NTV Telugu Site icon

Top Headlines @9 PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

గుజరాత్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం.. హిమాచల్‌లో కాంగ్రెస్‌దే పీఠం

గుజరాత్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది. మోదీ మ్యాజిక్‌తో 156 నియోజకవర్గాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. 54శాతం ఓట్లను దక్కించుకుంది. బీజేపీ దెబ్బకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకునే అవకాశం కూడా లేకుండాపోయింది. 20 సీట్లు కూడా గెలవలేక చతికిలపడింది. గుజరాత్‌లో ఎన్నికల ఆరంగేట్రం చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ 12శాతం ఓట్లను కొల్లగొట్టింది. కాంగ్రెస్ 17 స్థానాలను కైవసం చేసుకోగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. డిసెంబర్‌ 12న భూపేంద్ర పటేల్‌ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా ఎన్నికల్లో బీజేపీ 150కి పైగా సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. గుజరాత్‌లోఓ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. 1985లో మాధవ్ సిన్హ్ సోలంకీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకుంది. అత్యధిక సీట్లు దక్కించుకొని బీజేపీ తన సొంత రికార్డును కూడా బద్దలు కొట్టింది. గతంలో ఆరుసార్లు గెలుపొందిన బీజేపీ.. 2002లో గరిష్ఠంగా 127 సీట్లు గెలుచుకుంది. తాజా ప్రదర్శనతో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా ఏడు సార్లు ఓ రాష్ట్రంలో మెజారిటీ సాధించడం ద్వారా మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది.

బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్.. రేపే ఆవిర్భావం 

అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం చేయడం.. మరుసటి రోజే ఆ తీర్మానం ప్రతిని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే! ఇన్ని రోజులపాటు ఈ తీర్మానం విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచిన సీఈసీ.. ఎట్టకేలకు ఈరోజు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ.. కేసీఆర్‌కు సీఈసీ అధికారికంగా లేఖ పంపింది. ఈ నేపథ్యంలో.. రేపు (డిసెంబర్ 9) శుక్రవారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు భారత రాష్ట్ర సమితిఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు ఇచ్చారు.

వైఎస్సార్సీపీ పటిష్టతపై జగన్ ఫోకస్.. నేతలకు స్వీట్ వార్నింగ్

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, సమావేశం సందర్భంగా నాయకులకు సీఎం జగన్ మెత్తటి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాధ్యత తీసుకుంటే కచ్చితంగా పని చేయాలి. పని చేయలేక పోతే ముందే చెప్పేయండి. మీరు పని చేస్తున్నారో లేదో పర్యవేక్షించటానికి నా మనుషులు ఉంటారు. మీరు పని చేయకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.పని చేసిన వాళ్ళకు తగిన గుర్తింపు ఉంటుంది. అబ్జర్వర్లకు వారి విధుల పై సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. పరిశీలకులతో సీఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. అబ్జర్వర్లు మీకు కేటాయించిన నియోజకవర్గాలను గెలిపించుకుని తీసుకుని రండి. మరో పవర్ సెంటర్ గా మారే ప్రయత్నం చేయకండి. ఐదో తరగతి పిల్లవాడిని 10వ తరగతి క్లాస్ లో కూర్చో బెట్టినట్లే కొద్ది రోజులు మీకు ఇబ్బంది ఉంటుంది. నెమ్మదిగా అలవాటు పడతారు. మీరు గెలిపించుకుని వస్తే మిమ్మల్ని ఎలా చూసుకోవాలి అన్న బాధ్యత నాది అన్నారు జగన్.

సింగరేణి బొగ్గు గనుల వేలంపై కేటీఆర్ ఫైర్

సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధాని నరేంద్ర మోడీ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు లోక్ సభలో కేంద్రం ప్రకటించిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పకూల్చడమే అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై అసూయతోనే.. ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతో సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణతో పాటు దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణిదే కీలక పాత్ర అని.. గనులు కేటాయించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను దివాలా తీయించిన విధంగానే సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్‌లోనూ సింగరేణి రికార్డ్ సృష్టిస్తోందని.. అలాంటి సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

పూటకో మాట.. రోజుకో పాట… అదే వైసీపీ ఎజెండా

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య రోజూ మాటల యుద్ధం సాగుతూనే వుంటుంది. తాజాగా ఏపీ విభజన వివాదం రాజుకుంది. వైసీపీ నేతలు ఏపీ, తెలంగాణ కలిసి పోతే స్వాగతిస్తామని కామెంట్లు చేశారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాగలిగితే మొట్టమొదటగా స్వాగతించేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే అని, కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా పార్టీ, మా ప్రభుత్వ విధానమని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సజ్జల సమైక్య కామెంట్లపై స్పందించింది టీడీపీ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సజ్జల సలహాలతో జగన్ పాలనతో రాష్ట్రంలో పీకల్లోతున కూరుకు పోయింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసి రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రభుత్వం మరోమారు తీరని ద్రోహం చేసింది. విభజన కేసులు మూసేయాలన్న తాజా అఫిడవిట్ తో రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల ఆస్తులు చేజేతులా వదులుకున్నట్టైంది. ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకు వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెర లేపారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలక పాత్ర పోషించింది వైసిపినే అన్నారు. షెడ్యూలు 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించవచ్చని చెప్పింది జగన్ రెడ్డి కాదా..? అన్నారు.

చిట్ ఫండ్ కేసులపై ఓ కన్నేయండి
పెండింగ్ లో ఉన్న చిట్ ఫండ్ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అధికారులకు సూచించారు. గురువారం ఆయన రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్లు స్టాంపుల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన రిజిస్ట్రేషన్లు స్టాంపుల ఐజీ, అదనపు ఐజీ, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు. రిజిస్ట్రేషన్ల ద్వారా కొన్ని జిల్లాల రెవెన్యూ లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని సమావేశంలో స్పష్టీకరించారు. కాకినాడ, విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళంలను ప్రీమియం రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రజత్ భార్గవ సూచించారు. అలాగే, డిసెంబరు 31 లోగా ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లు ఏర్పాటు కోసం భవనాలను గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రివాబా జడేజా ఘన విజయం.. రవీంద్ర జడేజా ఆనందం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది. ఆమె తన ప్రత్యర్థి పై 61 వేలకు పైగా భారీ మెజారిటీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. క్షత్రియ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థిగా బిపేంద్రసింగ్​ జడేజా పోటీ చేశారు. రివాబాకు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైనా సరే వాటన్నింటిని ఎదుర్కొని విజయం సాధించారు.

పవన్ వారాహి వాహనంపై పేర్ని నాని సెటైర్లు

పవన్ కళ్యాణ్ వారాహి వాహనం మీద పేర్ని నాని కౌంటర్ వేశారు. యుద్ధం చేయటానికి వ్యాన్లు కావాలా? ఎన్నికల్లో అలా యుద్ధాలు చేస్తారా?? అలా అయితే నేను కూడా వ్యాను కొని ఉండేవాడిని అన్నారు. ఈ వీడియో చూసి సినిమా టీజర్ అనుకున్నా అన్నారు నాని. డబ్బులు ఉండి వ్యాన్లు కొంటే అయిపోతుంది. ఇవన్నీ సినిమాల్లో పనికి వస్తాయి. బయటే కాదు లోపల ఏముందో కూడా చూపిస్తే బాగుంటుంది అన్నారు. లక్ష పుస్తకాలు చదివాను అంటాడు కదా. ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా పవన్ చదివితే బాగుంటుంది. ఈ చట్టం ప్రకారం ఆలీవ్ గ్రీన్ కలర్ సొంత వాహనాలకు వేయకూడదని చెబుతోంది. ఆలీవ్ గ్రీన్ రంగు ఉంటే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవదు. వేరే రంగు వేసే బదులు ముందే వాహనానికి పసుపు రంగు వేసుకుంటే ఖర్చు కలిసి వస్తుంది కదా అన్నారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యారు. తన రథాన్ని రెడీ చేయించారు. మిలటరీ ట్రక్ తరహాలో ఓ వాహనాన్ని రెడీ చేయించుకుంటున్నారని ముందుగానే వార్తలు వచ్చాయి. అవి నిజమని తేలింది. వారాహి వాహనం ఫోటోలను నిన్ననే పవన్ షేర్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో మాత్రం పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఈ రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. యుద్దానికి వారాహి సిద్దం అనే టైటిల్ లో వీడియో వదిలారు. కావాలని తన బాడీ గార్డ్ లను మిలటరీ జవాన్లు మాదిరిగా చూపించడం విశేషం.

నా చావుకు హరీష్ శంకరే కారణం.. పవన్ లేడీ ఫ్యాన్ సూసైడ్ నోట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఆయన కథల ఎంపికతో అభిమానులకు అసహనం తెప్పిస్తున్నాడు. రీమేక్ సినిమాలతో అభిమానులకు కోపం తెపిస్తున్నాడు అని అందరికి తెల్సిందే.ఇక ఇప్పుడు మరో రీమేక్ పవన్ చేయబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి పవన్ తేరి రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు కోపంతో ఊగిపోతున్నారు. WeDontWantTheriRemake అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఒక లేడీ ఫ్యాన్ తేరి రీమేక్ చేస్తే చచ్చిపోతానంటూ సూసైడ్ లెటర్ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.