NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రాహుల్ భారత్ జోడో యాత్ర@100 డేస్.. హిట్టా? ఫట్టా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేటితో వంద రోజలు పూర్తి చేసుకోనుంది. ఒక్క అడుగుతో మొదలైన కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర వడివడిగా ముందుకు సాగుతూ 3,500 కిలోమీటర్ల పొడవునా సాగనుంది. అయితే ఈ యాత్ర 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌ను పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది. గడిచిన మూడునెలలుగా కొనసాగిన యాత్రలో రాహుల్ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమిళనాడులో సెప్టెంబర్ 7న మొదలైన యాత్ర ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్రాల మీదుగా సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాగింది. డిసెంబర్ 24న ఢిల్లీలోకి ప్రవేశించనుంది. అనంతరం ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చివరకు జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఇప్పటివరకు 2800కి.మీలు పూర్తి చేసుకుంది.

పూరీ జగన్నాథ్‌ టెంపుల్ లో సెల్ ఫోన్లు నిషేధం

13వ శతాబ్దానికి చెందిన దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయం. ఈ మందిరంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. స్మార్ట్‌ఫోన్‌లను తీసుకెళ్లడంపై పూర్తి నిషేధం విధించనున్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ గురువారం తెలిపింది. ఇప్పటి వరకు ఈ నిబంధన భక్తులకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకెళ్లొచ్చని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ తెలిపారు.

ఏపీ ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ విడుదల

2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పండుగలతోపాటు తిథులను బట్టి వచ్చే హిందూ పండుగల్లో మార్పులు ఉంటాయని, వాటిని ముందుగానే పత్రికా ప్రకటన, మీడియా ద్వారా తెలియజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి పండుగల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. దీంతో బ్యాంకర్లు షాకవుతున్నారు. ఈ అంశంపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యమైన హిందూ పండుగలకు సెలవులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం మూడేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోడిపందాలకు వెళ్లారు.. కాలువలో దూకారు.. తర్వాత?

సరదాల సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. సంక్రాంతికి ఇంకా నెలరోజుల టైం వుంది. ధనుర్మాసం కూడా ఇవాళే ప్రారంభం అయింది. ఇదిలా వుంటే.. సంక్రాంతి ప్రారంభానికి ముందే సరదా రాయుళ్ళు రెడీ అయిపోయారు. ఖాళీగా ఉండడం ఎందుకని కోడిపుంజులతో పందాలకు సై అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట ఈ కోడిపందాలు జరుగుతూనే వున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో కోడిపందేల రాయుళ్లు రెచ్చిపోయారు.
తిరుపతి జిల్లాలో పోలీసుల దాడులకు భయపడి పందెంరాయుళ్ళు కాలువలో దూకడం సంచలనం కలిగించింది. కోడి పందెం రాయుళ్ల తీరుపట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే… రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద మామిడి తోపులో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారంతో రైడ్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు దాడి చేస్తారనే సమాచారం అందుకున్న పందెం రాయుళ్ళు పలాయనం చిత్తగించారు. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో కాలువలో దూకారు నలుగురు యువకులు. కాలువలో నుండి ఈదుకుంటూ బయటకు వచ్చారు ముగ్గురు యువకులు. అయితే, కాలువలో దూకిన వారిలో మనోహర్‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన వారు బయటకు వచ్చి నాలుగో వ్యక్తి గురించి వాకబు చేశారు. గల్లంతైన యువకుడు కోసం గాలిస్తున్నారు. కోడిపందాల సరదా ఒక యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. సినిమా టిక్ గా కాలువలో దూకడం, ఒకరు గల్లంతు కావడం విషాదం నింపుతోంది. గల్లంతయిన యువకుడి వివరాలు అందాల్సి వుంది.

రంజీలోనూ అదే దూకుడు.. ఇషాన్ మరో శతకం

భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ద్విశతకం (210) బాదిన విషయం అందరికీ తెలిసిందే! క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన ఈ చిచ్చరపిడుగు.. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన వరల్డ్ రికార్డ్‌ని నమోదు చేశాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. ఆ రికార్డ్‌ని ఇషాన్ పాతాళానికి తొక్కేశాడు. అంతేకాదండోయ్.. వన్డేల్లో ఒక్క సెంచరీ నమోదు చేయకుండానే, నేరుగా ద్విశతకం చేసిన ఏకైక క్రికెటర్‌గానూ ఇషాన్ చరిత్రపుటలకెక్కాడు. అదే జోరుని ఇప్పుడు రంజీ ట్రోఫీలోనూ ఇషాన్ కొనసాగిస్తున్నాడు. ఆ డబుల్ సెంచరీ చేసి వారం రోజులు కాకుండా.. రంజీలో శతకం బాదేశాడు. జార్ఖండ్, కేరళ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సహకారంతో 132 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో అతనికి ఇది ఆరో శతకం. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 114 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయినప్పుడు.. ఇషాన్ క్రీజులోకి దిగాడు. సౌరభ్‌ తివారీ (97)తో కలిసి.. స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు.

భక్తి కథకు వచ్చి బంగారం కొట్టేసిన మహిళ

గోషామహల్ పోలీస్ మైదానంలో జరుగుతున్న మహాభాగవత్ కథ కార్యక్రమంలో హాజరైన మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు దొంగతనం జరిగింది. దీనిని దొంగలించి పారిపోతున్న మహిళ దొంగతో పాటు మరి కొంతమంది మహిళలను అక్కడున్న ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు గోషామాల్ పోలీస్ మైదానంలో శ్రీ భగవత్ కథ కార్యక్రమం జరుగుతుంది… ఈ కార్యక్రమాని తిలకించడానికి వందలాది మంది మహిళలు హాజరై భగవత్ కథను వింటున్నారు. ఈ క్రమంలో మాంగర్ బస్తికు చెందిన 8 మంది మహిళలు భగవత్ కథ కార్యక్రమంలో భక్తుల వలె వారి వద్ద కూర్చున్నారు… అదును చూసి ఓ మహిళా మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును దొంగలించింది. అదేగాక వీరితో పాటు మరి కొంతమంది వచ్చిన మహిళలు కూడా దొంగలించేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్న భక్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ప్రపంచంలోనే పొట్టిమనిషి.. ఎత్తెంతో తెలుసా?

పశ్చిమ ఇరాన్ (రోజెలాట్)కు చెందిన కుర్దిష్ వ్యక్తిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుధవారం ప్రకటించింది. 20 ఏళ్ల అఫ్షిన్ ఎస్మాయిల్ ఘదెర్జాదేహ్‌ కుర్దిష్ నగరమైన బుకాన్‌కు చెందినవాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన వెబ్‌సైట్‌లో దుబాయ్‌లో 24 గంటల వ్యవధిలో గదర్‌జాదేను మూడుసార్లు కొలిచినట్లు పేర్కొంది. అతడి కంటే ముందు రికార్డ్ హోల్డర్ 36 ఏళ్ల ఎడ్వర్డ్ ‘నినో’ హెర్నాండెజ్ (కొలంబియా) కంటే దాదాపు 7 సెం.మీ (2.7 అంగుళాలు) తక్కువ అని అధికారులు తెలిపారు. ఘదెర్జాదేహ్‌ తల్లిదండ్రులు అతనితో కలిసి దుబాయ్ వెళ్లారు. ఘదెర్జాదేహ్‌ తండ్రి మాట్లాడుతూ తన కొడుకుకు మానసిక సమస్యలు లేవని తెలిపారు. తన కొడుకు శారీరక బలహీనత కారణంగానే చదువు మానేసినట్లు సమాచారం. చదువు లేనప్పటికీ కానీ అతని పేరు ఎలా వ్రాయాలో నేర్చుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి సుల్తాన్ కోసెన్ కూడా కుర్దుడే. అతను ఆగ్నేయ టర్కీ (బాకూర్)లోని మార్డిన్ ప్రావిన్స్‌లోని కుర్దిష్ ప్రావిన్స్‌కు చెందినవాడు.

వాట్సాప్ అడ్మిన్ లకు వార్నింగ్.. క్రిమినల్స్ చేతికి గ్రూప్ డేటా?

Whatsapp

కొత్త కొత్త టెక్నాలజీ పరిచయం అవుతోంది.. కొత్త యాప్స్‌ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మారుతున్న కాలంతో పాటు నేరం కూడా కొత్త రూపం దాల్చడం మొదలైంది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే దొంగలు ప్రత్యక్షంగా మీ దగ్గరకు లేదా మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండేది. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మీకు సంబంధించిన వివరాలు తెలిస్తే చాలు.. ఒక్క లింక్ మీ ఫోన్ కు పంపడం ద్వారా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు. ఒక పద్ధతి గురించి ప్రజలకు తెలియగానే.. మరో పద్ధతిలో దొంగిలించడానికి వీరి వద్ద ప్లాన్ రెడీగా ఉంటున్నట్టు చాలా ఘటనలు ఫ్రూవ్‌ చేశాయి కూగా.. తాజాగా వాట్సాప్ ద్వారా కూడా కొంతమంది డబ్బు పోగొట్టుకున్నామని ఫిర్యాదులు చేయడం కలకలం సృష్టిస్తోంది.. ఈ సమయంలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.