ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ అరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కవిత గతంలో వాడిన సెల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. కవిత తనకు తెలిసిన వివరాలన్నింటినీ ఆమె సీబీఐ అధికారులకు చెప్పినట్లు సమాచారం. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో సీబీఐ అధికారులు కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణకు వర్ష సూచన.. రాగల 3 రోజులు జాగ్రత్త
తెలంగాణలో అక్కడక్కడ రేపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి.. సాయంత్రం వాయుగుండంగా, ఇవాళ ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రకటించారు.
వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోంది
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని.. వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, అనేక ఘోరాలు చేస్తున్నారని టీడీపీ మీడియాలో రాస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజలకు పాలనను ప్రజల గుమ్మం వరకు వెళ్ళి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఇలా తప్పుడు కథనాలను టీడీపీ నేతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు పెట్టి మరీ దోచుకున్నాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎంత మందికి ఇచ్చే వారో ప్రజలకు తెలుసు అని.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి ఇస్తున్నామో తెలుసా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ‘వారాహి’ రిజిస్ట్రేషన్ వాయిదా
కొన్నిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్‌లో వారాహి రంగు ఉండటం వివాదానికి కారణమైంది. వారాహి రంగుపై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలివ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలు అంటించారు. అయితే ఏదేమైనా ప్రస్తుతం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. లారీ చాసిస్‌ను బస్సుగా మార్చడం, వాహనం ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువ ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహనాల టైర్లను రోడ్డుపై వెళ్లే వాహనానికి వాడటం, ఆర్మీకి సంబంధించిన కలర్‌ను సివిల్ వాహనానికి వాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమంటూ తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ శాఖ సూచించినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కమిటీల నియామకం కల్లోలం సృష్టిస్తున్నాయి. నిన్న ప్రకటించిన ఏఐసీసీ రిలీజ్ చేసిన జాబితాలో తన జూనియర్ల కంటే తక్కువ స్థానం కల్పించారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆమె రాజీనామా చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఆత్మాభిమానం కూడా ముఖ్యమంటూ తెలిపారు. పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడమంటే.. తనను అవమానించడమేనన్నారు. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారుతోంది. తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేస్తున్నామన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి మంత్రిగా పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు.
బంగ్లా ప్రధానిపై తీవ్ర అసహనం.. రాజీనామా చేయాలంటూ వీధుల్లోకి వచ్చిన జనం
బంగ్లాదేశ్ ప్రధాని హసీనా పై ప్రజలనుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని ఢాకా ఆందోళనకారులతో నిండిపోయింది. ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ఆందోళనల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేతలు పాల్గొన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరిగి ఎన్నికలు జరుపాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తోంది. కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవలికాలంలో నిరసనలు మరింత తీవ్రంగా మారాయి. శుక్రవారం నాడు భద్రతా దళాలు బీఎన్‌పీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లాయి. భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందారు. దీంతో విపక్షాల్లో ఆగ్రహం పెల్లుబికింది.
ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్.. విజేతగా కొచ్చి
హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ ముగిసింది. ఆదివారం చిరుజల్లుల మధ్యనే రయ్ మంటూ రేసింగ్ కార్లు దూసుకెళ్లాయి. ఇండియన్ రేసింగ్ ఫైనల్‌లో కొచ్చి టీం విజేతగా నిలిచింది. ఈ రేసులో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 385 పాయింట్లతో బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో గోవా (282 పాయింట్లు), నాలుగో స్థానంలో చెన్నై (279 పాయింట్లు), ఐదో స్థానంలో బెంగళూరు (147.5 పాయింట్లు), ఆరో స్థానంలో ఢిల్లీ (141 పాయింట్లు) జట్లు నిలిచాయి. ఈసారి రేసింగ్ లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలో 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోయాయి.