NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారం మాదే..90 నుంచి 100 సీట్లు గెలుస్తాం

90 నుండి 100 స్థానాలతో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తోందని.. హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీలు, సీబీఐలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తమకు బీఆర్ఎస్ కార్యకర్తల బలం ఉందని అన్నారు. బీజేపీ మమ్మల్ని ఏమీ చేయలేదని తెగేసి చెప్పారు. బీఆర్ఎస్ అంటే.. బీదలు, రైతులు, సామాన్యుల పార్టీ అని అభివర్ణించారు. మన పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఆసరా పెన్షన్లు గానీ, కల్యాణ లక్ష్మి గానీ లేదని అన్నారు. బీజేపీకి ఆదానియే దోస్తు, మన రైతు ఆ పార్టీకి దోస్తు కాడని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదాని ఆస్తులు పెంచే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానివి అని, ఆమ్ ఆద్మీ సంపద పెంచే నిర్ణయాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివి అని తేడాలు తెలియజేశారు. అదాని ఆమ్దానీ (సంపద) పెంచే పార్టీ కావాలా? అన్నదాత ఆమ్దానీ పెంచే బీఆర్ఎస్ కావాలా తేల్చుకోవాలని సూచించారు. నెత్తి, కత్తి లేని వాళ్ళు నత్తి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్, సచివాలయాలను కులుస్తామన్న పార్టీలు.. మన తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. హిందూ, ముస్లింల మధ్య పగను రెచ్చగొట్టి, రాజకీయం చేయాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తోందని హరీశ్ రావు ఆరోపణలు చేశారు.

నాలుగేళ్ళలో ఏం చేశావ్.. బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో ఎంపీగా ఏం చేశావని ప్రశ్నించారు. కనీసం ఒక చిన్న పాఠశాలనైనా తీసుకొచ్చావా? అంటూ నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా.. కేటీఆర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో ఆత్మీయ సభలో ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది? విద్యావ్యవస్థలో ఇలా మార్పు వస్తుందని, సిరిసిల్లలో మెడికల్‌ కాలేజీ ప్రారంభమవుతుందని అనుకున్నామా? అని అడిగారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఇచ్చిన కేసీఆర్‌ ఎక్కడా? తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని దౌర్భాగ్యపు ప్రధాని ఎక్కడా? అని విరుచుకుపడ్డారు.ప్రధాని మోడీ ఒక్క మెడికల్‌ కాలేజీ గానీ, నర్సింగ్‌ కాలేజీ గానీ, నవోదయ పాఠశాల గానీ, కస్తూర్బా గానీ ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇంతకుముందు కరీంనగర్‌కు ట్రీపుల్ ఐటీ వచ్చినట్టే వచ్చి ఎత్తిపోయిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటప్పుడు విద్యార్థులు ఎవరిపై కొట్లాడాలి? అని నిలదీశారు. మనం ఏం చేస్తున్నామో కొద్దిగా అయినా సోయి ఉండాలని సూచించారు. రాష్ట్రానికి వ్యవయాస కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, జేఎన్టీయూ కాలేజీ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై నలుగురు పిల్లలను ఉసిగొల్పి అడ్డం పంపడం న్యాయమా? అని ప్రశ్నించారు. దమ్ముంటే ప్రధాని మోడీ, బండి సంజయ్‌లపై దాడి చేయాలని అన్నారు. నాలుగేళ్లు అయినా, ఎంపీగా ఏం చేశావని బండి సంజయ్‌ను గల్లా పట్టి నిలదీయాలన్నారు. ఏం చేశావని గట్టిగా అడిగితే బండి సంజయ్ మౌనం పాటిస్తారని.. అనవసరంగా అడ్డం పొడువు మాటలు మాత్రం మాట్లాడుతారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ తన పనే అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తృణమూల్ ప్రైవేట్ కంపెనీ.. రాజకీయపార్టీ కాదు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి ఈ రోజు కేంద్రానికి వ్యతిరేకంగా రెండు రోజుల నిరసన దీక్షను ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదని.. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అంటూ ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఎన్నికలు వంశపారంపర్యత, జాతి, బుజ్జగింపు ప్రాతిపదికన జరిగాయని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణలో ఇవి పాతుకుపోయాయన్నారు. కేంద్ర ప్రాయోజిత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల డబ్బు తీసుకుందని సువేందు అధికారి ఆరోపించారు.రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో సుమారు రూ.3.60 కోట్ల జాబ్ కార్డ్ హోల్డర్లు నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. జాబ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పుడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు కోటి జాబ్ కార్డ్ డేటాను తొలగించిందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 1 కోటి జాబ్ కార్డుల తరపున గణనీయమైన మొత్తంలో డబ్బు తీసుకుందని, అవి నకిలీవని తేలిందని సువేందు అధికారి ఆరోపించారు. ఇది పెద్ద కుంభకోణం అని బీజేపీ నేత అన్నారు.

బ్రాహ్మణజాతికి ఏ అన్యాయం జరిగినా పోరాడేది శారదాపీఠమే

బ్రాహ్మణ జాతికి ఎప్పుడూ విశాఖ శారదాపీఠం అండగా ఉంటుందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి. విజయవాడలోని గాంధీ నగర్ ఫిలిం ఛాంబర్ వద్ద సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనకు హాజరైన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. స్వామివారికి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు,తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్, కుంకుమార్చన నిర్వాహకులు గుడిపాటి సీతారామ్,భక్తులు. గురువందనం సమర్పించారు వేదపండితులు. భక్తులకు అనుగ్రహభాషణం చేశారు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ… గాంధీనగర్ ప్రాంతానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మణలున్నారు. చైత్రమాసంలో సహస్ర కుంకుమార్చన నిర్వహించడం శుభకరం.కుంకుమార్చన నిర్వహించిన గుడిపాటి సీతారామ్ కు అభినందనలు. కాషాయ జెండాలు పట్టుకుని హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామనేలా కొందరు టీవీల్లో ,సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ వేదాలు…ఇతిహాసాలను నిలబెట్టే జాతి బ్రాహ్మణ జాతి ఒక్కటే. దేవాలయాల్లో దైవత్వాన్ని కాపాడే ఏకైక శక్తి బ్రాహ్మణ జాతి అన్నారు.

శ్రీరామనవమి స్పెషల్ సాంగ్

శ్రీరామనవమి వచ్చిందంటే భద్రాచలంలో సందడే సందడి.. రెండు తెలుగు రాష్ట్రాల చూపు భద్రాచలం వైపు పడుతుంది. కడు రమణీయంగా రాముడి కల్యాణం అక్కడ జరుగుతుంది. ఆ కల్యాణం కమనీయం చూడాలంటే రెండు కళ్ళు చాలవంటే అతిశయం కాదు. లక్షలాదిమంది శ్రీరాముడి కల్యాణం చూడడానికి భద్రాద్రి వెళతారు.. భద్రాచలం రామాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీరామనవమి సందర్భంగా వనిత టీవీ స్పెషల్ సాంగ్ విడుదల చేసింది. అలిగి కూర్చున్నాది.. అలిగి కూర్చున్నాది… ఆమె ఎవ్వారో .. బంగారు కడియాల.. రింగు వెంట్రుకాల రంగు సీతమ్మో… అంటూ స్పెషల్ సాంగ్ సాగుతుంది. రామయ్యా సీతమ్మ.. పోయేనే సీతమ్మ.. తోట లోపలికి.. ముత్యాల పైట కొంగు… ముత్యాల పైట కొంగు.. పౌడాల పైట కొంగు అంటూ జానపదాల పడికట్టులతో ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది.

శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులతో జగన్ భేటీ

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్నారు సీఎం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు సీఎం జగన్.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వామినారాయణ్‌ గురుకుల్‌ యూనివర్శిటీని ఏర్పాటుచేసి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు సీఎంకి వివరించారు ప్రతినిధుల బృందం.

బ్యాగ్ నిండా డబ్బులు.. భార్య ఏంచేసిందంటే?
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రాజ్‌కోట్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) డైరెక్టర్‌ జవరిమల్ బిష్ణోయ్ ను సిబిఐ అరెస్టు చేసింది. ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అయితే సీబీఐ అధికారులను షాక్‌కు గురిచేస్తూ.. భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో అక్కడ కలకలం రేగింది. శనివారం అతడి ఆఫీస్, ఇంటిపై సీబీఐ అధికారులు దాడి చేశారు. తన ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులను చూసిన బిష్ణోయ్ నాలుగో అంతస్తు కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అతడి భార్య చేసిన పని తాజాగా వెలుగులోకి వచ్చింది.సీబీఐ బృందం బిష్ణోయ్ ఇంటికి చేరుకోగానే ఆయన భార్య ఇంటికి తాళం వేసింది. వెంటనే ఆమె ఇంటి పైకప్పు నుండి డబ్బుతో కూడిన బ్యాగ్‌ను పార్కింగ్ స్థలంలోకి విసిరింది. ఈ బ్యాగ్ ఆమె మేనల్లుడు ఎత్తుకెళ్లాడు. ఇదే తరహాలో మరో బ్యాగ్ నిండా నగదును అతని భార్య పక్క ఇంటికి పంపింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న బ్యాగులను పైకప్పుపై నుంచి విసిరేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు బ్యాగుల నుంచి దాదాపు కోటి రూపాయలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది.

వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో సీఎం జగన్ భేటీ

ముఖ్యమంత్రి జగన్ తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ Auguste Tano Koume నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచబ్యాంకు భారత్‌ విభాగానికి డైరెక్టర్ Auguste Tano Koume మాట్లాడుతూ.. ఏపీ రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు.. అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా.. మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు? అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారు.

బోయపాటి మామ.. రామ్ ను ఈ రేంజ్ లో చూపిస్తావనుకోలేదే?

రామ్ పోతినేని.. గతేడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. డాక్టర్, పోలీస్ గా హీరో నటన అద్భుతమే అయినా కోలీవుడ్ డైరెక్టరో లింగుసామి ఇంకొంచెం కొత్తదనాన్ని యాడ్ చేసి ఉంటే బావుండేది అని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమా తరువాత రామ్.. గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించేసుకున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బోయపాటి శ్రీనుతో రామ్ కలిశాడు. BoyapatiRAPO ను పట్టాలెక్కించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇంకేంటి.. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఈ కాంబో గురించే మాట్లాడుకొనేలా చేసేశారు. ఇస్మార్ట్ శంకర్ తో చాక్లేట్ బాయ్ ను కాస్తా మాస్ హీరోగా మార్చాడు పూరి. ఇక ఈ సినిమాతో ఊర మాస్ హీరోగా మార్చేశాడు బోయపాటి. ఆయన సినిమాలు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ లలో మాస్ కు మొగుడు అనగానే బోయపాటి పేరే వినిపిస్తోంది.