NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కాంతార, కెజిఎఫ్ హీరోలతో ప్రధాని.. ఫోటో వైరల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బెంగుళూరులో సందడి చేశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్‌లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేసిన ఆయనకు కన్నడిగులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని రాజ్‌కుమార్ సైతం పాల్గొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కన్నడ స్టార్ నటులు యష్, రిషబ్ శెట్టి పాల్గొని ప్రధానిని మీట్ అయ్యారు. వారితో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. కన్నడ సినిమా, కర్నాటక సంస్కృతి వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడం మరియు సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం దక్షిణాది సినిమా ప్రయత్నాలు చేస్తుండడం మంచి విషయమని ఆయన ప్రశంసించారని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

గవర్నర్ బిబి హరిచందన్ తో సీఎం జగన్ భేటీ

గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి శ్రీమతి భారతితో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ , ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌ను రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన హరిచందన్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్ట కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిలో గవర్నర్ హరిచందన్ దయతో, ప్రజలకు మరియు రాష్ట్ర పరిపాలనకు ఆయన అందించిన సలహాలు మరియు మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం సజావుగా సాగేందుకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు గవర్నర్ నుంచి తనకు ఎంతో ఆప్యాయత, సహకారం, మార్గదర్శకత్వం లభించిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ముందుగా రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ సూర్యప్రకాష్‌, డిప్యూటీ సెక్రటరీ నారాయణస్వామి. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్యమంత్రి కార్యదర్శి ముత్యాల రాజు, NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్ని, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ గవర్నర్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియమితులయిన సంగతి తెలిసిందే.

101 జేసీబీలు, 10 టన్నులతో పూలవర్షం.. ధనంజయ్ ముండేకి గ్రాండ్ వెల్కం

ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే కారు జనవరి 4న పర్లీ నగరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం తర్వాత ముండె ముంబైలో 39 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆయన ఈరోజు తొలిసారిగా పర్లీలో అడుగుపెట్టారు. ముందుగా ఆయన గోపీనాథ్ కోటకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. పర్లీలో అడుగుపెట్టగానే తన తండ్రి పండిట్ అన్నా ముండే సమాధి వద్దకు వెళ్లి ఆయనకు వందన సమర్పణ చేశారు. అనంతరం ధనంజయ్ ముండే పర్లీ చేరుకున్నారు. అయితే అతడికి న భూతో న భవిష్యత్ అనే రేంజులో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు అభిమానులు. ముండేపై పూల వర్షం కురిపించేందుకు 101 జేసీబీలు ఉన్నాయి. ఆ జేసీబీల నుంచి 10 టన్నుల పూలవర్షం కురిపించారు. వైభవం చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా జనం హాజరయ్యారు. డీజే, విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసి అభిమానులు కోలాహలం మధ్య ముండేను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా పార్లమెంట్ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు.

ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని త్వరలో బహిరంగంగా కనిపిస్తారని పేర్కొన్నారు. తంజావూరులో ముల్లివైక్కల్ మెమోరియల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళుల మెరుగైన జీవనం కోసం ఒక ప్రకటన చేయబోతున్నారని ఆయన తెలిపారు. ప్రభాకరన్ అనుమతితోనే తాను ఈ ప్రకటన చేస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారని నెడుమారన్ చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. అయితే ప్రభాకరన్ ఎక్కడ ఉన్నారో ఆ విషయాన్ని తాను ఇప్పుడు వెల్లడించలేనని చెప్పారు. మరోవైపు ప్రభాకరన్ చనిపోయారంటూ 2009 మే 18న శ్రీలంక ఆర్మీ ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. ప్రభాకరన్ కుమారుడు కూడా చనిపోయాడని తెలిపింది. ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ చనిపోయారని వెల్లడించింది.

గంజాయి మత్తులో కిరాతకం.. మైనర్ బాలికని దారుణంగా చంపిన రౌడీ షీటర్

విజయవాడలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో కుక్కల రాజు అనే రౌడీ షీటర్ ఓ మైనర్ బాలికని నరికి చంపాడు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఘోరం జరిగింది. కంటిచూపు లేని రాణి అనే మైనర్‌ను రాజు అత్యంత కిరాతకంగా చంపాడు. మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అతడు ఈ కిరాతక పనికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి మనోహరం వెంటనే ఇంటికి చేరుకొని, విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసిన బోరున విలపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రౌడిషీటర్ రాజుపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ బాలిక మృతదేహాన్ని తరలించారు. బాలికను హత్య చేసిన అనంతరం కుక్కల రాజు పరారీయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి తల్లి మనోహరం మాట్లాడుతూ.. ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశాడు. కళ్లు కనిపించవనే కనికరం కూడా లేదు. నిన్న రాజు గంజాయి సేవించే వచ్చాడు. నేను అసభ్యంగా ప్రవర్తించటం లేదని‌ చెప్పి వెళ్లిపోయాడు. అరగంటలో వెనక్కి వచ్చి చూసేసరికి గొడ్డలితో నా కూతురిని నరికి చంపాడు.

షారుఖ్ ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్-దళపతి విజయ్?

పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. అయిదేళ్ల తర్వాత తన సినిమాని రిలీజ్ చేసి, దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తున్నాడు. ఇదే జోష్ లో మరోసారి 2023లో ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యడానికి షారుఖ్ నటిస్తున్న సినిమా ‘జవాన్’. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. పఠాన్ సినిమా ఎన్ని వందల కోట్లు తెచ్చినా సౌత్ లో మాత్రం అంత ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోయింది. నార్త్, సౌత్ లెక్కల మధ్య తేడా తగ్గించడానికి అట్లీ, దళపతి విజయ్ ని రంగంలోకి దించుతున్నాడనే వార్త కోలీవుడ్ లో వినిపిస్తోంది. అట్లీ కి సౌత్ లో మంచి క్రెడిబిలిటీ ఉంది, విజయ్ తో కూడా చాలా మంచి రిలేషన్ ఉంది. విజయ్ అట్లీల కాంబినేషన్ లో ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. ఈ కారణంగానే అట్లీ, జవాన్ సినిమాలో క్యామియో ప్లే చెయ్యించడానికి విజయ్ ని అప్రోచ్ అయ్యాడట. విజయ్ కూడా ఓకే చెప్పడానికి కోలీవుడ్ లో వినిపిస్తున్న మాట.

అన్ని దేశాల ఆశాకిరణం చైనా.. గ్లోబల్‌ ఎకానమీని గట్టెక్కించేనా?

చైనా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశం ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి కోలుకుంటోంది. కొవిడ్‌ జీరో పాలసీకి డిసెంబర్‌లో స్వస్తి చెప్పింది. రెండు నెలల కిందట తీసుకున్న ఈ నిర్ణయం చైనాను ఆర్థికపరంగా పూర్తి స్థాయిలో కుదుటపర్చలేదు. రియల్‌ ఎస్టేట్‌, తయారీ, ఎగుమతులు, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ గూడ్స్‌ వంటి రంగాలు ఇంకా బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ సెక్టార్లు మరింత కాలం ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాలో గతేడాది వివిధ వస్తూత్పత్తులకు గిరాకీ లేకపోవటంతో ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది. యూరప్‌ మరియు అమెరికాల్లో కూడా డిమాండ్‌ మందగించటంతో ఎగుమతులు నేలచూపులు చూశాయి. కొవిడ్ ఎఫెక్ట్‌ నుంచి చైనా ఎకానమీ క్రమంగా పుంజుకుంటోందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఆసియా దేశాల్లో మాత్రం ఇంకా అలాంటి ఆశావహ దృక్పథం కనిపించట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు.చైనా ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పునఃప్రారంభమైనా.. రాబోయే నెలల్లో ఆసియాలో వృద్ధి మందగించే అవకాశమే ఉందని నొమురా సంస్థ తన నివేదికలో వెల్లడించింది. చైనాలో ఆర్థిక వృద్ధి ముందుగా సేవల రంగంలో నెలకొంటుందని, ఇందులోనూ కొన్ని పరిమితులు ఉన్నాయని వివరించింది. అయితే.. ఆసియాలో ఎగుమతులు లేదా పారిశ్రామిక రంగ పురోగతి ఈ సంవత్సరంలోని రెండో అర్ధ భాగంలో పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతుందని నోమురా పేర్కొంది.

ఈ పోస్టర్ చాలా హాట్ గురూ…

లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడంతో శాకుంతలం మూవీని ఏప్రిల్ 14కి వాయిదా వేశారు. ఈ 2 మంత్స్ డిలే కారణంగా సమంతాని థియేటర్స్ లో చూడాలి అనుకున్న ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అభిమానులని హార్ట్ చెయ్యకుండా ప్రమోషన్స్ ని కంటిన్యు చేస్తూనే ఉంది శాకుంతలం టీం. ఇప్పటికే మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన శాకుంతలం ఆల్బమ్ నుంచి మూడు పాటలు బయటకి వచ్చి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా శాకుంతలం మూవీ నుంచి నాలుగో సాంగ్ ని ప్రేమికుల రోజున రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఫెబ్ 14న ‘మధుర గతమా’ అంటూ సాగే పాటని రిలీజ్ చెయ్యనున్నట్లు అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో సమంతా, దేవ్ మోహన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది. ఫైరీటైల్ లవ్ స్టొరీ కాబట్టి లీడ్ పెయిర్ మధ్య ఎంత మంచి కెమిస్ట్రీ ఉంటే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో సామ్, దేవ్ ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసేలా కనిపించట్లేదు.

Show comments