టీఎస్ఆర్టీసీకి పండగే పండగ.. 11 రోజులు 165.46 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బస్సులకు విశేష ఆదరణ లభించింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు వెల్లడించారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గతేడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా ప్రయాణించగా.. ఈ సంక్రాంతికి 11 రోజుల్లోనే మొత్తంగా రూ.165.46కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనంగా ఆదాయం లభించింది. ఈ సంక్రాంతి సందర్భంగా 3.57 కోట్ల కిలోమీటర్ల టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గతేడాదితో పోలిస్తే 26.60లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయని తెలిసింది. గతేడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయి. ప్రతి రోజు సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయి. ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ భారీగా పెరిగింది.
కంటివెలుగుపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు. బీఆర్కే భవన్ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్‌ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అవసరమైన 97,335 మందికి కంటి అద్దాల పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో వున్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్‌ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. కంటి అద్దాల నిల్వలను (స్టాక్స్) వివరాలను రోజు వారిగా సరిచూసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంప్‌ల నిర్వహణ చేపట్టాలని అన్నారు.
విద్యార్ధులకు అల్పాహారం కోసం 15లక్షల నిధులు
మినీ భారత్ లా భావించే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శరవేగంగా అభివృద్ధిచెందుతోంది. ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ నియోజకవర్గం ఇప్పుడు కాలుష్యానికి దూరంగా నివాసయోగ్యంగా మారుతోంది. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరోవైపు ప్రతిష్టాత్మకంగా ఐఐటీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలతో విద్యార్ధులకు అత్యుత్తమ విద్య అందుతోంది. తాజాగా పటన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఔదార్యం చాటారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 35 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న 1947 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించేందుకు 15 లక్షల రూపాయలు సొంత నిధులు అందజేశారు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు.
ఇస్నాపూర్ లో పాడుబడ్డ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా
హైదరాబాద్ లో ఒకవైపు డ్రగ్స్, గంజాయి పట్టుబడుతోంది. ఇదిలా ఉంటే నార్కొటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పటాన్ చెరు పోలీసులు. ఇస్నాపూర్ లోని ఓ కంపెనీలో నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న పటాన్చెరు పోలీసులు. ఆరు లక్షల విలువచేసే నార్కోడ్రగ్స్ , డైజోఫామ్,అలెఫ్రోజోలం సీజ్ చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్న మదన్ మోహన్ రెడ్డి,గురువా రెడ్డి, మనోహర్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసుకి సంబంధించి పరారీలో మరొకరు వున్నారు.40 డ్రమ్ములలో డ్రగ్స్ తయారు చేసే ముడి పదార్థం. ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పటాన్ చెరు పోలీసులు. డ్రగ్స్ తయారు చేసి గతంలో సిద్దిపేట జిల్లాలో పాటుబడ్డారు నిందితులు. ఇస్నాపూర్ లో పాడుబడ్డ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గురించి వివరాలు వెల్లడించారు పటన్ చెరు పోలీసులు.
షారూఖ్ ఖాన్ ఎవరు? అసోం సీఎం సూటి ప్రశ్న
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన ‘‘పఠాన్’’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. అయితే విడులకు ముందే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులోని ‘‘బేషరమ్ రంగ్’’ పాటపై హిందూ సంస్థలు, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాని విడుదల చేస్తే థియేటర్లపై దాడులు చేస్తామంటూ పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో పఠాన్ సినిమా, షారుఖ్ ఖాన్ పై అడిగిన సమయంలో.. ‘‘ షారుఖ్ ఖాన్ ఎవరు..?’’ అంటూ ప్రశ్నించారు. పఠాన్ సినిమా గురించి తనకు తెలియదని గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్ అని విలేకరులు అన్నప్పుడు.. రాష్ట్ర ప్రజలు అస్సామీల గురించి ఆందోళన చెందాలి.. హిందీ సినిమాల గురించి కాదంటూ చురకలు అంటించారు బిశ్వ శర్మ.
మోదీ డాక్యుమెంటరీ వెనక పాకిస్తాన్ వ్యక్తులు ఉన్నారా..?
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని నరేంద్రమోదీపై డాక్యుమెంటరీ రూపొందించింది. ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అనే పేరుతో రెండు సీరీస్ లను బీబీసీ రూపొందించింది. అయితే ఈ డ్యాక్యుమెంటరీపై భారత్ తో పాటు బ్రిటన్ లో కూడా చర్చ మొదలైంది. ఇప్పటికే భారత ప్రభుత్వం బీబీసీ చర్యలను ఖండించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్న ఓ ఎంపీ ప్రధాని మోదీపై చర్చను లేవనెత్తాడు. అయితే ప్రధాని రిషి సునాక్, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇదిలా ఉంటే బ్రిటన్ పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ లార్డ్స్ తో సభ్యుడిగా ఉన్న రామి రేంజర్, ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని తప్పుపట్టాడు. భారత దేశం జీ-20కి అధ్యక్షత వహిస్తున్న వేళ, యూకేలో భారత సంతతి ప్రధాని ఉన్న సమయంలో, భారత్-యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవికి దీనిపై లేఖ రాశారు. యూకే నగరాల్లో హిందువుల, ముస్లిం మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి..దీన్ని పెంచే విధంగా డాక్యుమెంటరీలోని రెండో భాగం ఉందని, దాన్ని నిలిపివేయాలని బీబీసీని కోరాడు.
కిస్ మిస్ లు మిస్ కావద్దు.. ఎన్ని లాభాలో తెలుసా?
కిస్ మిస్ లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. చాలామంది వీటిని చిన్నచూపు చూస్తుంటారు. నిజానికి కిస్ మిస్ లు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారం పుష్కలంగా అందిస్తాయి. చూడటానికి అవి చిన్నగా ఉన్నా అందులోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి చాలా శక్తినిస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించడంతో డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. డ్రైఫ్రూట్స్‌లో ముఖ్యంగా కిస్‌మిస్ ఆరోగ్యానికి చాలా మంచివి. కిస్ మిస్ బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. కిస్ మిస్ లు ఏడాదంతా పుష్కలంగా లభిస్తాయి. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. వీటిని తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు. కిస్‌మిస్‌లో ఫైబర్ ఎక్కువ. ఇవి మలబద్ధకాన్ని నివారించి, తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. పేగులు, పొట్టలో విష వ్యర్థాల్ని తరిమికొడతాయి.వీటిని తినడం వలన శరీరములో శక్తిగల ఆమ్లాలను సమన్వయం చేసి జ్వరం రాకుండా చేస్తుంది. కిస్‌మిస్ తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు వంటి దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలం చేకూరడానికి కిస్‌మిస్ ఉపయోగపడుతుంది.
రెండవ వన్డే మనదే.. సిరీస్ కూడా టీమిండియాదే
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో 15 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. అయితే తొలి వన్డే హీరో బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్ పోరాడటంతో న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. ఫిలిప్స్, బ్రేస్‌వెల్ కలిసి ఆరో వికెట్ కు 41 పరుగులు జోడించారు. మహ్మద్ షమీ 3 వికెట్లతో సత్తా చాటగా పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో రెండు వికెట్లు, సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం 109 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20.1 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.