NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

9am

9am

రేవంత్‌పై చొప్పువిసిరే యత్నం.. ఇద్దరు అరెస్ట్‌

హాత్‌ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొంద‌రు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయ‌త్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం. ఈఘటన చోటుచేసుకోవడంతో కాసేపు ఆప్రాంతంలో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులు నెలకొనలేదు.

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్..

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ అదుపులో తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల క్రితం భార్య జ్యోతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు భర్త బాలకృష్ణ కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భార్యను వరకట్న వేధింపులు, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాలకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

కార్డులు స్వైఫ్ చేసాడు.. 5 కోట్ల రూపాయలు కాజేశాడు..

మొబైల్ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న నవీన్ మొదట్లో తన క్రెడిట్ కార్డును స్వైప్ చేసి కమీషన్ తీసుకోకుండా స్నేహితులకు నగదు ఇచ్చాడు. అతడిని నమ్మి స్నేహితులు అత్యాశకు గురయ్యారు. నవీన్ తమ వద్ద కమీషన్ తీసుకోకపోవడంతో మనమే క్రెడిట్ కార్డులు సేకరించి పదిశాతం కమీషన్ చొప్పున నగదు అవసరమైన వారికి అందజేద్దామనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు.దాదాపు 50 మంది యువకులు ఒక్కొక్కరు ఐదు లేదా ఆరు బ్యాంకుల నుంచి దాదాపు 100 క్రెడిట్ కార్డులను సేకరించి పిన్ నంబర్‌లతో సహా ఒకేసారి నవీన్‌కు ఇచ్చారు. ఒకేసారి ఇన్ని కార్డులు ఇవ్వడంతో నగదు ఇచ్చేందుకు వారం రోజులు గడువు కోరారు. వారం కాదు.. రెండు వారాలు గడిచినా అడ్రస్ లేదు. ఇంతలోనే తమ కార్డుల నుంచి స్వైప్ చేస్తున్నట్లు ఫోన్లకు మెసేజ్ లు రావడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. తాను ఒక్కడినే రూ.కోటి డబ్బు కావాలని కార్డులు ఇచ్చినట్లు ఓ బాధితుడు రవి చెప్పుకొచ్చారంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం వేచిచూస్తున్నారు. నిన్న 63,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.07 కోట్లకు చేరింది.

ద కశ్మీర్ ఫైల్స్ ఒక చెత్త సినిమా-సినీ నటుడు ప్రకాశ్ రాజ్

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్, తాజాగా బాయ్‌కాట్ బ్యాచ్‌ని ఏకిపారేశారు. పఠాన్ సినిమాని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ బ్యాచ్, మోడీ సినిమాను రూ.30 కోట్ల వరకు కూడా నడపలేకపోయారని చురకలంటించారు. అంతర్జాతీయ జ్యూరీ ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాను విమర్శించినా.. తనకెందుకు ‘ఆస్కార్’ రాలేదంటూ దర్శకుడు సిగ్గులేకుండా అడుగుతున్నాడని, అతనికి కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కేరళలో నిర్వహించిన ఎంబీఐఎఫ్ఎల్ 2023 వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్ బాయ్‌కాట్ బ్యాచ్ మొత్తం పఠాన్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది రూ.700 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది. పఠాన్‌ని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ ఇడియట్స్.. మోడీ సినిమాని కనీసం రూ.30 కోట్ల వరకు కూడా నడిపించలేకపోయారు. వీళ్లు కుక్కల్లా మొరుగుతారే తప్ప, కరవరు. వీరి విషయంలో చింతించాల్సిన అవసరమే లేదు. వీరి వల్ల శబ్ద కాలుష్యం సంభవిస్తుంది. ఇక కశ్మీర్ ఫైల్స్ అయితే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటి. ఆ సినిమాను ఎవరు నిర్మించారో మనందరికీ తెలుసు. అంతర్జాతీయ జ్యూరీ ఈ సినిమాపై ఉమ్మేసింది. సిగ్గుచేటు ఏమిటంటే.. నాకెందుకు ఆస్కార్ రాలేదని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అడుగుతున్నాడు. అతనికి కనీసం భాస్కర్ అవార్డ్ కూడా రాదు. విదేశాల్లో సెన్సిటివ్ మీడియా ఉంది. కానీ, ఇక్కడ ఒక ప్రోపగాండా సినిమా తీయొచ్చు. ద కశ్మీర్ ఫైల్స్ తరహా సినిమాలు చేసేందుకు రూ.2 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నారని నాకు తెలిసింది’’ అంటూ చెప్పుకొచ్చారు.

అలా షూటింగ్ మొదలయ్యింది… ఇక లీక్ ఇచ్చేశారు- RC 15

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చార్మినార్ దగ్గర చరణ్ పొలిటికల్ స్పీచ్ తో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్ ఇచ్చేశారు మెగా అభిమానులు. చరణ్ ‘RC 15’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలని షూటింగ్ స్పాట్ నుంచి లీక్ చేసేశారు. దీంతో సోషల్ మీడియాలో RC 15 షూటింగ్ నుంచి అభిమానులు లీక్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చరణ్-శంకర్ లు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలి అని కష్టపడి చేస్తున్న RC 15 షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోస్ లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు గతంలో వైజాగ్, రాజమండ్రి షెడ్యూల్స్ నుంచి కూడా ఇలానే ఫాన్స్ షూటింగ్ చూడడానికి వెళ్లి చరణ్ లుక్ ని లీక్ చేశారు. శంకర్ సినిమాలో సోషల్ ఎలిమెంట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే చరణ్, విలేజ్ లుక్ అండ్ కాలేజ్ స్టూడెంట్ లుక్… ఇలా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు అనే మాట బయటకి వచ్చింది కానీ ఎలాంటి రోల్ చేస్తున్నాడు అనే పూర్తిగా ఎవరికీ తెలియదు. భారతీయుడు సినిమాలో ఓల్డ్ కమల్ హాసన్ క్యారెక్టర్ రేంజులో RC 15లో ఫాదర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది.

ఈ హీరోని చూసి తమిళ హీరోలు చాలా నేర్చుకోవాలి- ధనుష్‌

రెండు నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ధనుష్ కి ఒక క్రెడిబిలిటీ ఉంది. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం, పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకూ ప్రయాణం చేసిన ధనుష్ మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న మూవీ ‘సార్/వాతి’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సార్ సినిమాని ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ కి ధనుష్ హైదరాబాద్ వచ్చాడు. ధనుష్ రావడంతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరింత స్పెషల్ అయ్యింది. నిజానికి కమల్ హాసన్, రజినీకాంత్, కార్తి, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు తెలుగులో రిలీజ్ అయ్యే తమ సినిమాల ప్రమోషన్స్ కి హైదరాబాద్ వస్తుంటారు కానీ విజయ్ ఇప్పటివరకూ చెన్నై దాటి ఎక్కడికీ వచ్చి తన సినిమాని ప్రమోట్ చెయ్యలేదు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మలయాళ సూపర్ స్టార్

మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రెడిబిలిటీ ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకీ లేదు. కంటెంట్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోలు కూడా నటించి ఏకైక ఇండస్ట్రీ కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఏ చిత్ర పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు ఏడాది ఒక సినిమా చేస్తాడు, రెండు చేస్తూ గొప్ప ఇక మూడు సినిమాలు చేస్తే ఆకాశానికి ఎత్తేయొచ్చు. మలయాళంలో మాత్రమే స్టార్ హీరోలు ఇప్పటికీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తున్నారు. యంగ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు సీనియర్ స్టార్ హీరోలు, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా ఏడాదికి అయిదు సినిమాలకి పైగా చేస్తున్నారు అంటే అక్కడ ఇండస్ట్రీ ఎంత హెల్తీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సీనియర్ సూపర్ స్టార్ హీరోల్లో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉండే వాళ్లలో మముట్టి టాప్ ప్లేస్ లో ఉంటాడు. మోహన్ లాల్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడు కానీ ప్రస్తుతం మోహన్ లాల్ పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడంతో ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి. మమ్ముట్టి మాత్రం కథ నచ్చితే సినిమా చేసేస్తున్నాడు.

టర్కీ, సిరియాల్లో 15,000 మందికి పైగా మృతి

టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ సహాయ శిబిరాలను సందర్శించారు. ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తడంతో ఎర్డోగాన్ అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటైన భూకంప కేంద్రం కహ్రామన్‌మారాస్‌ను సందర్శించి అక్కడ సమస్యలను పరిష్కరించారు. లోటుపాట్లు ఉన్నాయని ఒప్పుకున్న ఆన.. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం సాధ్యం కాదని వెల్లడించారు.

నమాజ్‌ కోసం మసీదుల్లో మహిళలు.. ప్రవేశానికి అనుమతి..!

నమాజ్ చేయడానికి మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక ముస్లిం మహిళ ప్రార్థనల కోసం మసీదులోకి ప్రవేశించవచ్చని, మసీదులో ప్రార్థనల కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలను పొందే హక్కును వినియోగించుకోవడం ఆమె ఇష్టమని అని బోర్డు పేర్కొంది. నమాజ్ కోసం ముస్లిం మహిళలు మసీదులోకి ప్రవేశించడంపై దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఫర్హా అన్వర్ హుస్సేన్ షేక్ అనే వ్యక్తి 2020లో ఉన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. భారతదేశంలోని మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశాన్ని నిషేధించే ఆరోపణలు చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవని ఆదేశించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను మార్చిలో సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అఫిడవిట్ దాఖలు చేసింది. ఏఐఎంపీఎల్‌బీ ఎలాంటి రాజ్యాధికారాలు లేని నిపుణుల సంఘం కాబట్టి ఇస్లామిక్ సూత్రాల ఆధారంగా సలహా అభిప్రాయాన్ని మాత్రమే జారీ చేయగలదని అఫిడవిట్‌లో పేర్కొంది.”ఇస్లాం అనుచరుల మత గ్రంథాలు, సిద్ధాంతాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే, మసీదుల్లో నమాజ్ కోసం మహిళల ప్రవేశానికి అనుమతి ఉంది” అని ఏఐఎంపీఎల్‌బీ పేర్కొంది.అందువల్ల ఒక ముస్లిం మహిళ ప్రార్థనల కోసం మసీదులోకి ప్రవేశించడానికి ఉచితం. మసీదులో ప్రార్థనల కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలను పొందడం ఆమె హక్కును వినియోగించుకోవడం ఆమె ఎంపిక” అని అఫిడవిట్ పేర్కొంది.

మూడో తరగతి బాలికపై లైంగిక వేధింపులు

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూలన చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తూర్పు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు(40) పాఠశాల ఆవరణలో ఎనిమిదేళ్ల 3వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. క్రీడా ఉపాధ్యాయుడు 2016 నుండి తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. చిన్నారిని ఆ వ్యక్తి ప్రలోభపెట్టి పాఠశాలలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గత వారం జరిగింది. చిన్నారి ప్రవర్తనపై ఆమె తల్లికి అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల చిన్నారి తన తల్లి అడిగితే జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు.నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తమకు కాల్ రావడంతో ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అమృత గుగులోత్ తెలిపారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్‌ చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై ఐపీసీ సెక్షన్ 376, 506, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
Credit card fraud: కార్డులు స్వైఫ్ చేసాడు..5 కోట్ల రూపాయలు కాజేశాడు..