పవన్ ఎవరి సైన్యంలో దూరి యుద్ధం చేస్తారు
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్న వారాహిపై అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేసి వైసీపీపై విమర్శలు చేయగా.. తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు నారాహి అంటూ సెటైర్ వేశారు. ఆయన వాహనం కలర్, చొక్కా కలర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎందుకంటే ఆయన కలర్ పసుపు అని అందరికీ తెలిసిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు అని.. ఆయన ప్యాకేజీ స్టార్ అని విమర్శలు చేశారు. అంతేకాకుండా కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం లేవన్నారు. ఎవరి సైన్యంలో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నారని మంత్రి రోజా ప్రశ్నించారు.
ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. 31 మంది అరెస్ట్
రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతిని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 100 మందితో పట్టపగలు యువకులతో వెళ్లి ఇంట్లో వైశాలి అనే యువతిని మిస్టర్ టీ షాప్ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేయడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాలితో తను ప్రేమలో ఉన్నానని తెలిపిన నవీన్ రెడ్డి.. ‘హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. మా వివాహం 2021 ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల దేవాలయంలో జరిగింది. బిడిఎస్ వరకు పెళ్లి ఫోటోలు బయటకు రాకూడదని వైశాలి కండిషన్ పెట్టిందని, మేము జనవరి 2021 నుండి ప్రేమలో ఉన్నామన్నాడు. అంతేకాకుండా.. వైశాలి కుటుంబ సభ్యులు నాతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు నవీన్.
మాండూస్ తుఫాన్ దెబ్బతో తిరుమలలో భక్తుల ఇక్కట్లు
మాండూస్ తుఫాన్ దెబ్బ ఏపీని వణికిస్తోంది. తుఫాన్ కారణంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో విస్తారంగా వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షం కుండపోతగా పడుతూ వుండడంతో శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు తిరుమలలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ తడిసి ముద్దయ్యి పలు చోట్ల నీరు ఏరులై పారుతూ వుంది. రోడ్లపై వ్యాపారం సాగించేవారు దుకాణాలను మూసివేశారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకుంటున్న భక్తులు వర్షానికి ఇబ్బందులకు గురౌతున్నారు. శ్రీవారి భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ అనుమతి ఇచ్చింది. ఒకవైపు వర్షంతో అటునుంచి వెళ్ళే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గదులు పొందిన భక్తులు వర్షానికి గదుల నుంచి బయటకు రాలేక గదులకే పరిమితమవ్వుతున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఇక శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్ లకు చేరుకునేందుకు కూడా భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గొడుగులతో కొంతమంది భక్తులు..వర్షంలో తడూస్తూనే మరికొంత మంది భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లకు చేరుకుంటున్నారు. ఇక స్వామి వారి దర్శనం ముగించుకొని ఆలయం వెలుపలకి వస్తున్న భక్తులు వర్షానికి పరుగులు తీస్తుండగా..మరి కొంత మంది భక్తులు షెడ్ల క్రింద తలదాచుకుంటున్నారు.
ఢిల్లీ, శంషాబాద్ విమానాశ్రయాల్లో భారీగా బంగారం సీజ్
ఎయిర్ పోర్టులు అక్రమ బంగారాం రవాణాకు అడ్డాగా మారుతున్నాయి. ఢిల్లీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో అక్రమ బంగారం పట్టుబడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో బహ్రెయిన్ ప్రయాణీకుడి వద్ద 69 లక్షల విలువ చేసే 1483 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 14 గోల్డ్ బిస్కెట్లను లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశాడా కేటుగాడు. అక్రమ బంగారం రవాణా గుట్టును రట్టు చేసిన కస్టమ్స్ అధికారులు. లగేజ్ బ్యాగ్ స్కానింగ్ బయట పడింది బంగారం. ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇటు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి భారీగా బంగారం పట్టివేశారు. దుబాయ్ ప్రయాణీకుల వద్ద 1.38 కోట్ల విలువ చేసే 3 కేజీల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే యత్నం చేశారు కేటుగాళ్లు. లగేజ్ బ్యాగ్ లో దాచిన బంగారు బిస్కెట్లు, ఆభరణాల గుట్టు రట్టు చేసింది కస్టమ్స్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ లోని కస్టమ్స్ అధికారులు.
నూతన బిల్డింగ్ కావాలని ఉస్మానియా మెడికోల ధర్నా
ఉస్మానియా ఆస్పత్రి నుంచి వైద్య కళాశాల వరకు నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు, పూర్వ విద్యార్థులతో పాటు పలువురు ర్యాలీ నిర్వహించారు. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ‘మాకు కొత్త భవనం కావాలి’, ‘జై ఉస్మానియా’ నినాదాలు చేస్తూ ఆస్పత్రికి చెందిన జూనియర్ వైద్యులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నిజాం నవాబు నిర్మించిన ప్రస్తుత ఆసుపత్రి భవనం 100 సంవత్సరాలకు పైగా ఉందని ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యుడు పేర్కొన్నారు. కొత్త భవనం కావాలని గత 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా నేటికీ స్పందించలేదని వైద్యులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ భవనానికి గతంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య రూ.200 కోట్లు విడుదల చేశారని, ఇంకా నిర్మించాల్సి ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. తమ వేదనను తెలుపుతూ, నిరసనకారులు మాట్లాడుతూ, ప్రస్తుత భవనం పైకప్పు దాదాపు కూలిపోయే దశకు చేరుకుందని, అందువల్ల ఆసుపత్రి ఆవరణలో ఉన్నప్పుడు ఎవరి ప్రాణాపాయం లేకుండా పనిచేయడానికి కొత్త బ్లాక్ అవసరమని చెప్పారు.
సంక్రాంతికి ఊరెళుతున్నారా.. టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వేరే ఊర్లో ఉన్నా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంటుంది. అయితే.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది టీఎస్‌ఆర్టీసీ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 7 నుండి 15 వరకు 4,233 ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇతర పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల మధ్య పనిచేస్తాయి. సంక్రాంతికి రవాణా ఏర్పాట్లపై టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, వీసీ సజ్జనార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీఎస్‌ఆర్టీసీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు తెలిపారు. అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు టీఎస్‌ఆర్టీసీ పత్రికా ప్రకటనలో తెలిపింది.
మరోసారి మారిన క్వాలీఫైయింగ్ రేస్ టైం
హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమాక్స్ పరిసరాల్లో చిరు జల్లులు కురవడంతో ఇప్పటి వరకు జరగాల్సిన ప్రాక్టీస్ రేస్ ఆలస్యం కానుంది. ట్యాంక్ బండ్ దగ్గర నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో మరోసారి క్వాలిఫై రేసింగ్ టైం మారింది. 3 గంటల 10 నిమిషాలకు జరగాల్సిన రేసింగ్ 3 గంటల 45 నిమిషాలకు మార్పు చేశారు అధికారులు. ఒక్కో రేసింగ్ కు 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. అయితే… 5 గంటల తర్వాత లైటింగ్ తగ్గనుండటంతో ఇవాళ ఒక్క రేసింగ్ మాత్రమే జరిగే ఛాన్స్ ఉంది. మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు మూడు క్వాలి ఫై రేసింగ్స్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ కు సాగర్ తీర ప్రాంతంలో కార్ రేసింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే జల్లులు కురవడంతో.. రేస్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రేస్ వీక్షించేందుకు వచ్చినవారు తీవ్ర నిరాశకు చెందారు.
ఇషాన్ డబుల్ సెంచరీ.. మూడో వన్డేలో భారీ స్కోరు
బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎట్టకేలకు జూలు విదిల్చింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది. చిట్టగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడు కెరీర్‌లో చేసిన తొలి వన్డే సెంచరీని చిరస్మరణీయం చేసుకున్నాడు. 131 బంతుల్లో 10 సిక్సర్లు, 24 ఫోర్లతో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. అతడికి విరాట్ కోహ్లీ మంచి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో 44వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ తప్ప జట్టులో మరెవరూ కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారు.ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలం అయ్యాడు. అతడు కేవలం 3 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అటు ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా మారిన కేఎల్ రాహుల్ కూడా వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. విధ్వంసకర సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌పై నెటిషన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే నుంచి ఇషాన్ కిషన్‌ను ఆడించినా సరిపోయేదని కామెంట్ చేస్తున్నారు.