NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

14 మంది ప్రధానులు మారారు కానీ ప్రజల తలరాత మారలేదు

స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధానులు మారారని, అయినా దేశ ప్రజల తలరాత మారలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో రైతు సంఘ‌టిత శ‌క్తిని ఏకం చేద్దామ‌ని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్రణీత్ సహా పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతుల పోరాటం న్యాయబద్ధమైనదని, త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని చెప్పారు. చిత్తశుద్ధితో ప‌ని చేస్తే.. తప్పకుండా గెలిచి తీరుతామని అన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నానని, తెలంగాణ‌లో ఏం చేశామో మీరందరూ ఒకసారి చూడండని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించండి అని రైతు నేతల్ని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెల‌ల పాటు పోరాడారని.. ఆ సమయంలో రైతులను ఉగ్రవాదుల‌ని, ఖలీస్తానీలని, వేర్పాటవాదులని విమర్శించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అయితే.. రైతులు వెనకడుగు వేయకుండా తమ పోరాటాన్ని కొనసాగించడంతో, ప్రధాని మోడీ దిగివచ్చిన క్షమాపణ చెప్పారని, ఆ చట్టాలని ఉపసంహరించుకున్నారని తెలిపారు. 750 మంది రైతులు చ‌నిపోతే.. ప్రధాని కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మన దేశంలో దేనికి కొదవ లేదని.. అయినప్పటికీ రైతులు, ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. తెలంగాణ ఏర్పడ‌క ముందు రైతులు, చేనేత‌లు ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహ‌త్యలు చేసుకునేవారని.. రైతుల గోస చూసి తన కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న ఎండలు

మార్చి చివర నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఎండాకాలంపై కీలక సమాచారాన్ని తెలిపింది. ఈ సారి ఎండాకాలం మండేకాలంగా ఉండబోతోందని వెల్లడించింది. భారత్ చాలా ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉండనున్నట్లు తెలిపింది. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాననున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ కాలంలో తూర్పు, వాయువ్య భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువగా వడగాలుల ప్రభావం ఉండబోతోందని అంచానా వేసింది. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వడగాలల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో, వాయువ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కన్నా తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక మిగతా దేశంలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.

ఫేక్ పోస్టులతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది

సోషల్ మీడియా వేదికగా ఫేక్ పోస్టులతో వైసీపీ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. టీడీపీ-జనసేన మధ్య వివాదాలు సృష్టించేందుకు ఫేక్ ప్రచారం చేస్తున్నారు.నిన్న బీజేపీ జాతీయ నాయకుడిపై జరిగిన దాడి వెనుక వైసిపి కిరాయి గుండాల హస్తం ఉంది. ఇప్పటికైనా బీజేపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను గమనించాలి.దేశంలోనే అద్భుత నగరం అమరావతి అని దాన్ని నీరుకార్చారని సాక్షాత్తూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల ఉద్యమం పై వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని ఫూల్స్ చేస్తూనే ఉన్నాడు.98 శాతం హామీలను ఎక్కడ నెరవేర్చారో సమాధానం చెప్పాలి.నవరత్నాలలో ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు.15 లక్షల మంది పేదలకు వివిధ కారణాలతో ఫించన్లు ఎగ్గొట్టారు.కరెంటు ఛార్జీలను పెంచి రూ. 57 వేల కోట్లు దండుకున్నారు.ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ ఖజానా ఒక్కటే నిండుగా ఉంది.ఉద్యోగులు డబ్బులు కూడా జగన్ లూటీ చేశారు.వైసీపీ ఎంపీలు 31 మంది ఢిల్లీలో పైరవీలు చేయడానికే ఉన్నారు.ఈ నాలుగేళ్లలో ఏపీలో ఐదు ఇళ్లు మాత్రమే కట్టారని పార్లమెంటు సాక్షిగా నిరూపితమైంది.సీఎం జగన్ ని గిన్నిస్ బుక్ లో ఎక్కించాలని ఎద్దేవా చేశారు బోండా ఉమామహేశ్వరరావు.

కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు కులాల ఓట్లపై ఫోకస్ పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో కాపు సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. కాసేపట్లో వివిధ కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీకి కాపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు మాజీ మంత్రి చినరాజప్ప. ప్రారంభం నుంచి కాపులు, బీసీలే టీడీపీకి అండగా ఉన్నారు…చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది… గత ఎన్నికల్లో పవన్ పోటీ చేయడంతో రాజకీయంగా నష్టపోయాం… కాపులకు చంద్రబాబు ఎంతో లబ్ది చేకూర్చినా కొందరు దుష్ప్రచారం చేశారన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చినరాజప్ప. కాపు యువత అటూ ఇటూగా ఉన్నా.. కాపు పెద్దలు చంద్రబాబుపై నమ్మకంతో ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే… బీసీలకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్లను చంద్రబాబు కల్పించారన్నారు. మరోవైపు చంద్రబాబు వైసీపీ నేతల తీరుపై మండిపడుతూ ట్వీట్ చేశారు. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వాహనం పై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతి రోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందన్నారు చంద్రబాబు.

ఎస్బీఐకి రూ.95 కోట్ల టోకరా.. నిందితుడి అరెస్ట్

సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ నుంచి రూ.95 కోట్ల రుణం పొందాడు. ఇందుకు గానూ నకిలీ పత్రాలను సమర్పించాడు. ఇదిలా ఉంటే తాను అప్పుగా తీసుకున్న పనికోసం కాకుండా ఇతర పనులకు ఈ లోన్ మొత్తాన్ని మళ్లించినట్లు విచారణలో తేలింది. దీంతో బ్యాంకును మోసం చేసిన వ్యక్తిని మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. నిందితుడైన వ్యాపారవేత్త కౌషిక్ కుమార్ నాథ్ ను మార్చి 30న అరెస్ట్ చేశామని, కోల్‌కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు అతన్ని ఏప్రిల్ 10 వరకు ఈడీ కస్టడీకి పంపిందని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోనే అతిపెద్ద రుణదాగా ఉన్న ఎస్‌బీ‌ఐని రూ.95 కోట్ల మేర మోసం చేసినట్లు ఈడీ తెలిపింది.

వేసిన తాళం వేసినట్టే ఉంది.. 13వేలు పోయాయి.. ఎలుకే చేసిందా?

పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్‌లోంచి రూ.13వేలు దొంగతనం జరిగింది. నగదు డ్రాయర్‌లోని గ్యాప్‌లో ఉన్న కరెన్సీ నోట్లను ఎలుక కొరికి తన గూట్లో పెట్టుకుంది. ఈ ఘటన అంతా షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దుకాణ యజమాని ఎలుకల బొరియ నుంచి రూ.12,700 తీయగలిగాడు. తమ్లుక్ మార్కెట్‌లోని ఓ దుకాణం యజమాని అమల్ కుమార్ మైతీ బుధవారం రాత్రి యథావిధిగా తన దుకాణాన్ని మూసివేసాడు. మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు దుకాణానికి వచ్చి నగదు డ్రాయర్(టెబుల్ డెస్క్) తెరవగా డబ్బులు దొంగతనం జరిగినట్లు గ్రహించాడు. ఆ సమయంలో ఆ షాపులో పనిచేసే ఉద్యోగి ఉన్నాడు. కానీ యజమానికి ఆ ఉద్యోగిపై అనుమానం లేదు. పైగా తన దగ్గరే డ్రాయర్ తాళం ఉంది. డ్రాయర్ ఓపెన్ చేసినట్లు లేదు. నగదు తప్పిపోయిన విషయాన్ని మైతీ ఇతర వ్యాపారులకు తెలియజేశాడు. అందరూ తన దుకాణానికి వచ్చి గుమిగూడారు. ఈ విషయమై చర్చించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

బాల్య జ్ఞాపకాలతో రైల్వే క్వార్టర్స్ నేపథ్యంలో సినిమా!

ప్రముఖ నటుడు, దర్శక రచయిత తనికెళ్ళ భరణి బాల్యం, యవ్వన కాలం చిలకలగూడాలోని రైల్వే క్వార్టర్స్ లో గడిచింది. ‘రైల్వే క్వార్డర్స్ అంటే మినీ ఇండియా అని, అప్పట్లో తమ ఇంటి చుట్టూ అన్ని కులాల, అన్ని మతాల, ప్రాంతాల వాళ్ళు ఉండేవారని, యుక్తవయసు వచ్చే వరకూ కులాల పేరుతో జనాలకు కొట్టుకుంటారనే విషయమే తనకు తెలియద’ని తనికెళ్ళ భరణి చెప్పారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితి తనికెళ్ళ భరణికి ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేసి, ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘రైల్వే క్వార్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని ‘చిలకలగూడ, రైల్వే క్వార్టర్స్ 221/1′ పేరుతో సినిమాగా తీయాలన్నది తన కోరిక’ అని చెప్పారు.రైల్వే డిపార్ట్ మెంట్ లో పనిచేసిన తన తండ్రిని, సోదరుడిని తలుచుకున్నారు. తన తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్లే తాను మూడుసార్లు దేశవ్యాప్తంగా పర్యటించగలిగానని, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ రైలులో ప్రయాణం చేయడానికి ప్రాధాన్యమిస్తాన’ని అన్నారు. తాను రాసిన పలు నాటకాల తొలి ప్రదర్శన బోయిగూడాలోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో జరిగాయని, ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తన కళ్ళ ముందే రైల్ నిలయం నిర్మాణం జరిగిందని, ఈ వేదిక మీద కూడా పలు ప్రదర్శనలు ఇచ్చానని అన్నారు. ‘ఇంతవరకూ ఎన్నో సత్కారాలు పొందినా, జ్ఞాపికలను అందుకున్నా… ఈ రోజున లలిత కళాసమితి ఇచ్చిన 1854 నాటి మొట్ట మొదటి రైల్వే ఇంజిన్ మోడల్, ఫేరీ క్వీన్ జ్ఞానపీఠ పురస్కారం లాంటిద’ని హర్షధ్వానాల మధ్య తెలిపారు.

తొలి వికెట్ సమర్పించుకున్న పంజాబ్

క్రికెట్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌ నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే.. నిన్న తొలి మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఇవాళ రెండు మ్యాచ్‌ ఉండగా.. తొలి మ్యాచ్‌ కోల్‌కతా, పంజాబ్‌ జట్ల ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ను ఎంచుకున్నారు. మ్యాచ్‌కు ముందు మొహాలీలో వర్షం పడటంతో.. పిచ్‌లో ఉన్న తేమ‌ను వాడుకోవాల‌నుకుంటున్న‌ట్లు కేకేఆర్ కెప్టెన్ రాణా తెలిపాడు. కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం సంతోషంగా ఉందని తెలిపారు. అయితే.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్‌ సింగ్‌.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 23/1 గా ఉంది.