NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

కుప్పంలో చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో జరిగిన గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచాడని ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన దొంగ ఓట్లతో ఇన్నాళ్ళూ గెలిచాడని.. ఇప్పుడు ఆ ఓట్లు పోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తరిమికొట్టారని మంత్రి రోజా విమర్శలు చేశారు. దొంగ ఓట్లతోనే చిత్తూరు ఎంపీ సీటు గెలుస్తున్నాడని అన్నారు. నారా లోకేష్‌ది యువగళం కాదని.. తెలుగుదేశం పార్టీకి మంగళం పాడే కాలమని ఎద్దేవా చేశారు. లోకేష్ వార్డు మెంబర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు చాలా చాలా తక్కువ అని చురకలు అంటించారు. తండ్రి సీఎం, తాను మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అంటే లోకేష్ కంటే వెస్ట్ లీడర్ ఎవరు లేడని మంత్రి రోజా అన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో ఎవరికీ తెలియడం లేదని రోజా కౌంటర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌ది యువ శక్తి కాదు ముసలి శక్తి అని ఆరోపించారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి అ కులం వాళ్లందరినీ రోడ్డుమీద వదిలేశారని.. మళ్ళీ ఇప్పుడు ఆయన తమ్ముడు మరో పార్టీ పెట్టి మరోలా డ్రామా ఆడుతున్నారని విమర్శలు చేశారు

కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలి

దేశంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను దూరం పెట్టాలన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బ్రిటీష్‌వాళ్లు మన సంపద దోచుకొని పోయారు.. మన సంస్కృతిని నాశనం చేసి, వారి సంస్కృతి రుద్దేసి వెళ్లిపోయారు.. మాతృభాష కళ్లు లాంటిది, పరాయి భాష కళ్లద్దాల్లాంటివన్నారు వెంకయ్యనాయుడు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారతమాత మహా హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ నేతలు, ప్రజలు. గత ఐదేళ్లుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మహా హారతి కార్యక్రమం చోటు సంపాదించుకుంది. కార్యక్రమ ప్రాంగణంలో భారతమాత భారీ విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంది. త్రివర్ణ పతాక రంగుల్లో భారీగా హాజరైన విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది హుస్సేన్ సాగర్ తీరం. దేశ భక్తిని తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు వెంకయ్యనాయుడు. మనమంతా ఒక్కటే అనే భావన ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలా?

సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయని, ప్రభుత్వ విధానాలను గవర్నర్ చెబుతారన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు. అయితే తెలంగాణలో మాత్రం గవర్నర్ ప్రసంగం లేకపోవడం ఇది రెండో సారి అన్నారు. గవర్నర్ స్పీచ్ లేదంటే ప్రభుత్వానికి విధివిధానాలు లేనట్టే…తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం కూడా తీసుకోను అని ఆమె చెప్పారు. రాజ్యాంగం లో ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి కాదు కానీ అది సంప్రదాయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు గవర్నర్ ను టార్గెట్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీ నీ ప్రో రోగ్ చేయకపోతే ఆర్డినెన్సు కూడా తీసుకురాలేరు… ఇది తెలంగాణ ప్రజలకు నష్టం. కెసిఆర్ నిజాం కు ఎంత మంచి అభిమాని అయిన …. నిజాం పాలన తీసుకు వస్తా అంటే తెలంగాణ ప్రజలు సహించరు..గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వరు .గవర్నర్ ప్రజా దర్బార్ పెడితే మీకేమి నొప్పి…మీ ఇగో లు పక్కన పెట్టండి.

8నెలల గర్బిణీ.. ఉద్యోగంలోంచి తీసేసిన గూగుల్

ఐటీ ఉద్యోగుల తొలగింపుల్లో రోజుకో ఉద్యోగి విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సంస్థతో దశాబ్ధాల అనుబంధం ఉన్న ఉద్యోగి అయినా.. కొత్తగా జాబ్ లో చేరిన వారు అయినా ఎలాంటి భేదాలు లేకుండా ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. తాజాగా గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్ 50 శాతం ఉద్యోగులను, మెటా 11,000 మందిని, అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా గూగుల్ అమెరికాకు చెందిన కేథరీన్ వాంగ్ అనే ప్రోగ్రామ్ మేనేజర్ ని తొలగించింది. ప్రస్తుతం ఆమె తన ఆవేదనను లింక్డ్ ఇన్ ద్వారా వెల్లడించింది. 8 నెలల గర్భిణి, మరో వారంలో ప్రసూతి సెలవులు ఉంటాయి అనే సమయంలో హఠాత్తుగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది గూగుల్. కాలిఫోర్నియాకు చెందిన కేథరీన్, ఉద్యోగం నుంచి తొలగిస్తూ పంపిన ఈమెయిల్ చూడగానే గుండె చలించిపోయిందని పేర్కొంది. కొన్ని రోజుల్లో నా బిడ్డను చూస్తానని అనుకుంటూ సెలవులు తీసుకుంటున్న సమయంలో నా ఫోన్ చూడగానే నా గుండె జారిపోయింది అని, ఉద్యోగం కోల్పోయిన 12,000 మందిలో తాను కూడా ఒకరిని అని లింక్డ్ ఇన్ పోస్టులో రాసుకొచ్చింది.

పసిపిల్లలు ఏడుస్తున్నా కేసీఆర్ మనసు కరగడం లేదా?

టీచర్ల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. తల్లులను, పిల్లలను వేరు చేసి అరెస్ట్ చేస్తారా? ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప మనవ సంబంధాలు, భావోద్వేగాలు పట్టవా?మానవత్వం లేని మృగానివి. వినాశకాలే విపరీతబుద్ధి. ప్రజాస్వామ్యవాదులారా…. స్పందించండి. అసలు టీచర్లు చేసిన తప్పేంటి?… భార్యభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలనడమే నేరమా? తక్షణమే భేషరతుగా టీచర్లను విడుదల చేయాలి. 317 జీవో సవరణపై ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి. బీజేపీ అధికారంలోకి రాగానే 317 జీవోను సవరిస్తాం. 317 జీవోను సవరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్దంగా గత రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులపట్ల పోలీసుల అనుసరించిన వైఖరి అత్యంత అమానుషం. మహిళలు, పసిపిల్లలని కూడా చూడకుండా వేరు చేయడం దుర్మార్గం. చంటిపిల్లలు ఏడుస్తున్నా తల్లిని, పిల్లలను వేరు చేస్తూ ఈడ్చుకుంటూ అరెస్ట్ చేయడం సిగ్గు చేటు. టీచర్లను అరెస్ట్ చేస్తున్న తీరును చూసి సభ్యసమాజం అసహ్యించుకుంటోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ కు మానవత్వం లేదని మరోసారి రుజువైంది. పిల్లలతో కలిసి టీచర్ల కుటుంబాలు నడిరోడ్లపై ధర్నాలు, ఆందోళన చేస్తున్నా, పసిపిల్లలు భోరున ఏడుస్తున్నా మనుసు కరగడం లేదు. నిత్యం ఓట్లు, సీట్ల, డబ్బు రాజకీయాలే తప్ప భావోద్వేగాలు, మానవ సంబంధాలు పట్టని మానవ మృగం అన్నారు.

ఉత్సాహంగా రైతుల క్రికెట్ పోటీలు.. విజేతలు ఎవరంటే?

క్రికెట్ అంటే కొంతమందే ఆడతారని, వారంతా ప్రొఫెషనల్స్ అని అంతా భావిస్తారు. అయితే నాగలి పట్టి, పొలం దున్నే రైతన్నలు కూడా తామేం తక్కువ కాదంటున్నారు. నాగలి పట్టినట్టే, క్రికెట్ బ్యాట్ పడితే సిక్స్ లు, ఫోర్లు, బౌండరీలు బాదేస్తాం అంటున్నారు. నిర్మల్ జిల్లాలో అన్నదాతలు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. ఉత్సాహంగా రైతన్నల క్రికెట్ పోటీలు నిర్వహించారు రైతులు. నిర్మల్ జిల్లా రూరల్ మండలం అనంతపేట గ్రామంలో మాదాస్తు సునీత ఆధ్వర్యంలో చేపట్టిన రైతన్నల క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.ఈ పోటీల్లో అనంతపేట, నీలాయిపేట, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాలకు చెందిన రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. మొదట అదిలాబాద్ ఉమ్మడి జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు శ్యాం నాయక్ , నిర్మల్ మండల ఎంపీపీ కొరుపెల్లి రామేశ్వర్రెడ్డి టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. మొదటి బహుమతిగా 5వేలు, రెండవ బహుమతిగా 3 వేలు, మూడవ బహుమతి 2 వేలు అందచేశారు. అలాగే నాలుగో బహుమతిగా విజేతలకు వెయ్యి రూపాయలు నిర్వాహకులు అందచేశారు. మొదటి విజేతగా మేడిపల్లి గ్రామ రైతులు నిలిచారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం.. రైబాకినా చేతిలో స్వైటెక్ ఓటమి

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా.. ఆదివారం నాడు మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా నాదల్ బాటలోనే నడిచింది. నాలుగో రౌండ్‌లో 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో స్వైటెక్ పరాజయం పాలైంది. తొలి సెట్ కోల్పోయిన స్వైటెక్.. రెండో సెట్‌లో అయినా పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆమె పేలవ ఆటతీరుతో ఓటమి కొనితెచ్చుకుంది. కాగా ఈ పోరు కేవలం గంటన్నరలో ముగిసింది. రైబాకినా గతేడాది వింబుల్డన్ గెలిచి సత్తా చాటింది. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. జెలెనా ఓస్టాపెంకో, కోకో గాఫ్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో రైబాకినా క్వార్టర్ ఫైనల్స్ పోరులో తలపడనుంది. అటు పురుషుల సింగిల్స్ పోరులో గ్రీస్ ఆటగాడు స్టెఫానో సిట్సిపాస్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. మూడో సీడ్ సిట్సిపాస్ ఆదివారం నాడు ఐదు సెట్ల పాటు జరిగిన మ్యాచ్ లో 6-4, 6-4, 3-6, 4-6, 6-3తో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్‌పై విజయం సాధించాడు. ముఖ్యంగా చివరి సెట్‌లో భారీ సర్వీసులు, బలమైన గ్రౌండ్ షాట్లతో సిన్నర్‌ను సిట్సిపాస్ నిస్సహాయుడిగా మార్చేశాడు.