Site icon NTV Telugu

Top Headlines @9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

తెలంగాణ ఇన్ ఛార్జి డీజీపీగా అంజనీకుమార్

తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అంజనీ కుమార్‌ను ఇన్ చార్జ్ డీజీపీగా నియమించడంతో కొంత మంది కీలక అధికారుల్ని బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా రవిగుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్‌ను నియమించారు. సీఐడీ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌, లా అండ్ ఆర్డర్ డీజీగా శాంతికుమార్ జైన్ ను నియమించారు. అంజనీకుమార్ పూర్తి స్థాయి డీజీపీ నియామకం చేపట్టాలంటే తన సీనియర్లను దాటాలి. ఆయన కంటే సీనియారిటీ ప్రాతిపదికన ఐదుగురు ఉన్నతాధికారుల పేర్లతో జాబితా ఇప్పటికే యూపీఎస్సీకి చేరింది. వారిలో ముగ్గురిని రాష్ట్రానికి యూపీఎస్సీ సిఫార్సు చేయనుంది. వారిలో ఒకరిని తెలంగాణ సర్కార్ ఎంచుకుంటుంది. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్, 1989 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ రవిగుప్తా , 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ జితేందర్, రాజీవ్ రతన్ పేర్లను యూపీఎస్సీకి పంపారు. యూపీఎస్సీ నుంచి షార్ట్ లిస్ట్ అయిన మూడు పేర్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డీజీపీని నియమిస్తారు. అయితే అంజనీకుమార్ నే పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ క్యాడర్‌కు చెందిన అంజనీకుమార్ స్వస్థలం బీహార్.

ఏపీలో ఐటీ అభివృద్ధిపై రేపు సమగ్ర వివరాలిస్తాం

ఏపీలో ఐటీ అభివృద్ధిపై రేపు సమగ్రవివరాలు అందచేస్తాం అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రేపు సీఎం జగన్ నర్సీపట్నం లో రెండు కీలక ప్రాజెక్టులకు శంఖు స్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో భాగంగా అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు జరుగుతోంది. విశాఖ..తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు మేలు చేకూర్చే తాండవ..ఏలేరు ఎత్తిపోతల పథకం కి శంఖు స్థాపన జరగనుంది. ఏపీ విభజన చట్టం హామీలు అమలుపై బిజెపి నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఏపీకి మీరు చేసిన మేలు గురించి చెప్పండి. బీజేపీ ఎంపీ జీవీఎల్ ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీగా ఎంపికై తెగిన గాలిపటం మాదిరిగా విశాఖ వచ్చారు. ఇక్కడ కనీసం అవగాన లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇన్ఫోసిస్ లిఖిత పూర్వకంగా విశాఖ నుంచి సేవలు ఇస్తామని లేఖ ఇస్తే అది కూడా తప్పని చెబుతున్నారు. ఏపీ విభజన చట్టం ద్వారా రావాల్సిన హామీలపై బీజేపీ నాయకులు స్పందించడం లేదు ఎందుకన్నారు. పైరవీలు చేసుకుని పదవులు పొందిన జీవీఎల్ ఎప్పుడైనా సర్పంచ్ గా గెలిచారా?
ఇన్ఫోసిస్ ఇచ్చిన లేఖలు అబద్ధాలు చెబుతాయా ?

ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ వస్తేనే ఎంట్రీ.. లేదంటే ఎయిర్ పోర్టులోనే బ్రేక్

కోవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తు‍న్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది.  చైనాతో పాటు హాంకాంగ్‌, జపాన్‌, సౌత్‌ కొరియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్‌లోడ్‌ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. లక్షణాలు ఉన్న వారిని, వ్యాధి నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవ్య తెలిపారు. గత శనివారం నుంచి విమానాశ్రయాల్లో తనిఖీలు ప్రారంభమయ్యాయి. చైనా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, దక్షిణ కొరియా నుండి వచ్చే ప్రయాణికులందరికీ RTPCR పరీక్షలు నిర్వహించారు. 6000 మందిని పరీక్షించగా, గత రెండు రోజుల్లో 39 మందికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారించబడింది. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న 40రోజులు దేశంలో కీలకం కానున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతకుముందు, రాష్ట్రాలలో కూడా తనిఖీ, నిఘా పెంచాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది.

చంద్రబాబులో ప్రాయశ్చిత్తం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కందుకూరు ఘటన దురదృష్టకరం అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి మరోసారి 8 మంది అమాయకుల ప్రాణాలు బలయ్యాయి. ఇవి యాక్సిడెంట్ కాదు. చంద్రబాబు వికృత విన్యాసాలకు నిదర్శనం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయ్యాడు. డ్రోన్ విజువల్స్ కోసం, టైట్ షాట్స్ తాపత్రయ పడ్డారు. కోల్డ్ బ్లడెడ్…ప్లాన్డ్… ప్రచారం కోసం జరిగిన మరణాలు ఇవి అన్నారు సజ్జల. 100 అడుగుల రోడ్డును ఫ్లెక్సీ పోల్స్ పెట్టి 30 అడుగులుగా కుదించారు.విశాలమైన రోడ్లు లేదా ఖాళీ గ్రౌండ్ లో ఎవరైనా సభలు పెడతారు. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే. ఇంత జరిగినా చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనిపించ లేదు. శవాల మీద పేలాలు ఏరుకునే వైఖరి చంద్రబాబుది. చనిపోయిన వారిని త్యాగ మూర్తులు అంటున్నాడు.. సమిధలు, ఉద్యమం ఆగదు అంటున్నాడు. చంద్రబాబు వల్ల చనిపోయి ఈయన పొగడ్తలు పొందటమే మృతుల అదృష్టం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు.

అనకాపల్లిలో రేపు సీఎం జగన్ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అనకాపల్లిజిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరగనుంది. మాకవరపాలెంలో సుమారు 500కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి., మెడికల్ కాలేజ్ కోసం సీఎం భూమి పూజ చేస్తారు. ఈ మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తే అనకాపల్లి జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని నాలుగైదు మండలాలకు వైద్య సేవలు మరింత చేరువ అవుతాయి. తాండవ ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే కీలకమైన తాండవ ఎత్తిపోతలకు సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేస్తారు. ఏలేరు జలాలను తాండవ రిజర్వాయర్ కు మళ్ళించడం ద్వారా సుమారు 60వేల ఎకరాలకు అదనంగా సాగునీటి ని పంపిణీ చేయడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. సుమారు 450కోట్ల రూపాయలను ఇందు కోస్ వెచ్చిస్తుండగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో రైతులకు మేలు చేకూరుతుంది. సీఎం పర్యటనలో భాగంగా నర్సీపట్నం మండలం జోగు నాథుని పాలెంలో భారీ బహిరంగ సభ జరగనుంది.

బాలికపై జనసేన నేత వేధింపులు….మహిళా కమిషన్ సీరియస్

మైనర్‌ బాలిక పట్ల జనసేన నేత రాఘవరావు వేధింపులపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. విశాఖ పోలీస్ కమిషనరుకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని విశాఖ పోలీస్ కమిషనరును అదేశించారు మహిళా కమిషన్ చైర్ పర్సర్ వాసిరెడ్డి పద్మ. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకుడు రాఘవరావు వేధింపుల పర్వంపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విశాఖ నగర సోలీస్ కమిషనర్ శ్రీకాంత్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న చైర్మ పర్సన్ వాసిరెడ్డి పద్మ విశాఖ నగరానికి చెందిన ఓ మైనర్‌ బాలిక పట్ల జనసేన నేత రాఘవరావు వేధింపులపై కఠిన చర్యలు చేపట్టాలని అదేశించారు… బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.

బాబూ.. మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిన్నటి చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభకు 50-60 వేల మంది జనం వచ్చారు. మందు, ముక్క, బిర్యానీలు ఇచ్చి జనాన్ని పశువులను తోలినట్టు తోలారు. రెండు వేల మంది కూడా పట్టని ప్రాంతంలో వేల మందితో రోడ్ షో ఎలా నిర్వహిస్తారు..? ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబుదే బాధ్యత అన్నారు కేఏ పాల్. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 50 వేలు.. రూ. లక్ష అంటూ చంద్రబాబు చదివితే సరిపోతుందా..? అన్నారు. చంద్రబాబు కొడుకు.. మనవడు ప్రాణాలకు ఇదే విలువ ఇస్తారా..? చంద్రబాబు బిడ్డల ప్రాణాలకు లక్షల కోట్ల విలువా..? మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా..? అని మండిపడ్డారు పాల్. చంద్రబాబు ఎనిమిది మందిని మర్డర్ చేశారు. చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేయాలి. నైతిక బాధ్యత వహించి చంద్రబాబు టీడీపీకి రాజీనామా చేయాలి.

మిషన్ 90… పక్కా అధికారం మాదే అంటున్న బీజేపీ

తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇక తెలంగాణ ఇంచార్జ్ నుంచి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో చేరికలు వేగం పెంచాలని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దాంతో బీజేపీ మరో సారి స్పీడ్ పెంచింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట చేరికలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 90 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. బీజేపీ గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ వారిగా బీజేపీ సంస్థాగతంగా శక్తివంతంగా ఏర్పాటు చేశాం.. ఒక్కో అసెంబ్లీ కి నలుగురుని నియమించామన్నారు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్.

51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
అంతరిక్షంలో ప్రతిరోజూ శాస్త్రవేత్తలు కొత్త వాటిని గుర్తిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ ఆస్టరాయిడ్ భూమివైపు వేగంగా దూసుకొస్తుందని కనుగొన్నారు. ఎన్నో గ్రహశకలాలు ఇప్పటి వరకు భూమికి అత్యంత సమీపంగా వచ్చి వెళ్తుంటాయి. అయితే.. ప్రస్తుతం దూసుకొస్తున్న ఆస్టరాయిడ్‌లను మాత్రం తేలికగా తీసుకోవద్దని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడూ భూమికి సమీపంగా వస్తున్న ఆస్టరాయిడ్‌ 2022 వైజీ5 విషయంలో అప్రమత్తంగా ఉండాలని నాసా హెచ్చరిస్తోంది. డిసెంబర్‌ 30వ తేదీన ఇది భూమికి సమీపంగా.. 3.1 మిలియన్‌ కిలోమీటర్ల దూరంతో ఇది ప్రయాణించనుందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమేనని నాసా అంటుంది. గంటకు 51,246 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోందని, ఈ వేగం ఒక హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రయాణ వేగం కంటే ఐదు రేట్లు ఎక్కువని నాసా ప్రకటించింది. అయితే దీని వల్ల జరిగే నష్టతీవ్రత గురించి మాత్రం నాసా స్పష్టత ఇవ్వలేదు. ఆస్టరాయిడ్‌ 2022 వైజీ5ను డిసెంబర్‌ 24నే నాసా గుర్తించింది. ఇది అపోలో గ్రూప్‌ గ్రహశకలాలకు చెందింది. సూర్యుడికి గరిష్టంగా 398 మిలియన్‌ కిలోమీటర్ల దూరం, కనిష్టంగా 119 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. 829 రోజులకు సూర్యుడి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసుకుంటుందని ప్రకటించింది.

Exit mobile version