NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ముంబై సరికొత్త చెత్త రికార్డు .. కాలుష్యంలో నెంబర్ వన్

భారతదేశ ఆర్థిక రాజధానిగా ముంబైకి పేరు. కానీ ఇప్పుడు అది ఓ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. ఈ జాబితాలో గతంలో దేశ రాజధాని ఢిల్లీ ఉండేది.. కానీ, స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8వ తేదీల మధ్య తయారు చేసిన జాబితాలో ముంబై ఆ ప్లేస్ దక్కించుకుంది. జనవరి 29న ఇదే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై.. ఫిబ్రవరి 2నాటికి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానాల్లోకి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. తర్వాత ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న, వాయు నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత అనారోగ్యకరమైన నగరంగా నిలిచింది. గత నవంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడించాయి. రోడ్లపై ఎగసిపడే దుమ్ము, వాహనాల నుంచి పొగ వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలే ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. మరోవైపు నగరంలో గాలి నాణ్యత పడిపోవడంతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ రాబోయే 10 రోజుల పాటు నగరంలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించింది.

కడప జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటన ..షెడ్యూల్ ఇదే

బుధవారం ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్ వైయ‌స్‌ఆర్‌ కడప జిల్లాలో ప‌ర్యటించనున్నారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యం నుంచి సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విడుద‌ల చేశారు. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో వివాహ రిసెప్షన్‌ వేడుకకు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ హాజరవుతారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. 11.10 – 11.30 జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమం ఉంటుంది. ఈకార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ కూడా పాల్గొంటారు. ఇదిలా ఉండగా.. 2019లో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ పేరుతో ముఖ్యమంత్రి స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో రెండేళ్లు పనులు జరగలేదు. కోవిడ్ అనంతరం ఇప్పుడు రూ.1,76,000 కోట్ల (22 బిలియన్‌ డాలర్లు) మార్కెట్‌ విలువ కలిగి, ఏటా 27 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. పనులు వేగంగా సాగుతున్నాయి.

కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో విజయసాయి భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ లో ఆయన స్వగృహంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు కలగజేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఇప్పటివరకూ సేవలందించిన బిశ్వభూషణ్‌ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అపార అనుభవం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ఎంతో మేలు కలగజేస్తుందని విజయ సాయిరెడ్డి అన్నారు. సోమవారం గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి∙దంపతులు భేటీ అయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని రాజ్‌భవన్‌లో తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం జగన్.

నగరిలో రోజా అవినీతికి అడ్డూఅదుపూ లేదు

చిత్తూరు జిల్లాలో ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కింది. మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పుత్తూరు టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భానుప్రకాష్. పుత్తూరు నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రజలను పాదయాత్రకు తీసుకురాలేదు. లోకేష్ కు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. నా ఆస్తులపై సిబిఐ విచారణ చేయమని మంత్రి రోజా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రోజాకు ధైర్యం ఉంటే తన ఆస్తులపై సిబిఐ విచారణ విచారణ కోరాలన్నారు భాను ప్రకాష్. లేకుంటే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజా ఆస్తులపై సిబిఐ విచారణ చేయిస్తాం. రోజా నిత్య పెళ్ళికూతురు..రోజా చరిత్ర అందరికీ తెలుసు. రోజా ఫ్యామిలీ మన్నార్ గుడి మాఫియాగా పెట్రేగిపోయింది… కువైట్, దుబాయ్ లలో రోజాకు పనేంటి..? పర్యాటకశాఖను ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. మహిళలు తలవంచుకునేలా రోజా వ్యవహారశైలి ఉందన్నారు భాను ప్రకాష్.

వెంకటరెడ్డి ఎవరో నాకు తెలీదు.. కేఏ పాల్ సంచలనం

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేశాయి. ఓవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుస్తాయని తామే ముందే చెప్పామని బీజేపీ చెప్తుంటే.. మరోవైపు వెంకట్‌రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాము పొత్తులకు వెళ్లమని, ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తామని రేవంత్ రెడ్డి వర్గం ఇప్పటికే స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైతం ఎన్నికల ముందు గానీ, ఆ తర్వాత గానీ కేసీఆర్‌తో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ అవసరమే రాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు నష్టం కలిగేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము పార్టీ అధిష్టానికి లేఖ రాస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాజాంతి పార్టీ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని కుండబద్దలు కొట్టారు. వెంకటరెడ్డి కాంగ్రెస్ కోవర్టు అని చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో మూడు లక్షల ఓట్లుంటే.. అందులో కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఓట్లు మాత్రమే పడ్డాయంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ సైతం తెలంగాణలో ఎక్కడా లేదన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయిందని, అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు, ఆయా కులాలకే మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. తాను బీసీనని, ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. తనకు 90 శాతం ప్రజలు సపోర్ట్‌గా ఉన్నారన్న కేఏ పాల్.. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను అంబేద్కర్ పుట్టినరోజునే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.

అరటిపండు తింటే పొట్ట వస్తుందా?

అరటిపండు పేరు చెబితే అది తినకూడదు.. తింటే పొట్ట పెరుగుతుందంటారు. అందరికీ అందుబాటులో ఉండే అరటిపండ్లు అన్నీ సీజన్లలో దొరుకుతుంటాయి. చిన్నపిల్లల దగ్గర్నించి ప్రతి ఒక్కరూ కూడా వీటిని తింటారు. ఎంత ఆరోగ్యకరమైన పండో.. ఈ పండు చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు ఇది మంచి ఆరోగ్యకరమైన పండు అని చెప్పగా.. మరికొన్ని ఇది అనేక సమస్యలు తెస్తుందని, కొంతమంది రోగులు వీటిని తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. నిజానికి ఎన్నో పోషకాలు, మినరల్స్, ఇతర విటమిన్స్ నిండి ఉన్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు పోషకాహార నిపుణులు. నిజానికి భారతదేశంలో 50 రకాలు పైగా అరటిపండ్లు లభిస్తున్నాయి. వాటిలో పచ్చ అరటిపండ్లు, చక్కెరకేళి, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం. వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయని అంటారు. ముఖ్యంగా జీర్ణసంబంధ సమస్యలను అరటిపండ్లు దూరం చేస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారు అరటిపండు తినడం మంచిది. అందుకే డాక్టర్స్ కూడా ఈ పండుని తినడం చాలా మంచిదని అంటారు. అరటిపండ్లు తక్కువ నుండి మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తినొచ్చు. ఈ విషయాన్ని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అరటిపండ్లలో చక్కెర ఎక్కువగా ఉంటుందనేది అపోహ మాత్రమే. అరటిపండులో ఫ్రక్టోజ్, విటమిన్ బి వుంటుంది. అరటిపండ్లలో సహజ చక్కెర ఉంటుంది. అంతేకాకుండా అరటిపండ్లు తింటే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందని భావిస్తారు. కానీ మాత్రం నిజం కాదు.

లవర్స్ డే.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరో

అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న నవీన్ ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసి మెప్పించాడు. ఇక హీరోనే కాకుండా నటుడిగా కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తున్నాడు. గతేడాది నవీన్ చంద్ర.. తన భార్య ఓర్మాను అభిమానులకు పరిచయం చేశాడు. తాను వచ్చాకా జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇక నవీన్ పెళ్లి తరువాత వచ్చిన మొదటి ప్రేమికుల దినోత్సవం కావడంతో ఓర్మాకు మంచి గిఫ్ట్ ఇస్తాడేమో అనుకుంటే.. ఆమె తనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లు నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. లవర్స్ డే రోజున నవీన్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపాడు. త్వరలోనే తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నట్లు నవీన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. ఓర్మా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది. బేబీ బంప్ తో ఉన్న ఆమెతో కలిసి బీచ్ లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. “బేబీ మూన్.. నిన్ను నా చేతుల్లో ఎత్తుకోవడానికి ఆగలేకపోతున్నాను. ముందుగానే తండ్రి బాధ్యతలను తీసుకోవడానికి ఆతృత పడుతున్నాను. కొత్త దశ.. కొత్త జీవితం.. కొత్త ప్రయాణం.. తండ్రి కాబోతున్నాను.. లవ్ యూ ఓర్మా.. 2023 కు స్వాగతం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు నవీన్ చంద్రకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు.

స్టాక్ మార్కెట్లకు మంచి రోజు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ మొత్తం పాజిటివ్‌ ట్రేడింగ్‌ నడిచింది. ఈ రోజు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన రెండు కీలక సూచీలు లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా లాభపడి నేటి అత్యధిక విలువ అయిన 61 వేల 102 పాయింట్లను నమోదు చేసింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పెరిగి ఒకానొక దశలో 17 వేల 900 పాయింట్లను దాటిపోయింది. ఐటీ స్టాక్స్‌ ర్యాలీ తీయటంతో లాభాలు కొనసాగాయి. జనవరి నెలకు సంబంధించిన టోకు ధరల ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్టానికి.. అంటే.. 4 పాయింట్‌ ఏడు మూడు శాతానికి పడిపోవటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కి మద్దతుగా నిలిచింది. చివరికి.. సెన్సెక్స్‌.. 600 పాయింట్లు పెరిగి 61 వేల 32 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 158 పాయింట్లు లాభపడి 17 వేల 929 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 19 కంపెనీలు లాభాల బాటలో నడవగా 11 సంస్థలు నష్టాల బారిన పడ్డాయి. బీఎస్‌ఈలో ఆయిల్‌ ఇండియా, సైయెంట్‌, యూపీఎల్‌ మంచి పనితీరు కనబరిచాయి. ఫోనిక్స్‌ మిల్స్‌, నోసిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఘోరంగా పడిపోయాయి. రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్‌ బాగా రాణించింది. ఒక శాతం వరకు లాభపడింది. మరో వైపు.. రియాల్టీ ఇండెక్స్‌ ఘోరంగా దెబ్బతిన్నది. ఒక శాతం వరకు నష్టపోయింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్టాక్స్‌ విలువ ఒక్కసారిగా 10 శాతం పెరిగింది.

మల్లికా సాగర్ పై ప్రశంసలు.. వేలం అద్భుతం అని కితాబులు

సోమవారం నిర్వహించిన ఐపీఎల్ విమెన్స్ మొట్టమొదటి వేలం విజయవంతమైంది. ఐదు ఫ్రాంఛైజీలు రూ.59.5 కోట్లను వెచ్చించి 87 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. అయితే.. ఈ వేలం ప్రక్రియలో క్రికెటర్లతోపాటు మరో వ్యక్తి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమే.. వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్‌. ఆమె వేలం నిర్వహించిన తీరు అద్భుతమంటూ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. “మల్లికా సాగర్‌ అద్భుతమైన ఆక్షనీర్‌. చాలా స్పష్టంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. WPLలో వేలానికి ఆమె సరైన ఎంపిక. వెల్‌డన్‌ బీసీసీఐ” అని కార్తీక్ ట్విట్టర్‌లో ఆమెకు కితాబిచ్చాడు. ముంబైకి చెందిన మల్లికా ఆర్ట్‌ కలెక్టర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఆర్ట్‌ ఇండియా కన్సల్టెంట్‌ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ప్రో కబడ్డీ లీగ్‌ వేలం ప్రక్రియకు నిర్వహకురాలిగా కూడా వ్యవహరించారు. ఇదే అనుభవంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు.

Show comments