NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

భారత్ జోడో యాత్రలో రాహుల్ తో ఊర్మిళ నడక

అందాల నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం శివసేనలో ఉన్న ఆమె.. ఈ ఉదయం 8 గంటలకు నగ్రోటా జిల్లాలోని గారిసన్‌ పట్టణంలో భారత్‌ జోడో యాత్ర మొదలైన కాసేపటికే వచ్చి కలిశారు. రాహుల్‌గాంధీతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్‌గాంధీతో చాలాసేపు మాట్లాడుతూ కనిపించారు.కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ఆర్మీ గారిసన్ దగ్గర నుంచి యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే ఊర్మిళ మటోండ్కర్ రాహుల్ గాంధీతో చేరారు, కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు వారికి స్వాగతం పలికేందుకు మార్గం వెంట రోడ్డుపై బారులు తీరారు.ఊర్మిళ మటోండ్కర్(48) సెప్టెంబర్ 2019లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, 2020లో శివసేనలో చేరారు. క్రీమ్-కలర్ సంప్రదాయ కాశ్మీర్ ఫెరాన్ (వదులుగా ఉన్న గౌను), బీనీ క్యాప్ ధరించి ఊర్మిళ మటోండ్కర్ రాహుల్‌ గాంధీతో కలిసి నడిచారు. ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రాతో పాటు వందలాది మంది చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని వారితో చేరారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర గురువారం పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించి సోమవారం జమ్మూ నగరానికి చేరుకుంది. ఈ నెల 30న కశ్మీర్‌లో యాత్ర ముగియనుంది. అదేరోజు శ్రీనగర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ క్రికెట్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

ఆప్-బీజేపీ పోరు.. మరోసారి నిలిచిపోయిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ సమావేశంలో ఎన్నిక సందర్భంగా ఆప్, బీజేపీ కార్పిరేటర్ల ఆందోళనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరోసారి నిలిచిపోయింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత సమావేశమయ్యే మొదటి సభలోనే మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవలసి ఉన్న సభలో గందరగోళంతో గతంలో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సమావేశాల్లో ఆందోళన నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 134 వార్డుల్లో ఆప్ గెలవగా.. 104 వార్డులకు బీజేపీ పరిమితం అయింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. డిసెంబరు 4న పౌర ఎన్నికలు నిర్వహించగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరిగింది. తొలి సమావేశం జనవరి 6న జరగగా.. మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోకుండానే వాయిదా పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, నామినేటెడ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో గొడవ చెలరేగింది. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ.. నామినేటెడ్ సభ్యుల కన్నా ముందుగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యులను నియమించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం తెలిపింది.

ప్రతిపక్షాల నోరు మూయించేందుకు జీవో నెంబర్1
ఏపీలో జీవో నెంబర్ ఒకటిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఒకవైపు కోర్టులో వాదనలు కొనసాగాయి. అటు విపక్షాలు కూడా జీవో నెంబర్ 1 ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జీఓ నం. 1 పై వాదనలు‌ ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ జీవోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రస్తావనను అమలు చేయాలని కోర్టును ఆశ్రయించాం అన్నారు. 2020లో పిటిషన్ వేస్తే నిన్న విచారణకు వచ్చింది. నిన్నటి నుంచి జీవో నెంబర్ 1పై విచారణ జరుగుతుంది. పోలవరం అంశం కోర్టులో ఇవాళ కూడా విచారణకు రాలేదు. పోలవరం కేంద్రమే పూర్తి చేసి అప్పచెప్పాలనే మా వాదన. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు జీవో నెంబర్1 ఉపయోగపడుతుందన్నారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిడి ఉంటే ఏ యాత్ర అయినా సూపర్ సక్సెస్ అవుతాయి. ఇదిలా ఉంటే జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేయాలని కోరారు టీడీపీ తరపు న్యాయవాది. అయితే హైకోర్టు అందుకు నిరాకరించింది. మొత్తం మీద జీవో నెంబర్ 1 పై హైకోర్ట్ ఏం తేలుస్తుందోనన్న ఉత్కఠ నెలకొంది.

వణికిస్తున్న పెద్ద పులి.. అర్థవీడు మండలంలో భయం భయం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో పెద్దపులి హల్ చల్ చేస్తుండడంతో జనం వణికిపోతున్నారు. అర్ధవీడు మండలంలో పెద్దపులి టెన్షన్ వేధిస్తోంది. మూడు రోజులగా మాగుటూరు, కాకర్ల, వెలగలపాయ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది పెద్దపులి. కాకర్ల పలనరవ సమీపం లోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవును చంపి తినేసింది పెద్దపులి. వెలగలపాయలో మరో ఆవుపై దాడి.. ఆవు పై దాడి చేస్తున్న క్రమంలో రైతులు కేకలు వేయడంతో పారిపోయింది పెద్దపులి. పెద్దపులి సంచారాన్ని ధ్రువీకరించారు అటవీశాఖ అధికారులు. పెద్దపులి సంచారం కారణంగా తీవ్ర ఆందోళనలో స్థానిక గ్రామస్తులు వున్నారు. పెద్దపులిని పట్టుకుని తమని కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు స్థానికులు.

నడక మంచిదే.. ప్రజలకు ఒరిగేదేంటి?

ఏపీలో పాదయాత్రల విషయంలో ఒకరినొకరు పోటీపడుతున్నారు. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై తనదైన రీతిలో స వేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. నడక చాలా మంచిది.. ముఖ్యంగా లోకేష్ లాంటి వ్యక్తులకు మరింత మంచిదని సలహా ఇచ్చారు. నడవడానికి పర్మిషన్లు అవసరం లేదు..నీవు నడవచ్చు లోకేష్.. నీ ఆరోగ్యం మెరుగు పరుచుకునే యాత్రకు యువగళం అనే పేరేందుకు‌…? లోకేష్ మీ నాన్న గారు యువకులకు చేసిన మోసం ..ఈ రాష్ట్రంలో ఏ యువకుడు మర్చి పోలేదు..? బాబు వస్తే జాబు వస్తాదని అన్నావు.ఇంటికో ఉద్యోగం అన్నావు..ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు..? ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగావు..? ముఖ్య మంత్రి యువ నేస్తం అని నిరుద్యోగులకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తానన్నావు.. ఎంతమందికి ఇచ్చావు..? మా నియోజకవర్గంలో 50 మందిని చూపించు . ముఖ్య మంత్రి యువ నేస్తం కాదిది…యువమోసం. మోసాల మీద వెన్నుపోట్ల మీద అధికారంలోకి వచ్చినటువంటి దౌర్భాగ్య చరిత్ర మీది. మీ నాన్నగారిది..అసెంబ్లీలో మాట్లాడటానికి గొంతు నొక్కే సారని మండిపడ్డారు.

‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’లో ఏమైంది?
వారధి క్రియేషన్స్ పతాకంపై జైదీప్ విష్ణు తెరకెక్కించిన సినిమా ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’. దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ టీజర్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ఈ టీజర్‌లో డైలాగ్స్, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్‌.. ఇలా అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రధానమైన కారెక్టర్లను చూపించారు. దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాకు ఎడిటర్‌గానూ పని చేయగా, కథను అందించిన సంతోష్ మురారికర్ కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా-బోపన్న జోడీ

కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీకి వాకోవర్ లభించడంతో ఈ అవకాశం లభించింది. లాత్వియా, స్పెయిన్‌కు చెందిన జెలెనా ఒస్టాపెంకో-డేవిడ్ వెగా జోడీతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ జోడీ క్వార్టర్స్ నుంచి తప్పుకోవడంతో సానియా, బోపన్న సెమీస్ చేరారు. అంతకు ముందు ఉరుగ్వే, జపాన్ జోడీ ఏరియల్ బెహార్-మకాటో నినోమియాపై 6-4, 7-6 తేడాతో గెలిచి క్వార్టర్స్ చేరింది సానియా, బోపన్న జంట.తాజాగా, క్వార్టర్స్ ఆడకుండానే సెమీస్ ఛాన్స్ దక్కడంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో సానియా నిలిచింది. కాగా, విమెన్స్ డబుల్స్ బరిలోనూ దిగిన సానియాకు రెండో రౌండ్లోనే నిరాశ ఎదురైంది. కజకిస్థాన్‌కు చెందిన ఏనా డానిలినాతో కలిసి డబుల్స్ బరిలో దిగిన సానియా.. రెండో రౌండ్‌లో బెల్జియం, ఉక్రెయిన్ జోడీ అలీసన్ వాన్ ఉయ్‌ట్వాంక్-అనెలినా కలినినా జోడీ చేతిలో పరాజయం పాలైంది. సానియా గతేడాది యూఎస్ ఓపెన్ తర్వాతే రిటైర్ అవుతున్నట్లు మొదట అనౌన్స్ చేసింది. అయితే గాయం కారణంగా ఆ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ గాయంతో మూడు నెలల పాటు టెన్నిస్‌కు దూరమై ఈ మధ్యే తిరిగి రాకెట్ పట్టిది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఆడేసి ఆటకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది.

దేశం కోసం భగత్ సింగ్ ఆడియో ఆవిష్కర‌ణ‌!

గ‌తంలో ”అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం” లాంటి చిత్రాల‌ను నిర్మించిన రవీంద్ర గోపాల తాజాగా ‘దేశం కోసం భగత్ సింగ్’ సినిమా తీశారు. ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను మంగళవారం ఫిలించాంబ‌ర్ లో ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌ మాట్లాడుతూ, ”అల్లూరి సీతారామ రాజు, భ‌గ‌త్ సింగ్, సుభాష్ చంద్ర‌బోస్… ఇలా స్వాతంత్ర్య స‌మ‌రయోధుల పాత్ర‌లంటే అన్న ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. అలాంటిది రవీంద్ర గోపాల్ సాహసం చేసి ఈ సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల పాత్ర‌లు వేశాడు. త‌న మీద త‌న‌కు ఎంతో న‌మ్మ‌కం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. త‌న‌ కోసం కాదు.. ఇది దేశంకోసం చేసిన సినిమా” అని అన్నారు.