Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మోడీ ఇంట విషాదం… తల్లి హీరాబెన్ ఇక లేరు

ప్రధాని నరేంద్రమోడీకి మాతృవియోగం కలిగింది. మాతృమూర్తి హీరాబెన్ మోడీ కన్నుమూశారు. ఆమె వయసు 100 ఏళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు హీరాబెన్ మోడీ. అయితే  గురువారం ఆమె కోలుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థత నుంచి కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆసుపత్రి గురువారం రాత్రే ప్రకటించింది. అయితే కొద్దిగంటల్లోనే ఈవిషాదం వినాల్సి వచ్చింది.ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం ఈ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మోదీ హుటాహుటిన ఈ ఆసుపత్రిని సందర్శించి, తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్ద ఉన్నారు. అనంతరం న్యూఢిల్లీ వెళ్ళారు. హీరాబెన్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్రవిషాదంలో నింపేసింది.హీరాబెన్ మోడీ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.ఈ ఏడాది జూన్‌లో హీరాబెన్‌ శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోలింగ్‌కు ముందు మోదీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు.. మోడీ సోదరుడు ప్రహ్లాద్‌ మోడీ కుటుంబం మంగళవారం కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రహ్లాద్‌ మోడీకి స్వల్ప గాయాలయ్యాయి.

ముగిసిన హీరాబెన్ మోడీ అంత్యక్రియలు

ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శుక్రవారం శివైక్యం చెందారు. అస్వస్థతతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరికాసేపట్లో గాంధీనగర్‌లో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో మాతృమూర్తి పక్కనే కూర్చున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది.తల్లి మృతితో ప్రధాని మోదీ భావోధ్వేగపూరిత ట్వీట్‌ చేశారు.. ‘నిండు నూరేండ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది. ఆమెలో తాను ఎప్పుడూ త్రిమూర్తులను చూశాను. ఆమె ఒక నిస్వార్ధ కర్మయోగి. విలువలకు నిలువెత్తు నిదర్శనం’ అని చెప్పారు.

మోడీ తల్లి హీరాబెన్ మృతికి పలువురి సంతాపం
మోడీ మాతృమూర్తి హీరాబెన్​ మోదీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గుజరాత్​ సీఎం భూపేంద్ర పాటిల్, పాటు రక్షణశాఖ మంత్రి రాజనాథ్​ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ​ సంతాపం తెలుపుతూ ట్వీట్​ చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​, మధ్యప్రదేశ్​ సీఎం శివ్​ రాజ్​ సింగ్​ చౌహాన్​, కేంద్ర మంత్రి అమిత్​ షా మోదీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ కు గాంధీనగర్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోదీ తన మాతృమూర్తి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో అమ్మ పక్కనే కూర్చున్నారు. సన్నిహితులకు మాత్రమే అంతిమక్రియల్లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరా బెన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తల్లి హీరాబెన్ గారి మృతికి సంతాపం తెలుపుతున్నా.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించా…. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. మంత్రి కేటీఆర్ సైతం ప్రధాని తల్లి హీరాబెన్ ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు.

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ప్రత్యేక రైళ్ళు

సంక్రాంతి రద్దీని దృష్టిని పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు మరో 30 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, వికారాబాద్‌ నుంచి నర్సాపూర్‌, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఆయా రైళ్లలో రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ బోగీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం రాత్రి సమయాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. కాగా ఈ నెల 9న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌, 10న కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌, 11న వికారాబాద్‌ – నరసాపూర్‌, సికిందాబ్రాద్‌ – కాకినాడ టౌన్‌, 12న నరసాపూర్‌ – సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌, 13న వికారాబాద్‌ – కాకినాడ టౌన్‌, సికింద్రాబాద్‌ – నరసాపూర్‌, 14న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌, నరసాపూర్‌ – సికింద్రాబాద్‌, 15న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌, 16న సికింద్రాబాద్‌ – కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్‌ – వికారాబాద్‌, 17న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌, వికారాబాద్‌ – కాకినాడ టౌన్‌, 18న కాకినాడ టౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

రోడ్డు ప్రమాదంలో వికెట్‌ కీపర్ రిషబ్‌ పంత్ కు గాయాలు

క్రికెటర్, టీమిండియా వికెట్‌ కీపర్ రిషబ్‌ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన రూర్కీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రిషబ్ పంత్ కాలుకు తీవ్రగాయాలు కాగా ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన తలకు కూడా గాయాలయ్యాయి. ఆయనను అనంతరం ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. తన బీఎండబ్లూ కారును స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది.

టేక్రియాల్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు మృతి
ఇద్దరిదీ విడదీయరాని స్నేహం.. వారి స్నేహాన్ని చూసి విధికే కన్నుకుట్టిందేమో.. వారిద్దరినీ మృత్యువులోనూ విడదీయకుండా తిరిగి రానిలోకాలకు తీసుకుపోయింది. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సదాశివ నగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కంటైనర్ ను ఓవర్ టెక్ చేయబోయి అదుపు తప్పి ఢీ కొట్టింది బైక్. దీంతో సతీష్, సిద్దార్థ్ రెడ్డి స్నేహితులు మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లారీని ఓవర్ టేక్ చేయబోయి లారీ అంచును బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. కామారెడ్డి నుండి ధర్మారావుపేట వెళ్తున్న ఇద్దరు యువకులు బండి నితీష్(20), అతని స్నేహితుడు సామల సిద్ధార్థ రెడ్డి(23) లు పల్సర్ బైక్ పై అతివేగంగా వెళుతూ కంటైనర్ వెనక నుండి ఎడమ నుండి ఓవర్ టేక్ చేయబోయి కార్నర్ లో ఢీ కొని బైక్ ఎగిరి పడిపోయింది. ఈ ఘటనలో బండి నితీష్ అనే యువకుడు ఐదు మీటర్ల మేర ఎగిరి కింద పడ్డాడు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలు కాగా బండి నితీష్ అనే యువకుడికి తల భాగంలో ఎక్కువగా గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి సామల సిద్ధార్థ రెడ్డికి తీవ్ర గాయాలు అవ్వడంతో అతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమంగా ఉందని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి నుండి అత్యవసర పరిస్థితిలో హైదరాబాద్ కు తరలిస్తు ఉండగా మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు.

ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్‌ నెతన్యాహు ప్రమాణ స్వీకారం

ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్‌ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్‌లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు. ఆరోసారి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. పార్లమెంట్‌లోని 120 మంది సభ్యుల్లో ఆయనకు 64 మంది సభ్యుల మద్దతు ఉంది. ఆయనకు సొంత లికుడ్‌ పార్టీ సహా కొన్ని పార్టీల మద్దతు ఉంది. ఇరాన్‌ అణుబాట పట్టకుండా నిరోధించడం, దేశం అంతటా నడిచేలా బుల్లెట్‌ రైలు ఏర్పాటు, మరిన్ని దేశాలను ‘అబ్రహాం ఒప్పందాల’ పరిధిలోకి తీసుకురావడం వంటివి జాతీయ లక్ష్యాలని నెతన్యాహు ప్రమాణ స్వీకారానికి ముందు నెస్సెట్‌(పార్లమెంట్‌)లో పేర్కొన్నారు. ప్రధానిగా ప్రమాణం చేసిన నెతన్యాహుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఇక లేరు

ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు పీలే (82) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావో పాలోలోని ఐన్‌స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే బ్రెజిల్‌కు మూడుసార్లు ప్రపంచకప్ అందించారు. 1958, 1962, 1970లలో ఫిఫా ప్రపంచ కప్‌ను మూడుసార్లు గెలిపించిన ఏకైక ఆటగాడు పీలే. ఆయన బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశారు. మొత్తం 1,363 మ్యాచ్‌లలో 1,281 గోల్స్ చేశారు. 2000లో ప్లేయర్ ఆఫ్ ది సెంచరీగానూ ఎంపికయ్యారు.

 

 

Exit mobile version