NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

చకచకా విశాఖకు జగన్.. మార్చినుంచి అక్కడే మకాం

విశాఖ రాజధాని కాబోతోందన్నా సీఎం జగన్ ఢిల్లీ కామెంట్ల తర్వాత విశాఖలో హంగామా మొదలైంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నా అని దేశరాజధాని సాక్షిగా ప్రకటించేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ పరిపాలన త్వరలో విశాఖపట్టణం నుంచి సాగనుంది. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయమై అధికార యంత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ మౌఖికంగా మాత్రం ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండేందుకు బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. వీవీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం గాలిస్తున్నారు. మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టులో విచారణ త్వరలో జరగనుంది. పరిపాలనా కార్యాలయాల తరలింపు ఎప్పటికి జరిగినా.. అక్కడ తన క్యాంపు కార్యాలయాన్నైనా ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

మూడు రోజుల ముందే భూకంపాన్ని పసిగట్టాడు.. కానీ!

టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసిన భారీ భూకంపాలను ఒక వ్యక్తి ముందుగానే పసిగట్టాడు. భూప్రకంప‌న‌లను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ స‌ర్వే (SSGEOS)కు చెందిన ఫ్రాంక్ హూగ‌ర్బీట్స్ అనే పరిశోధకుడు.. ద‌క్షిణ మ‌ధ్య ట‌ర్కీ, జోర్డాన్‌, సిరియా, లెబ‌నాన్ ప్రాంతాల్లో త్వరలోనే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించవచ్చని ఫిబ్రవరి 3వ తేదీన ట్వీట్ చేశాడు. అయితే.. అప్పుడు అతడ్ని ఎవ్వరూ నమ్మలేదు. అతనో నకిలీ శాస్త్రివేత్త అంటూ నెటిజన్లు ధ్వజమెత్తారు. ఎందుకంటే.. గతంలో ఆయన వేసిన అంచనాలన్నీ బోల్తాపడ్డాయి. అందుకే.. ఇలాంటి తప్పుడు ట్వీట్లు వేయొద్దంటూ అతడ్ని మొదట్లో విమర్శించారు.కానీ.. ఫ్రాంక్ చెప్పినట్టుగానే మూడు రోజుల తర్వాత టర్కీ, సిరియాలను భూకంపాలు కుదిపేశాయి. 7.8, 7.6, 6.0 తీవ్రతతో వరుసగా మూడు విధ్వంసకర భూకంపాలు ఆ రెండు ప్రాంతాల్ని చిదిమేశాయి. రెండు దేశాల్లో కలిపి 2800కు పైగా బిల్డింగులు నేలమట్టమయ్యాయి. 3400 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాదిమంది తీవ్ర గాయాలపాలయ్యాయి. భారీ ఆస్తినష్టం జరిగింది.

బోరుగడ్డ అనిల్ ఆఫీస్ కు నిప్పు.. అర్థరాత్రి హైడ్రామా

గుంటూరు జిల్లాలో అర్థరాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. గుంటూరు డొంకరోడ్డులోని అనిల్ ఆఫీస్‌ను తగలబెట్టేశారు గుర్తుతెలియని వ్యక్తులు. అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు దుండగులు. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బోరుగడ్డ అనిల్. అర్థరాత్రి సమయంలో ఆఫీస్ లోకి చొరబడ్డ దుండగులు పెట్రోల్ చల్లారు. అనంతరం నిప్పు పెట్టి అక్కడినించి పారిపోయారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది. అయితే, ఈఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి తనపై దాడి చేసినట్టు అక్కడి వాచ్ మెన్ ఆరోపిస్తున్నాడు. క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్‌ ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం బొరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తు్న్నారు. రెండురోజుల క్రితం బోరుగడ్డ అనిల్ కుమార్ కోటంరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఐటీ రంగంలో టెన్షన్ టెన్షన్. ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా?

ఐటీ రంగంలో ఇప్పుడంతా టెన్షన్ టెన్షన్.. ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా? ఏ రోజు మెయిల్‌కి ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు. పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి? ఈఎమ్ఐలు ఎలా చెల్లించాలి? ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయి? ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇలా రకరకాల భయాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మెటా, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలు లే ఆఫ్స్‌ తో పాటు, రిక్రూట్ మెంట్లు కూడా నిలిపివేశాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే తిరిగి గాడిలో పెట్టడం తలకు మించిన భారం. ఆర్థిక మాంద్యం సాధారణంగా 3-4 ఏళ్లు కొనసాగుతుంది. దీంతో ఓ దేశ జీడీపీ 10% కుంగుబాటుకు లోనవుతుంది. మాంద్యం నిరుద్యోగం, పేదరికాన్ని సృష్టిస్తుంది. ఇదంతా ఒక ప్రాంతానికో, ఒక నగరానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉండటం ఖాయం. ఈ లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు ముందస్తు జాగ్రత్తగా ఉద్యోగుల భారాన్ని, కంపెనీల నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి.

కీలక మైలురాయిని దాటేసిన ఐఎన్ఎస్ విక్రాంత్

భారత్‌కు చెందిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఓ చారిత్రక మైలురాయిని దాటింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్‌ అయింది. ఎల్‌సీఏ తేజస్ (నేవీ) విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా విజయవంతంగా ల్యాండ్ అయింది. సముద్ర ట్రయల్స్‌లో భాగంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై భారత్‌కు చెందిన స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ వెర్షన్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఓ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈ నౌకపై ల్యాండ్‌ కావడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై తేలికపాటి యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయడం ద్వారా నావికాదళ పైలట్లు, భారతీయ నావికాదళం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక చారిత్రక మైలురాయి సాధించింది. ఇది స్వదేశీ విమానాల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ (నేవీ) విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి బయలుదేరింది. రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 45,000 టన్నుల ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో, ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. మిగ్‌-29కే, హెలికాప్టర్‌లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ యుద్ధనౌకపై ఏవియేషన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ అదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మందికి దేవుడు.. మరెంతో మందికి శత్రువు. ఆయనను ప్రేమించేవారు ఎంత మంది ఉన్నారో.. ఆయనను విమర్శించేవారు అంతేముంది ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాకా ఆ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. మొదటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే .. పవన్ లో ఎంతో కొంత మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా మాటల్తో తూటాలు పొడిచినా మిన్నగున్న మనిషి.. ఈ మధ్య ఎంతటివారికైనా తనదైన రీతిలో సమాధానమిస్తున్నాడు. అందరు ఎదురుగా ఉండి మాట్లాడింది వేర.. ఎవరు లేనప్పుడు మాట్లాడింది వేరు. కానీ, పవన్ రెండిటి దగ్గర ఒకేలా మాట్లాడతాడు అని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.. పవన్ ఎంత దేవుడిగా కొలిచినా ఆయనలో ఉన్న చెడ్డ గుణమే.. జాలి, దయ అని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదని ఉదాహరణలు చెప్పుకొస్తున్నారు.

మంచి జోరు మీద ఉన్న అనుపమ పరమేశ్వరన్

వరుస హిట్లతో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మంచి జోరు మీద ఉంది. కార్తికేయ 2, 18 పేజెస్ అమ్మడికి మంచి పేరునే తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం అనుపమ డీజే టిల్లు 2 లో నటిస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతకుముందు కొద్దిగా బొద్దుగా ఉన్న అనుపమ ఈ మధ్య బక్కచిక్కి కనిపిస్తున్న విషయం తెల్సిందే. అయితే గత కొన్నిరోజులుగా అనుపమ కూడా అందాల ఆరబోతను ఎంకరేజ్ చేస్తుందని మాటలు వినిపిస్తున్నాయి. పద్దతిగా, తెలుగు ఆడపడుచుల ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య అందాల ఆరబోతకు పూనుకొంది. మోడ్రన్ డ్రెస్ లలో ఎద అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది.ఇక తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో రెచ్చిపోయింది. గ్రీన్ కలర్ డ్రెస్ లో ష్రగ్ తో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అబ్బా.. అనుపమ చివరికి నువ్వు కూడా ఇలాంటి ఫోటో షూట్స్ చేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నావా..?