NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

బీజేపీ అధికారంలోకి రాబోతోంది

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లండి. మహిళలను కలవండి. అట్లాగే టీఆర్ఎస్ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులతోపాటు వారి ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోండి.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ మహిళా విధానాలు, పరిశోధన విభాగం ఇంఛార్జ్ కరుణా గోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి సహా పలువురు మహిళా నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇతర పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం లేదని, ప్రజల్లోకి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించడంతోపాటు వారు ఏం కోరుకుంటున్నారో అధ్యయనం చేసి మేనిఫెస్టోను రూపొందిస్తున్నామన్నారు.

గవర్నర్ తమిళిసై పై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం

గవర్నర్ తమిళసై పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. గవర్నర్ ఈ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తు‌న్నారు మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ఇలాంటి గవర్నర్ ను ఇప్పటివరకు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఆమెకు కనిపించట్లేదా అని ఆయన ప్రశ్నించారు. అంతపెద్ద సెక్రెటరియేట్ నిర్మాణం కనిపించడం లేదా.. అది అభివృద్ధి కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరుగుతోందా అని ఆయన అన్నారు. రైతు సంక్షేమ రాష్ట్రంలో గవర్నర్ కు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయా? అని ఆయన మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. గణతంత్ర వేడుకల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని స్కూల్ ఆవరణ, స్థానిక మసీదులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం, తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరచిపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.

భీమవరంలో ఘనంగా రిపబ్లిక్ డే

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఓపెన్ టాప్ వెహికల్ ద్వారా జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ వివిధ పెరేడ్ కవాతులను రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.శ్రీకాంత్ పర్యవేక్షణలో పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రసంగపాఠాన్ని చదివి వినిపించారు. స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలర్పించిన వ్యక్తులందర్నీ ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 74 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రస్తావిస్తూ జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 2.20 లక్షల మంది రైతులకు రూ 110 కోట్లను రైతు భరోసా సాయంగా అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని రైతాంగానికి 6,183 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించడం జరుగుతుందన్నారు 53,730 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు అందించి సాగుకు రుణాల అందించడం జరిగిందన్నారు. అలాగే ఉచిత పంటలు బీమా పథకం కింద 50,314 మంది రైతులకు 100 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా అందజేయడం జరిగిందన్నారు.

కొడంగల్ లో హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభం

కొడంగల్ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ ను లాంఛనంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మదనపల్లి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి యాత్ర కరపత్రాలను విడుదల చేశారు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 6 నుంచి 60రోజులపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్లు..నేను పీసీసీ అధ్యక్షుడినైనా.. మీ వాడిని అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో మీరు ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసామని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పేదవాడికి అన్నిరకాల సహాయం అందించిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. పంట బీమా ఇవ్వకుండా… రైతు చనిపోతే డబ్బులిస్తాడట అంటూ ఆయన ధ్వజమెత్తారు. ధరణి దరిద్రం పోవాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ కేసీఆర్ పోయినా ఆగదని, అంతకు అంతకు కలిపి ఆ కళ్యాణ లక్ష్మీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర.. హారతులిచ్చిన జనం
యాంకర్ వాయిస్:అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కాసేపల్లిలో ప్రజా సంక్షేమ యాత్ర భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ప్రజా సంక్షేమం కోసం తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండలంలో అన్ని గ్రామాలలో 11 రోజుల పాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర చేపట్టారు ఇందులో భాగంగా మొదటి రోజు కాసేపల్లి, గుత్తి అనంతపురం కొత్తపల్లివిరుపాపురం, ఆవులంపల్లె వరకు పాదయాత్ర సాగింది .ఆయన పాదయాత్రలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు పూలు చల్లుతూ మహిళలు హారతులు ఇచ్చారు. పాదయాత్రలో ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలని వారికి మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రజా సంక్షేమ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. పెద్దవడుగూరు మండలంలో 11 రోజులపాటు అన్ని గ్రామాలలో పాదయాత్ర తర్వాత యాడికి మండలంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

ప్రభుత్వం తీరుపై మండిపడ్డ రాజాసింగ్.. పాడైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం

పాడైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రిపైర్ చేసి మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు కూడా వాహనంలో సౌండ్స్ వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజా సింగ్ బతుకుతే ఎందీ? చస్తే ఏంది? అనే ఫీలింగ్ లో కేసిఆర్ ఉన్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యే లకు కొత్త కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని, నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు ఇదివరకే లేఖ రాశానన్నారు. అయినా అదే వాహనాన్ని బాగు చేసి నాకు తిరిగి పంపించారని ఆయన పేర్కొన్నారు. మీకు ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెహికిల్ ఇచ్చామని అధికారులు అంటున్నారని, మీరు దానిలోనే తిరగాలని పోలీసులు నోటీసులు ఇస్తున్నారన్నారు. తిరగకపోతే కూడా నోటీసులు ఇస్తున్నారని, తిరిగితే బండి ఎప్పుడు పాడు అవుతుందో అర్థం కావట్లేదని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇదే వెహికిల్ పంపించమని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వాహనం ఐదు సార్లు నడిరోడ్డుపై నిచిలిపోగా.. ఇటీవల శంషాబాద్ నుంచి వస్తుండగా పురాణాపూల్‌ సర్కిల్లో ఆగిపోయింది. తరచుగా తన వాహనం రోడ్డుపై ఆగిపోతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ చెబతున్నారు.

బాబాయ్ పాటపై కన్నేసిన అబ్బాయ్
బింబిసార చిత్రం హిట్ తో జోరు పెంచేశాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా తరువాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో అమిగోస్ ఒకటి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం అందరి చూపు ఈ సాంగ్ మీదనే ఉంది. ఎందుకంటే ఈ సాంగ్ నందమూరి బాలకృష్ణ హిట్ సాంగ్ కాబట్టి.

వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్

క్రీడాభిమానులు శార్దూల్ ఠాకూర్‌ని ‘ద లార్డ్’గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే.. అతడు ఎన్నోసార్లు టీమిండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కీలక వికెట్లు తీసి గట్టెక్కించాడు. అంతెందుకు.. రీసెంట్‌గానే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేలో మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో.. చివర్లో బ్రేస్‌వెల్ వికెట్ తీసి, జట్టుని గెలిపించాడు. మిగిలిన రెండు మ్యాచెస్‌లోనూ బాగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే.. శార్దూల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతనికి చోటు దక్కుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశాడు. ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. బంతిని పెద్దగా స్వింగ్‌ చేయలేడని మనం భావించినప్పుడల్లా.. మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు కూడా పడగొడుతున్నాడు. అతడు గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ వేయకపోయినా.. నంబర్‌ 1గా ఎదుగుతాడు. వరల్డ్‌కప్‌ జట్టులో ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నా. అంతేకాదు.. ఎనిమిదో స్థానంలో శార్దూల్ బాగా బ్యాటింగ్‌ చేయగలడు. మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే.. మరో మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం ఇర్ఫాన్‌ అభిప్రాయంతో ఏకీభవించలేదు. వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కకపోవచ్చని అన్నాడు. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడని, అతడు పేస్ ఆల్‌రౌండర్ కాబట్టి, శార్దూల్‌కి చోటు కష్టమేనని తేల్చేశాడు.

Show comments