విశాఖ సాగరతీరంలో వాల్తేర్ వీరయ్య సందడి
విశాఖ సాగరతీరం మెగా అభిమానుల రాకతో జనసంద్రంగా మారింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పోటెత్తారు అభిమానులు. భారీగా తరలివచ్చిన మెగా అభిమానులతో సందడి ఏర్పడింది. ఆదివారం కావడంతో అనుకున్న కంటే ఎక్కువగా తరలివస్తున్న ఫ్యాన్స్ తో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. విశాఖ నుండే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కూడా భారీగా తరలివచ్చారు అభిమానులు. ఎక్కడ చూసినా చిరంజీవి కటౌట్లతో అభిమానుల సందడి కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్ హాజరుకాలేదు. తనకు అనారోగ్యంగా వుందని రాలేకపోతున్నానని, కోవిడ్ కాకూడదని కోరుకుంటున్నా అన్నారు శృతి హాసన్. ఈ మూవీ ఈనెల 13వ తేదీన విడుదల కానుంది. మెగా అభిమానులు ఈమూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
నిఖత్ జరీన్ కు సన్మానం.. టీపీసీసీ ఐదులక్షల నజరానా
దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తామన్నారు బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. టీపీసీసీ ఆధ్వర్యంలో నిఖత్ జరీన్ కు సన్మానం జరిగింది. హైదరాబాద్ నిజాం క్లబ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యారు హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, ఇతర నేతలు. నిఖత్ జరీన్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూ పార్టీ తరపున 5లక్షలు బహుమతిగా ప్రకటించాము. మేమంతా జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే ఈ బహుమతిని ప్రకటించాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిజాం క్లబ్ లో కార్యక్రమం ఏర్పాటు చేసాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం.ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవన్నారు. రాజకీయాల్లోనూ క్రీడా స్ఫూర్తి అవసరం. మగవాళ్ళు ఆడే ఆట అని అడ్డు చెప్పకుండా జరీన్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించారు.ఇందుకు నిఖత్ జరీన్ కుటుంబాన్ని అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిఖత్ జరీన్ కు స్థలాన్ని కేటాయించాలి. అన్ని రకాల సౌకర్యాలతో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలి. 26 జనవరిలోగా గ్రూప్ 1 ఆఫీసర్ గా నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరింత గొప్పగా నిఖత్ జరీన్ ను సన్మానించేలా మరో కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి.
మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..
రక్తసంబంధం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఒకరి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో విషాదం నెలకొంది. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న ప్రాణాలు వదిలాడు. మెట్ పల్లి పట్టణంలోని రెడ్డి కాలానికి చెందిన బొగ నాగ భూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముగ్గురు కుమారులు ఉండగా నిన్న మధ్యాహ్నం సమయంలో రెండో కుమారుడు బొగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో విషాదం నెలకొంది. ఉదయం శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మొదటి కుమారుడు బొగ సచిన్ స్మశాన వాటికలోనే కుప్పకూలాడు.అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు ఆసుపత్రి వైద్యులు. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఒకే రోజు వ్యవధిలో చేతికందిన ఇద్దరు కుమారులు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అంత్యక్రియలకు వచ్చిన బంధువుల రోదనలు మిన్నంటాయి. మొదటి కుమారుడు సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ బ్యాంక్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు మరణించడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని బంధువులు విచారం వ్యక్తం చేశారు.
పాక్ లో పరిస్థితి ఘోరం.. పిండికోసం తొక్కిసలాట
పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎంతలా అంటే ప్రజలకు పిండి, గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ. చివరకు గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకోవడం, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై పిండిని సరఫరా చేసింది. మ ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. మిర్‌పుర్‌ఖాస్ జిల్లాలో ఏడుగురు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తొక్కసలాటలో చనిపోయాడు.పాకిస్తాన్ వ్యాప్తంగా పిండి రేట్లు ఆకాశానికి అంటడంతో సింధ్ ప్రభుత్వం సబ్సిడీపై రూ. 65లకే 10 కిలోల పిండిని విక్రయిస్తోంది. అయితే పిండి బస్తాలను తెచ్చిన ట్రక్కు చుట్టు ప్రజలు పెద్ద ఎత్తన గుమిగూడటం, ముందుగా పిండిని తీసుకోవాలని చూడటంతో తొక్కిసలాట జరిగింది. 40 ఏళ్ల హర్ సింగ్ కోలీ ఈ గందరగోళంలో కింద పడిపడిపోయి చనిపోయాడు. ఈ మరణంతో బాధితుడి కుటుంబీకులు ఐదు గంటల పాటు నిరసనకు దిగారు. సింధ్ ప్రాంతంలో పిండి విక్రయం గందరగోళానికి దారి తీసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు గాయపడ్డారు. మైనర్ బాలికతో పాటు ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీరామ్ సేన పై దుండగుల కాల్పులు.. బెలగావిలో ఘటన
కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బెలగావిలో శ్రీరామ్ సేన నేతపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. హిందాల్గా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరామ్ సేన జిల్లా అధ్యక్షుడు రవికుమార్ కోకిట్కర్ తుపాకీతో కాల్పులు జరిపారు. శ్రీరామ్‌సేన కార్యకర్తలు హిందుత్వం కోసం నిలబడతారని, ఇలాంటి దాడులకు భయపడబోమని ఆ సంస్థ చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఈ ఘటనను ఖండించారు. శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కోకిట్కర్ తన డ్రైవర్ మనోజ్ దేసూర్కర్, మరో ఇద్దరు కారులో బెలగావి నగరం నుండి హిందాల్గాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కారు స్పీడ్ బ్రేకర్ రావడంతో వేగం తగ్గించిన సమయంలో మోటార్ బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు సమీపంలోకి రాగానే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోకిట్కర్, అతని డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బెలగావి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిందూత్వ పక్షాన నిలబడే సంస్థ, కార్యకర్తలు ఇలాంటి తూటాలకు, ఆయుధాలకు భయపడబోరని శ్రీరామ్‌సేన అధినేత ముతాలిక్ అన్నారు.
90 లక్షలు సబ్బుల్ని సేకరించిన యువకుడు… వాటినేం చేశాడంటే?
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన సమీర్ లఖానీ అనే యువకుడు 8 ఏళ్ల కిందట కాంబోడియా పర్యటనకు వెళ్లాడు. అక్కడి పురాతన కట్టడాలు చూసి ఎంతగానో ఆనందించాడు. అయితే అదే సమయంలో ఆ నిర్మాణాల చెంత నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయాడు. ఓ తల్లి నెలల పసికందుకు దుస్తులు ఉతికే సబ్బుతో స్నానం చేయిస్తుండటం చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. అటు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిలో కేవలం ఒక్కశాతం మాత్రమే వంటి సబ్బుతో స్నానం చేస్తున్నట్టు తెలుసుకుని నిరుపేదలకు ఏదో ఒకటి చేయాలని తపించాడు. దీంతో ఏకో సోప్ బ్యాంక్ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈ సంస్థ ద్వారా వాడిన సబ్బులు, అరిగిపోయిన సబ్బులను సేకరించడం పనిగా పెట్టుకున్నాడు.వీటిని కాంబోడియాతోపాటు మరెన్నో దేశాల్లోని నిరుపేదలకు అందించాడు. ఇలా 2014 నుంచి సేవాపథంలోనే కొనసాగుతూ సమీర్ లఖానీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2017లో సీఎన్‌ఎన్ టాప్ టెన్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు. 2020 ఫోర్బ్స్ టాప్ థర్టీ అండర్ థర్టీ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. కాగా సమీర్ భారత మూలాలున్న అమెరికన్ కావడం విశేషం.
రచ్చ గెలిచి ఇంటి మీద పడ్డ పూరి.. ఈసారి ఆ హీరోతో..?
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది పెద్దల మాట. కానీ, పూరి ప్రస్తుతం రచ్చ గెలిచి ఇంటిని గెలవాలని చూస్తున్నాడు. అదేనండీ.. కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. పూరి కొడుకు ఆకాష్ తండ్రి పేరును పెట్టుకొని ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు. ఆకాష్ ఎంచుకున్న కథల ప్రభావమో.. లేక ఆకాష్ నటన నచ్చలేదో ఆ సినిమాలు ఎంత ప్రమోషన్స్ చేసినా కూడా ప్రేక్షకుల మైండ్ కు ఎక్కలేదు. ఇక పూరి సైతం కొడుకు కోసం కథను, డైలాగ్స్ ను రాసాడే తప్ప డైరెక్షన్ చేసింది లేదు. యావరేజ్ హీరోలను మాస్ హీరోలుగా నిలబెట్టిన చెయ్యి.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను హీరోగా మార్చగల సత్తా ఉన్న డైరెక్టర్.. ఇన్ని పెట్టుకొని పూరి, కొడుకును మాత్రం పట్టించుకోలేదనే అసహనం అభిమానుల్లో కూడా ఉంది.