ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం
MLC కవిత సిబిఐ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం తెలిపింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో , 11 వ తేదికి సీబీఐ అంగీకారం తెలపడం కీలకంగా మారింది. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది సీబిఐ. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంబంధించిన కేసులో వివరణ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది.వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సిబిఐ కి కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. కవిత లేఖకు సిబిఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది. కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం తెలపడంతో ఉత్కంఠకు తెరపడింది. వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో , 11 వ తేదికి సీబీఐ అంగీకారం తెలిపింది. ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చారు సీబీఐ అధికారులు.
మహిళలకు ప్రేమించే హక్కు, నిరాకరించే హక్కు ఉంటాయ్
ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన మెడికో విద్యార్థిని హత్య కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఈ అంశంపై స్పందించారు. మెడికో విద్యార్థిని హత్య దారుణమని.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ స్నేహాలు విషాన్ని చిమ్ముతున్నాయని ఇప్పటికైనా యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో పుట్టే ప్రేమలను మనం అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు. ప్రేమ పేరుతో యువకుడు వేధిస్తున్నట్లు తపస్వి ఒక్కమాట కూడా చెప్పలేదని తల్లిదండ్రులు అంటున్నారని.. పథకం ప్రకారమే మెడికో తపస్విని జ్ఞానేశ్వర్ హత్య చేశాడని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలకు ప్రేమించే హక్కు ఉన్నప్పుడు నిరాకరించడం అనే హక్కు కూడా ఉంటుందని.. అంతమాత్రానికే మహిళలను చంపేస్తారా అని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిందితుడు జ్ఞానేశ్వర్‌పై పోలీసులకు తపస్వి ఫిర్యాదు మాత్రమే ఇచ్చిందని.. కౌన్సిలింగ్ ఇస్తే చాలని పోలీసులతో చెప్పిందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. కానీ అతడు ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేసే వరకు వెళ్లడం దురదృష్టకరమన్నారు.
ఈనెల 9 నుంచి 11 వరకూ కార్ రేసింగ్ పోటీలు.. అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
ఈసారి HMDA ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్ రేసింగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. కార్ రేసింగ్ పోటీలతో మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్స్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులులో వుంటాయని పోలీసులు తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకూ కార్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్,నెక్లెస్ రోడ్,ఐమాక్స్ రోటరీ వైపు రోడ్ క్లోజ్ చేస్తారు. బుద్దభవన్,నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమాక్స్ వైపు నో ఎంట్రీ అమలుచేస్తారు. రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు.బీఆర్‌కెఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్,నెక్లెస్ రోటరీ రూట్ క్లోజ్ చేస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్‌టీఆర్‌ఘాట్,నెక్లెస్ రోడ్,లుంబినీ పార్క్ రోడ్లు మూసివేస్తారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. తెలంగాణను మార్చేస్తాం
ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రక్త, వెంట్రుక నమూనాలిస్తే నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘నేను తంబాకు తింటానని పచ్చి అబద్దాలు చెప్పినవ్ కదా… నాకు ఆ అలవాటే లేదని నిరూపిస్తా. అందుకోసం రక్త నమూనాలతోసహా నా శరీరంలోని ఏ భాగమైన పరీక్షలకు ఇచ్చేస్తా…. మరి నీకు రక్తపు, రెండు వెంట్రుకల నమూనాలిచ్చే దమ్ముందా?’’అంటూ సవాల్ విసిరారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయించారని అన్నారు. తక్షణమే ఆ కేసులు రీ ఓపెన్ చేసి విచారణ జరపాలని దర్యాప్తు సంస్థలను కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని మామ్డ మండలం దిమ్మదుర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య వర్సెస్ శ్రీహరి
తెలంగాణలో ఇద్దరు దళిత నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో ఇద్దరు దళిత నాయకుల మధ్య దళిత బంధు పంచాయతీ కొనసాగుతుంది.. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎం దళిత బంధు విషయంలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో దళిత వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ ఘనపూర్ లో CMRF చెక్కుల పంపిణీ సందర్భంగా దళిత బంధులో బంధుప్రీతి పెరిగిందని సరైన అర్హులకు దళిత బంధు అందడం లేదంటూ కడియం చేసిన కామెంట్ .. ఎమ్మెల్యే రాజయ్య గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.. రెండు రోజుకుగా కడియం శ్రీహరి పైనా పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం చేపల పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దళిత నేతగా గుర్తింపు పొందిన నేను దళితులకు ఎప్పుడు అన్యాయం చేయాలేదన్నారు. అర్హులకే దళిత బంధు అందించాం.విడతల వారిగా అందరికి దళిత బంధు వస్తుంది అని హామీ ఇచ్చిన రాజయ్య మంగళవారం సైతం దాన్ని కొనసాగింపుగా కడియం శ్రీహరికు పరోక్ష చురకలు అంటించారు.. స్టేషన్ ఘనపూర్ లో మొదటి విడత ఇచ్చిన దళిత బంధులో ఎవ్వరు అనర్హులో చెప్పాలి అని సవాల్ విసిరారు. అదే సమయంలో మా బంధువులకు . మా అనుచరులు దళిత బంధు తీసుకోరు అని చెప్పగలరా అని పరోక్షంగా చురకలు అంటించారు.
కర్నాటక , మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. ఉద్రిక్తత
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య చాలాకాలం నుంచే సరహద్దు వివాదం కొనసాగుతోంది. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా.. తమ రాష్ట్రానికి చెందిన మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకలో తప్పుగా కలిపారంటూ మహారాష్ట్రా వాదిస్తూనే ఉంది. దీనిపై ఆ రాష్ట్రం సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. మరోవైపు.. కర్ణాటక కూడా తమ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక పేర్కొంటోంది. ఇలా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు విషయమై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. వారం రోజుల క్రితం బెళగావిలోని ఒక కళాశాల ఉత్సవాల్లో ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించడంతో.. మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు. దీంతో.. సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్ణాటక రక్షణ వేదిక బెళగావిలో ఆందోళనలు చేపట్టింది. ఆ వేదికకు చెందిన 400 మంది ఆందోళనకారులు.. కర్ణాటక జెండాలు పట్టుకొని, ధార్వాడ్ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకొని.. వాటిపై దాడులకు ఎగబడ్డారు
అమెరికా ప్రభుత్వానికి మెటా తీవ్ర హెచ్చరిక
మెటా సంస్థ మంగళవారం ఒక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం ‘జర్నలిజం బిల్లు’కి ఆమోదం తెలిపితే.. తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్)లో మీడియా సంస్థల వార్తల్ని బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే.. ఫేస్‌బుక్‌లో షేర్ చేసే కంటెంట్‌కి గాను అమెరికా మీడియా సంస్థలకు బలంగా ఫీజు బేరమాడే అవకాశం లభిస్తుంది. అంటే.. ఫేస్‌బుక్ గనుక తమ న్యూస్ షేర్ చేస్తే, అందుకు అక్కడి మీడియా సంస్థలకు డబ్బులు డిమాండ్ చేసే ఆస్కారం ఉంటుంది. అందుకే, ఈ బిల్లుని అమల్లోకి తీసుకురావొద్దని మెటా సంస్థ అమెరికా ప్రభుత్వానికే హెచ్చరిక చేసింది. అంతేకాదు.. ఫేస్‌బుక్‌లో కంటెంట్ షేర్ చేయడం ద్వారా మీడియా సంస్థలకు తమ మాధ్యమం ద్వారా ట్రాఫిక్ పెంచుతున్నామని కూడా పేర్కొంది. గతంలో ఇలాంటి చట్టాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో.. అప్పట్లో ఫేస్‌బుక్ కొన్నాళ్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థల వార్తలను సస్పెండ్ చేసింది. తాజాగా ఇటువంటి చట్టాన్నే అమెరికాలో పరిశీలిస్తున్నారు. దీనిని జేసీపీఏ పేరిట మిన్నెసోటా సెనెటర్ యామీ క్లోబౌషెర్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుకి అన్ని విభాగాల నుంచి మద్దతు లభించింది కాబట్టి, ఇది అమల్లోకి వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
ఉత్తర కొరియాలో దారుణం.. సినిమా చూశారని పిల్లల్ని చంపేశారు
పిల్లలు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తే.. వాళ్లకు రెండు మొట్టికాయలు తగిలించి, మళ్లీ అలాంటి తప్పులు చేయకూడదని మందలిస్తాం. కానీ.. ఉత్తర కొరియాలో అలా కాదు. ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతకీ.. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా? కేవలం సినిమాలు చూడటమే. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. సినిమాలు చూసిన పాపానికి, ఇద్దరు విద్యార్థుల్ని బహిరంగంగా కాల్చి చంపారు. అసలేం జరిగిందంటే.. అక్టోబర్ నెలలో ఇద్దరు విద్యార్థులు, చైనా సరిహద్దుగా ఉన్న ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను కలుసుకున్నారు. వారితో కలిసి కాసేపు సరదాగా ఆడుకున్న ఆ విద్యార్థులు.. వారితో కలిసి దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ నాటక ప్రదర్శనలను వీక్షించారు. ఇదే వారు చేసిన తప్పు. ఉత్తర కొరియాలో విదేశీ ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సినిమాల్ని నిషేధించాడు. విదేశీయులతో ఎలాంటి సంపర్కం ఉండకూడదని, ఇంకా మరెన్నో ఆంక్షలు విధించాడు. వాటిని అతిక్రమించి, ఆ ఇద్దరు విద్యార్థులు సినిమాలు చూశారని, వారికి మరణశిక్ష విధించారు. ఇతరులు మళ్లీ ఇలాంటి తప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో.. ప్రజల ముందే ఆ మైనర్లను అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనతో కిమ్ జోంగ్ కర్కశత్వ పాలన మరోసారి వెలుగులోకి వచ్చింది.