19 లేదా 20 తేదీల్లో మోడీ తెలంగాణ పర్యటన
భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో రానున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించనున్నారు మోడీ. అనంతరం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఆయన పచ్చజెండా ఊపనున్నారు. వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. రాష్ట్రానికి, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చూపిన చొరవ ఫలించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విశాఖపట్నానికి వందే భారత్ రైళ్లు కావాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని కొద్దివారాల క్రితం స్వయంగా కలిసి కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న పలు రైళ్ల పొడిగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఇవ్వడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులపైనా మాట్లాడారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేకు తొలి వందేభారత్ మంజూరయ్యింది. ప్రస్తుతం వందేభారత్‌లో సీట్లు మాత్రమే ఉన్నందువల్ల తొలుత విజయవాడ వరకు నడిపిస్తామని.. బెర్తులతో కూడిన వందేభారత్ రైళ్లు వచ్చాక విశాఖపట్నం వరకు పొడిగిస్తామని అశ్వినివైష్ణవ్ కిషన్‌రెడ్డికి తెలిపారు.
శివచరణ్ నా కొడుకే కాదన్న ఉదయగిరి ఎమ్మెల్యే
నెల్లూరులో ఒకవైపు ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంటే…మరో వివాదం నలుగుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని బహిరంగ లేఖ రాసిన మేకపాటి శివ చరణ్ రెడ్డి తన కుమారుడే కాదని ఎం.ఎల్.ఏ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉదయం నుంచి అందుబాటులో లేని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి.. శివ చరణ్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. తనకు ఇద్దరు కూతుళ్ళు మాత్రమే ఉన్నారని కొడుకులు లేరని ఆయన స్పష్టం చేశారు. తన మొదటి భార్య తులసమ్మకు సంతానంగా రచన. రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితారెడ్డి ఉన్నారన్నారు. కేవలం డబ్బులు కోసమే తల్లీ, కొడుకులు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా అయితే నేరుగా తనను ఎదుర్కోవాలని చంద్ర శేఖర్ రెడ్డి శివచరణ్ రెడ్డికి సవాల్ విసిరారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై శివచరణ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన తల్లికి చిన్నతనంలోనే మేనమామ కొండారెడ్డితో వివాహమైందని విభేదాల వల్ల విడిపోగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన తల్లితో సంబంధం పెట్టుకున్నారన్నారు.
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యూహం అదేనా?
గడల శ్రీనివాసరావు.. పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఇటీవల కాలంలో ఆయన వ్యాఖ్యలు అదే నిజం అనిపిస్తున్నాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. అధికార పదవిలో ఉన్న గడల శ్రీనివాసరావు తాను కొత్తగూడెంకి సేవలు చేయాలని ఉన్నట్లుగా ప్రకటించడం వెనక ఏదో వ్యూహం ఉందని అంటున్నారు. ఆయన ఇక్కడ పోటీ చేస్తాడని స్పష్టం అవుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా గడల శ్రీనివాసరావు ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ కల్పన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన మెగా జాబ్ మేళా సందర్భంగా గడల శ్రీనివాసరావు మాట్లాడారు. ఆయన కామెంట్లపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
వాల్తేరు వీరయ్య ట్రైలర్.. నిజంగా పూనకాలే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ విడుదల అయ్యింది. మొదట్నుంచీ చిత్రబృందం చెప్తున్నట్టుగానే.. ఈ ట్రైలర్ పూనకాలు తెప్పించేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి చివరిదాకా.. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సముద్రంలో అలలని చీల్చుకుంటూ వచ్చే పడవ సీక్వెన్స్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌లో.. వీరోచితమైన డైలాగ్స్, మెగాస్టార్ గ్రేస్, రవితేజ మాస్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఫుల్లుగా నిండి ఉంది. ఇందులో ముఠామేస్త్రీ నాటి రోజుల్ని గుర్తు చేసేలా.. చిరు పాత్రని కాస్త చిలిపిగా తీర్చిదిద్దినట్టు స్పష్టమవుతోంది.మాస్ మహారాజా రవితేజ ఎంట్రీతో ఈ ట్రైలర్ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లిందని చెప్పుకోవచ్చు. క్రాస్ సినిమా తరహాలోనే ఇందులో ప్యూర్ మాసిజంతో అతడు ఆకట్టుకున్నాడు. చిరు, రవితేజ మధ్య వచ్చే ఎపిసోడ్స్ థియేటర్లలో అరుపులు పెట్టించడం ఖాయమని ఇందులో చూపించిన సీక్వెన్సుల ద్వారానే అర్థం చేసుకోవచ్చు. మరీ స్పెషల్‌గా.. చివర్లో రవితేజ ‘‘హలో మాస్టారు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కరికి బాక్సులు బద్దలైపోతాయి’’ అని చెప్పడం, ‘‘ఏంట్రా బద్దలయ్యేది, ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వీరయ్య లోకల్’’ అంటూ చిరు గట్టి కౌంటర్ ఇవ్వడం.. ఈ ట్రైలర్‌లోనే హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. చిరుతో పాటు రవితేజ స్క్రీన్స్ ప్రెజెన్స్ కూడా అదిరాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా వీరోచితంగా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది.
మంత్రి కొప్సుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ నేత భేటీ
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వి.సులం తుంగ్ హెచ్ లోథా భేటీ అయ్యారు. నాగాలాండ్ లో బీఆర్ఎస్ పార్టీ స్థాపనపై వారివురు చర్చించారు. డెమోక్రటిక్ లేబర్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు లోథా. ఫిబ్రవరి నెలలో జరగనున్న ఎన్ని కల్లో బి.ఆర్.ఎస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లోథా 1980-81 మధ్య కాలంలో కోహిమా లోథా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, ఆ తర్వాత ఆల్ నాగాలాండ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్నారు. డెమోక్రటిక్ లేబర్ పార్టీ స్థాపించి 1993 సాధారణ ఎన్నికల్లో సానిస్ పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొంది కాంగ్రెస్ లో చేరారు.. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవర్ స్థాపించిన పార్టీలో చేరారు. ప్రస్తుతం నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్ష బాధ్యత లతో పాటు నేషనల్ కిసాన్ సెల్ వైస్-చైర్మన్ గా కొనసాగుతున్నట్లు లోథా తెలిపారు. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా హాజరైనట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలోపేతానికి తాము కృషి చేస్తా మని సులంతుంగ్ హెచ్ లోథా హామీ ఇచ్చారు. లోథా తో పాటు కొత్త గూడెం బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ నాయకులు అనుదీప్, మోర భాస్కర్ రావు ఉన్నారు.
వాల్తేరు వీరయ్య టైటిల్.. బాబీ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ
సినిమాలకు ‘టైటిల్’ అనేది ఎంతో ముఖ్యమైందో అందరికీ తెలుసు. ఒక సినిమా మొత్తం దాని మీదే ఆధారపడి ఉంటుంది. సినిమాపై క్యూరియాసిటీ పెరగాలన్నా, ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆకర్షితులు అవ్వాలన్నా.. ఈ టైటిలే కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ఫిల్మ్‌మేకర్స్ ఎంతో కసరత్తు చేసి తమ సినిమాకు సరిగ్గా సూటయ్యేలా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఏరికోరి మరీ ఆసక్తికరమైన టైటిల్స్‌నే ఎంపిక చేస్తారు. కొన్ని సినిమాలకైతే.. ఈ టైటిల్సే పునాదులు వేస్తాయి. అలాంటి సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటని దర్శకుడు బాబీ తన ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చాడు. తాను స్టోరీ రాసుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేయలేదని, టైటిల్ ఆధారంగా స్టోరీ రాసుకున్నానంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘‘యాగంటిలో వెంకీ మామ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో.. నటుడు నాజర్ నాకు ఒక పుస్తకం ఇచ్చారు. అది చదువుతున్నప్పుడు, అందులోని ‘వీరయ్య’ అనే పేరు నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ ‘వీరయ్య’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నా. ఈ విషయం మా టీం సభ్యులకు కూడా చెప్పాను. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి ఇంకా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు బాపట్లలో ఉన్నప్పుడు, చిరు నాన్న వద్ద పని చేసే ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి, చిరుతో ఫోటోషూట్ చేయించారు. ఆ ఫోటోల వల్లే తాను మద్రాస్ వచ్చానని చిరంజీవి చెప్పారు. చిరుకి సహాయం చేసిన ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్యనే. సో.. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలా వాల్తేరు వీరయ్య స్టోరీ పుట్టుకొచ్చింది. ఇది చిరంజీవికి కూడా బాగా నచ్చింది’’ అని వివరించాడు. ఇదన్నమాట ఈ టైటిల్ వెనకున్న అసలు సంగతి!
పాక్ వదిలిపోతున్న కంపెనీలు.. కారణం అదేనా?
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పేకమేడలా కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు గ్యాస్, ఇంధన సంక్షోభం నెలకొంది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్నే సవాల్ చేస్తున్నారు. ఇక కరెంట్ కోతలు, పిండిధరలు, గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో అక్కడి ప్రజానీకం సతమతం అవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తయారీ పరిశ్రమలు కూడా చాాలా వరకు ప్రభావితం అవుతున్నాయి.
పాకిస్తాన్ కు భారీ షాక్ ఇచ్చాయి సుజుకీ, టయోటా కంపెనీలు. పాకిస్తాన్ నుంచి పెట్టాబేడా సర్దుకుని వెళ్లిపోతున్నాయి. పాకిస్తాన్ లో సుజుకీ మోటార్స్ సంస్థ తమ అసెంబ్లింగ్ ఫ్లాంట్ ను జనవరి 6 నుంచి మూసేస్తున్నట్లు ప్రకటించింది. జపాన్ కు చెందిన సుజుకీ సంస్థ, పాకిస్తాన్ ఆటోమోబైల్స్ కార్పొరేషన్ తో కలిసి 1983లో పాక్ సుజుకీ కంపెనీగా ఏర్పడింది. ఇంతకాలం పనిచేస్తూ వచ్చిన సుజుకీ ఇప్పుడు దేశాన్ని వదిలిపెట్టి పోతోంది. భారత్ లో ఇదే సంస్థ 1981లో మారుతీ సుజుకీ పేరుతో ఏర్పాటు అయింది. అయితే పాకిస్తాన్ మాత్రం జపాన్ నుంచి విడి భాగాలు తెప్పించుకుని అసెంబ్లింగ్ మాత్రమే చేస్తోంది. అక్కడ డిజైనింగ్, తయారీ ఫ్లాంట్లు లేవు. కానీ భారత్ లోనే గత కొన్నేళ్లుగా మారుతీ సుజుకికి సంబంధించి డిజైనింగ్, తయారీ జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ జపాన్ నుంచి విడి భాగాలు తెప్పించే పరిస్థితిలో లేదు. కారణం డాలర్ల కొరత. గట్టిగా చెప్పాలంటే పాకిస్తాన్ కు కేవలం ఒక నెల దిగుమతులకు మాత్రమే విదేశీ మారకద్రవ్యం అందుబాటులో ఉంది.
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి చేతన్ శర్మ
క్రికెట్ అడ్వైజరీ కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ నూతన సెలెక్షన్ కమిటీని ప్రకటించింది. ఈ మేరకు ఆలిండియా సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. మరోసారి చేతన్ శర్మనే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసింది. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి 2022 డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగారు. తాజాగా ఆయన మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. అటు ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ వివరాలను శనివారం నాడు బీసీసీఐ వెల్లడించింది. సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఈ మేరకు ఖరారు చేసింది.