NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

నాదీ మధ్యతరగతే.. వారి కష్టాలు నాకు తెలుసు

బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని.. ఆ వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకుంటానని అన్నారు. ‘‘నేను మధ్యతరగతికి చెందినదాన్నే. ఆ వర్గానికి చెందినవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో నేను అర్థం చేసుకోగలను. మోడీ ప్రభుత్వం ఏ బడ్జెట్‌లోనూ మధ్యతరగతి వారిపై కొత్త పన్ను విధించలేదు. రూ.5 లక్షల జీతం ఆర్జించే వారిపై ఎలాంటి పన్నులు లేవు’’ అంటూ ‘బాత్ భారత్ కీ’లో భాగంగా ‘పాంచజన్య’తో ఇంటరాక్షన్‌లో చెప్పారు. కేంద్రం 100 స్మార్ట్ సిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదలను విడుదల చేసిందని.. వ్యాపారం, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలస వెళ్ళే ప్రజలకు ఇది సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కార్యక్రమాలు జీవన ప్రమాణాన్ని మెరుగుపరచలేదా?’’ అంటూ ప్రశ్నించారు. అవును, నేనేమీ మధ్యతరగతి వారి జేబుల్లోకి నేరుగా డబ్బును వేయలేదు కానీ, ఈ సౌకర్యాలు వారికి సహాయం అందిస్తున్నాయని అన్నారు.

ఆ కమెడియన్ ఇంట్లో డబుల్ ధమాకా

పెళ్ళిచూపులు’ సినిమాతో హాస్యనటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ అక్కడ నుండి వెనుదిరిగి చూడకుండా దూసుకు పోతున్నాడు. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించడంతో పాటు ‘ఇంటింటి రామాయణం’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించాడు. ఈ సినిమా త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా ఉంటే… రాహుల్ రామకృష్ణ తన భార్య హరిత ప్రెగ్నెంట్ అనే విషయం కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తాజాగా ‘బోయ్, సంక్రాంతి రిలీజ్,’ అనే కాప్షన్ తో ఓ పండంటి బిడ్డ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. వ్యక్తిగత విషయాలను అత్యంత గోప్యంగా ఉంచే రాహుల్ రామకృష్ణ ఎప్పుడో కానీ ఇలాంటి విశేషాలను నెటిజన్స్ తో పంచుకోడు. పైగా తరచూ ఏవో కొంటి చేష్టలతో సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ గురవుతుంటాడు. ఈ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఇంట్లోకి సంక్రాంతి పండగ రోజునే మగబిడ్డ అడుగుపెట్టడం డబుల్ థమాకా అనే అనుకోవాలి. అతని అభిమానులతో పాటు చిత్రసీమలోని స్నేహితులు కూడా రాహుల్ రామకృష్ణను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

సుమకు మెసేజ్ పంపిన చిరంజీవి…మూడేళ్ళు పట్టించుకోలేదా?

మెగాస్టార్ చిరంజీవిని జీవితంలో ఒక్కసారైనా కలవకపోతామా అనే ఆశతో బతికే అభిమానులు ఎంతోమంది. ఆయన ఫోన్ చేస్తే,.. మెసేజ్ చేస్తే పొంగిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చిరు దగ్గరనుంచి ఒక చిన్న మెసేజ్ వచ్చిన జన్మ ధన్యమైపోతుంది అని ఎదురుచూసేవాళ్ళు లేకపోలేదు. చిరంజీవి మెసేజ్ చేసినా పట్టించుకోని వారున్నారా..? అంటే.. ఉన్నారని చిరునే స్వయంగా చెప్పుకొచ్చాడు. చిరు మూడేళ్ళ నుంచి మెసేజ్ చేసినా ఆమె రిప్లై ఇవ్వడం పక్కన పెట్టండి.. కనీసం పట్టించుకోలేదట.. ఇంతకీ ఎవరామె అంటే.. స్టార్ యాంకర్ సుమ. అవును.. సుమ, చిరంజీవి మెసేజ్ కు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ చేస్తున్న ఒక షోకు చిరు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇక ఈ షోలో సరదాగా సందడి చేసిన చిరు.. ఈ షో లో కూడా చిరు లీక్స్ పేరుతో ఏదైనా మ్యాటర్ ను లీక్ చేయొచ్చుగా అని అడుగగా.. చిరంజీవి, సుమనే ఇరికించాడు. సుమ మూడేళ్ళ పాటు నేను మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.

భారీ ధరకు మహిళల ఐపీఎల్ హక్కులు కొనుగోలు చేసిన రిలయన్స్ కంపెనీ

పురుషుల క్రికెట్ తరహాలో మహిళా క్రికెట్‌కు కూడా ఆదరణ పెంచాలని బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్‌ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. మహిళల ఐపీఎల్‌కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్‌ను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రూ.951 కోట్లతో వయాకామ్ 18 సంస్థ బిడ్డింగ్ వేసింది. అంటే ఒక మ్యాచ్‌కు రూ.7.09 కోట్లు చెల్లించ‌నుంది. పురుషుల జ‌ట్టుతో స‌మాన వేతనం త‌ర్వాత‌.. మ‌హిళ‌ల క్రికెట్‌కు ఇది మ‌హర్దశ అని.. అతిపెద్ద, కీల‌క‌మైన అడుగు అంటూ జై షా ట్వీట్ చేశారు. తాజా ఒప్పందం ప్రకారం 2023 నుంచి 2027 వరకు మహిళల ఐపీఎల్ హక్కులను వయాకామ్ 18 కలిగి ఉంటుంది. ఇదే సంస్థ పురుషుల ఐపీఎల్ డిజిటల్ హక్కులను కూడా పొందింది. అలాగే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA టీ20 లీగ్‌ను కూడా ప్రసారం చేస్తోంది. కాగా మార్చి 5 నుంచి 23 వ‌ర‌కు మ‌హిళ‌ల ఐపీఎల్ తొలి సీజ‌న్ జ‌ర‌గ‌నుంది. మొత్తం ఐదు ఫ్రాంఛైజీలు పోటీప‌డనున్నాయి. ఇప్పటివ‌రకు మహిళల ఐపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేయ‌లేదు. జ‌న‌వ‌రి 25వ తేదీన మ‌హిళ‌ల ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌ను ఆవిష్కరించ‌నున్నట్టు స‌మాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న మ‌హిళా క్రికెట‌ర్లకు రూ. 50 లక్షలు, రూ. 40 ల‌క్షలు, రూ.30 ల‌క్షల బేస్ ప్రైజ్, మిగ‌తావాళ్లకు రూ. 20 ల‌క్షలు, రూ. 10 ల‌క్షలు క‌నీస ధ‌రను బీసీసీఐ ప్రక‌టించింది.

విషాదం.. భర్తలాగే తనూ ప్రమాదంలో చనిపోయిన పైలట్

నేపాల్ విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన 20నిమిషాల్లోనే పశ్చిమ నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన పోఖారాలో ఆదివారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 72మంది చనిపోయారు. అందులో నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కుప్పకూలిన విమానం కో-పైలట్ అంజు ఖతివాడ కూడా విమాన ప్రమాదంలో మరణించారు. ఈమె తన మొదటి భర్తలాగే ప్రమాదంలో కన్నుమూసింది. అంజు మొదటి భర్త దీపక్ పోఖరేల్ కూడా యతి ఎయిర్‌లైన్స్‌లో పైలట్. దీపక్ ప్రయాణించిన విమానం జూన్ 21, 2006న కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దీపక్ సహా పది మంది మరణించారు. దీపక్ మరణం తర్వాత అంజు మళ్లీ పెళ్లి చేసుకుంది. పైలట్‌గానే కొనసాగాలని నిర్ణయించుకుంది. కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించిన అంజు.. నేపాల్‌లోని అత్యంత కష్టతరమైన విమానాశ్రయాల్లో విజయవంతంగా దిగి.. కెప్టెన్‌గా ర్యాంక్‌కు చేరువలో ఉంది. ఆదివారం కనుక ఆ విమానం విజయవంతంగా ల్యాండ్ అయితే ఆమెకు ఫైలట్ గా ప్రమోషన్ వచ్చేది. ఇది ఆమె కల. తాను అనుకున్న కల నెరవేరకుండానే ప్రాణాలు పోగొట్టుకుంది. ప్రమాదం జరిగినప్పుడు అంజు కెప్టెన్ కమల్ తో కో-పైలట్‌గా ఉంది. దీపక్‌- అంజు దంపతులకు 22 ఏళ్ల కుమార్తె ఉంది. దీపక్ మరణం తర్వాత రెండో పెళ్లిలో ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అంజు తల్లిదండ్రులు ప్రస్తుతం బిరత్ నగర్‌లో నివసిస్తున్నారు.

వీధికుక్కల ఆకలి తీరుస్తున్న యువతిపై దూసుకెళ్ళిన కారు

సెలవు రోజు అంటే చాలు… స్నేహితులతో ఏ సినిమాకు వెళ్లాలి? ఏ ప్లేస్‌కు టూర్​ వేయాలి?… ఇలా రకరకాల ప్లాన్స్‌తో ఉంటారు చాలామంది. కానీ, ఆమె మాత్రం ఆదివారం వచ్చిందంటే… వీధికుక్కలకు ఆహారాన్ని తీసుకెళ్తుంది. ఇలానే వీధి శునకాలపై ప్రేమతో తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకుంది ఛండీగఢ్‌లోని తేజస్విత. చండీగఢ్ లో తేజస్విత (25) అనే యువతి తన ఇంటికి సమీపంలో రహదారి పక్కన కుక్కలకు ఆహారం వేస్తోంది. అదే సమయంలో ఓ కారు పక్క రహదారి నుంచి యూ టర్న్ తీసుకుని వేగంగా కుక్కతో పాటు ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తేజస్విత కింద పడిపోగా, శునకం అక్కడి నుంచి పరారైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. తేజశ్విత తలకు గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వారితో మాట్లాడిందని, బాగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తేజశ్విత రోజూ తన తల్లితో కలిసి వీధికుక్కలకు ఆహారం ఇచ్చేందుకు వెళ్లేదని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి తేజశ్విత, ఆమె తల్లి మంజీదర్‌ కౌర్‌లు ఫుట్‌పాత్‌ పక్కనే వీధికుక్కలకు ఆహారం ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ చిట్కా పాటిస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారంటీ

ఈరోజుల్లో మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, అందాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందునా జుట్టు రాలిపోవడం, పొట్ట పెరిగిపోవడం మామూలైపోయింది. జుట్టు గురించి యువతీ, యువకులు ఎంతో జాగ్రత్త పడతారు. అయినా మన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు రాలిపోవడం, చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడం జరిగిపోతోంది. దీంతో యువత ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళితే వయసు పెద్దదిగా అనిపిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తారు. చాలామంది గోరింటాకు మిశ్రమం చాలా బాగా పనిచేస్తుందని చెబుతారు.
* గోరింటాకుల పొడిలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ పొడి, తులసి రసం, పుదీనా రసం వేసి బాగా కలపాలి. అలాగే ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట పాటు ఉడికించాలి. రాత్రంతా కూడా దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పూట ఈ మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని, మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం వుంటుంది. దీనివల్ల తెల్ల జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది.
* ఉసిరికాయ ఇంకా అలాగే కొబ్బరినూనె మిశ్రమం కూడా దీనిపై బాగా పనిచేస్తుంది. మీరు ఉసిరికాయలలోని గింజలను తీసేసి ఎండబెట్టాలి. ఆ ఎండిన ఉసిరికాయలు కొన్నిటిని తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని పావు కప్పు కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. వేడిచేసిన నూనెని రాత్రంతా కూడా అలాగే వదిలేయాలి. ఇక మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ తరువాత వచ్చే నూనెను సేకరించి మీ జుట్టుకు బాగా రాయాలి. ఇలా రాసిన తరువాత ఒక అర గంటపాటు ఉంచి శుభ్రంగా తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయండి చాలు.. మీ జుట్టు నిగనిగలాడుతుంది. తెల్లజట్టు తగ్గుతుంది.

బుమ్రా లేని లోటు సిరాజ్ తీరుస్తున్నాడా?

హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ కొంతకాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో క్రమంగా జట్టులో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకుంటున్నాడు. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ ఇప్పుడు వైట్‌బాల్ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో సిరాజ్ 9 వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏడాది కాలంగా సిరాజ్ బౌలింగ్‌లో మరింత పదును పెరిగిందని.. వైట్‌బాల్ క్రికెట్‌లో బుమ్రా లేని లోటు అతడు తెలియనివ్వడంలేదని జాఫర్ అన్నాడు. వైట్‌బాల్ బౌలర్‌గా సిరాజ్ ఎంతో పురోగతి సాధించాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు.