NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

పదవికే వన్నెతెచ్చిన నేత వేపాడ చిరంజీవి

ఏపీలో ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు వేపాడ చిరంజీవి రావు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వేంపాడ చిరంజీవి రావు సన్మానించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని. ఈసందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. వేపాడ చిరంజీవి రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఒక టీచర్ గా గ్రూప్1 ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సుమారు యాభై వేలమంది యువతి యువకులకు విద్య అందించి వారి కల నిజం చేసిన వ్యక్తి చిరంజీవి అన్నారు నాని. చిరంజీవి లాంటి వ్యక్తుల అవసరం శాసన మండలికి, ప్రస్తుత సమాజానికి చాలా అవసరం ఉందన్నారు. ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం పార్టీకి శుభసూచకం. చిల్లర వ్యక్తులను పదవులిస్తే చట్ట సభల విలువలు దిగజారిపోతాయి.చిరంజీవి లాంటి మేధావులు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వల్ల చట్ట సభల విలువ మరింత పెరుగుతుంది. ఎమ్మెల్సీ పదవికే వన్నె పెరుగుతుందన్నారు. ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన అభ్యర్ధిని ఎంపిక చేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపారు కేశినేని నాని.

వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ..

ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ ట్రైన్ ను శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ రోజు కాంగ్రెస్ మిత్రులు మోదీ అందరిని ఏప్రిల్ ఫూల్స్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు.. కానీ ఈ రైలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం అయింది. ఇది మన నైపుణ్యం, సామర్థ్యం, విశ్వాసానికి చిహ్నం’’ అని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయని, ప్రజల సంక్షేమం కోసం వారు సమయం కేటాయించలేదని ప్రధాని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఒకే కుటుంబంపై దృష్టి సారించాయిని పరోక్షంగా గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. పేద, మధ్య తరగతివారిని ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

ఏపీలో ఒంటిపూట బడులు… విద్యార్ధులకు మజ్జిగ పంపిణీ

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 07:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం అందివ్వాలని ఉత్తర్వులు జారీచేసింది విద్యాశాఖ. ఒకటవ తరగతి నుండి IX తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు HALF DAY పాఠశాలలను ప్రకటించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలలతో సహా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 03-4-2023 నుండి చివరి పని దినం వరకు అంటే 30-4-2023 వరకు వుంటాయి. ప్రత్యేకంగా SSC పరీక్షా కేంద్రాలు (రాష్ట్రవ్యాప్తంగా 3349 కేంద్రాలు) ఉన్న పాఠశాలల్లో, పరీక్ష రోజుల్లో (మొత్తం ఆరు రోజులు) తరగతులు ఉండవు. ఈ పాఠశాలలు 03.04.23 నుండి 30.04.23 వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సెలవు దినాలలో ఆరు రోజుల పాటు పరిహార తరగతులను నిర్వహించాలి. పరిహార తరగతులు కూడా హాఫ్ డే షెడ్యూల్‌ను అనుసరిస్తాయి.

రాజకీయ దురుద్దేశంతోనే నవమి నాడు ఘర్షణలు

శ్రీరామ నవమి రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ లోని ససారం, బీహార్ షరీఫ్ ప్రాంతాల్లో రామనవమి ఉత్సవాల సందర్భంగా మతపరమైన ఉద్రికత్తలు చెలరేగడంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రాజకీయ దురుద్దేశం వల్లే ఈ ఘర్షణలు ప్రేరేపించబడ్డాయిన ఆయన అన్నారు. బీహార్ లో ఇలాంటి ఘర్షణలు తొలిసారిగా జరిగాయని, ఇది సహజంగా జరగలేదని, కొందరు వ్యక్తుల వల్లే జరిగాయిని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మతసామరస్యానికి విఘాతం కలిగించబోమని ఆయన తెలిపారు.ఘర్షణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన బీహార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై మాట్లాడుతూ..‘‘ ఆయన ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు, ఎందుకు రావద్దని అనుకుంటున్నాడో అర్థం కాలేదు’’ అంటూ నితిష్ కుమార్ కామెంట్స్ చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

మిస్టరీగా మారిన హత్య కేసును చేధించిన వర్షం

ఇంట్లో నుంచి ఓ వివాహిత హఠాత్తుగా అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఆమె కోసం వెతకని ప్రదేశం లేదు. ఎంత వెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈలోగా అకస్మాత్తుగా అకాల వర్షం కురిసింది. ఈ వర్షం ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పటికీ.. ఒక హత్య మిస్టరీని ఛేదించడానికి వర్షం సాయపడింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని గ్రేటర్ నోయిడాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. బంజరు భూమిలో పాతిపెట్టిన మహిళ మృతదేహం లభ్యమైంది. కుక్కలు మృత దేహాన్ని పీక్కుతినడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అంతకు ముందే నరేంద్ర అనే వ్యక్తి తన సోదరి కనిపించడం లేదని 15 రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కట్నం కోసం అత్తమామలు తనను హత్య చేసి ఉంటారని పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నరేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదు

పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదని, ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ కేవలం పోలీసులు వేసుకున్నదేనన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ కమిటీకి నోటీసులు అనే వార్త ప్రజలను ఫూల్స్ చేసేదే అని ఆయనా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేసిన సిట్ లపై మాకు అసలు నమ్మకమే లేదని, సిట్ వేశారు అంటే ఆ కేసును పర్మనెంట్ గా పెండింగ్ లో పెట్టడమే అన్నారు. ఇప్పటి వరకు వేసిన ఏ సిట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదని ఆయన విమర్శించారు. టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ… కానీ ఆ సంస్థ చైర్మన్ ను కేసీఆర్ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నాడని, తీగలాగితే తన డొంక బయటపడుతుంది అనే టీఎస్పీఎస్సీ చైర్మన్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారన్నారు.సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్లే అధికారం టీఎస్పీఎస్సీ చైర్మన్ కు కూడా ఉండదని, క్వశ్చన్ పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో మెంబర్ సెక్రటరీ కి తప్ప ఎవరికీ తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ ని చెప్పుచేతల్లో పెట్టుకుని తనకు కావాల్సిన విధంగా పనిచేయించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వామ్మో.. ఆ డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా శాకుంతలం. సమంత, దేవ్‌ మోహన్ కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ ఆలోచన లేకుండా శాకుంతలం సినిమా కోసం కొన్నేళ్లుగా కష్టపడుతున్నారు ఈ బడా డైరెక్టర్. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ ఏమిటనే దానిపై టాలీవుడ్ లో చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శాకుంతలం తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ను మళ్లీ పట్టాలెక్కించబోతున్నారని సమాచారం.

జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం ఎప్పుడంటే..?

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే.. పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎంసెట్‌, జేఈఈ వంటి ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షల కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి ఉంది. కొందరు శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లకు, మరికొందరు ఇంటి వద్దనే సిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. వృత్తి విద్య కోర్సుల పరీక్షలు మాత్రం ఏప్రిల్‌ 4 వరకు జరుగనున్నాయి. కాగా, తెలంగాణలో జూనియర్ కాలేజీలు పునఃప్రారంభంపై ఇంటర్‌ బోర్డు ప్రకటన చేసింది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) శనివారం జారీ చేసిన 2023-24 విద్యా సంవత్సరానికి తాత్కాలిక విద్యా క్యాలెండర్ ప్రకారం, జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుండి 25 వరకు దసరా సెలవులు మరియు జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇంటర్మీడియట్ విద్య కోసం మొత్తం 227 పని దినాలు లెక్కించబడ్డాయి.