ఇందిరాగాంధీ, రాజీవ్ హత్యలు ప్రమాదాలే.. ఉత్తరాఖండ్ మంత్రి వ్యాఖ్యలు
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేష్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలిదానం అనేది గాంధీ కుటుంబానికి చెందిన గుత్తాధిపత్యం కాదని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలేనని మంత్రి గణేష్ జోషి మంగళవారం అన్నారు. రాహుల్ గాంధీ తెలివితేటలపై జాలిపడుతున్నానని ఆయన ఎద్దేవా చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్‌ల బలిదానాలు జరిగాయన్నారు. గాంధీ కుటుంబ సభ్యులతో జరిగినవి ప్రమాదాలేనని.. బలిదానాలకు, ప్రమాదాలకు మధ్య వ్యత్యాసం ఉందని జోషి అన్నారు. శ్రీనగర్‌లో తన భారత్ జోడో యాత్ర ముగింపులో కాంగ్రెస్ నాయకుడి ముగింపు ప్రసంగం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఒకరు తమ తెలివితేటల స్థాయిని బట్టి మాత్రమే మాట్లాడగలరని ఆయన విలేకరులతో అన్నారు. రాష్ట్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న జోషి.. జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ యాత్రను సజావుగా ముగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఘనత కూడా ఇచ్చారు. ఆ ఘనత ప్రధానమంత్రికే చెందుతుందని.. ఆయన నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండకపోతే, రాహుల్‌గాంధీ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉండేవారు కాదన్నారు. బీజేపీ నేత మురళీ మనోహర్ జమ్మూకశ్మీర్‌లో హింస ఉద్ధృతంగా ఉన్నప్పుడు లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారని జోషి చెప్పారు.
పిల్ విచారణనుంచి తప్పుకున్న సీజే.. అందుకేనా?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆంధప్రదేశ్ కి వరం లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుకున్నారు. పోలవరం నిర్మాణానికి 2014 అంచనాల ప్రకారం నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించిందని, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 2017లో ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనుబంధ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం ఈ పిల్ విచారణకు వచ్చింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విచారణకు హాజరయ్యారు.
ఆ స్కూల్లో వింత నిబంధన.. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే ఫైన్
పురాతన కాలంలో విధించే పన్నులు, జరిమానాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. స్కూలుకి వెళ్లే పిల్లలు బొట్టు పెట్టుకోవడం, చేతికి కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం మామూలే. కానీ ఏపీలోని ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఇలాంటివి పాటిస్తే తాట తీస్తారు. జరిమానాలు విధిస్తారు. ఆ ట్రైనింగ్ స్కూల్ ఎక్కుడుందా అడుగుతున్నారా… అక్కడికే వస్తున్నాం. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే జరిమానాలు విధించే ట్రైనింగ్ సెంటర్ కర్నూలు డీఎంహెచ్ వో ప్రాంగణంలో ఉంది. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఉంది. అందులో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా ఉంది. ఈ కోర్సుకు ప్రిన్సిపల్, వార్డెన్‌గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. ఆమె నిత్యం వేధిస్తుండటం… బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ కోసం వస్తే వార్డెన్ తన వ్యక్తిగత సేవలన్నీ చేయించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ బృందం ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. నగరంలోని భారీ కోట ప్రాంతంలో రద్దీగా ఉండే మసీదులో ఆత్మాహుతి బాంబు దాడి జరిగి 100 మంది మృతి చెందిన తర్వాత.. క్షతగాత్రులైన బంధువులు తమ బంధువుల కోసం మంగళవారం పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని ఆసుపత్రులకు చేరుకున్నారు. అయితే క్షతగాత్రుల్లో ఎక్కువగా పోలీసులే ఉన్నారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. చికిత్స నిమిత్తం వారందరిని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ (టీటీపీ) ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ పేలుడులో కనీసం 170 మంది గాయపడ్డారు, వందలాది మంది ఆరాధకులు మధ్యాహ్నం ప్రార్థనలు చేస్తున్న మసీదు పై అంతస్తును కూల్చివేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రభుత్వ సీనియర్ అధికారి రియాజ్ మహసూద్ తెలిపారు. ఇప్పటి వరకు, 100 మృతదేహాలను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్య ప్రతినిధి మహ్మద్ అసిమ్ ఒక ప్రకటనలో తెలిపారు. 100 మందిలో 97 మంది పోలీసు అధికారులు ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా పార్లమెంటుకు తెలిపారు.
భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్
రళ రాష్ట్రంలో మిరాకిల్ జరిగింది. జస్ట్ ఇంకొక్క రౌండ్ చక్రం తిరిగినా తన తలపైనుంచి బస్సు వెళ్లేది. కొట్టాయంకు చెందిన ఓ మహిళ జీవితంలో మిరాకిల్ జరిగింది. బస్సు కిందపడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె జుట్టు బస్సు చక్రంలో ఇరుక్కుపోయింది. కొట్టాయం సమీపంలోని చింగవరానికి చెందిన ఈ మహిళ పేరు కే అంబిలి… స్కూల్ బస్సులో హెల్పర్‌గా పనిచేస్తోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ చిన్నారిని దాటించే సమయంలో ఆర్టీసీ బస్సు ఈమెను ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సుకింద పడిపోయింది. డ్రైవర్ వెంటనే సడెన్ బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు బస్సు ముందు చక్రం ఆమెపైనుంచి వెళ్లలేదు. అయితే జుట్టు మాత్రం చక్రంలో ఇరుక్కుపోయింది. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మహిళకు సాయం చేశారు. ఓ బార్బర్‌ను పిలిపించారు. అతను బస్సు కిందకు వెళ్లి చక్రంలో ఇరుక్కున్న మహిళ జుట్టును కత్తిరించాడు. దీంతో మహిళ క్షేమంగా బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. తాను ఇంకా బతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని మహిళ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతా క్షణాల్లో జరిగిపోయిందని చెప్పింది.
ఎన్ని బాధలున్నాయ్ కొడుకా.. ఇలా కావాలనే రైలుకింద పడ్డావు
ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జనవరి 26న జరిగింది. అతడి పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు తిరిగారు. ఇంతలో రైలు రావడాన్ని చూశాడు. అంతే.. ఉన్నట్లుండి ప్లాట్ ఫామ్ నుంచి దిగి ట్రాక్ పై పరిగెత్తి పడుకున్నాడు. కాసేపు అక్కడున్న వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఇంతలో రైలు వచ్చేసింది. రైలు అతడి పైనుంచి వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ వ్యక్తి అలా సూసైడ్ చేసుకోవడాన్ని కళ్లారా చూసి షాక్ అయ్యారు. ఆయన ఎందుకలా పట్టాలపైకి దిగాడో అర్థమయ్యేలోపే ఆయన ప్రాణం పోయింది. కళ్ల ముందే సూసైడ్ ఘటన చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉంది. పని ఒత్తిడి కారణంగా ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోలేని రైల్వే అధికారులు తెలిపారు.