NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్ న్యూస్

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

విశాఖ గీతం వర్సిటీ మెడికల్ కాలేజీ దగ్గర హై టెన్షన్

విశాఖ గీతం వర్సిటీ మెడికల్ కాలేజీ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విశాఖ ఋషికొండలోని గీతం మెడికల్ కాలేజ్ ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ,పోలీసు యంత్రంగం రంగంలోకి దిగాయి. మెడికల్ కాలేజ్ వైపు రహదారుల ను మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. డీసీపీ సుమీత్ గరుడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను గతంలో తొలగించగా….ఇప్పుడు ఆ భూముల్లో ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 45 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణ జరిగిందని గతంలోనే రెవెన్యూ శాఖ తేల్చింది. గీతం యూనివర్సిటీ చైర్మన్ గా టీడీపీ నేత, బాల కృష్ణ అల్లుడు శ్రీభరత్ వ్యవహరిస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం గీతం భూముల్లోకి వచ్చిందనేది టీడీపీ ఆరోపణ. ఈ నేపథ్యంలో మీడియా సహా బయట వ్యక్తులు ఎవరు యూనివర్సిటీ వైపు వెళ్ల కుండా నియంత్రిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే… రూరల్ ఎమ్మర్వో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఆక్రమణలకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నాం అన్నారు. అప్పుడు బోర్డులు మాత్రమే పెట్టాము. మరల ఆక్రమణ కు గురికాకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు పెన్సింగ్ వేసాం. సర్వే నెంబర్ 37,38 లో 14 ఎకరాలు ప్రభుత్వ భూమి మెడికల్ కళాశాల వద్ద ఉంది. అందులో గీతం ప్రాంగణంలో ఉన్న 5.72 ఎకరాలకు ఫెన్సింగ్ వేశామన్నారు. కోర్టు పరిధిలో 40 ఎకరాల వరకు ఉంది అందులో మేము జోక్యం చేసుకోలేదన్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలి

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం సాధించేందుకు సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారన్నారు మంత్రి విడదల రజినీ. విశాఖలో 16 వ గ్లోబల్ హెల్త్ సమ్మెట్ ను ప్రారంభించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ అరిజన్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు గ్లోబల్ హెల్త్ సమ్మిట్ జరగనుంది. అమెరికాలో భారతీయ వైద్యులు విశాఖలో సదస్సు నిర్వహించడం అభినందనీయం. సౌమ్య స్వామినాథన్ తో సహా వైద్యులు వైద్యం పై ఏపీ ప్రభుత్వం చొరవ పై సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లో అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ఏపీలో అమలును హర్షించారు. అమెరికాలో భారతీయ వైద్యుల సలహాలతో ఏపీలో మెరుగైన వైద్యం పేదలకు అందించే ప్రయత్నం చేస్తాం. సీఎం జగన్ నేతృత్వం లో రాష్ట్రంలో వైద్య పరంగా ముందంజలో ఉన్నామన్నారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులను పునర్నిర్మాణం చేస్తున్నాం అన్నారు మంత్రి విడదల రజిని. ఆరోగ్య శ్రీ ద్వారా పేదవారికి కార్పోరేట్ వైద్యం అందిస్తున్నాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సీఎం జగన్ లక్ష్యం అన్నారు మంత్రి రజిని. నోవాటెల్‌ హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 450 మంది వైద్య నిపుణులు పాల్గొంటున్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టాలి

దేశవ్యాప్తంగా రైతులంతా ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టాలన్నారు మిజోరాం గవర్నర్ హరిబాబు. విశాఖలో మూడు రోజులపాటు జరిగే ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రి మురళీధరన్. ఆ ఆర్గానిక మేళాలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ప్రకృతి వ్యవసాయ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ ఎక్కువగా చిరు ధాన్యాలు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇస్తున్నారు.కేంద్ర మంత్రి మురళీ ధరన్ మాట్లాడుతూ.. భారత దేశం నుండి ప్రపంచ దేశాలకు ఆర్గానిక్ ఉత్పత్తులు జరుగుతున్నాయ్. అనకాపల్లి బెల్లం కు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయికి అనకాపల్లి బెల్లంకి మార్కెట్ అయ్యేలా కృషి చేస్తాం అన్నారు. త్వరలో విశాఖలో జరగనున్న జీ 20 సదస్సు ప్రాంగణంలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన చేపట్టాలన్నారు కేంద్రమంత్రి మురళీ ధరన్. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహిస్తున్నారు.

షాకింగ్ సర్వే.. మనలో 40 శాతం మందికి ఈ సమస్యే..!

మనలో కొందరు, మన చుట్టూ ఉన్నవారిలో మరికొందరు.. మనకు తెలిసినవారు, బంధువులు, స్నేహితులు.. ఇలా అనేక మంది.. చాలా సమస్యలతో బాధపడుతున్నారు.. ఆరోగ్యసమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు.. ఇక, ఆర్థిక సమస్యలైతే చెప్పకరలేదు.. కొందరికి అన్నీ ఉన్నా.. ఏదో తెలియని మానసిక సమస్యలతో బాధపడుతుంటారు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ ఆరేళ్ల క్రితం దేశంలోని 12 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే అనేక ఆందోళనకరమైన అంశాలను వెలికితీసింది.. ఈ సర్వే ప్రకారం 2.7 శాతం ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. భారత దేశంలోని 15 కోట్ల మందికి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కోసం వెంటనే వైద్యం అవసరమని తేల్చేసింది ఆ సర్వే.. సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో 2016లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందుతున్నారని పేర్కొంది. క్రమంగా ఈ సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉందని.. దీనికి బ్రేక్‌లు వేయకపోతే రానున్న పదేళ్ల తర్వాత ప్రపంచంలోనే మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

లష్కరే అనుబంధ సంస్థ “టీఆర్ఎఫ్”పై కేంద్రం బ్యాన్

Trf

కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రారంభించాలని చూస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’(టీఆర్ఎఫ్)పై కేంద్రం నిషేధం విధింంచింది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతోంది. అమాయక పౌరులను, హిందువులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలను, కాశ్మీర్ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాలను పెంపొందించడం, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, ఉగ్రవాదుల చొరబాటు మరియు పాకిస్తాన్ నుండి జమ్మూ కాశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కోసం ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా యువతను రిక్రూట్ చేస్తోందని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. 26/11 ముంబై దాడులకు పాల్పడిన లష్కరే తోయిబాకు ప్రాక్సీగా ఈ సంస్థ పనిచేస్తోంది. తొలిసారిగా 2019లో ది రెసిస్టెంట్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. షేక్ సజ్జాద్ గుల్ దీని కమాండర్ గా పనిచేస్తున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది కేంద్ర హోం శాఖ.

ఏరోబిక్ డ్యాన్స్ తో ఉపయోగాలేంటి? అనర్థాలేంటి?

ఈమధ్యకాలంలో వివిధ అనారోగ్య కారణాల వల్ల వ్యాయామానికి ప్రాధాన్యత పెరిగింది. పెరిగిపోతున్న స్థూలకాయం నుంచి బయటపడడానికి, హెల్తీగా వుండడానికి ఏరోబిక్ డ్యాన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. ఫిట్ నెస్ గా వుండడం వల్ల ఆరోగ్యంతో పాటు శరీరం తేలికగా వుంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఏ ఫిట్‌నెస్ వ్యాయామం ఉత్తమం అనేది మరో క్లిష్టమైన ప్రశ్న. అనేక రకాల ఫిట్‌నెస్ కార్యకలాపాలు అందుబాటులో ఉన్నందున దేనిని ఎంచుకోవాలో చాలామందికి ఇబ్బందిగా వుంటుంది. అన్నింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టం. ఏరోబిక్ డ్యాన్స్ కూడా అటువంటి ఫిట్‌నెస్ యాక్టివిటీలో ఒకటి, ఇది ఇటీవలి కాలంలో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అధిక-తీవ్రత మరియు రిథమిక్ ఏరోబిక్ వ్యాయామం మొత్తం శరీరానికి మంచిది. అంతేకాకుండా, మీరు జిమ్ చేయడం మరియు రన్నింగ్ చేయడం విసుగు చెందితే, మీరు కొంత వినోదం కోసం ఏరోబిక్ డ్యాన్స్‌ని ఎంచుకోవచ్చు. ఏరోబిక్ డ్యాన్స్ చేయడం వల్ల ప్రయోజనాలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. మీరు దేనిని ఎంచుకోవాలి అనేది నిర్ణయించుకోవడంలో మీకు ఈ కథనం ఉపయోగపడుతుంది.

ఫస్ట్ వీక్.. స్టాక్ మార్కెట్ రివ్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త సంవత్సరం మొదటి వారం మెరుపులేమీ లేకుండానే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం ఇన్‌ట్రా డేలోనూ నష్టాలు కొనసాగాయి. రెండు సూచీలు కూడా నేల చూపులే చూశాయి. ఉదయం అతి స్వల్ప లాభాలతో ప్రారంభమైన చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 60 వేల మార్క్‌ నుంచి దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 18 వేల మార్క్‌ నుంచి పతనమైంది.సెన్సెక్స్‌ 452 పాయింట్లు కోల్పోయి 59 వేల 900 వద్ద క్లోజ్‌ అయింది. నిఫ్టీ 126 పాయింట్లు తగ్గి 17 వేల 859 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 5 కంపెనీలు మాత్రమే లాభాల బాటలో నడిచాయి. బాంబే బుర్మా, పీవీఆర్‌, డాబర్‌ ఇండియా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిఫ్టీలోని రాణించిన సంస్థల జాబితాలో బ్రిటానియా, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, మహింద్రా అండ్‌ మహింద్రా.. టాప్‌లో నిలిచాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ బాగా వెనకబడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ హండ్రెడ్‌, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ హండ్రెడ్‌ జీరో పాయింట్‌ 7 శాతం డౌన్‌ అయ్యాయి.

బ్యాంకు దివాళా తీసినా.. మీకు ఐదులక్షలు గ్యారంటీ
గత కొన్నేళ్లుగా.. ఆర్థిక అవకతవకల కారణంగా దేశంలోని చాలా బ్యాంకుల పరిస్థితి దిగజారింది. డబ్బు లావాదేవీలను రిజర్వ్ బ్యాంక్ నిషేధించే స్థాయికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుల ఖాతాదారులే ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనల వల్ల బ్యాంకు దివాళా తీస్తే తమ సొమ్ము ఏమైపోతుందనే ప్రశ్న చాలా మంది ఖాతాదారుల్లో మెదలుతోంది. మీకు ఖాతా ఉన్న ఏదైనా బ్యాంకు మునిగిపోతే, మీకు రూ. 5 లక్షల మొత్తం లభిస్తుంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం, మీరు బ్యాంకు ఖాతాలో 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసి ఉండాలి. ఈ సందర్భంలో మాత్రమే మీకు 5 లక్షల రూపాయలు లభిస్తాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం ప్రకారం, బ్యాంకులో డిపాజిట్ మొత్తం ఐదు లక్షల రూపాయలకు హామీ ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ఈ మొత్తం రూ. 1 లక్ష ఉండగా, 2020 సంవత్సరంలో, ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. అంటే, మీ డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు దివాళా తీస్తే.. ఖాతాలో జమ చేసిన మొత్తం ఐదు లక్షల కంటే ఎక్కువ అయినప్పటికీ, మీకు ఐదు లక్షల రూపాయల మొత్తం తిరిగి వస్తుంది.

హీరో శర్వానంద్ పెళ్లి.. పెళ్ళికూతురు ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తెలంగాణకు చెందిన అమ్మాయితో శర్వా వివాహం జరగనుంది. గత మూడు రోజుల నుంచి శర్వా వివాహం గురించి వార్తలు గుప్పుమంటున్నా వధువు తాలూకు వివరాలు తెలియలేదు. అయితే ఇప్పుడు వధువు వివరాలతో పాటు ఎంగేజ్మెంట్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మాయి పేరు బొజ్జల పద్మ. దివంగత టీడీపీ నేత గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. కాళహస్తికి చెందిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మేనకోడలు. పద్మ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తోంది. కరోనా కారణంగా ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుందని తెలిసింది. ఇక శర్వా- పద్మల వివాహము పెద్దలు కుదిర్చినదే అని తెలుస్తోంది. పెళ్లి కుమార్తె లేదా వారి తరపు బంధువులతో శర్వాకు ఎలాంటి పరిచయాలు లేవని సమాచారం. ఇక ఈ జంట ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబ వర్గాలు వీరి ఎంగేజ్మెంట్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. జనవరి 26 న వీరి ఎంగేజ్మెంట్ అతి తక్కువమంది కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఇక పెళ్లిని వేసవిలో జరగనుందని.. ఇరు కుటుంబ వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట ఫోటోలు బయటికి రానున్నాయి.