NTV Telugu Site icon

Top Headlines @1 PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

జో బైడెన్‌ భార్య, కమలా హారిస్ భర్త.. చట్టసభలోనే ఇలా.. వీడియో వైరల్‌

అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ను పెదవులపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఈ వీడియో ఆసక్తికర చర్చకు దారి తీసింది. వారిద్దరు చట్టసభలోనే పబ్లిక్‌గా చుంబించుకోవడంపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. అది మామూలు పలకరింపు అయితే ఫర్వాలేదు. ఏకంగా పెదాలపై చుంబనం కావడంతోనే ఇక్కడ యవ్వారం మరో మలుపు తిరిగింది. మంగళవారం కాపిటోల్‌ హిల్‌లో ప్రెసిడెంట్‌ బైడెన్‌ స్టేట్‌ ఆఫ్‌ ది యూనియర్‌ ప్రసంగం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా.. కమలా హారిస్‌ను మరోసారి ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్‌ భావిస్తున్నట్లు లాస్‌ ఏంజెల్స్ టైమ్స్‌ ఓ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆంతరంగికుల నుంచి బైడెన్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. కీలక వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈయన గతంలో ప్రముఖుల వద్ద సీఏగా పనిచేశారు. అతడి అరెస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లై వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడు. ఈ కేసులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ అనుమానిస్తోంది. అంతకుముందు అతని ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ, అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు బుచ్చిబాబు పాత్ర ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. అందుకే ఈ తెల్లవారుజామున బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టుకు ముందు పలుమార్లు ఢిల్లీకి పిలిపించి విచారించారు కూడా. అయితే.. అరెస్టయిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు రోస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆపై విచారణ కోసం కస్టడీ కోరే అవకాశాలున్నాయి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం లో మరొకరిని అరెస్ట్ చేశారు. గౌతమ్ మల్హోత్రాను ఈడి అధికారులు అదుపులో తీసుకున్నారు.

ఎమ్మెల్యే ఎర కేసులో 17న విచారిస్తామన్న సుప్రీంకోర్ట్

ఎమ్మెల్యే ఎర కేసులో సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 17న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్‌లు ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తిప్పికొడతామని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 13న విచారించాలని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే దీనిపై ఈ నెల 17న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణకు 2022 డిసెంబర్ 16న తెలంగాణ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జనవరి 4న తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో ఈ ఉత్తర్వును సవాలు చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 6న కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ కు మావోయిస్టుల నుంచి బెదిరింపులు

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫిబ్రవరి 10న బీహార్‌లోని భాగల్‌పూర్ పర్యటనకు ముందు ఐఎస్‌ఐ, నక్సలైట్లు, ఛాందసవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోహన్‌ భగవత్ పర్యటన కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ధనంజయ్ కుమార్ అప్రమత్తంగా ఉన్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ సందర్శించాల్సిన మహర్షి గుహను కూడా ఎస్‌ఎస్పీ పరిశీలించారు. మోహన్‌ భగవత్ పర్యటన నేపథ్యంలో అన్ని ప్రాంతాలను తనిఖీ చేశామని, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి సమస్య ఉండదని అధికారులు వెల్లడించారు. సీసీటీవీ నిఘా కూడా ఉంటుందని, అలాగే పోలీసులు సాధారణ దుస్తుల్లో కూడా మోహరిస్తారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన మహర్షిలోని కుప్పఘాట్ ఆశ్రమంలో సద్గురు నివాసం ప్రారంభించబడుతుందని, అలాగే పరమహంస మహారాజ్‌పై రూపొందించిన డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆవిష్కరించడం కూడా గమనించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.మోహన్ భగవత్ కార్యక్రమం మూడు గంటల 45 నిమిషాల పాటు సాగనుంది. ఆయన మహర్షి మెహి తపస్సు చేసిన ప్రసిద్ధ గుహను కూడా సందర్శించనున్నారు. ఆ తరువాత ఆయన నౌగాచియాకు బయలుదేరనున్నారు.

ఎమ్మిగనూరులో కిలో టమోటా రూపాయే… రైతుల నిరసన

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే వాటికి గిట్టుబాటు ధర గగనం అయిపోతోంది. అన్నదాతకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి అన్న చందంగా మారింది టమోటా రైతుల పరిస్థితి. కర్నూలు జిల్లాలో టమాటా ధరలు పతనం అయిపోయాయి. ఎంతగా అంటే టమోటా అమ్మేందుకు కూడా రైతులు ఇష్టపడడం లేదు. బహిరంగ మార్కెట్లో కిలో 15, 20 రూపాయలు పలుకుతుంటే.. రైతులకు మాత్రం ఒక్కరూపాయి కూడా దొరకడం కష్టంగా మారింది. టమోటా లేకుండా వంట గదిలో రోజు గడవదు. ఏ కూర చేయాలన్నా టమోటా కావాల్సిందే. అదే టమోటా ఒకప్పుడు తలెత్తుకు నిలబడింది. కానీ ఇప్పుడు టమోటా బిక్కచూపులు చూస్తోంది. ఎమ్మిగనూరు మార్కెట్లో కిలో టమాట రూపాయికి దిగజారింది. దీంతో రవాణా ఖర్చులు కూడా రావని మార్కెట్లోనే పారబోశారు రైతులు. టమోటాలు కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా అందించాలని, తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకూ కిలో రూ. 30 నుంచి రూ. 40ల వరకూ పలికిన టమాటా ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సిరియా భూకంపం.. తమ్ముడిని కాపాడిన అక్క

అమ్మా, నాన్నల తర్వాత అన్న లేదా అక్క తమ చెల్లెళ్ళు, తమ్ముళ్ళకు చేదోడు వాదోడుగా నిలుస్తుంటారు. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా వారే అండగా ఉంటారు. టర్కీ, సిరియాలో సంభవించిన పెను భూకంపం తీరని విషాదం నింపింది. వేల సంఖ్యలో ప్రజలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎన్నో వేల మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తుంటే ఎన్నో విషాదకర దృశ్యాలు బయటపడుతున్నాయి. ఇంతటి విషాదంలోనూ ఒక దృశ్యం యావత్ ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంది. ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథిలాల కింద ఓ బాలిక, తన తమ్ముడితో ఇరుక్కుపోయింది. స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్‌ సపోర్టుగా ఉండడంతో వారు ప్రాణాలతో బిక్కు బిక్కు మంటూ అక్కడే ఉండిపోయారు. ప్రాణభయంతో గంటల పాటు శిథిలాల కిందే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బాలిక తన తమ్ముడి కోసం ఆరాటపడింది. శిథిలాల కింత ఇరుక్కుపోయాడు తమ్ముడు.

అరకులో పులి సంచారం.. భయాందోళనలో జనం

పులులు, ఏనుగులు, వన్యప్రాణులు అరణ్యాలను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పులి సంచారం స్థానికులను, పర్యాటకులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పులిని పట్టుకునేందుకు బోను సిద్ధం చేశారు ఫారెస్ట్ అధికారులు. అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల సరిహద్దులో పులి సంచరిస్తున్నట్టు ఆధారాలు దొరకడంతో పులిని పట్టుకునేందుకు బోను సిద్ధం చేసినట్లు అనంతగిరి రేంజర్ దుర్గాప్రసాద్ తెలిపారు. అనంతగిరి మండలం చిలకలగెడ్డలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద బోనును సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోనును గ్రామానికి తరలిస్తామన్నారు. సంబందిత గ్రామాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రేంజర్ తెలిపారు.మరోవైపు తిరుపతి జిల్లాలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. చంద్రగిరి(మం) ఏ.రంగంపేటలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గూండాలకోన ప్రాంతంలో మేకను ఎత్తుకెళ్లింది చిరుతపులి. గ్రామస్తులు కేకలు వేయడంతో మేకను వదలి పారిపోయింది చిరుత పులి. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. చిరుత తిరుగుతుండడంతో రైతులు, పశుకాపరులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

ఫిల్మ్ రేటింగ్ పేరుతో మోసం.. కృష్ణానదిలో దూకి..
మోసాలు, దారుణాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం కొంతమంది కేటుగాళ్ళు ఏం చేయడానికైనా, ఎవరిని ఎంత మోసం చేయడానికైనా వెనుకాడడం లేదు. విజయవాడలో ఓ మహిళ లక్షలు మోసపోయింది. భర్తకి చెబితే ఏమవుతుందోనని, కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా బలవన్మరణానికి పాల్పడింది. ఫిల్మ్ రేటింగ్ పేరుతో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ లో ఫిల్మ్ రేటింగ్ ద్వారా లక్షల రుపాయలు లాభలంటూ ప్రకటనలు.. అబద్దపు ప్రకటనలతో మోసపోతున్న బాధితులు.లక్షల రుపాయలు చెల్లించి మోసపోయిందా మహిళ. వాషింగ్టన్ ఫిల్మ్ స్క్వేర్ కంపెనీకి రెండు దఫాలుగా సుమారు 7 లక్షలు చెల్లించింది విజయవాడకు చెందిన హిమబిందు. భర్త నాగకృష్ణ ప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో తొలిసారి డబ్బులు చెల్లించినపుడు అడ్డుకున్నాడు భర్త. ఆయనకు తెలియకుండా మరో 7 లక్షల రుపాయలు చెల్లించింది హిమబిందు..డబ్బులు చెల్లించాక సదరు కంపెనీ నుండి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు నిర్దారణకు వచ్చింది హిమబిందు. డబ్బుల విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి.