NTV Telugu Site icon

Top Headlines @9 PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ… 3,966 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. అయితే.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్‌ రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేటినెట్‌ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని చర్చించింది కేబినెట్‌. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్‌.

హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు.. కొరికారు : వైశాలి

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల నడిబొడ్డున ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో వైశాలి అనే యువతిని మిస్టర్‌ టీ షాప్‌ ఓనర్‌ నవీన్‌ రెడ్డి కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కటించి.. ప్రధాన సూత్రధారైన నవీన్‌ రెడ్డి అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా.. నవీన్‌ రెడ్డితో పాటు ఇప్పటికీ 31 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. వైశాలి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్న పోలీసులు.. ఆమె వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా వైశాలి మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్‌ చేసేందుకు వచ్చినవాళ్లు తనను చాలా ఘోరంగా ట్రీట్‌ చేశారని ఆమె ఆరోపించారు.

అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుఫాన్

మాండూస్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం కలిగించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుఫాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 1469 ఆహారపు ప్యాకెట్లు , 2495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శనివారం ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.

తిరుమలలో భారీవర్షాలు.. నిండుకుండలా జలాశయాలు

ఒకవైపు మాండూస్ తుఫాన్, మరోవైపు భారీవర్షాలతో తిరుమల వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేని వానలతో జలాశయాలు జలకళతో కళకళలాడుతున్నాయి. మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో గత రెండు రోజులుగా శేషాచల కొండల్లో కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని జలశయా లకు జలకల సంతరించుకుంది.నిన్న ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని పాపవినాశనం డ్యాం పూర్తిగా నిండిపోగా..గోగర్భం డ్యాంలో 90శాతంకీ పైగా నీరు చేరింది. నిన్న ఉదయం నుంచి సప్తగిరులపై కురుస్తున్న వర్షానికి..ఎగువ అటవీ ప్రాంతం నుంచి భారీగా నీరు జలశాయాలలోకి చేరుకోవడంతో జంట జలాశయలైన కుమారధార… పసుపుధారలతో పాటు పాపవినాశనం డ్యాంలోకి భారీగా వరద నీరు చేరింది.ఇంకా కుడా ఎగువ ప్రాంతం నుంచి డ్యాంలలోకి వరద నీరు వస్తూ ఉండడంతో ఆప్రమత్తమైన టీటీడి అధికారులు పాపవినాశనం డ్యాంలో ఒక్క గేట్ ను ఇంచ్ మేర ఎత్తి వేసి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేశారు.ఈ నీరంతా కడప జిల్లా కుక్కలదొడ్డి వైపు వున్న అటవీ ప్రాంతంలోకి వెళ్ళనుండడంతో ముందుగానే వాటర్ వర్క్స్ అధికారులు కడప జిల్లా నీటిపారుదల శాఖాధికారులతో పాటు ఈ నీరు ప్రవహించే వైపు నివాసం వుండే ప్రజలను అప్రమత్తం చేశారు.

పాన్ ఆధార్ లింక్ చేసుకున్నారా… తుదిగడువు ఇదే

మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేశారా ? చేయకపోతే త్వరగా చేసుకోండి. లేకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. ఇప్పటివరకు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని పన్నుచెల్లింపుదారులను ఆదాయపు పన్నుశాఖ కోరింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. తాజాగా పాన్, ఆధార్ లింకేజీ ప్రక్రియకు 2023 మార్చి 31వ తేదీని తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకుంటే పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సాధారణ గడువు ముగిసిందని.. తాజాగా గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేసింది. ఒకవేళ మీరు ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే పాన్ కార్డు పనిచేయదు.

తెలంగాణ పీసీసీ కమిటీ ప్రకటన.. 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ

తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణకు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది కాంగ్రెస్‌. అంతేకాకుండా.. మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని కాంగ్రెస్‌ నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్‌లతో పాటు షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. అయితే.. 24 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లను, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించినట్లు వెల్లడించింది. కొత్త కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ సీఎస్ సోమేష్ పై హైకోర్ట్ సీరియస్

బషీర్‌బాగ్‌లోని హిల్ ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణకు సంబంధించి పదేపదే హామీలు ఇవ్వడంతో విసుగు చెందిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం డిసెంబర్ 23న తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది. వారసత్వ నిర్మాణం యొక్క గత వైభవాన్ని కనీసం పునరుద్ధరించడానికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించాలని సోమేశ్‌ కుమార్‌ను కోరింది. ప్యాలెస్‌ను పునరుద్ధరించాలని కోరుతూ హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్‌కు చెందిన దీపక్ కాంత్ గిర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. హెరిటేజ్ నిర్మాణంలో పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గతంలో ఐదు నుంచి ఆరు సార్లు విచారణ జరిపిన టూరిజం అధికారులు కోర్టుకు తెలియజేసినా ఆ పనిని అమలు చేయలేదు. ఈ కేసును అనుసరించి ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రతిష్టాత్మకమైన వారసత్వ భవనాన్ని పరిరక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ, ఈ విషయంలో సంబంధిత అధికారుల ప్రతిస్పందనను తీవ్రంగా పరిగణించింది.

హైదరాబాద్ లో ఘంటశాల నాటక ప్రదర్శన

అంతరించిపోతున్న నాటకలను అందరం కలిసి ఆదుకోవాలని వాసవి బృందావన కమిటీ పిలుపునిచ్చింది… పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ సాయి సంతోషి నాట్యమండలి సురభి కళాకారులచే మోతీ నగర్ లోని వాసవి బృందావనంలో ఘంటసాల జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు… అనంతరం రచయిత భాస్కరుని సత్య జగదీష్, కమిటీ అధ్యక్షులు విజయానంద్, కమిటీ సభ్యులు సతీష్ ఆయుత లు మీడియాతో మాట్లాడారు. ఘంటసాల ఒక సినీ గాయకుడే కాదు ఒక గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బృందావన్ కాలనీ కమిటీ సభ్యులు, ఘంటసాల బంధువులు, తదితరులు పాల్గొన్నారు.

భారత్ నామమాత్రపు గెలుపు.. ఒక్క విజయంతో ముగింపు
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ముగించింది. ఇప్పటికే రెండు వన్డేలలో ఓటమి చెంది సిరీస్ కోల్పోగా శనివారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా విశ్వరూపం చూపించింది. దీంతో బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. 410 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య బంగ్లాదేశ్ 182 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లందరూ సమష్టిగా రాణించారు. శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షకీబుల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యాసిర్ అలీ 21, మహ్మదుల్లా 20 పరుగులు చేశారు.