NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

వివేకా హత్యకేసు విచారణకు కొత్త సిట్

వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని, ఏప్రిల్‌ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం. కొత్త సిట్‌ ని ఏర్పాటు చేస్తూ… సుప్రీంకోర్టు ముందు ప్రతిపాదన పెట్టింది సిబిఐ. కొత్త సిట్‌లో ఎస్పి వికాస్‌ సింగ్‌, అడిషనల్‌ ఎస్పీ ముకేష్‌ కుమార్‌, ఇన్స్పెకర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, సబ్‌ ఇన్స్పెక్టర్‌ అంకిత్‌ యాదవ్‌ ఉన్నారు. సిబిఐ డిఐజి కేఆర్‌ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్‌ పని చేస్తుందని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. వివేకా హత్యకేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తప్పించింది సిబిఐ. ఆరు నెలలలోపు ట్రయల్‌ మొదలుకాక పోతే… సాధారణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకుంటాం అని దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలో దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే అదనపు ఛార్జ్ షీట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో నిందితునిగా ఉన్న శివశంకర్ భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

ప్రాణాలు కాపాడే మందుల కోసం అల్లాడుతున్న పాక్

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు తంటాలు పడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన మందుల కొరతతో అల్లాడుతోంది. పాకిస్తాన్‌లోని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క వివాదాస్పద ధరల విధానం మరియు క్షీణిస్తున్న స్థానిక కరెన్సీ కారణంగా ఇతర దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రాణాలు కాపాడే మందుల కొరతను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఔషధ విధానం కూడా మందుల ధరల పెరుగుదల, కొరతను ఎదుర్కొంటోంది. డాలర్-రూపాయి వ్యత్యాసం కారణంగా విక్రేతలు తమ సరఫరాను నిలిపేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, సంతానోత్పత్తి మందులు, అనస్థీషియా గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నాయి. సిరప్ లు, ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నప్పటికీ, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులను ఇండియా, రష్యా, చైనా, యూరప్, అమెరికా, టర్కీ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది.

ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు

కేంద్రం ఓబీసీ వర్గీకరణ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన కులాల (ఓబీసీలు) వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ వెల్లడించారు. ఓబీసీ వర్గీకరణ కోసం నియమించిన రోహిణి కమిషన్ కాలపరిమితిని పొడిగించారా? కమిషన్ కోరకుండానే గడువు పొడిగించడానికి కారణాలేమిటి? ఇప్పటివరకు ఎన్ని పర్యాయాలు కమిషన్ కాలపరిమితిని పొడిగించారు? రోహిణి కమిషన్ పనిని ఎప్పటికి పూర్తి చేసి నివేదిక సమర్పిస్తుందని రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ కోవిడ్ మహమ్మారి ప్రభావంతో దేశవ్యాప్త ఆంక్షల కారణంగా కమిషన్ నిర్ణీత గడువులోగా పని పూర్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం కాలపరిమితిని పొడిగించిందని మంత్రి తెలిపారు.కమిషన్ పదవీకాలం ఇప్పటి వరకు 14సార్లు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం కేంద్రం వద్దనున్న ఓబీసీ జాబితాలో వర్గీకరణకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతను నివృత్తి చేసుకుని జాబితాను పూర్తిస్థాయిలో ఖరారు చేసేందుకు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పనిచేస్తోంది. ఈ పని పూర్తికావడానికి సమయం పడుతుందని మంత్రి తెలిపారు. నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడే రోహిణి కమిషన్ పనిచేస్తోందని, కమిషన్ పదవీ కాలపరిమితి ఈ ఏడాది జూలై 31 వరకు ఉందని మంత్రి తెలిపారు.

ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి

ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇంకా నెరవేరలేదు. తాజాగా రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, జనరల్‌ కేటగిరీ రాష్ట్రాల మధ్య పధ్నాల్గవ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసాన్ని చూపలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజిని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ ప్రభుత్వ హామీ పరిస్థితి ఏమిటి అంటూ రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రాలతో కేంద్రం పంచుకునే పన్నుల రాబడి సమాంతరంగా జరగాలన్న ఆర్థిక సంఘం సిఫార్సు మేరకే గతంలో పన్నుల పంపిణీలో 32 శాతం ఉన్న రాష్ట్రాల వాటాను 2015-2020 కాలానికి 42 శాతానికి పెంచినట్లు చెప్పారు. పదిహేనవ ఆర్థిక సంఘం సైతం 2020-2026 కాలానికి ఈ పంపిణీ నిష్పత్తిలో పెద్దగా మార్పులు చేయలేదు. కొత్తగా జమ్మూ, కాశ్మీర్‌ రాష్ట్రంగా అవతరించినందున 42 శాతాన్ని 41 శాతానికి స్వల్పంగా తగ్గించినట్లు తెలిపారు. పన్నుల్లో వాటా పంపిణీ ద్వారా ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటును పూడ్చడం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

దొంగల మాస్టర్ ప్లాన్.. జ్యూవెలరీ షాప్ కి సొరంగం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి జువెలరీని దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే మీరట్ నగరంలోని ఓ నగల దుకాణంలోకి డ్రెయినేజీ నుంచి భారీ సొరంగాన్ని తవ్వారు. 10 అడుగుల సొరంగాన్ని నేరుగా జువెలరీలోకి తవ్వి లక్షల రూపాయల విలువై ఆభరణాలను దోపిడి చేశారు. మంగళవారం ఉదయం షాప్ తెలిసిన తర్వాత యజమాని సొరంగాన్ని చూసి షాక్ తిన్నాడు. షాపులోని ఆభరణాలు అన్నీంటిని దోచుకెళ్లినట్లు గమనించాడు. దొంగతనం గురించి జువెలరీ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు షాపులోకి ప్రవేశించడానికి డ్రైన్ నుంచి ఇటుకలను, మట్టిని తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయల నగదులో దొంగలు పారిపోయారు. అయితే ఎంత మొత్తం అనేదికి ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడితో మీరట్ లోని బంగారం వ్యాపారులు నిరసన తెలిపారు. నగరంలో ఇలాంటి దోపిడి జరగడం ఇది నాలుగోసారి అని వ్యాపారులు ఆరోపించారు. వ్యాపారులు పోలీసులను దోపిడి జరిగిన దుకాణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కంచికామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయ భూములపై పిల్

ఏపీలోని గుంటూరు కంచికామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవస్ధానం భూముల వివాదంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. యలవర్తి కుటుంబీకులు రాసిన గిఫ్ట్ డీడ్ తరువాత 11 సేల్ డీడ్ లు చేసినట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్. భూమిలో 2 ఎకరాలు కళ్యాణోత్సవం నిమిత్తం దేవలయానికి రాసిచ్చిన యలవర్తి కుటుంబీకులు. 400 గజాలు కొనుగోలు అంశంపై చేసిన డాక్యుమెంట్లపై వచ్చిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ప్రొహిబిషన్ లిష్టులోంచీ 400 గజాలు తీసేయాలని ఎండోమెంట్ కమీషనర్ కు అర్జీ పెట్టాడు కొనుగోలుదారుడు హర్ష. అర్జీ ఆధారంగా ఎండోమెంట్ కి సంబంధం లేదంటూ రిజిష్టర్ లోంచీ తీసేయాలంటూ 2022 జనవరిలో ఎండోమెంట్ కమీషనర్ ఆదేశాలు జారీచేశారు. కమీషనర్ ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో ఆలయ భక్తుల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎండోమెంట్ కమీషనర్ ఆదేశాలపై స్టే ఇస్తూ అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.

శ్రీరామనవమికి చేయవలసిన, చేయకూడని పనులేంటి?

సకలగుణాభిరాముడు యావత్ లోకానికి ఆదర్శం. శ్రీరాముడి పెళ్ళంటే ఎంతో వైభవంగా జరుగుతుంది. చైత్ర నవరాత్రుల చివరి రోజైన శ్రీరామ నవమి చైత్ర మాసం శుక్లపక్షం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మిస్తాడు. అందుకే ఆ రోజున శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకలకు రాముని భక్తులు అనేక ఏర్పాట్లు చేస్తుంటారు. రామనవమి హిందువులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొన్ని పనులను అసలే చేయకూడదు. శ్రీరాముడి కల్యాణం చూస్తే సకల పాపాలు పోతాయని, కుటుంబానికి, ఈసమాజానికి అంతా మంచి జరుగుతుందని అంతా నమ్ముతారు.

శ్రీరామనవమికి ఏం చేయాలంటే.. * చాలామంది రాముడి విగ్రహాన్ని ఊయలో ఉంచి రామ నవమి సంబరాలు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
* శ్రీరామనవమి నాడు నిద్రలేచిన వెంటనే భగవంతుడికి దండం పెట్టుకోవాలి.
* అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గత, వర్తమాన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
* రామచరిత మానస్, రామ్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కలిపి పఠించడం మంచిది. రామ కీర్తనలు, భజనలు, స్తోత్రాలు కూడా పఠించాలి.

ఈ ‘చిన్నికృష్ణుడి’కి ‘ట్రిపుల్ ఆర్’కు సంబంధమేంటి!?

i

ఇక్కడ ఒంటికాలిపై కృష్ణుని గెటప్ లో దర్శనమిస్తున్న చిన్నికృష్ణుడు – ఇప్పుడు చిత్రసీమను ఏలేస్తున్నాడు. ఎవరబ్బా ఇతగాడు? ఈ బుడతడి ముఖ కవళికలు చూస్తే బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కదూ! మీ అందరికీ బాగా తెలిసినవాడే! ఆ మాటకొస్తే నేడు యావద్భారతదేశాన్నీ అలరించి, అంతర్జాతీయంగానూ విజయబావుటా ఎగురవేస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’కు ఈ బాలకృష్ణుడికి సంబంధం ఉంది. ఇంత చెప్పినా, అతనెవరో గుర్తు పట్టలేకపోయారా!? బాగా చూడండి… అతనెవరో కాదు మనందరి ‘జక్కన్న’ … దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి! ఈ ఫోటో చూసినవారిలో చాలామంది ముందుగా బాలకృష్ణుడి గెటప్ లో ఉన్నది రాజమౌళి చెల్లెలు, సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ అని భావిస్తారు. ఎంతయినా జీన్స్ కదా! ఇంతకూ రాజమౌళి ఈ గెటప్ లో కనిపించడానికి కారణమేంటి? ఎపుడైనా కృష్ణాష్టమి ఉత్సవాల్లో చిన్నారి రాజమౌళి బాలకృష్ణునిలా ముస్తాబై అలరించాడా? లేక ఏదైనా సినిమా కోసం ఇలా మురిపించాడా? అంటే – అవును అక్షరాలా ఓ సినిమాలో రాజమౌళి ఇలా బాలకృష్ణుని గెటప్ లో నటించారు. చిత్రమేమిటంటే – ఆ సినిమా ఇప్పటి దాకా వెలుగు చూడలేదు. ఇంతకూ ఆ సినిమా టైటిల్ ఏంటి? ఆ చిత్రం పేరు కూడా కృష్ణునికి సంబంధించిందే! ‘పిల్లనగ్రోవి’. భలే బాగుంది కదూ! ఈ చిత్రానికి రాజమౌళి పెదనాన్న, కీరవాణి తండ్రి అయిన శివశక్తిదత్త దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చిన్నారి శ్రీలేఖ కూడా నటించింది. 1980ల మధ్యలో ఈ సినిమా రూపొందిందట! ఇందులో సీనియర్ యాక్టర్ మిక్కిలినేని కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా ఇక్కడ పొందు పరిచాము. అందులో మిక్కిలినేని వద్ద కూర్చుని ఉన్నది చిన్నారి శ్రీలేఖ. వారికి సూచనలిస్తూ నమస్కారబాణంతో కనిపిస్తున్నవారు శివశక్తిదత్త.

ఈరోజు స్టాక్ మార్కెట్.. అన్ని రంగాలు.. ఆశాజనకం..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ బుధవారం పర్వాలేదనిపించింది. రెండు కీలక సూచీలు కూడా చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాయి. అన్ని రంగాల కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ.. సాయంత్రం కూడా లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌.. 346 పాయింట్లు పెరిగి 57 వేల 960 పాయింట్ల వద్ద ఎండ్‌ అయింది.నిఫ్టీ.. 129 పాయింట్లు పెరిగి 17 వేల 80 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 26 కంపెనీలు రాణించాయి. మిగతా నాలుగు కంపెనీలు మాత్రమే వెనకబడ్డాయి. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌ షేర్ల విలువ పెరగ్గా.. రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మరియు ఎయిర్‌టెల్‌ పడిపోయాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ స్టాక్స్‌ వ్యాల్యూ పెరగ్గా.. యూపీఎల్‌, ఎయిర్‌టెల్‌ నేలచూపులు చూశాయి. వ్యక్తిగత షేర్ల విషయానికొస్తే.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 3 శాతానికి పైగా అడ్వాన్స్‌ అయింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌తో వివాదాన్ని పరిష్కరించుకోవటం కలిసొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర 73 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 58 వేల 969 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు స్వల్పంగా 46 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 70 వేల 630 రూపాయలు పలికింది.

Show comments