NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పాకిస్తాన్ కు మరోసారి భారీ ఆర్థిక సాయం

దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి భారీ ఆర్థిక సాయం చేసింది అమెరికా. వరదలతో అతలాకుతలం అయిన పాకిస్తాన్ ను ఆదుకునేందుకు 100 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునర్నిర్మాణం, వ్యాధులు ప్రభలకుండా, ఆర్థిక వృద్ధి, ఆహారం కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. మానవతా సాయం కింద పాకిస్తాన్ కు నిధులు ఇస్తున్నట్లు యూఎస్ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. గతంలోొ కూడా వరద సాయం కింద పాకిస్తాన్ కు 100 మిలియన్ డాలర్లను అందించింది యూస్. దీంతో మొత్తంగా 200 మిలియన్ డాలర్లను వరదసాయం కింద అందించింది. పాకిస్తాన్ పునరుద్ధరణ, పునర్నిర్మాణం కోసం రాబోయే కాలంలో నిరంతరం తోడ్పాటు అందిస్తామని.. వాతావరణాన్ని తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని నెడ్ ప్రైస్ వెల్లడించారు. వరద విలయం నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్ కు 16.3 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వాతావరణంపై నిర్వహించిన సదస్సులో చెప్పారు. ఇందులో సగం విదేశాల నుంచి వస్తాయని ఆయన భావిస్తున్నారు.

వ్యక్తి చేయి నరికి, ఎత్తుకెళ్లిన దుండగులు..

హర్యానాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై దాడిచేసి చేయిని నరికేశారు. అంతటితో ఆగకుండా నరికిన చేయిని తీసుకుని వెళ్లారు దుండగులు. ఈ ఘటనలో బాధితులుడు తీవ్రగాయాలపాలై చావుబతుకుల మధ్య ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన జరిగింది. జగ్ను అనే వ్యక్తిపై సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుక్షేత్ర హవేలీలో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ నారాయణ్‌ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకుని కురుక్షేత్ర హవేలీలోకి ప్రవేశించి, బాధితుడు జుగ్నుపై దాడి చేశారు. చేయిని నరికేశారు. అయితే ఈ ఘటన వెనక కారణాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నట్లు స్థానిక డీఎస్పీ రామ్ దత్ నైన్ తెలిపారు. బాధితుడి వాగ్మూంలాన్ని రికార్డు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వెతుకున్నారు. సీసీ కెమెరా పుటేజీ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుడు కురుక్షేత్ర హవేలీ వెలుపల కూర్చుని ఉండగా 10-12 మంది వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి? ఏం తాగాలి?

లంఖణం పరమ ఔషధం.. అంటారు. అంటే ఏమీ తినకుండా ఉండడం. ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు. ఒక్కోసారి మనం ఏమీ తినకుండా ఉంటాం. అటువంటప్పుడు నిజానికి ఆరోగ్యం బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పైగా ఉపవాసం వల్ల నీరసం వస్తుంది. అలానే దాని వలన ఇతర అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఉపవాసం చేసినా సరే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిజానికి మనం ఎలా అయినా ఉపవాసం చెయ్యవచ్చు. పూర్తిగా ఉపవాసం చేస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.ఒక నిపుణుడి పర్యవేక్షణ లేకుండా సంపూర్ణ ఉపవాసం చేయడమన్నది మంచిదది కాదు. ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఉపవాసం సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అనే దాని గురించి అనేక రకాల చర్చలు జరుగుతుంటాయి. ఉపవాసం అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకుండా ఉండాలంటే కొన్ని పద్దతులు పాటించాలి. ఉపవాసం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం బాగుంటుంది అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పిసిఓఎస్, ఒబిసిటీ, కొలెస్ట్రాల్, లివర్ సమస్యలు మొదలైనవి కూడా దరిచేరవు. ఉపవాసం చేసేటప్పుడు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, గోరువెచ్చని నీరు, తేనె, నిమ్మరసం కలిపిన నీరు మాత్రమే తాగాలి.

మాఫియాతో లింకు పెట్టుకున్నందుకు తీసుకెళ్లి పదేళ్ల శిక్ష వేశారు

గుట్కా వ్యాపారి జేఎం జోషికి ముంబైలోని ప్రత్యేక కోర్టు పదేళ్ల శిక్ష.. ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు జోషి సహకరించాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అదే సాయంతో 2002లో పాకిస్థాన్‌లో గుట్కా ఫ్యాక్టరీని ప్రారంభించగా.. ఆ కేసులో ఇప్పుడు ముంబై కోర్టు జేఎం జోషిని దోషిగా నిర్ధారించి పదేళ్ల శిక్ష విధించింది. ఈ కేసులో జోషితో పాటు జమీరుద్దీన్ అన్సారీ, ఫరూఖ్ అన్సారీలు కూడా దోషులుగా తేలడంతో ఇద్దరికీ శిక్ష పడింది.మాణిక్‌చంద్ గ్రూప్ వ్యవస్థాపకుడు రసిక్‌లాల్ ధరివాల్ కూడా ఈ కేసులో దోషిగా ఉన్నారు. అయితే 2017లో ఆయన మరణించిన తర్వాత, అతను కేసు నుండి తప్పించుకున్నాడు. కేసు గురించి మాట్లాడుతూ, రసిక్లాల్, జెఎం జోషి గతంలో కలిసి గుట్కా వ్యాపారం చేసేవారు. అయితే ఆ తర్వాత డబ్బు విషయంలో కొంత వివాదం ఏర్పడి ఇద్దరూ విడిపోయారు. జోషి ధరివాల్ నుండి విడిపోయి గోవా గుట్కా పేరుతో మరో కంపెనీని ప్రారంభించాడని అప్పట్లో చెప్పుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య వివాదాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో ఉండి ఈ విషయం సెటిల్ చేశాడు. ఆ సమయంలోనే అక్కడ గుట్కా ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాయం అందిస్తామంటూ షరతు పెట్టారు. ఇప్పుడు ఆ సాయం అందించడం జేఎం జోషికి భారంగా మారింది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద అతనిపై చర్యలు తీసుకున్నారు.

ఏడేళ్ల బాలుడిపై దాడి చేసిన శునకం
ఇటీవల కాలంలో వీధికుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో వీధికుక్కులు అక్కడి ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో కూడా గతంలో కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే గుజరాత్ లో వీధికుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాలుడు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధికుక్క దాడి చేసింది. ఫతేపురా గ్రామంలోని ముఖేష్ అనేబాలుడు అతని ఇద్దరు స్నేహితులు గాలిపటాలు ఎగురవేస్తుండగా వీధికుక్క అతనిపై దాడి చేసి తలపై కరిచింది. కుక్కదాడి చేస్తున్న సమయంలో ముఖేష్ కేకలు వేయడంతో స్థానికులు అతడిని రక్షించారు. ఫతేపురాలోని ఓ క్లినిక్ లో ప్రథమచికిత్స అందించి.. అక్కడ నుంచి దాహోద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఒకే రోజులో గుజరాత్ రాష్ట్రంలో రెండు చోట్ల కుక్కల దాడి జరిగింది. సూరత్ లో ఇంటిముందు ఆడుకుంటున్న ఓ బాలిక వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ముఖంపై తీవ్రగాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేశారు. కుక్క నుంచి కూతురుని రక్షించే క్రమంలో బాలిక తల్లి కూడా గాయపడింది.

టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు హౌస్ అరెస్ట్

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మారణాయుధాల సరఫరా, నకిలీనోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి లేదంటూ కాల్వ శ్రీనివాసులకు పోలీసులు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు.అయితే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంతో కాల్వ శ్రీనివాసులు ఇంటి వెనక గోడ దూకి నేతాజీ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడ కూడా ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడ బైఠాయించారు. వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డి అక్రమాలను బహిర్గతం చేయకుండా తమపై ఆంక్షలు విధించి నిర్బంధించారని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వణికిస్తున్న చలి… గజ గజ వణుకుతున్న జనం

రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు గజ గజ వణుకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇక మధ్యాహ్నం నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో జనం ఇల్లు విడిచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు. మరో ఐదు రోజుల వరకూ అంటే సంక్రాంతి వరకు చలి ఇట్లనే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగింది. అంతేకాకుండా ఈజిల్లాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కామారెడ్డి జిల్లా డొంగ్లీలో అత్యల్పంగా 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈరోజులు ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే జనం జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 7.5 కాగా, అల్మాయిపేట, సత్వార్ 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్ లో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కాగా.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక దిలాబాద్ ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసురుతుంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడి పోయాయి. మూడు రోజులుగా చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరింది. కొమురం భీం జిల్లాలో 6.5గా నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6.5 నమోదైంది. నిర్మల్ జిల్లా 7.9 కాగా.. మంచిర్యాల జిల్లాలో 9.4 గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది.

నేటి నుంచి వన్డే సిరీస్.. టీమిండియా బోణీ కొట్టేనా?

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు గౌహతిలో తొలి వన్డే జరగనుంది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నారు. రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లు మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నారు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రతి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఆటతీరు ఎలా ఉంటుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వన్డే సిరీస్‌లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పరిస్థితి అయోమయంగా మారింది. కేఎల్ రాహుల్ రావడంతో అతడికి జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. రోహిత్ ఎవరిని తీసుకుంటాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు తిరుగులేదు. ముఖ్యంగా 2019, 2020, 2021లో అతడు పరుగుల వరద పారించాడు. గతేడాది నుంచి నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. 2022లో 10 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 27.89 సగటుతో 251 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.