సమాచారం …ఆర్టీసీలో టెక్నాలజీ అప్ గ్రేడ్
తెలంగాణ ఆర్టీసీకి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చర్యలు చేపట్టిందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సాంకేతికతతో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒరాకిల్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అమలుకు నల్సాప్ట్ కంపెనీతో టీఎస్‌ఆర్టీసీ ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్ బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నల్సాఫ్ట్ సీఈవో సీఏ వెంకట నల్లూరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇలా ఒప్పందం కుదుర్చుకోవటం దేశంలోనే అన్ని ఎస్‌ఆర్‌టీయూలో ఇదే మొదటిది.అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో తెలంగాణ ఆర్టీసీ ముందంజలో ఉందని, సాంకేతికత ద్వారానే వేగంగా ప్రయాణికులకు చేరువ అవుతున్నామనే విషయాన్ని సజ్జనార్ గుర్తు చేశారు. ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్‌ఎస్), బస్ పాసుల జారీ, లాజిస్టిక్, పార్శిల్ సేవలు, బస్సు ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ఆధారంగా యూపీఐ చెల్లింపులు, బుకింగ్ కౌంటర్ల ఆన్‌లైన్, ప్రజల సౌకర్యార్థం అద్దె బస్సుల బుకింగ్, ప్రయాణ టికెట్‌తో పాటు తిరుపతి దేవస్థానం శీఘ్ర దర్శన సదుపాయాన్ని ఆన్‌లైన్ ద్వారానే అందిస్తున్నామని చెప్పారు.
వసుధ ఫార్మాలో ఐటీ సోదాలు.. ఏపీలోనూ తనిఖీలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి ఐటీ సోదాలు. హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, నరసాపురం, వైజాగ్, రాజమండ్రిలో కొనసాగుతున్నాయి సోదాలు. వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల పై ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు తనిఖీలు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ వెంగళరావు నగర్ లో రెండు టీమ్ లు, మాదాపూర్ లోని మరో కార్పొరేట్ కార్యాలయంలో నాలుగు టీమ్ లు సోదాలు జరుపుతున్నాయి. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు వెంకట రామరాజు. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు అధికారులకు లభించాయి. వాటి ఆధారంగా సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ (Vasudha Pharma Chem Limited ) లో ఎంవీ రామరాజు ఛైర్మన్ గా వున్నారు. ఎంఎఎస్ రాజు, ఎం ఆనంద్, ఎంవీఎన్ మధుసూదన్ రాజు, ఎంవీఎస్ఎన్వీ ప్రసాద్ రాజు, ఎం.వరలక్ష్మి, కె.వెంకటరాజు, జి.వెంకటరమణ రాజు, డా.పీవీ అప్పాజీ, కొత్తపల్లి శ్రీహరి వర్మ సభ్యులుగా వున్నారు. వసుధ ఫార్మా రాజు 1995 లో సాధారణ స్థాయి నుంచి ఎదిగారు. అద్దె ఇంటి నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన రాజు అంచెలంచెలుగా ఎదిగారు. వెంగళరావు నగర్ లో అద్దె ఇంటి నుంచి ప్రస్థానం మొదలుపెట్టారు. వసుధ ఫార్మా టర్నోవర్ 500 నుంచి 1000 కోట్లకు చేరుకుంది. కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు.
గుట్టల కొద్దీ డబ్బు… సంచుల్లో పట్టుకెళ్ళిన ఉద్యోగులు
ప్రపంచంలోని ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖర్చు తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు లక్షల మంది ఉద్యోగుల జాబ్‌లు ఊడిపోయాయి. ఇంకా ఎంతమంది రోడ్డున పడతారో కాలమే చెప్పాలి. ఇది ఇలా ఉంటే చైనాకు చెందిన ఓ సంస్థ మాత్రం తన ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్‌ను ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. బోనస్ కింద 30 మందికిపైగా ఉద్యోగులకు దాదాపు రూ.73 కోట్లు అందజేసింది. అంతేకాదు, ఆ మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఆ డబ్బును కట్టకట్టలుగా వేదికపై పేర్చి పంచిపెట్టింది. దీంతో ఆ నగదును తీసుకెళ్లడానికి ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకుని నింపుకెళ్లడం గమనార్హం.