Site icon NTV Telugu

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కైకాల సత్యనారాయణ విలక్షణ నటుడు.. కేసీఆర్ నివాళి

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని సీఎం కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సీఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సినీ నటుడు మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

బీఆర్ఎస్ నేత నోట …జై కాంగ్రెస్ నినాదాల మాట

రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఏడాదికో పార్టీ మారుతున్నారు. అయితే తామేం పార్టీలో ఉన్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో వారికి గుర్తుకురావడం లేదు. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీకి జై కొట్టడం అలవాటులో పొరపాటుగా జరిగిపోతుంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదే జరిగింది. ఎమ్మెల్యే రమణ రెడ్డి అనుచరులు ఇంకా బీఆర్ ఎస్ పార్టీని ఒంట ఓట్టించుకోలేదు. ఇప్పటికీ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయన అనుచరాలు జై కాంగ్రెస్ అని అంటూనే ఉన్నారు. వారి నినాదాలు విని పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతూనే వుంది. తాజాగా ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభను ఉత్తేజపరిచేందుకుగాను నినాదాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా గులాబీ బట్టలేసుకున్నారు. జై బీఆర్ఎస్ కు బదులుగా జై కాంగ్రెస్ అని పలకడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. జై బీఆర్ఎస్ అని అనడానికి బదులు రేగొండ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పెట్టేం శంకర్ జై కాంగ్రెస్ అంటూ నినదించారు. అక్కడ ఉన్న మిగతా నేతలు జరిగిన పొరపాటును అతని దృష్టికి తేవడంతో నాలిక్కరుచుకుని మళ్లీ జై బీఆర్ఎస్, బీజేపీ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం. 16మంది జవాన్లు మృతి

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లతో ప్రయాణిస్తున్న టక్కు లోయలో పడింది. ఉత్తర సిక్కిం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏటవాలుగా ఉన్న రోడ్డు నుంచి ట్రక్కు జారిపోయి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. మూడు కాన్వాయ్ లు శుక్రవారం ఉదయం చటెన్ నుంచి థంగు వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. జెమా వద్ద కాన్వాయ్ లోని ఓ వాహనం మార్గం మధ్యలో ప్రమాదానికి గురైంది.మరణించిన వారిలో ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. ‘‘ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

గోషామహల్ లో కుంగిన పెద్ద నాలా.. పడిపోయిన కార్లు

గోషామహల్‌లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. అయితే.. ఒక్కసారిగా నాలా కుండిపోవడంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు, దుకాణాలు కుంగిన నాలాలో పడిపోయాయి. అంతేకాకుండా.. మార్కెట్లో ఏర్పాటుచేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దాదాపు 50 కూరగాయల బండ్లు నాలాలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్దఎతున్న మార్కెట్ కు వచ్చిన జనాలను పోలీసులు తరలిస్తున్నారు. అయితే.. నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోపక్క ఎప్పుడు ఏమి కులుతాయో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నాలా కుంగడంపై పరిశీలిన చేస్తున్నారు.

హీరో అవ్వడానికి వారికి రూ. 5 లక్షలు ఇచ్చి మోసపోయా

కుర్ర హీరో నిఖిల్ సైతం అలాంటి సినిమా కష్టాలనే ఎదుర్కొన్నాడట. సినిమా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి, సీరియల్స్ చేసి, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక నిఖిల్ నటించిన 18 పేజీస్ నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతాన్ని, సినిమా కష్టాలను నెమరువేసుకున్నాడు. యంగ్ ఏజ్ లోనే హైదరాబాద్ నవాబ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.. అప్పటి రోజులను తలుచుకుంటే మీకేం అనిపిస్తోంది అన్న ప్రశ్నకు.. నిఖిల్ సమాధానమిస్తూ.. ” సుదీర్ వర్మ నాకు ఈ సలహా ఇచ్చాడు.. నేను హీరో అవుతా అని అందరి ముందు చెప్తే నవ్వి పక్కకు పంపిస్తారు.. అసలు సినిమా ఏంటి..? ఎలా ఉంటుంది..? అనేది నేర్చుకో.. తరువాత సినిమా హీరో అవ్వొచ్చు అని చెప్పడంతో నేను అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను.. సినిమా ఎలా తీస్తారు అనేది నేర్చుకున్నాను. హ్యాపీ డేస్ వరకు నాలుగు చిన్న చిన్న సినిమాలు చేశాను. చదరంగం అనే సీరియల్ 40 ఎపిసోడ్స్ చేశాను.. అప్పుడు సీరియల్స్ కు చాలా అవకాశాలు వచ్చాయి.

మాస్క్ పెట్టుకు రాలేదని వైద్యం చేయని డాక్టర్

మాస్క్ పెట్టుకు రాలేదని జ్వరంతో వచ్చిన ఓ బాలుడికి వైద్యం చేయకుండా నిరాకరించాడు ఓ ప్రభుత్వ వైద్యుడు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల దురుసుగా ప్రవరిస్తూ పై పెచ్చు కలెక్టర్ తనకు స్నేహితుడు అని చెప్పుకుంటూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుడంటే ఇలా ఉండకూడదని ఈ వైద్యుడిని చూస్తే అర్థం అవుతుందని అంటున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రం లోని ప్రభుత్వ హాస్పటల్ లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యుడు నాగరాజు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం కావాలని వచ్చే పేషెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారని డాక్టర్ ముందే పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గోపాలకుంట గ్రామానికి చెందిన హుస్సేన్ తన పిల్లలకు జ్వరం రావటంతో కల్లూరు ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకు వచ్చాడు. ఓపీ రాయించి పిల్లలను సదరు వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళగా పిల్లలు మాస్క్ పెట్టుకు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓపీ స్లిప్ ను వారి మొహంపై పడేసి బయటకు వెళ్లగొట్టటంతో అక్కడే ఉన్న మరికొంత మంది పేషెంట్లు డాక్టర్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర జ్వరంతో వచ్చిన పిల్లలకు వైద్యం చేయకుండా బయటకు పంపించి వేయటం ఏంటని డాక్టర్ ను ప్రశ్నించారు.

2023 ఐపీఎల్ మినీ వేలం ప్రారంభం.. వేలంలో 400మంది ఆటగాళ్ళు
2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 400 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం అన్ని ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. అయితే ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను ఆయా జట్లు రిలీజ్ చేశాయి. వేలంలో ఉన్న పలువురు ఆటగాళ్ల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు అఫ్ఘానిస్తాన్‌కు చెందిన అల్లా మొహ్మద్ ఘజ్నాఫర్. అతడి వయస్సు 15 ఏళ్లు మాత్రమే. ఈ కుర్రాడు మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి.

314 పరుగులకు భారత్ ఆలౌట్.. 87 పరుగుల కీలక ఆధిక్యం

మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్ని్ంగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలు మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాణించకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్‌మన్ గిల్ (20) విఫలం అయ్యారు. స్టార్ ఆటగాళ్లు పుజారా (24), విరాట్ కోహ్లీ (24) రాణించలేకపోయారు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ 93 పరుగులతో అదరగొట్టాడు. అతడు 104 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు రాబట్టాడు. పంత్‌కు శ్రేయస్ అయ్యర్ కూడా చక్కటి సహకారం అందించాడు. శ్రేయస్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పంత్, శ్రేయస్ ఇద్దరూ సెంచరీలు చేయకపోవడం అభిమానులను నిరాశపరిచింది. వీళ్లిద్దరూ ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించి టీమిండియాను ఆదుకున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్‌, తైజుల్ ఇస్లామ్‌లకు చెరో 4 వికెట్లు పడ్డాయి. టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్‌కు తలో ఒక వికెట్ పడింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది.

Exit mobile version