డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసుని చేధించిన పోలీసులు
తెలంగాణలో సంచలనం కలిగించిన డాక్టర్ కిడ్నాప్ కథ కొలిక్కి వచ్చింది. ఆదిభట్ల కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు.. డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ని పట్టుకున్న పోలీసులు. డాక్టర్ వైశాలిని రక్షించారు. నల్లగొండ జిల్లా మంచన్‌పల్లి దగ్గర డాక్టర్ వైశాలిని వదిలేసి వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. డాక్టర్ వైశాలి అంతకుముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. నవీన్ గ్యాంగ్ దాడిలో గాయాల పాలైన శేఖర్ పలు వివరాలు వెల్లడించారు. దామోదర్ రెడ్డి ఇంటి ముందు నిలబడ్డ శేఖర్ పై దాడికి పాల్పడ్డ నవీన్ గ్యాంగ్ హంగామా చేశారు. శేఖర్ పై దాడి చేసి రాడ్లు కర్రలతో కాళ్లు విరగొట్టింది నవీన్ గ్యాంగ్. నవీన్ గ్యాంగ్ దాడిని ప్రతిఘటించాడు శేఖర్. మాస్కు, హెల్మెట్ ,ఒకే రంగు డ్రెస్ వేసుకొని వచ్చారు.. శేఖర్. తార్, జిప్సీ, మిగతా వాహనాల్లో ఒక్కసారిగా వచ్చారు..నవీన్ తో పాటు అందరూ తాగే ఉన్నారు.వాళ్లతో పట్టే రాళ్లు కర్రలు రాడ్స్ తీసుకొని వచ్చారు.కార్ల నుంచి దిగుతూనే ఒకసారిగా రాళ్ల వర్షం కురిపించారు.దొరికిన వాళ్ళ పైన రాడ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు.సీసీ కెమెరాలతో పాటు సెల్ ఫోన్లని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న అందరు సెల్ఫోన్లని గుంజుకొని దాడికి పాల్పడ్డారు. అమ్మాయిని వైశాలిని మాముందే ఎత్తుకొని పారిపోయారని వివరించారు.
అంబులెన్స్ కి ఓవర్ స్పీడ్ ఫైన్
ఓ అంబులెన్స్ కి ఓవర్ స్పీడ్ జరిమానా విధించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ట్రాఫిక్ బాబాయిలు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నడిపే ప్రైవేటు అంబులెన్స్ లకు పోలీసులు ఫోటోలు కొడుతూ జరిమానాలు వేస్తున్నారు. దీంతో ప్రైవేట్ అంబులెన్స్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు అందించే మాకే ఇలా ఫైన్లు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరైన గిరాకీలు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంబులెన్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విధించే జరిమానాలతో వారికి భారం ఎక్కువ అవుతోంది. ఆ జరిమానాలు కట్టడంతో కుటుంబ పోషణ భారంగా మారి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి అత్యవసర సేవలు అందించే ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలకు జరిమానాలు విధించవద్దని కోరుతున్నారు.
నాలుగు గంటలుగా లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకుంటూనే వున్నారు. నాలుగు గంటలుగా లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. షర్మిల దగ్గరకు వెళ్తుంటే నన్ను ఆపుతున్నారని, పాదయాత్ర చేసుకునే హక్కు అందరికి ఉంటుందన్నారు షర్మిల తల్లి విజయమ్మ. షర్మిల పాదయాత్ర కు అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు. షర్మిలకు వచ్చే ఆదరణ చూసి కేసీఆర్ భయపడుతున్నాడు. తెలంగాణ లోనే ఏమి అభివృద్ధి చేయలేని వారు బి ఆర్ ఎస్ పెట్టి దేశమంతా ఏమి చేస్తారు. బీఆర్ ఎస్ పేరుతో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లినా జగన్మోహన్ రెడ్డి ని కదిలించలేరు. ముందు కేసీఆర్ తెలంగాణ బాగోగులు చూసుకోకుండా దేశం మీద పడినా లాభం లేదన్నారు విజయమ్మ. మరోవైపు లోటస్ పాండ్ కి వెళ్ళే దారి వెంట భారీగా పోలీసులు మోహరించారు.
తమిళనాడులో జనావాసాలపై గజరాజుల బీభత్సం
వన్య ప్రాణులు అడవులను వదిలి జనావాసాల్లోకి రావడం ఇటీవల సాధారణమైంది. వాటి ఆవాసాలను మనిషి తన స్వార్థం కోసం ధ్వంసం చేస్తుండడంతో ఎటు పోలేక అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. చిరుతలు, ఎలుగులు, పెద్ద పులులు, ఏనుగులు ఇలా ఎప్పుడూ ఏవో జంతువులు పరిసర గ్రామాల్లో జనవాసాల్లో దూరుతున్నాయి. ఇలా వచ్చిన పెద్ద పులులు, చిరుతల దాడుల్లో పలువురు ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక ఏనుగులు గ్రామాల్లో చొరబడి ప్రజల ప్రాణాలు తీయడం, పంటలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చాలా జరిగాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూర్ జిల్లాలోని కడలూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ గ్రామంలో చొరబడింది. ఏనుగులు జనావాసాలపై దాడి చేయడంతో 50కి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డప్పులు కొడుతూ, బాంబులు కాలుస్తూ ఆ ఏనుగుల మందను వెళ్లగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. చివరి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి ఏనుగుల మందను అడవి వైపు మళ్లించారు.
యూట్యూబ్‌లో నగ్న ప్రకటనలు.. దావా వేసినందుకు సుప్రీంకోర్టు చీవాట్లు
పరిహారం ఇప్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లితే అక్కడ కోర్టు అతడికి మొట్టికాయలు వేసింది. యూట్యూబులో వచ్చే లైంగిక యాడ్స్ కారణంగా తను పోటీ పరీక్షల్లో నెగ్గలేకపోయానంటూ.. తనకు న్యాయం చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు పనికిమాలిన పిటిషన్ వేసినందుకు రూ.25,000 జరిమానా కూడా విధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ కిషోర్ చౌదరి, ఆ రాష్ట్ర పోలీస్‌లో చేరేందుకు పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాడు. అయితే యూట్యూబ్ వీడియోల్లో వచ్చిన కొన్ని లైంగిక యాడ్స్ వల్ల తన ఏకగ్రత దెబ్బతిన్నదని అతడు ఆరోపించారు. దీని వల్ల పోలీస్ ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. యూట్యూబ్ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం ఆనంద్ కిషోర్ పిటిషన్‌ను తిరస్కరించింది. తన వాదన వినిపించేందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన అతడికి చీవాట్లు పెట్టింది.
క్రికెట్ ఆడుతుంటే గుండెపోటు.. యువకుడి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అనూజ్ పాండే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తల తిరగడంతో కిందపడిపోయాడని అందరూ భావించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనూజ్ గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో అనూజ్‌కు అంత్యక్రియలు పూర్తిచేశారు. అనూజ్ తండ్రి అమిత్ కుమార్ పాండే త్రివేణిగంజ్ మార్కెట్‌లో సీడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. అమిత్‌కు భార్య సునీత, ఇద్దరు కుమారులు సుమిత్, 16 ఏళ్ల అనూజ్ ఉన్నారు. తన కుమారుడు అనూజ్ బుధవారం ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు ఇంటి నుండి బయలుదేరాడని అమిత్ పాండే చెప్పారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అనూజ్ మైకం కారణంగా స్పృహ తప్పి పడిపోయాడని.. అతని స్నేహితులు అనూజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని వివరించారు.
టీసీపై పడ్డ కరెంట్ తీగలు.. తీవ్ర గాయాలు
ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్లాట్ ఫాంపై నిలుచున్న రైల్వే టీసీపై ఉన్నట్టుండి కరెంట్ వైరు తెగిపడింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే లైన్ కోసం హై ఓల్టేజ్ కరెంట్ తీగలు వాడుతారు. ఆ తీగలను తాకితేనే కాలి బూడిదవుతారు. అలాంటి ఓ హైఓల్టేజ్ విద్యుత్తు వైరు తెగి మీద పడితే.. ఎంత ప్రమాదమో ఊహించనక్కర్లేదు. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్‌లోని ఖారగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్ ఫారమ్‌పై టికెట్ కలెక్టర్(టీసీ) వేరే వ్యక్తితో మాట్లాడుతూ నిలబడ్డారు. ఒక్కసారిగా హైఓల్టేజ్ విద్యుత్తు తీగ ఆయనపై పడింది. క్షణాల్లో తీగతో పాటే ట్రాక్‌పై పడిపోయాడు టీసీ. ఆయనతో మాట్లాడుతున్న మరో వ్యక్తి భయంతో పరుగులు పెట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉంటే, బాధితుడు సుజన్ సింఘ్ సర్దార్‌గా గుర్తించారు. విద్యుత్తు షాక్‌తో తీవ్ర గాయాలైన టీసీని రైల్వే సిబ్బంది, అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. తీగ తెగి పడడానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు.
షాపింగ్ మాల్ లో అగ్ని ప్రమాదం… భారీగా మంటలు
రష్యాలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణం మేర మంటలు విస్తరించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రష్యా క్యాపిటల్ మాస్కో ఉత్తర శివారు ప్రాంతమైన ఖిమ్కిలో ఈ సంఘటన జరిగింది. అక్కడి మెగా ఖిమ్కి షాపింగ్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానం మేర విస్తీర్ణంలో ఉన్న షాపింగ్ మాల్ అంతటా మంటలు వ్యాపించాయి. కొన్ని పేలుడు శబ్ధాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ మాల్ భవనంలో ఉంటున్న నివాసితులు, సిబ్బంది అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, అగ్నిని నియంత్రణ వాహనాలతో ఫైటర్లు అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే మంటలు పెట్టి ఉంటారని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ అనుమానం వ్యక్తం చేసింది.