ఏపీలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై ప్రభుత్వ వివరణ
ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించటం లేదని మీడియాలో వచ్చిన కథనాల స్పందించిన ప్రభుత్వం.. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమం, కొత్త నియామకాలు, ఇతర అన్ని అంశాలతో 8 పేజీల లేఖ విడుదల చేసింది ప్రభుత్వం. మెజారిటీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా… బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి మాత్రం 20వ తేదీ వరకు సమయం పడుతోంది. ఈ వాస్తవాలకు మసిపూసి… ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఎస్ రావత్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏకంగా 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని వార్తపత్రికలు ప్రచురిస్తున్న కథనాలను ఎస్ఎస్ రావత్ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకుండా వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రాస్తున్న కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామంటూ… శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మధ్యప్రదేశ్ నర్మదా లోయలో 256 డైనోసార్ గుడ్లు
మానవుడి మనుగడ లేని సమయంలో డైనోసార్లు ఈ భూమిని ఏలాయి. దీనిపై పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చాలా చోట్ల డైనోసార్లకు సంబంధించి శిలాజాలు లభించాయి. క్రెటేషియస్ యుగం ముగిసే సమయానికి డైనోసార్లు అంతరించిపోయాయి. ఇదిలా ఉంటే ఇటీవల మధ్యప్రదేశ్ నర్మదా లోయలో డైనోసార్ గూళ్లు, శాకాహార టైటానోసార్లకు సంబంధించి 256 గుడ్లను శిలాజ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్‌పూర్-కోల్‌కతా, భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రాంతాలలో అనేెక పెంకులు కలిగిన గుడ్లను కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ డైనోసార్స్ గూళ్లు, గుడ్లు 66 మిలియన్ ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్న పొడవైన మెడ కలిగిన డైనోసార్ జాతికి చెందినదిగా వెల్లడించారు. నర్మదా లోయలో దొరికిన గూళ్లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని.. సాధారణంగా డైనోసార్ గూళ్లు ఒకదానికి ఒకటి కొంతదూరంలో ఉంటాయి. కానీ నర్మదా నదిలో దొరికిన డైనోసార్ శిలాజాలు ఇందుకు భిన్నంగా పరిశోధకులు చెబుతున్నారు. 15 సెం.మీ మరియు 17 సెం.మీ వ్యాసం కలిగిన గుడ్లు, అనేక టైటానోసార్ జాతులకు చెందినవి కావచ్చని.. ఒక్కో గూడులోని గుడ్ల సంఖ్య ఒకటి నుండి 20 వరకు ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు.. తల్లి గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో గుడ్లపై పెంకుపై పెంకు ఏర్పడినట్లు అంచానా వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల
ఈనెల 24న కొండగట్టుకు పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. ఆయన పర్యటన రూట్ మ్యాప్ విడుదల అయింది. పవన్ కళ్యాణ్ ఉ.11 గంటలకు చేరుకొని, ఆలయంలో ప్రత్యేక పూజ తర్వాత వారాహికి పూజలు చేస్తారు. మ.2 గంటలకు కొడిమ్యాల(మం) నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీ అవుతారు. అనంతరం సా.4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సా.5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. జగిత్యాల జిల్లాలో పవన్ కళ్యణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు జనసేన నేతలు. ఈనెల 24న హైదరాబాద్ నుండి బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకుంటారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారాహి వాహన పూజ జరుపుతారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్ లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఇదే రోజున అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఈ యాత్రలో భాగంగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. అనంతరం మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.
కేసీఆర్.. మీకు ఇదే చివరి అవకాశం!
సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఇదే మీకు ఆఖరి అవకాశం. బడ్జెట్ లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించండి. అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. అతిపెద్ద నాగోబా జాతరను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన.. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారు. పోడుభూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తాం అన్నారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం అన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్.
శ్రద్ధా వాకర్ కేసులో 3వేల పేజీల ఛార్జిషీట్
దేశాన్ని కుదిపేసిన శ్రద్ధా వాకర్ కేసులో ఢిల్లీ పోలీసుల 3000 పేజీల ఛార్జీషీట్ రెడీ చేశారు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత క్రూరంగా హత్య చేసి శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 100 మంది సాక్ష్యాలతో పాటు ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో ఛార్జీషీట్ సిద్ధం చేశారు. దీనిని న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. పరీశీలన అనంతం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా చేసిన తర్వాత ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేశాడు అఫ్తాబ్. అరెస్ట్ తర్వాత అఫ్తాబ్ ఇచ్చిన సమాచారంతో 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా.. ఇవి శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో సరిపోయాయి. దీంతో కేసు మరింతగా బలపడింది. ఇక నార్కో, పాలిగ్రాఫ్ టెస్టుల్లో కూడా అఫ్తాబ్ శ్రద్దాను చంపినట్లు ఒప్పుకున్నాడు. వీటన్నింటిని ఛార్జిషీట్ లో పొందుపరిచారు. ఈ నెలఖారులో కోర్టులో సమర్పించే అవకాశం ఉంది.
చైనాలో లెక్కకు మిక్కిలి కోవిడ్ మరణాలు.. 13వేల మరణాలు నమోదు
చైనాలో కోవిడ్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు చైనా ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చైనీస్ న్యూ ఇయర్ కోసం దేశవ్యాప్తంగా కోట్లలో ప్రజలు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చైనీస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. జనవరి 13 నుంచి 19 మధ్య చైనా ఆస్పత్రుల్లో ఏకంగా 13,000 మంది మరణించినట్లు వెల్లడించింది. అంతకుముందు జనవరి 12 వరకు 60,000 మంది మరణించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ లెక్కలు కేవలం ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్యే. ఇక ఇళ్లలో చనిపోయిన వారి సంఖ్య తీసుకుంటే మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేవలం ఆస్పత్రుల్లో చనిపోయిన వారి సంఖ్యనే పరిగణలోకి తీసుకుంటోంది. వారం వ్యవధిలో మరణించిన వారిలో 681 మంది ఆస్పత్రిలో చేరి శ్వాసకోశ వైఫల్యంతో మరణించాని.. ఇన్ఫెక్షన్, ఇతర వ్యాధుల వల్ల 11,977 మంది మరనించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
నిన్న షారూక్ తెలియదన్నారు.. ఇవాళ ఫోన్ లో ఛాటింగ్
శనివారం ఓ మీడియా సమావేశంలో తనకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఎవరో తెలియదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ షారుఖ్‌తోనే తాను ఫోన్‌లో మాట్లాడానని ఆదివారం తెలిపారు. ఆదివారం ఉదయం 2 గంటలకు తనకు షారుఖ్ ఫోన్ చేసి, గువహటిలో పఠాన్ సినిమాను ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వందేనని తాను భరోసా ఇచ్చానని ట్విటర్ మాధ్యమంగా వివరించారు. ఆ ఘటనపై తాము విచారణ జరుపుతామని, అలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తాను షారుఖ్‌కి హామీ ఇచ్చామని తెలిపారు. కాగా.. శనివారం నిర్వహించి మీడియా సమావేశంలో షారుఖ్ గురించి మీడియా ప్రతినిధులు హిమంతను ప్రశ్నించగా, అసలు తనకు షారుఖ్ ఎవరో తెలియదని బాంబ్ పేల్చారు. బాలీవుడ్ నుంచి తనకు చాలామంది ఫోన్ చేస్తుంటారని, కానీ ఇప్పటిదాకా ఆ ఖాన్ పేరుతో తనకు ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పారు. ఒకవేళ అతడు ఫోన్ చేస్తే, తాను తప్పకుండా సమస్యల గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే షారుఖ్ ఫోన్ చేయడం గమనార్హం.
లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో కాల్పులు ఘటన జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ దుండగుడు ప్రజలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మాంటేరీ పార్కాలో జరిగిన చైనీస్ ల్యూనార్ న్యూ ఇయర్ వేడక జరుగుతన్న సమయంలో శనివారం రాత్రి 10.30 తర్వాత కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది. 10 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతకుముందు రోజు వేలాది మంది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. మాంటెరీ పార్క్ లాస్ ఏంజిల్స్ కౌంటీలోని ఒక నగరం, లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.