NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కుంగిపోతున్న జోషిమఠ్.. పీఎంవో ఎమర్జెన్సీ మీటింగ్

ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. శనివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు. ప్రమాదం అంచున ఉన్న ఇళ్లలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే 500 పైగా ఇళ్లు, పలు రోడ్లు బీటలువారాయి. ఇదిలా ఉంటే జోషిమఠ్ సంక్షోభంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉత్తరాఖండ్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు హాజరుకానున్నారు. జోషిమఠ్ పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. పీఎంఓ ఆదివారం మధ్యాహ్నం జోషిమఠ్ పట్టణంలోని పరిణామాల గురించి చర్చించనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రటరీ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జోషిమఠ్ జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం చమోలీ జిల్లాలో సేఫ్టీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అదనంగా రూ.11 కోట్లు విడుదల చేసింది.

వాల్తేరు వీరయ్య టీంకి షాకిచ్చిన శృతి

శృతి హాసన్.. ప్రస్తుతం సంక్రాంతి సినిమాలన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. సంక్రాంతి హీరోలు ఎవరు హిట్ కొట్టినా హీరోయిన్ గా ఆమె కూడా హిట్ అందుకున్నట్లే. చిరు సరసన వాల్తేరు వీరయ్యలో, బాలయ్య సరసన వీరసింహారెడ్డి చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటా పోటీగా నిలవనున్నాయి. ఇక ఇప్పటికే రిలీజైన ఈ రెదను సినిమాల ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి. కాగా, మొన్ననే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది. బాలయ్య తో పాటు శృతి హాసన్ స్పెషల్ ఛాఫర్ లో వెళ్లి ఈవెంట్ లో పాల్గొన్నారు. బాలయ్య ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనతో పనిచేయడం తన అదృష్టమని శృతి చెప్పుకొచ్చింది. ఇక నేడు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ-ఏయు గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ ఈవెంట్ లో శృతి, చిరు గురించి ఏం మాట్లాడుతుందో అని ఎదురుచూస్తున్న వేళ ఆమె చేదు వార్తను చెప్పుకొచ్చింది.

గడ్డపోతారం పరిశ్రమలో మంటలు.. ముగ్గురు మృతి

సంగారెడ్డి జిల్లాలో రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. గడ్డపోతారంలోని మైలాన్ కంపెనీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం (మం) గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ముగ్గురు కార్మికుల తీవ్ర గాయాలు పాలుకాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు కార్మికులు మృతిచెందారు. దీంతో విషాద ఛాయలు అలముకున్నాయి. పరిశ్రమలో మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ఘటనలో మరణించిన ముగ్గురిని గుర్తించారు. మృతులు పారితోష్ (40), రంజిత్ కుమార్ (27), లోకేశ్వర్ రావు(38). బొల్లారం పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో స్ట్రాటిక్ ఎనర్జీతో ఫ్లాష్ ఫైర్ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులు మరణించారు. మృతులంతా కాంట్రాక్టు కార్మికులు. తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాజేష్ ఫోర్క్ లిఫ్ట్ డ్రైవర్ ప్రమాదం జరిగిన తీరుని వివరించారు. ఈ ఘటనకు రాజేష్ ప్రత్యక్ష సాక్షిగా వున్నారు.

కంటి వెలుగుని విజయవంతం చేయాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయాల‌న్నారు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి. మంచిర్యాలలో కంటి వెలుగుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సామూహిక కంటి ప‌రీక్షల ద్వారా ప్రజ‌ల్లో నేత్ర స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే ల‌క్ష్యంతో సీయం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చారన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రతి ఒక్కరికీ కంటి ప‌రీక్షలు నిర్వహించాల‌నే ఉద్దేశ్యంతో ప్రణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్నారు. ఈ నెల 12లోగా మండల పరిషత్‌, మున్సిపాలిటీల్లో సమావేశాలు పూర్తిచేయాలన్నారు. 18న నియోజక‌వర్గాలలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూన్‌ నెలాఖరులోగా అందరికీ పరీక్షలు చేయాలని, అవసరమైనవారికి మందులు, కంటి అద్దాలు అందజేయాలని నిర్దేశించారు. కంటి వెలుగు క్యాంపులపై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు, కార్యక్రమం స‌క్సెస్ అయ్యేలా క్షేత్రస్థాయిలో ఊరు, వాడల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులందరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాల‌ని కోరారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భారత్ జోడో యాత్ర’కు మంచి స్పందన

దక్షిణాదిలో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భారత్ జోడో యాత్ర’కు మంచి స్పందన వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. హర్యానా కురుక్షేత్రలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర భయం, ద్వేషం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి వ్యతిరేకమని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, హిందీ బెల్టులో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. కొంతమంది యాత్రకు ముందు బీజేపీ రాష్ట్రాల్లో ప్రజల నుంచి రెస్పాన్స్ రాదని కొంతమంది చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా ప్రజామద్దతు లభిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో యాత్ర జరుగుతున్న సమయంలో కొంతమంది బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ప్రజా మద్దతు లభించదని అన్నారు.. కానీ ప్రజలు జోడోయాత్రలో భాగమయ్యారని అన్నారు. యాత్ర మహారాష్ట్రకు చేరుకున్నప్పుడు దక్షిణాదితో పోలిస్తే మెరగైన స్పందన వచ్చిందన్నారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందని అక్కడ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. రైతులు, పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ బీజేపీ మనస్సులో ఉందని.. రాహుల్ గాంధీ మనసులో బీజేపీ లేదని, నా ఇమేజ్ గురించి నేను పట్టించుకోనని అన్నారు. భగవద్గీతను గుర్తు చేస్తూ.. మీ పని చేయడం ఫలితం గురించి ఆలోచించకండి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

పోలీసులు ఇచ్చిన టీ నిరాకరించిన అఖిలేష్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లక్నో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిరసనకు దిగారు. ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీస్ జగన్ అగర్వాల్ ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. దీంతో పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లక్నోలోని పోలీస్ ప్రధాన కార్యాలయం మందు నిరసన తెలిపారు. పోలీసులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఖిలేష్ యాదవ్ కు ‘ టీ ’ ఇవ్వడానికి వెళ్లినప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్. పోలీసులు అందించిన టీ తాగేందుకు నిరాకరించారు. ‘‘ నేను టీ తాగను, దీంట్లో విషం కలిస్తే ఎలా..? మిమ్మల్ని నమ్మను’’ అంటూ అఖిలేష్ యాదవ్ అన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మనీష్ జగన్ అగర్వాల్‌ను విడుదల చేయాలని కోరుతూ డీజీపీ ప్రధాన కార్యాలయం గేట్ నంబర్ టూ వెలుపల నిరసన చేపట్టారు.

మన పథకాల వైపు దేశం చూస్తోంది

తెలంగాణలో అమలవుతున్న పథకాల వైపుదేశం చూస్తోందన్నారు విప్ బాల్క సుమన్. తెలంగాణలో ఏ అభివృద్ది జరుగుతుందో పక్కరాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో చర్చ జరగాలి..ప్రజలకు మేలు జరుగుతోంది. రైతు బంధు పెట్టడం వల్ల 8 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది..అక్కడ అమలు చేసుకుంటున్నారు. మిషన్ భగీరథ 12రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నారు. మిషన్ కాకతీయ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి..కంటివెలుగును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మందికి నేరుగా లబ్ధి చేకూర్చిన పథకం కంటి వెలుగు. ఇప్పటివరకు తెలంగాణలో 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కంటి అద్దాలను అందించడం జరిగిందన్నారు. మొదటి విడతలో కలిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి 100 రోజుల్లోనే తెలంగాణలో పూర్తిస్థాయిలో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 200 కోట్లు కేటాయించాము. రాష్ట్రంలో 1500 వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.

టీఎస్‌ఆర్టీసీ ‘జీవా’ వాటర్ బాటిళ్ళ విక్రయం రేపే ప్రారంభం

వినూత్న పథకాలతో ప్రయాణికులకు దగ్గరైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు స్వచ్ఛమయిన తాగునీటిని అందించేందుకు మార్కెట్‌లోకి ఆర్టీసీ బ్రాండ్‌ జీవా (ZIVA) వాటర్‌ బాటిళ్లు ప్రవేశపెట్టింది. ఈ పథకం జనవరి 9వ తేదీన ప్రారంభిస్తున్నట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం లీటర్ బాటిళ్ళు అందుబాటులో ఉంటాయని, త్వరలో 250 ఎంఎల్‌, అర లీటర్‌ బాటిళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా విక్రయాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ జీవా వాటర్‌ బాటిళ్లు ‘స్పింగ్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. స్వచ్ఛమయిన తాగునీటిని ప్రయాణికులకు అందిస్తామని, అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో జీవా వాటర్ బాటిళ్లు విక్రయిస్తామన్నారు.