NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ముగిసిన అవినాష్ రెడ్డి రెండవ రోజు సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ రెండవ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. 8 గంటల పాటు విచారించిన సిబిఐ పలు విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. హత్యను గుండెపోటుగా ఎవరు చిత్రీకరించారనే దానిపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. వివేకా హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఇంట్లోనే ఉన్నట్లు చూపించిన తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ విచారించింది. అవినాష్ రెడ్డి రాజకీయ ఎంట్రీపై కూపీలాగింది కేంద్ర దర్యాప్తు సంస్థ. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీ అవినాష్‌ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 40 కోట్ల రూపాయల డీల్‌‌కు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీసింది సీబీఐ. ఇటు వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి , ఉదయ్ కుమార్ లకు రెండో రోజు సీబీఐ కస్టడీ విచారణ ముగిసింది.

నరోదాగామ్ కేసులో నిందితులందరూ నిర్దోషులే

గుజరాత్‌లోని నరోదాగామ్ ఊచకోత కేసులో హ్మదాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్‌లో 11 మంది చనిపోయారు. ఈ కేసులో గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో భజరంగ్ దళ్ నేత బాబు బజరంగీ సహా 86 మంది నిందితులుగా ఉన్నారు. అహ్మదాబాద్‌లోని నరోదా గామ్‌లో ఇళ్లకు నిప్పుపెట్టి 11 మంది ముస్లింలు మరణించిన మతపరమైన అల్లర్ల కేసులో అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. హత్య జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. విచారణలో 18 మంది చనిపోయారు. మిగిలిన 68 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 13 ఏళ్లలో ఆరుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించారు. 187 మంది సాక్షులను, 57 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించారు. నరోదా గామ్‌లో మాయా కొద్నానీ నేతృత్వంలోని దుండగులు 11 మందిని ఊచకోత కోశారనేది కేసు. గైనకాలజిస్ట్ మాయా కొద్నానీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో మారణహోమం జరిగింది. ఈ కేసులో కొద్నానీకి అనుకూలంగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

చంద్రబాబుపై మంత్రి సురేష్ సెటైర్లు

చంద్రబాబు పర్యటనపై మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సెటైర్లు వేశారు. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా… దళితులు ఏమి పీకలేరు… అని మీరు అనలేదా..యర్రగొండపాలెంలో మీ పార్టీ ఇంచార్జి బాబును కూడా నెల్లూరు మీటింగ్ లో చంద్రబాబు అవమానించలేదా..ఏ చెట్టూ లేని చోట ఆముదపు వృక్షం లాంటి ఎరిక్షన్ బాబే అక్కడ మహా వృక్షం అని అనలేదా..అలాంటి పార్టీలో ఈ దళిత నాయకులు ఎలా కొనసాగుతారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు మంత్రి సురేష్. నీ హయాంలో కొత్త జిల్లాల విషయం గుర్తుకురాలేదు. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్ముతారా అన్నారు. జగనన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటంతో పాటు ఒక జిల్లాకు ఎన్టిఆర్ పేరు కూడా పెట్టారు..ఇన్నాళ్లు గుర్తుకురాని ఎన్టిఆర్ పేరు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందేమిటి? అని మంత్రి ప్రశ్నించారు. నీ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కనబడితే ఒప్పుకోవు… సభల్లో మాత్రం జై ఎన్టీఆర్ అని అంటావు. రెండు నాలుకల ధోరణి నీకే సాధ్యం అని ఎద్దేవా చేశారు.

అనుమానాస్పద మృతిని చేధించిన జమ్మికుంట పోలీసులు..

అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును రేపుతున్నాయి. చివరకు ఆత్మహత్యలు, హత్యలకు కారణం అవుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న వారు పిల్లల జీవితాన్ని, తమ గౌరవాన్ని పట్టించుకోకుండా బరితెగిస్తున్నారు. భర్తలను కాదని ప్రియులతో సంబంధాలు నెరుపుతూ కొంతమంది భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేకం జరిగాయి. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట నాలుగు నెలల క్రితం జరిగిన హత్యను చేధించారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం పోలోజు రమేష్(38) అనే వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు జమ్మికుంట మండలం మడిపల్లి-ఉప్పల్ రైల్వే ట్రాక్ పై గుర్తించారు. దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి కవిత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులకు బదిలీ చేశారు. కేసు విచారణలో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి సెల్ ఫోన్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంబించారు. అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన కంచం రజిత, భర్త రమేష్, కంచం ఓదెలు, రుద్రవేన దేవేందర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

స్కాలర్ షిప్ డబ్బులతో ప్రయాణికులకు నిమ్మరసం

దేశంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా 40 డిగ్రీల సెల్సియస్ దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎండలు మండిపోతున్నాయి. వేడి ప్రజలకు అల్లాడిపోతున్నారు. బెంగాల్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో చాలా మంది ప్రజలు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ఎండలో ప్రయాణించాల్సిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని పాఠశాల బాలికల బృందం ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది. ప్రయాణీకులకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌ల రూపంలో అందుకున్న డబ్బును ఉపయోగించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అందించిన కన్యాశ్రీ ప్రకల్ప పథకాన్ని బాలికలు వేసవి రోజున ప్రయాణికులకు షర్బత్ అందించడానికి ఉపయోగించుకున్నారు.రాజ్ ఖమర్ హై స్కూల్ ఆఫ్ ఇండస్ బ్లాక్ విద్యార్థులు ట్రక్కు డ్రైవర్లు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎండ వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించారు. హైవేపై అలసిపోయిన ప్రయాణికులకు విద్యార్థులు నిమ్మరసం అందించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు బాలికలు నిమ్మరసం కూడా అందించారు. వేసవి తాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రజలు, అలసిపోయిన ప్రయాణికులకు విశ్రాంతిని అందించడానికి తాము చిన్న ప్రయత్నం చేస్తున్నాని దిశాని అనే విద్యార్థి చెప్పారు. ఇందుకోసం కన్యాశ్రీ పథకం కింద ఇచ్చిన డబ్బును ఉపయోగించామని ఆమె వెల్లడించింది.

ఏపీలో స్టిక్కర్ కాంబినేషన్ స్టార్టయింది

ఏపీలో అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీ లో స్టిక్కర్ కాంపిటీషన్ మొదలయిందని, వైసిపి వెంటనే ఆపెయ్యాలన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ముఖ్యమంత్రి వాఖ్యలపై జివీఎల్ స్పందించారు. వైజాగ్ ను కేంద్రమే అభివృద్ధి చేసింది. అభివృద్ధి కోసం వెళ్తాం అంతే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. బిజెపి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నాం. టిడిపి అబద్ధపు ప్రచారం చేస్తోంది.వైసీపీనీ గద్దె దింపి బిజెపి జనసేన అధికారం లోకి రావాలి అనేది లక్ష్యం అన్నారు. బిజెపి వైసీపీ ల మధ్య వ్యక్తిగత బంధం కాదు, వ్యతిరేఖ బంధమే. టిడిపి బిజెపి తో పొత్తు కోసం తహహలాడుతున్నది. అన్ని గడపలు తొక్కుతోంది. టిడిపి తప్పుడు మాటలు చెపుతోంది. కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపికి బిజెపి జనసీన ను చూసి అక్కసు ఎందుకు. చంద్రబాబు పుట్టిన రోజు నాడు ఇలాంటి మాటలా? అని మండిపడ్డారు జీవీఎల్. బీఆర్ఎస్ అంటే భ్రమ రాజకీయాల సమితి.. స్టీల్ కొనడానికి EOI పిలిస్తే, స్టీల్ ప్లాంట్ కొనడానికి అనుకుని బిడ్ వేస్తామని చెప్పారు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

ఎలక్ట్రికల్ వాహనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం

భవానిపురంలోని ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ లో గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ కార్యక్రమం ప్రారంభమయింది. క్యాంపెయిన్ లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోలార్ ఎనర్జీతో పనిచేసే ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు ,మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వాహనాలకి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశాం అన్నారు. తిరుపతిలో ప్రస్తుతం 100 ఎలక్ట్రానిక్ బస్సులు ఉన్నాయి. 1000 బస్సులు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు పోతాం అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే సిఎం జగన్ ఆలోచన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం అన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ స్థలం కోర్ట్ కేసులో ఉన్నందున పిల్లలకు గ్రౌండ్ ఆలస్యం అవుతుందన్నారు.

పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్… 24 పరుగులతేడాతో ఆర్సీబీ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో 27వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుతా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లను బెంగళూరు బ్యాటర్లు ఊచకోత కోశారు. నిర్ణీత 20 ఓవర్లో ఆర్సీబీ బ్యాటర్లు 174/4 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ 137 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్ తో 59 పరుగులు చేయగా.. ఫాప్ డుప్లెసిస్ సైతం అర్థ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 56 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు.. అందులో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. అయితే ఆర్సీబీ ఓపెనింగ్ జోడిని పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్ ప్రీత్ బార్ వరుస వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ ( 59 ), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0) ను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో సంతోషం నింపాడు. దినేశ్ కార్తీక్ కూడా ఇప్పటికే 5 బంతుల్లో ఓ ఫోర్ బాది 7 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మహిపాల్ లోమ్రోర్ 9 బంతుల్లో 7, షాబజ్ అహ్మద్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ మాత్రం కష్టాల్లో పడింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ అథర్వ టైడే ఇన్సింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఊపుమీద కనిపించిన.. ఇక రెండో బంతికి ఇన్‌స్వింగర్ తో ఆర్సీబీ బౌలర్ సిరాజ్.. పంజాబ్ బ్యాటర్ అథర్వ టైడేను బోల్తా కొట్టించాడు.

ఆయన ఊరికే అలా నిలబడినా చాలు.. ట్విట్టర్ షేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గురించి పరిచయ వాక్యాలు కానీ, ఎలివేషన్స్ కానీ అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఎక్కడ ఉన్న ప్రభంజనమే. పవన్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక గత కొన్నాళ్లుగా పవన్ రాజకీయాల్లో ఉంటున్న విషయం తెల్సిందే. వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో మాత్రమే కనిపించేవాడు. ఎక్కడకు వెళ్లినా పంచెకట్టుతోనే దర్శనమిచ్చేవాడు. దీంతో పవన్ ఫ్యాన్స్..ఆయన స్వాగ్ ను మిస్ అవుతూ వచ్చారు. ఇక కొన్నిరోజులుగా పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. ఆయనను అలా చూస్తూ ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. పవన్ ఎక్కువ బ్లాక్ హుడీస్ లో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక మొన్నటికి మొన్న ముంబైలో బ్లాక్ హుడీ తో OG సెట్లో ఉస్తాద్ లా అడుగుపెట్టాడు. ఆ ఫొటోలే ఇంకా ట్రెండింగ్ నుంచి దిగలేదు. తాజాగా ఉస్తాద్ మరో ఫోటో ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. OG.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెల్సిందే . ప్రమోషన్స్ ఎలా చేయాలో దానయ్యకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. అందుకు ఆర్ఆర్ఆర్ యే ఉదాహరణ.