NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

మెగా పీపుల్స్ సర్వేకు 14వ రోజు విశేష స్పందన

ఏపీలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వేకి అనూహ్య స్పందన లభిస్తోంది. 14వ రోజు గురువారం ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు స్పందించారు. నిన్న ఒక్కరోజు 98 లక్షల గృహాలకు ఈ పథకం చేరింది. 75 లక్షల మంది స్పందించి మిస్ డ్ కాల్స్ ఇచ్చి జగన్ సందేశాన్ని విన్నారు. ఈ తరహాలో గతంలో ఏ సర్వేకి అంత ఆదరణ లభించలేదు. నేనున్నాను.. నేను విన్నాను అంటూ తన పాలనతో ప్రజలకు చేరువ అయ్యారు జగన్. నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్ర‌జా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన `జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు` కార్యక్రమానికి విశేష స్పంద‌న ల‌భిస్తోందని వైసీపీ తెలిపింది.విభిన్న రకాల సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌బ్ధిపొందిన ప్రతీ కుటుంబం జ‌గ‌న‌న్న పాల‌న‌కు జై కొడుతోంది.. `మా న‌మ్మకం నువ్వే జ‌గ‌న్` అంటోంది. జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మం చేప‌ట్టిన 14 రోజుల్లో కోటికి పైగా కుటుంబాల్లో సర్వే నిర్వహించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కోటి మార్క్‌ను దాటడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, గ‌త చంద్రబాబు పాలనకు గ‌ల తేడాను వివరిస్తూ గృహ సారథులు సర్వే చేస్తున్నారు. మ్యానిఫెస్టో అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి గ్రామంలో సందడి నెలకొంది. జ‌గన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రతినిధులుగా ఇంటింటికీ వెళ్తున్నారు.

ట్విట్టర్‌ను విడిచిపెట్టిన హ్యాష్‌ట్యాగ్‌ల సృష్టికర్త

లెగసీ బ్లూ టిక్‌లను తొలగించాలని ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయంతో హ్యాష్‌ట్యాగ్‌ల సృష్టికర్త క్రిస్ మెస్సినా ట్విట్టర్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, తన బ్లూ టిక్‌ను రద్దు చేసినందున ట్విట్టర్‌ను విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకోలేదని, మొత్తం వెరిఫికేషన్ పరిస్థితిని నిర్వహించే విధానం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెస్సినా స్పష్టం చేశారు. ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించమని సూచించిన మొదటి వ్యక్తిగా క్రిస్ మెస్సినా పేరుగాంచారు. “గత ఆరు నెలల్లో అందుకున్న దానికంటే ముందు ట్విట్టర్ ఏదైతే ఎక్కువ గౌరవం, పరిశీలనకు అర్హమైనది” అని మెస్సినా తన ఖాతాను ప్రైవేట్‌గా మార్చడానికి ముందు ట్వీట్ చేశాడు. 2007లో మెస్సినా హ్యాష్‌ట్యాగ్‌ను కనుగొన్నారు. మెస్సినా 2007లో హ్యాష్‌ట్యాగ్‌లను పరిచయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. హ్యాష్ గుర్తు (#)ని ఉపయోగించి టాపిక్‌ల కోసం వెతకడానికి వినియోగదారులను అనుమతించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ చర్య బాగా ప్రాచుర్యం పొందింది. హ్యాష్‌ట్యాగ్ వినియోగదారుని టాపిక్‌ని సులభంగా వెతకడానికి అనుమతిస్తుంది. ఈ హ్యాష్‌ట్యాగ్ పోస్ట్ రీచ్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇప్పుడు, ట్విట్టర్‌లో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా చూపిస్తున్నారు.

టాస్ గెలిచిన సీఎస్కే.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 29వ మ్యాచ్. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్ స్టేడియం) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. రెండు వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్‌కు గత మ్యాచ్‌లో ముంబై కళ్లెం వేయడంతో.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఆ జట్టు కసి మీద ఉంది. మరోవైపు.. గత మ్యాచ్‌లో బెంగళూరుపై ఘనవిజయం సాధించిన ధోనీ సేన.. ఈ మ్యాచ్‌లోనూ అదే కొనసాగించి, విజయం సాధించాలని పూనుకుంది. ఈ నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అయితే.. చెన్నై జట్టులో బ్యాటర్లు చాలామంది ఉన్నారు. ఏడో వికెట్ దాకా మెరుపులు మెరిపించే బ్యాటర్లు ఆ జట్టు సొంతం. అలాంటి జట్టుపై సన్‌రైజర్స్ రాణించాలంటే.. టాపార్డర్ అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన బ్రూక్.. ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అతనితో పాటు రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ కూడా తమవంతు కృషి అందిస్తే.. చెన్నైకి గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఇవ్వొచ్చు. ఇక్కడ మరో చిక్కు ఏమిటంటే.. ఈ మ్యాచ్ చెన్నై సొంత మైదానంలో జరుగుతుంది.

ఐఐటీ మద్రాస్ లో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో నాలుగో స్టూడెంట్

చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థులు వరుసగా ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. తాజాగా మరో విద్యా్ర్థి సూసైడ్ చేసుకున్నారు. ఐఐటీలోని హాస్టల్ గదిలో ఈరోజు విద్యార్థిని శవమై కనిపించిందని, ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే, ఈ ఏడాది ఐఐటీ-మద్రాస్‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో, ఐఐటి-మద్రాస్‌లో 32 ఏళ్ల పిహెచ్‌డి విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. అంతకు ముందు, మార్చిలో అదే క్యాంపస్‌లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మూడవ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫిబ్రవరిలో, మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ స్కాలర్ ఐఐటీ-మద్రాస్‌లో సూసైడ్ చేసుకున్నారు.

రెండు గ్రూప్ లు.. ఏడుగురు ఉగ్రవాదులు.. పూంచ్ దాడి పక్కా స్కెచ్

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ఉగ్రదాడి ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రెండు గ్రూపులకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు పాకిస్థాన్ జాతీయవాద గ్రూపులకు చెందినవారని పేర్కొంది. గురువారం ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఉగ్రవాదులు జైష్-ఎ-మహ్మద్ (జెఇఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సహాయంతో జమ్ముకాశ్మీర్ రాజౌరిలో చురుగ్గా పనిచేస్తున్న గ్రౌండ్ వర్కర్లపై దాడి చేశారని నిఘా వర్గాలు తెలిపాయి. జైష్ మద్దతుతో కూడిన ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు సమాచారం అందుకుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి రాజౌరీ, పూంచ్‌ మీదుగా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారనే వార్తలపై నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. జేఈఎం, ఎల్‌ఈటీ ఉగ్రవాదులను పీఓకేలోని పలు చోట్ల దాగి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి ఉగ్రవాదుల జాడ కోసం భద్రతా బలగాలు బాటా-డోరియా ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

నేను నిరపరాదిని…….హైకోర్టుకెళతా

టీటీడీ దర్శన టికెట్ల కుంభ‌కోణంలో టీచ‌ర్స్ ఎమ్మెల్సీ షాక్ సాబ్జీ టీటీడీ విజిలెన్స్ అధికారుల‌కు ప‌ట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ విష‌యం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ త‌ర‌పున షేక్ సాబ్జీ రెండేళ్ల క్రితం గెలుపొందారు.బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముకున్న విష‌యాన్ని గ్రహించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆయ‌న‌పై కేసు న‌మోదుకు రెడీ అయ్యారు. ఈ నెల‌లో 19 సిఫార్సు లేఖ‌ల‌ను ఎమ్మెల్సీ పంప‌గా, టీటీడీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని బ్రేక్ ద‌ర్శన భాగ్యాన్ని క‌ల్పించింది. ఇవాళ ఏకంగా 14 మంది భ‌క్తుల‌ను వెంట‌బెట్టుకుని ఆయ‌న తిరుమ‌ల ద‌ర్శనానికి వెళ్లారు. అలాగే ఇదే నెల‌లో ఆయ‌న మూడు సార్లు తిరుమ‌ల‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా స్వామివారిని ద‌ర్శనం చేసుకున్నారు.ఎమ్మెల్సీ ఇచ్చిన సిఫారసు లేఖలపై నిఘా పెట్టారు అధికారులు. ఈ సందర్భంగా పలు విభ్రాంతికరమయిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ దర్శనానికి వచ్చిన 14 మంది భ‌క్తుల‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారించారు. తామంతా క‌ర్నాట‌క వాసులుగా చెప్పారు. హైద‌రాబాద్‌కు చెందిన వారిగా ఆధార్‌లో ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు గుర్తించారు. ద‌ర్శ‌నానికి సంబంధించి ఎమ్మెల్సీ డ్రైవ‌ర్ ఖాతాకు రూ.1.05 ల‌క్ష‌ల‌ను భ‌క్తులు బ‌దిలీ చేసిన‌ట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్రేక్ దర్శన టికెట్లను అమ్ముతున్నారని విజిలెన్స్ తేల్చింది. ఇది తీవ్రమైన నేరంగా భావించిన టీటీడీ కేసు న‌మోదుకు రెడీ అయింది. అక్రమాలకు పాల్పడే వ్యక్తలు ఎవరైనా వారిపై కఠినచర్యలు తప్పవన్నారు ఈవో ధ‌ర్మారెడ్డి. ఇందుకు ఎమ్మెల్సీపై కేసు న‌మోదే ఉదాహ‌ర‌ణగా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాను నిరపరాదినన్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి.

డాక్టర్‌ వైఎస్సార్‌ పంటల బీమా పథకానికి జాతీయస్ధాయి గుర్తింపు

డాక్టర్‌ వైఎస్సార్‌ పంటల బీమా పథకానికి జాతీయస్ధాయి గుర్తింపు లభించింది. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్‌ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు అందజేశారు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపిన వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ సీఎంకి చూపించారు. ఈ సందర్భంగా అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలన్నారు.వ్యవసాయరంగంలో దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్ధేశం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్‌ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్‌ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సాధించింది.

టీటీడీకి ఊరట… ఫారెన్ కరెన్సీ డిపాజిట్లకు కేంద్రం ఓకే

తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం గొప్ప ఊరట నిచ్చింది. టీటీడీకి శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం.. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహాయింపు లభించింది. అయితే, భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కోన్నాలని కోరింది కేంద్రం. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరేన్సి ని డిఫాజిట్ బ్యాంకులో చేసుకునేందుకు అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఫారిన్ కరేన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు టిటిడికి మినహయింపు ఇచ్చింది. భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కోన్నాలని కోరిన కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. సెక్షన్ 50 ప్రకారం టిటిడికి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తూన్నట్లు ఇఓ దర్మారెడ్డికి సమాచారమందించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్. గతంలో ఫారిన్ కరేన్సి డిఫాజిట్లు వ్యవహరంలో టిటిడికి మూడు కోట్లు జరిమాన విధించింది కేంద్రం. జరిమానా చెల్లించిన అనంతరం ఫారిన్ కరేన్సి డిఫాజిట్లు చేసుకునేందుకు లైసేన్స్ రెన్యూవల్ చేసింది కేంద్రం. లైసేన్స్ రెన్యువల్ చేసిన….ఫారిన్ కరెన్సి డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలనేన నిబంధనను సడలించలేదు కేంద్రం. తాజాగా టిటిడి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది కేంద్రం.

మేనల్లుడు హిట్.. మామయ్య దిల్ ఖుష్

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాను అయినా ఎంకరేజ్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా బావుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తాడు. అలాంటింది.. తన తోబుట్టువు కొడుకు హిట్ కొడితే ప్రశంసించకుండా ఉండగలడా..?. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. మేనల్లుడు హిట్ టాక్ అందుకోవడంతో మామయ్య తబ్బుబ్బి పోతున్నాడు. తేజ్ తో పాటు చిత్ర బృందాన్ని సైతం పొగడ్తలతో ముంచెత్తాడు. ” విరూపాక్షకు అద్భుతమైన స్పందన వస్తుందని విన్నాను. సాయి ధరమ్ తేజ్ నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మంచి బ్యాంగ్ తో కమ్ బ్యాక్ ఇచ్చావ్. మీ సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుం డా తేజ్ కు సురేఖ కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ కు మేనల్లుడు స్పందిస్తూ.. మామఅత్తకు థాంక్స్ చెప్పాడు. ఇక తేజ్ కు యాక్సిడెంట్ జరిగినప్పుడు అన్ని తానై నిలబడ్డారు మెగా కుటుంబం. ముఖ్యంగా చిరంజీవి, తన సోదరిని ఓదారుస్తూ దైర్యం చెప్పాడు. ఇక తేజ్ కోలుకున్నాకా కానీ, అంతకుముందు కానీ.. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది చిరునే. ఇక తేజ్ సైతం తన మొదటి సినిమా నుంచి ఈ సినిమా వరకు తాను నిలబడింది వాళ్ళ మామయ్యల వలనే అని, వారు లేకపోతే ఈరోజు తాను లేనని చెప్తూనే వస్తున్నాడు. తేజ్ యాక్సిడెంట్ తరువాత రిపబ్లిక్ సినిమాను పైకి లేపింది తేజ్ మామయ్యలే.. అందుకే తనకు మామయ్యలంటే ఇష్టమని తేజ్ చెప్తూ ఉంటాడు. మరి ఈ మెగా మేనల్లుడు ఈ సినిమాతో ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.