NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

చిన్నశేషవాహనంపై ఊరేగుతున్న జూబ్లిహిల్స్ వేంకటేశ్వరస్వామి

హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. సుందరమయిన ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ వరకూ జరగనున్నాయి.

టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.4 గా తీవ్రత నమోదు

భూకంపంలో అల్లాడుతున్న టర్కీని మరోసారి భూకంపం భయపెట్టింది. రెండు వారాల క్రితం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు టర్కీ, సిరియా దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మరోసారి భూకంపం వచ్చింది. 6.4 తీవ్రతతో దక్షిణ టర్కీ నగరం అయిన అంటిక్యాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు సిరియా, లెబనాన్, ఈజిప్ట్ వరకు వెళ్లాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతం అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. తాజాగా వచ్చిన భూకంపంలో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో పాటు 200 మందికి పైగా గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు చెప్పారు. ఇప్పటికే టర్కీ, సిరియాల్లో 47,000 మందికి పైగా మరణించారు. ఒక్క టర్కీలోనే 41,156 మంది మరణించారు. 3,85,000 అపార్ట్మెంట్లు ధ్వంసం అయ్యాయి. భూకంపం బారిన పడిన టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచ దేశాలు సహాయసహకారాలు అందిస్తున్నాయి. భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సహాయకార్యక్రమాల్లో పాల్గొంది.

రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్ల వివాదం

కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు. రోహిణి సివిల్ సర్వెంట్ అధికారుల నియమావళిని ఉల్లంఘించారని, రోహిణి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రోహిణి.. రూప మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రభుత్వ సీఎస్ వందితా శర్మను కలుసుకున్న రోహిణి, రూపపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు రోహిణి ఫోన్ తో పాటు తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఆమె భర్త సుధీర్ రెడ్డి బాగలగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూ కట్టారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తర్వాత మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. విష్వక్సేన ఆరాధనతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలను 1955లో ఏపీ ఏర్పాటయ్యక 11 రోజులపాటు జరిపించారు. అంతకుమందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. మొదటగా ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాస్తంభోద్భవుడు లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట పుణ్య క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైనది. పునర్నిర్మాణం తర్వాత ఇల వైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

హెచ్ఐవీ ఆపై క్యాన్సర్.. అయినా కోలుకున్న రోగి

హెచ్ఐవీ, క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ రోగి రెండు వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇలా ఒకే సమయంలో రెండు ప్రాణాంతక జబ్బులతో బాధపడే రోగిని ‘ డ్యూసెల్డార్ప్ పేషెంట్’గా వ్యవహరిస్తారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ అయిన ల్యూకేమియా కోసం స్టెమ్ సెల్ చికిత్స తీసుకున్న తర్వాత సదరు రోగి క్యాన్సర్, హెచ్ఐవీ నుంచి కోలుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇలా కోలుకున్న వ్యక్తులు ప్రపంచంలో ముగ్గురే ఉన్నారు. గతంలో బెర్లిన్, లండన్ లోని ఇద్దరు రోగులు ఇలాగే కోలుకున్నారు. తాజాగా ఫ్రాన్స్ కు చెందిన రోగి ఈ రెండు వ్యాధుల నుంచి కోలుకున్నారు. 53 ఏళ్ల వ్యక్తికి 2008లో హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఆ తరువాత మూడు ఏళ్లకు అతను ప్రాణాంతకమైన మైలోయిడ్ లుకేమియా అనే రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది. 2013లో సీసీఆర్5 అరుదైన మ్యుటేషన్ తో ఒక మహిళా దాత మూలకణాలను ఉపయోగించుకుని బోన్ మ్యారో మార్పిడి చేయించుకున్నాడు. ఆ తరువాత పరిశీలిస్తే ఈ మ్యూటేషన్ హెచ్ఐవీ కణాలు రోగి కణాల్లోకి చేరకుండా ఆపగలిగినట్లు తేలింది. 2018లో హెచ్ఐవీకి ఉపయోగించే యాంటీరెట్రో వైరల్ థెరపీని నిలిపివేశాడు. నాలుగు ఏళ్ల తరువాత పరీక్షిస్తే అతని శరీరంలో హెచ్ఐవీ జాడ కనుగొనబడలేదని అధ్యయనం తెలిపింది.

టీడీపీ నేతలపై కేసులు నమోదు

కృష్ణాజిల్లా గన్నవరంలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. గన్నవరం ఎపిసోడులో టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులు పేరిట కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పట్టాభి, మరో 16 మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు పోలీసులు. బోడె ప్రసాద్ తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఆ ఉద్యోగులకు 6 శాతం వడ్డీ చెల్లించాల్సిందే

కరోనా టైంలో ఆపిన ఉద్యోగుల జీతాలకు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ల బకాయిలపై 6శాతం వడ్డీ చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కరోనా సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం చెల్లింపులను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27కు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు, తెలంగాణ పింఛనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులతో పాటు మరికొందరు రిట్‌ పిటిషన్లు, పిల్‌ దాఖలు చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సత్యంరెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు చైతన్య మిత్ర వాదనలు వినిపించారు.

నివురుగప్పిన నిప్పులా ఉద్యమాల ఖిల్లా వరంగల్

హాత్‌ సే హాత్‌ జోడో పేరిట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 12వ రోజు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ఆయన… హన్మకొండ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తొమ్మిదేళ్లుగా అక్రమ కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గిన వారు ఈ మీటింగ్ కు వచ్చారని ఆయన అన్నారు. ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రేవంత్‌ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మేధావులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు ఆలోచన చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందలగడ్డగా మారింది. జయశంకర్ పేరు పెట్టిన ఏకశిలా పార్కు తాగుబోతులకు అడ్డాగా మారింది. కాకతీయ కళాక్షేత్రం కట్టలేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు. తొమ్మిదేళ్లయినా అమరవీరుల స్థూపం ఎందుకు కావట్లేదు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కాలనీలు, శిఖం భూములు అన్ని కబ్జాలు అయ్యాయి.

దమ్ముంటే రండి… తేల్చుకుందాం

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం గరం గరంగా మారింది. గన్నవరంలో నిన్న సాయంత్రం వరకూ ఉద్రిక్తత కొనసాగింది. టీడీపీ నేత చిన్నా కారును తగులబెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్తలు. మంటలను అదుపు చేశారు పోలీసులు. ఆగ్రహంతో మళ్లీ రోడ్డెక్కారు టీడీపీ కార్యకర్తలు. ప్రభుత్వానికి.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో ఉన్న కార్యకర్తలు.. నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్టీ కార్యాలయంలో నేతలు.. పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యాలయంలో ఉన్న బోడె ప్రసాదును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేయడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సీరియస్ అయ్యారు. వల్లభనేని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని.. దమ్ముంటే రావాలంటూ వంశీకి బుద్దా సవాల్ చేశారు.