ఈనెల 8న తెలంగాణకు ప్రధాని నరేంద్రమోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని పలు రైల్వే అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదేరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ రెండో దశ పనులను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునఃఅభివృద్ది పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నరేంద్రమోదీ రూ. 11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుని సికింద్రాబాద్ – తిరుపతి మధ్య సేవలనందించనున్న వందేభారత్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ రైలు. ఈ రైలు కారణంగా సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గం. ల నుండి 08.30గం.ని.లకు తగ్గిపోతుంది. అనంతరం రూ. 715 కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నందు చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
భూతగాదా.. తాహశీల్దార్ ఎదుటే పిచ్చకొట్టుడు
చిన్న చిన్న వివాదాలే చినికి చినికి గాలివానగా మారుతున్న రోజులివి. తాజాగా ఏపీలో జరిగిన ఒక ఘర్షణ వీడియో వైరల్ అవుతోంది. అనకాపల్లిజిల్లా గవరవరంలో భూ తగదా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. తాహశీల్ధార్ ఎదుటే పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఈ ఫైటింగ్ సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చోడవరం మండలం, గవరవరం లో సర్వే నంబర్ 170/10 గల భూవివాదం పై వివాదం ఉంది. హద్దులు విషయంలో పరిష్కారం కోసం రైతులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. సర్వే చేయించేందుకు సిబ్బందితో సహా పొలంలోకి వెళ్ళారు తాహశీల్ధార్. ఒక వర్గం తర్వాత మరో వర్గం వెర్షన్ చెప్పాలని సూచించగా ఇంతలో మాటామాటా పెరిగింది. కంట్రోల్ తప్పిన ఇరువర్గీయులు కలియబడి కొట్టుకున్నారు.ఇదంతా చూస్తూ వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు తాహశీల్దార్. వివాదం రేగిన పొలంలోనే ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పాక్ లో ఆకలి కేకలు.. 50 ఏళ్ళ గరిష్టానికి ద్రవ్యోల్బణం
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ అల్లాడుతోంది. కనీసం అక్కడి ప్రభుత్వం ప్రజలకు తినేందుకు తిండిని కూడా ఇవ్వలేకపోతోంది. ఎక్కడ చూసిన ఆహారం కోసం తొక్కిసలాటలు, కొట్లాటలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇలా అన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే తిండి గింజలు ప్రజలకు చేరకముందే రాత్రికి రాత్రి మాయం అవుతున్నాయి. పాకిస్తాన్ ద్రవ్యోల్భణం 50 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. మార్చిలో 35.37 శాతానికి చేరుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నెలవారీ ద్రవ్యోల్భణం 3.72 శాతం కాగా.. గతేడాది సగటు ద్రవ్యోల్భణం రేటు 27.26 శాతంగా ఉంది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా నిత్యావసరాలు, పెట్రోల్, డిజిల్, గ్యాస్ ఇలా అన్నింటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, సైన్యం పెత్తనం ఇలా సవాలక్ష సవాళ్లు పాకిస్తాన్ ముందు ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ 1.1 బిలియన్లను విడుదల చేయకపోవడంతో పాకిస్తాన్ లో తిండికోసం అంతర్యుద్ధం చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బెజవాడ వాసులకు వర్షంతో ఉపశమనం
అసలే ఎండాకాలం.. భగభగమండుతోంది వాతావరణం. అందులోనూ విజయవాడ పేరు చెబితే ఎండతీవ్రత మామూలుగా ఉండదు. ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఒక్కసారిగా చల్లబడింది వాతావరణం..ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. విజయవాడ నగరంలో తేలికపాటి వర్షాలు కురిశాయి. గుడివాడలో బలమైన గాలులతో కురుస్తున్న భారీ వర్షం, అక్కడక్కడ పడుతున్న వడగళ్ళతో వాతావరణం మారిపోయింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో వాతావరణం చల్లబడింది. భానుడి వేడికి మండిన నేలపై చినుకులు పడడంతో కమ్మటి మట్టి వాసన వచ్చింది. దీంతో జనం ఉపశమనం పొందారు. ఇవాళ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గుడ్ మెన్ పేటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో భయంతో ఇళ్లల్లోకి పరుగులు తీశారు మహిళలు చిన్నపిల్లలు. చాలా ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురవడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. వేడిగాలులకు బదులు చల్లటి గాలులు వీశాయి. వారం క్రితం వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. రాబోయే రెండు మూడు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే, ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నా కొడుకు మోహిత్ రెడ్డిని ఆదరించండి
తిరుపతిలోని శిల్పారామం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఉండాల్సి రావడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రకటించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా జనం ముదుకు వచ్చే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు చెవిరెడ్డి. కేరింతలు పెడుతూ కరతాళ ధ్వనులతో మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ తమ మద్దతు తెలియపరచారు పార్టీ నేతలు, కార్యకర్తలు.ఆత్మీయ సమ్మేళనంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు జన్మనిస్తే.. చంద్రగిరి ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. నన్ను నమ్మి నాతో పాటు ప్రయాణించి ఈ స్థాయికి చేర్చిన పార్టీ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాను. చంద్రగిరి నుంచి రాష్ట్ర స్థాయి నాయకునిగా నాకు గుర్తింపు వచ్చిందంటే అదంతా మీరు పెట్టిన భిక్ష. నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించే చంద్రగిరి ప్రజలకు కొంత దూరంగా ముఖ్యమంత్రి జగనన్నకు దగ్గరగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.ముఖ్యమంత్రి జగనన్న సూచన మేరకు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. మీ అందరి కళ్ల ముందు పెరిగిన నా బిడ్డ మోహిత్ ను మీ బిడ్డగా దగ్గరకు తీసుకుని ఆదరించండి.ఇప్పటికే గడపగడపలో మోహిత్ ను ప్రజలకు పరిచయం చేసినా ఇకపై మరింతగా జనం మధ్యకు తీసుకుని వెళ్లాలి.చిన్నతనం వల్ల తెలిసో తెలియక ఎవ్వరిమనస్సు అయినా నొప్పించి ఉంటే మోహిత్ ను పెద్ద మనస్సుతో క్షమించండి.
నెల్లూరు జిల్లాలో అడ్డగోలు దోపిడీలు ఎక్కువయ్యాయి
నెల్లూరు జిల్లాలో అడ్డగోలు దోపిడీలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాకాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎగిరిపోయారు..కాకాణి మంత్రి కావడంతో టిడిపికి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ నెల 7న టిడిపి జాతీయ అధ్యక్షుడు నెల్లూరులో పర్యటిస్తారు..వేణుగోపాల స్వామి కాలేజి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తాం అన్నారు. నెల్లూరు జిల్లాలోగ్ అడ్డగోలు దోపిడీలు ఎక్కువైపోయాయని, అయినా పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ లేఔట్లు వెలుస్తున్నాయి.. నుడా బ్రతికుందా.. చనిపోయిందా అర్థం కావడం లేదు..ఇర్రిగేషన్ ఫండ్స్ వందల కోట్లు తినేశారు..ఇరిగేషన్ శాఖలో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారే తప్ప పనులు చేయడంలేదు..ఇరిగేషన్, అక్రమ లేఔట్లు, సిలికాలో హద్దుల్లేని అవినీతి జరుగుతోంది..దోపిడిదారులతో కుమ్మకై లంచాలకు అలవాటుపడిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
కేన్ విలియమ్సన్ పై గుజరాత్ టైటన్స్ బాంబ్
మార్చి 31వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే! బౌండరీ లైన్ వద్ద రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్స్‌ని క్యాచ్ పట్టబోయి.. కేన్ డైవ్ చేశాడు. ఈ క్రమంలోనే అతని మోకాలికి గాయమైంది. అతడు కనీసం కదిలే పరిస్థితిలో లేకపోవడంతో.. సిబ్బంది వచ్చి అతడ్ని తీసుకెళ్లింది. ఆ సమయంలోనే అతడు ఈ సీజన్‌కి దూరం అవ్వొచ్చన్న అనుమానాలు వచ్చాయి. అనంతరం వైద్యులు అతడ్ని పరీక్షించిన తర్వాత.. అతని మోకాలు ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. దాన్నుంచి కోలుకోవాలంటే చాలా సమయమే పడుతుందని కుండబద్దలు కొట్టాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్.. ఈ సీజన్‌లోని తదుపరి మ్యాచెస్‌లో కేన్ విలియమ్సన్ ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అతడు చెప్పిందే నిజమైంది. ఈ సీజన్ నుంచి కేన్ వైదొలుగుతున్నట్టు గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్రకటించింది.
డబ్బుకోసమే నేను చరణ్ ని పెళ్ళిచేసుకున్నా అన్నారు
మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, ఒక బిజినెస్ విమెన్ గా.. తనవంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషిస్తుంది. ఇక త్వరలోనే తల్లి అనే బాధ్యతను అందుకోనుంది. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. పదేళ్ల తరువాత ఉపాసన, చరణ్ పేరెంట్స్ కాబోతున్నారు. దీంతో మెగా కుటుంబమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా మెగా వారసుడు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తల్లి కాబోతున్న ఉపాసనను చరణ్ ఒక్క నిమిషం కూడా విడిచి ఉండడం లేదు. ఎక్కడకు వెళ్లినా తనతోపాటు భార్యను తీసుకెళ్తూ.. ఏది కావాలంటే అది చేస్తూ పర్ఫెక్ట్ హస్బెండ్ అనిపించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇన్ని ప్రశంసలు అందుకుంటున్న ఉపాసన చరణ్ ను పెళ్లాడిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. బాడీ షేమింగ్ కు గురైంది. అయినా ఉపాసన ఎక్కడా రాజీపడలేదు. వాటిని ఏవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉంటూ అందరి మన్ననలు పొందింది. కానీ, ఆ అవమానాలను మాత్రం మర్చిపోలేదని చెప్తుంది ఉపాసన.
ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించిన జయదేవ్ ఉనాద్కట్
ఐపీఎల్ చరిత్రలో భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక జట్ల తరపున ఆడిన ఆటగాడిగా జయదేవ్ నిలిచాడు. ఇప్పటివరకూ ఇతడు ఐపీఎల్‌లో మొత్తం 7 జట్ల తరఫున ఆడాడు. తొలుత 2010లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఇతడు ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అనంతరం 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టు తరఫున ఆ ఒక్క సీజన్ మాత్రమే ఆడిన అతడు.. 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున రంగంలోకి దిగాడు. 2016 సీజన్ వరకూ ఆ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2017లో పుణే సూపర్ జెయింట్స్, 2018లో రాజస్థాన్ రాయల్స్‌కు పప్రాతినిథ్యం వహించాడు. రాజస్థాన్ జట్టుకి కీలక బౌలర్‌గా అవతరించడంతో.. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ యాజమాన్యం అతడ్ని రిటెయిన్ చేసింది. అంటే.. నాలుగు సీజన్ల పాటు రాజస్థాన్ తరఫున అతగడు ఆడాడు. అయితే.. ఐపీఎల్-2022కు ముందు రాజస్థాన్ అతడ్ని రిలీజ్ చేసింది. అప్పుడు నిర్వహించిన మెగా వేలంలో.. ముంబై ఇండియన్స్ జట్టు అతడ్ని కొనుగోలు చేసింది. అయితే.. అతడు పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవడంతో, ముంబై కూడా అతడిని ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు విడిచిపెట్టింది. ఐపీఎల్-2023 మినీ వేలంలో లక్నో జట్టు అతడ్ని సొంతం చేసుకుంది. ఇలా అతడు ఏడు జట్ల తరఫున ఆడిన భారత ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. ఈ జాబితాలో అగ్రస్థానంలో మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇప్పటివరకూ ఫించ్ ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.