NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్..ఇవాళ రేపు యాగాలు

ఢిల్లీలో కేసీఆర్ టూర్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కార్యాలయంలో ఇవాళ, రేపు యాగాలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు కార్యాలయ ప్రారంభం కానుంది. పూర్తయింది యాగశాల నిర్మాణం.. యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. నవ చండీ హోమము,రాజశ్యామల హోమము ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో జరగనున్నాయి యాగాలు… దైవ కృప ,బీఆర్ఎస్ విజయవంతం కావడం ,దేశం సుభిక్షంగా ఉండటానికి యాగాన్ని నిర్వహిస్తున్నారు కేసీఆర్.

సిఎం స్టాలిన్ సతీమణికి దేవుని గొడుగు …వివాదం అవుతున్న వ్యవహారం

తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ప్రజలతో మమేకం అవుతుంటారు. తాజాగా ఆయన కుటుంబం ఓ వివాదంలో ఇరుక్కునిపోయింది. చెన్నై నగరంలోని ఓ ఆలయ వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆ ఆలయ గొడుగు వాడటం తీవ్ర వివాదానికి దారితీసింది. సీఎం సతీమణి కోసం ఆలయ ఛత్రాన్ని వాడారంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అత్యంత పవిత్రమైన ఆలయ ఛత్రాన్ని దుర్గాస్టాలిన్ వర్షంలో తడవకుండా ఉండేందుకు ఉపయోగించడం దేవాదాయ శాఖలో జరిగిన ఘోర తప్పిదమని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శించారు. చెన్నై శివారు తిరువొత్తియూరులోని త్యాగరాజ స్వామివారి ఆలయంలో జరిగిన వేడుకల్లో ఆదివారం ఉదయం ఉత్సవమూర్తి ఊరేగింపు ఆలయ మాఢవీధిలో జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు విగ్రహాన్ని ఊరే గించేందుకు ఆలయ ప్రధాన ద్వారం వెలుపలకు వచ్చారు. ఆ ఉత్సవమూర్తి వానలో తడవకుండా ఉండేందుకు సిబ్బంది ఛత్రంపట్టారు. అదే సమయంలో దుర్గా స్టాలిన్ ఊరేగింపు వెనుక నడచి వస్తుండగా వర్షంలో ఆమె తడవకుండా ఓ ఉద్యోగి ఆలయ ఛత్రాన్ని పడుతూ అనుసరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కలకలం సృష్టించింది.

ప్రజలకు ఉచితాలు, స్కీములు అవసరమా?

ఎన్నికల్లో గెలవడానికి ఉచిత పథకాలు ఎక్కువయ్యాయి. ఒక పార్టీకి మించి మరో పార్టీ ఉచిత పథకాల పేరుతో ఊదరగొడుతున్నాయి. ఎవరు ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తారో, ఎవరు టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీలు, సైకిళ్ళు, ఇంట్లో గృహోపకరణాలు ఇస్తున్నాయి పార్టీలు. అందుకోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టడానికైనా వెనుకాడడం లేదు. దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేయడం గురించి చర్చ సాగుతోంది. ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించిన తర్వాత ఈ చర్చ జరుగుతోంది. పెన్షన్లు, సాయం పేరుతో ఉచితాలను పంచి పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వుంది. దేశంలో అసమానతలను తగ్గించేందుకు ప్రవేశపెట్టే పథకాలను ఉచితాలుగా చూడకూడదని మరికొందరు వాదిస్తున్నారు. మోదీ చేస్తున్న ప్రకటనలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలకు చట్టబద్ధత లేకుండా చేసేందుకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలని ఆరోపించారు. ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతూ ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీల పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశం పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.

సీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్.. సీనియర్ ఆటగాళ్లపై వేటు?

టీమిండియా యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఒక్క ఇన్నింగ్స్‌తో సమీకరణాలన్నీ మార్చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో డబుల్ సెంచరీ చేయడంతో బీసీసీఐ దృష్టిలో కూడా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో 2023-24కు సంబంధించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోనున్నాడు. ఈనెల 21న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ఖరారు చేయనున్నారు. కొన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నా ఇషాన్ కిషన్‌కు సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. కానీ ఇప్పుడు అతడికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడికి బి లేదా సి కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సెంట్రల్ కాంట్రాక్టులో సీనియర్ ఆటగాళ్లపై బీసీసీఐ వేటు వేయనుంది. కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే ఆడుతూ పేలవ ప్రదర్శనతో జట్టుకు దూరమైన ఆజింక్యా రహానె, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ కాంట్రాక్టులను బీసీసీఐ తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే వీరి కెరీర్‌కు శుభం కార్డు పడగా త్వరలో సెంట్రల్ కాంట్రాక్టులకు కూడా బీసీసీఐ ఎండ్ కార్డ్ వేయనుంది. వీరి స్థానంలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రహానే, ఇషాంత్ శర్మ గ్రేడ్-బిలో ఉండగా.. వృద్ధిమాన్ సాహా గ్రేడ్-సిలో ఉన్నాడు.

ఇటలీలో దుండగుడి కాల్పులు.. ప్రధాని ఫ్రెండ్ దుర్మరణం
టలీ రాజధాని రోమ్‌లో ఒక దుండగుడు జరిగిన కాల్పుల్లో.. ఆ దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఫిడెన్‌ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అపార్ట్‌మెంట్‌ కమిటీ రెసిడెంట్స్‌ కమిటీ సమావేశాన్ని ఎలా నిర్వహించాలని, ఏయే అంశాలపై చర్చించాలన్న విషయంపై చర్చలు జరిపేందుకు కొందరు కమిటీ సభ్యులు ఆ కేఫ్‌లో సమావేశం అయ్యారు. ఇంతలోనే ఓ వ్యక్తి కేఫ్‌లోకి దూరి, మీ అందరినీ చంపేస్తానంటూ అరుస్తూ, ఒక్కసారిగా వారిపై కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు చాకచక్యంగా అతడ్ని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సరికొత్తగా ట్విట్టర్.. మూడు రంగుల వెరిఫికేషన్ టిక్ అమలు

ఎలన్ మస్క్ వచ్చినప్పటి నుంచి ట్విట్టర్‌లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఒకే రంగులో వెరిఫికేషన్ టిక్ ఉండేది. కానీ ఇక నుంచి మూడు రంగుల్లో వెరిఫికేషన్ టిక్ ఇవ్వాలని ట్విట్టర్ గతంలోనే నిర్ణయించింది. సెలబ్రిటీలకు సహా వ్యక్తిగత అకౌంట్లకు బ్లూ టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్ ఇస్తామని ఇప్పటికే ఎలన్ మస్క్ ప్రకటించారు. తాజాగా ఈ టిక్‌లను ట్విట్టర్ అమలు చేస్తోంది. వార్తలను అందించే ఏఎన్‌ఐ లాంటి సంస్థకు ట్విట్టర్ గోల్డ్ టిక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఖాతాలకు వెరిఫికేషన్ టిక్ ఊదా రంగులో దర్శనమిస్తోంది. దీంతో వినియోగదారులకు ట్విట్టర్ సరికొత్తగా కనిపిస్తోంది. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఈ టిక్‌లను అమలు చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. బ్లూ టిక్ కావాలంటే 8 డాలర్లు వసూలు చేస్తున్న ట్విట్టర్.. గోల్డ్ టిక్ కావాలంటే ఎక్కువ ధర చెల్లించాలని తెలిపింది. అయితే ధర ఎంత అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా గ్రే టిక్ కోసం కొంత ధరను చెల్లించాల్సి ఉంటుంది.

మిస్డ్‌ కాల్‌ వచ్చింది.. కట్టలు పోయాయి

సైబర్‌ నేరగాళ్లు బరితెగిస్తున్నారు.. ఎప్పుడు, ఎలా, ఎటువైపు నుంచి ఎటాక్‌ చేస్తారో తెలియదు.. ఉన్నకాడికి ఊడ్చేసేవరకు సమాచారమే ఉండదు.. ఏ లింక్‌ క్లిక్‌ చేయాలన్నా వణికిపోవాల్సి వస్తుంది.. ఏ మెసేజ్‌ను నమ్మితే.. దాని వెనుక ఏ మోసం దాగిఉందో కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడు మరో షాకింగ్‌ మోసం వెలుగు చూసింది.. కేవలం మిస్డ్‌ కాల్‌లో లక్షలు నొక్కేసిన ఘటన.. అందరినీ కలవరపెడుతోంది.. ఇప్పటి వరకు.. సదరు వినియోగదారుల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు తెలుసుకునే మోసాలకు పాల్పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఇక, మొబైల్‌కు వచ్చి ఓటీపీ అడిగి బ్యాంకు ఖాతాల నుంచి లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం.. కానీ, ఇప్పుడు ఓటీపీ అవసరం లేకుండా.. కేవలం మిస్డ్‌ కాల్‌తో లూఠీ చేయడం ఆందోళనకు గురిచేస్తోంది..

Show comments