NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు నూత‌న స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ తొలి స‌మీక్ష

సోమవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనులు, కరివెన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులు, ఉదండాపూర్ నుంచి తాగునీటి తరలింపు పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు. కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల పనులను కూడా కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణ గడ్డపై.. రాజధాని నడిబొడ్డున మరో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించిన మధుర క్షణాలివి. మధుర ఘట్టమి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, పరిపాలనా భవనం దృఢంగా, రాచరికంగా నిలుస్తోంది. తెలంగాణను ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం అకుంతి దీక్షకు మరో కారణం. అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలన భవనాన్ని సింహలగ్న ముహూర్తం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

ఏపీని ముంచెత్తిన వాన.. ఐఎండీ వార్నింగ్

మండువేసవిలో తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దయ్యాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగినా.. ఎడతెరిపి లేని వర్షం పలు ప్రాంతాలను ముంచెత్తింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఏలూరు, చింతలపూడి ,పోలవరం ,తాడేపల్లిగూడెం ,భీమవరం, నరసాపురం కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అకాల వర్షం రైతులకు భారీ నష్టం తెచ్చిపెట్టే విధంగా ఉంది. చాలా ప్రాంతంలో ధాన్యం కల్లాల్లోనే మిగిలిపోయింది. ఆరబెట్టిన మొక్కజొన్న తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం లో మార్పులు ఆక్వా రైతులు నిండా ముంచుతుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో తెల్లవారుజామునుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరికోతలు ఇంకా పూర్తికాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.కడప జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెల్లవారుజామునుంచి ఎడతెరపి లేని వర్షం పడుతోంది. ప్రధాన రోడ్లు అయిన గాంధీరోడ్డు, శివాలయం వీధి జలమయం అయ్యాయి. తహసీల్దార్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్, ఫైర్ కార్యాలయాలలోకి చేరిన వర్షపు నీరుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడజిల్లాలో ఎడ తెరిపి లేకుండా వర్షం పడుతోంది. కాకినాడ, సామర్లకోట, తుని, జగ్గంపేట, రామచంద్రపురం లలో ఈదురుగాలులు తో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులుకి పొలాల్లోనే వరి పంట పడిపోతుందని, ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం

గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉదయం.. మరికొన్ని చోట్ల సాయంత్రం ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం రాత్రి వేళ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ రోడ్లను వరద నీరు ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. వర్షపునీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో దాదాపు అరగంటకు పైగా వాన దంచికొట్టింది. దీంతో నగరం మరోసారి జలమయం అయింది. రోడ్లపై వరద నీరు పోటెత్తింది. మోకాలి లోతు నీటి ప్రవాహం కొనసాగడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత నెల ఏప్రిల్ 25, 29 తేదీల్లో కురిసిన కుండపోత వానల నుంచి ఇంకా తేరుకోకముందే ఆదివారం రాత్రి భారీ వర్షం హడలెత్తించింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ రాత్రి 7 గంటల తర్వాత మబ్బులు కమ్ముకుని భారీ వర్షం పడింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ట్రాఫిక్ స్థంభించింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారహిల్స్, షేక్ పేట్,టోలీచౌకీలో చెట్లు కూలాయి. సికింద్రబాద్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, కుత్భల్లాపూర్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఎయిమ్స్ లో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో.. రాత్రి 10.50 గంటలకి ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు. కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది. అయితే.. కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా.. కిషన్ రెడ్డి నిన్న ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో జరిగిన.. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ ప్రస్తావించిన అంశాల ఆధారంగా అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఆ తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. తినే ఆహారంలో గ్యాస్ ఎక్కువైనప్పుడు.. అది పొట్టలోని పేగులు ఉబ్బిపోయేలా చేస్తుంది. ఆ గ్యాస్ బయటకు రాకుండా ఇబ్బంది పెడుతుంది. దాని వల్ల కడుపులో నొప్పి వస్తూ.. క్రమంగా ఛాతీ దగ్గర కూడా పెయిన్ రావడంతో.. అది గుండె నొప్పి కావచ్చని పొరపాటు పడతారు. అయితే.. గ్యాస్ తొలగిన తర్వాత ఈ నొప్పి కూడా పోతుంది. గుడ్లు, శనగలు, బీన్స్, బఠాణీలు, మీల్ మేకర్ వంటివి అధిక గ్యాస్ ఉత్తత్పి అయ్యేలా చేస్తాయి. అందువల్ల వాటిని ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.

ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్‌

రాజమహేంద్రవరం నగర టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, ఆమె మామ, మాజీ ఎమ్మెల్సీ అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సీఐడీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 17 గంటల విచారణ అనంతరం రాత్రి 10 గంటలకు వారి అరెస్టును సీఐడీ అధికారులు ధ్రువీకరించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇద్దరికీ మే 12వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ జిల్లా జడ్జి అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ ల అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పట్టాభి సీఐడీ తీరుని తప్పుబట్టారు. ఇది కక్ష సాధింపు అనే అనుకోవాలి. 30 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. ఎప్పుడూ కనిపించనివి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి. చాలా ప్రభుత్వాలు మారాయి. ఏదైనా లోటుపాట్లు ఉంటే అప్పటి నుంచి బయటకు వచ్చేవి. ఫిర్యాదులు చేసేవారు. కానీ ఇవేమీ లేకుండా.. ఈ నాలుగేళ్లుగా చూస్తున్నాం అంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగజ్జననీ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్న అభియోగాలపై ఆ సంస్థ డైరెక్టర్లు.. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమేరకు సీఐడీ కేంద్ర కార్యాలయం ధ్రువీకరించింది. కాకినాడకు చెందిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కొర్ని వరప్రసాద్‌ ఏప్రిల్‌ 29న సీఐడీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై అధికారులు 420, 409, 120, 477, రెడ్‌విత్‌ సెక్షన్‌ 34 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిబంధనలు పాటించడం లేదని, ఆర్ బీఐకి తెలీకుండా డిపాజిట్లు సేకరించారని వీరిపై అభియోగాలున్నాయి.

ఎమ్మెల్యేకి నిరసన సెగ.. చేయి చేసుకున్న కన్నబాబు

యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ ఎదురైంది. అచ్యుతాపురం(మం) పూడి మడక గడపగడపలో తోపులాట చోటుచేసుకుంది. ఆగ్రహంతో చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహారంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంత కాలంగా ఎమ్మెల్యే వెర్సస్ లోకల్ లీడర్స్ ఫైట్ కొనసాగుతోంది. సొంత పార్టీలోనే ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తుంది ఓ వర్గం. పూడిమడక జెట్టీ నిర్మాణం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ స్వంత నియోజకవర్గం నేతలు ఆయన పర్యటనల్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నబాబు వద్దు – జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు జగన్ వరకూ చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కన్నబాబు దందాలను అరికట్టాలని.. ఆయన అరాచకాలు అడ్డుకోవాలన్నారు. తప్పులు చేస్తారు.. చేయిస్తారంటూ ప్లకార్డులు తీసుకొచ్చి నిరసనకు దిగారు. వీరిలో సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను స్థానికులు మరోసారి అడ్డుకోవడం తాజాగా చర్చనీయాంశమైంది. రాబోయే ఎన్నికల్లో కన్నబాబు ఈ నిరసనల్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ

కర్ణాటకలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. బడా నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నపోయారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రెండో రోజు భారీ రోడ్ షో నిర్వహించారు. మైసూరులో ఆరు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాలుపంచుకున్నారు. అయితే, మైసూరులో రోడ్ షోలో ప్రధాని మోడీ కాన్వాయ్ పై ఓ మహిళ సెల్ ఫోన్ విసిరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారాన్ని మరింతగా పెంచడానికి ప్రధాని మోడీ మైసూరులో తన మద్దతుదారులతో సమావేశమవుతున్న సమయంలో, ఒక మొబైల్ ఫోన్ ను జనం లోపలి నుండి గుర్తుతెలియని వ్యక్తి ప్రధాని కాన్వాయ్ పైకి విసిరాడు.రోడ్ షోకు సంబంధించిన వీడియోలో, జనం వైపు చేతులు ఊపుతున్నప్పుడు ఒక ఫోన్ వాహనం వైపు విసరడం కనిపించింది. అయితే, ఇది కావాలని చేసిన పనికాదని సమాచారం. ప్రధానిపై పూలు విసురుతున్న సమయంలో గుంపులోని ఎవరో పొరపాటుగా ప్రమాదవశాత్తు మొబైల్ ను విసిరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలాంటి దురుద్దేశం లేని ఓ మహిళా బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో ఫోన్ విసిరినట్లు పోలీసులు తెలిపారు.

మీ జేబులు ఖాళీ చేసే పన్నులు నేటి నుంచి ఏవేవి అమలవుతున్నాయో తెలుసా ?

ప్రతినెల పన్నుల విషయంలో కొన్ని మార్పుల ఉంటాయి. అలానే ఈ రోజు నుంచి కొన్ని పన్నుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవి నేరుగా మీ జేబుకు చిల్లుపెడుతుంటాయి, అందుకే వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. మే 1 నుంచి పన్నుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. జీఎస్టీ, సీఎన్జీ, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్‌తో సహా అనేక నియమాల్లో మార్పులు ఉంటాయి. బ్యాటరీతో నడిచే వాహనాలకు సంబంధించిన నిబంధనలలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. జీఎస్టీకి సంబంధించిన రూల్స్‌లో కొత్తగా వచ్చిన మార్పులను పారిశ్రామికవేత్తలు పాటించాలి. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును ఏడు రోజుల్లోగా ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ కొత్త నిబంధన మే 1 నుంచి అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. సీఎన్జీ ధరలు ప్రతి నెల మొదటి రోజు లేదా మొదటి వారంలో మారుతాయి. పెట్రోలియం కంపెనీలు నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను మారుస్తాయి. ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మే 1న కూడా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్

బర్త్ డే రోజున ఐపీఎల్ లో ఎప్పుడూ 20 పరుగులు కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ. 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరపున పుట్టిన రోజున జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇప్పటికీ రోహిత్ బర్త్ డేన అదే అత్యధిక స్కోర్.. 2014లో ఐదు బంతులాడి కేవలం 1 పరుగు చేసిన రోహిత్ శర్మ.. 2022లో 5 బంతులాడి 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో 5 బంతులాడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అయితే రోహిత్ శర్మ అవుట్ విషయంలో వివాదం చెలరేగింది. సందీప్ శర్మ బౌలింగ్ లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆఫ్ స్టంప్ కంటే ముందు లెగ్ స్టంప్ పైన బెయిల్ లైట్ రావడంతో సంజూ శాంసన్ గ్లవ్స్ తాకడం వల్లే బెయిల్స్ లేచాయని.. రోహిత్ శర్మ బౌల్డ్ కాలేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే వీడియోలో క్లియర్ గా గమనిస్తే సందీప్ శర్మ వేసి, ఆఫ్ స్టంప్ బెయిల్ ని తాకుతూ వెళ్లింది. ఆఫ్ స్టంప్ బెయిల్ లేచేసరికి లెగ్ స్టంప్ బెయిల్ కదిలి ముందుగా లైట్ వచ్చింది. అదీకాకుండా సంజూ శాంసన్ గ్లవ్స్ కి బెయిల్స్ కి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి అతని గ్లవ్స్ తాకి వికెట్లు కదలలేదు.

ఢీ కొరియోగ్రాఫర్ ఆత్మహత్యకు కారణం అదేనా?

ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం బుల్లితెరను షేక్ చేస్తోంది. అప్పుల బాధ తట్టుకోలేక చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పు ఇచ్చినవాళ్లు టార్చర్ పెడుతున్నారని, తల్లిదండ్రులను క్షమాపణలు అడిగి.. ఎంతో బలవంతంగా తన ప్రాణాలను వదిలేశాడు. ఇక వీడియోలో చివరన చైతన్య మాట్లాడిన మాటలు ఎంతోమందిని కదిలించింది. “ఢీ నేమ్ ఇస్తుంది.. ఫేమ్ ఇస్తుంది కానీ, సంపాదన చాలా తక్కువ ఇస్తుంది. జబర్దస్త్ షోలో అయితే సంపాదన ఎక్కువ వస్తుంది. కానీ, అయినా ఢీలోనే నిలబడ్డాం, కష్టపడ్డాం. మేము ఇల్లు, టీవీలు ఏమి కొనుక్కోలేకపోయాం కానీ, నేమ్, ఫేమ్ తెచ్చుకున్నాం” అని కంటనీరు పెట్టుకున్నాడు. ఇక దీంతో ఢీ అభిమానులు మల్లెమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢీ కంటెస్టెంట్స్ కు జబర్దస్త్ లో ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడం లేదా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.