రాబోయేది రైతు ప్రభుత్వమే.. బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కేసీఆర్
రాబోయేది రైతు ప్రభుత్వమే అని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్… కర్నాటకలో జేడీఎస్ కు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామని అన్నారు సీఎం. త్వరలో రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామని తెలిపారు. దేశ పరివర్తన కోసమే బీఆర్‌ఎస్ ఏర్పడిందని పేర్కొన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరుపున ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్‌ఎస్ కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. కుమార స్వామి కర్నాటక సీఎం కావాలని అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి. ఈసీ, టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఈ నెల 8న కేసీఆర్ కు సమాచారం పంపించిన విషయం తెలిసిందే. ఈసీ పంపిన లేఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేశారు. ఈ లేఖను కేసీఆర్ ఈసీకి పంపనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి టీఆర్ఎస్ బీఆర్ ఎస్ అవుతుందన్నారు. ఇక నుంచి టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్ అవుతుంది. బీఆర్ఎస్ పేరుతో ఆ పార్టీ కార్యక్రమాలు సాగుతాయి. పార్టీ జెండాలో గులాబీ జెండాలో భారత మ్యాప్‌ను ఉంచారు.
దేశంలో బీసీ గణన వెంటనే చేయాలి
దేశంలో వెనుకబడిన తరగతులకు జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతి, సంక్షేమం న్యాయబద్ధంగా జరిగేలా చూడాలంటే బీసీల విద్యా, సామాజిక గణన జరగాలి. దీనికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేపట్టి కొత్తగా ఆర్టికల్ 342బీని చేర్చాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సుంకాలు, సర్‌చార్జీల రూపంలో వసూలు చేస్తున్న రెవెన్యూలో రాష్ట్రాలకు కూడా వాటా ఇచ్చేలా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 270, 271, 280ను సవరించాలని కోరుతూ విజయసాయి రెడ్డి మరో రాజ్యాంగ (సవరణ) బిల్లు, 2022ను సభలో ప్రవేశపెట్టారు. దేశ జనాభా 68 కోట్లు ఉన్న సమయంలో వెనుకబడిన తరగతుల వారి సంఖ్య 52 శాతం ఉన్నట్లుగా 1980లో మండల్ కమిషన్ నిర్ధారించింది. ఇప్పుడు దేశ జనాభా 138 కోట్లకు చేరింది. అయినప్పటికీ ఇందులో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తెలియదు. విద్యా, సామాజికపరంగా బీసీల ప్రస్తుత స్థితిగతులు స్పష్టం కావాలంటే వెనుకబడిన కులాల గణన జరపడం అనివార్యం. అప్పుడే వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వం తదనుగణంగా విధానాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతుంది. కాబట్టి బీసీ కులాల గణన జరపాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు.
ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా?
జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ లో బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. టి ఆర్ యస్ రద్దుతో తెలంగాణ కు కెసిఆర్ పీడ పోయిందన్నారు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిండు..ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అని ఆయన ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏం చేసినవో చెప్పాలి. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కేంద్రం రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇచ్చారు కెసిఆర్ డబుల్ బెడ్రూంలు ఇచ్చాడో కేసీఆర్ లెక్క చెప్పాలన్నారు. హామీలు ఏమి నెరవేర్చావో ముఖ్యమంత్రి చెప్పు.. గుజరాత్ లో ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ముఖ్యమంత్రి బండారం బయట పెడతా. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినవ్ ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నవా? అన్నారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుండే వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడడానికి దేశం వదిలిపోయిన వాళ్ళు వేల కోట్ల డబ్బు కెసిఆర్ కు ఫండ్ ఇచ్చారు. విదేశాలకు పోయి వందల మంది జైళ్లలో మగ్గుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం రావాలన్నారు.
గుజరాత్ సీఎం రాజీనామా.. 12న మరోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణం
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు వచ్చి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాజీనామా సమర్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ రేపు ఉదయం 10 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ కోరారు. కొత్త గుజరాత్ కేబినెట్ డిసెంబర్ 12న ముఖ్యమంత్రితో పాటు ప్రమాణం చేయనుంది. ఇందులో డజనుకు పైగా మంత్రులు ప్రమాణం చేస్తారు. గుజరాత్‌లో చారిత్రాత్మకమైన ఆధిక్యత సాధించిన బీజేపీ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12న జరుగుతుందని పేర్కొంది. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. భూపేంద్ర పటేల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం డిసెంబర్ 12న జరుగుతుందని పాటిల్ తెలిపారు.
శ్వాస తీసుకో.. ప్యాకేజ్ వద్దు పవన్
జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదగడానికి కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారానికి వారాహి ప్రచార రధాన్ని కూడా తయారుచేసుకున్న. ఇక ఈ వారాహి రథంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారాహి రథానికి ఆలివ్ గ్రీన్ కలర్ వేయడంపై ఇతర పార్టీకి చెందిన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలివ్ గ్రీన్ ఎందుకు వేశారు.. పసుపు రంగు వేసుకోండి అని కొందరు అంటుండగా.. మరికొందరు ఆ రంగు కేవలం మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు వినియోగించడం నిషిద్ధమని చట్టం స్పష్టంగా చెబుతోందని చెప్పుకొచ్చారు. ఇక వారికి పవన్ కౌంటర్ ఇచ్చాడు. ఆలివ్ గ్రీన్ షర్ట్ ను చూపిస్తూ.. ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా..? లేక ఇది కూడా నిషిద్దమా..? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?” అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్ వేశారు.” శ్వాస తీసుకో.. ప్యాకేజ్ వద్దు” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై జన సైనికులు విరుచుకుపడుతున్నారు
రెండో శనివారం కూడా అందుబాటులో పాస్ పోర్ట్ సేవలు
రెండో శనివారం అయిన రేపు కూడా (డిసెంబర్ 10) పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, బేగంపేట, టోలిచౌకీ, కరీంనగర్, నిజామాబాద్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ ల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని ఆయన వివరించారు. తత్కాల్, సాధారణ పాస్ పోర్ట్ సేవలు రేపు అందుకోవచ్చు. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తత్కాల్ కేటగిరీ కింద ప్రాసెసింగ్ అప్లికేషన్ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం దరఖాస్తుదారులు పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ని చూడవలసిందిగా చెప్పారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్‌లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
నమ్మించి మోసం చేశాడు.. . టాలీవుడ్ విలన్ పై నిర్మాత కేసు
టాలీవుడ్ స్టార్ విలన్స్ లో షాయాజీ షిండే ఒకరు. విలన్ గానే కాకుండా మంచి సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పిస్తున్న షాయాజీ వివాదంలో చిక్కుకున్నాడు.భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ విలన్ ఇటీవల ఒక మరాఠీ సినిమాను ఒప్పుకున్నాడట. ఇక ఆ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న షిండే.. షూటింగ్ కి వస్తానని నమ్మకంగా చెప్పి డేట్స్ ఇచ్చిన సమయంలో మాత్రం షూటింగ్ కు హాజరుకాలేదట. దీంతో సదురు నిర్మాత భారీగా నష్టపోయాడట. కాగా, షూటింగ్ ఎందుకు రాలేదు అని షిండేను అడిగితే సమాధానం చెప్పలేదని, కథ చెప్పేటప్పుడు కొన్ని మార్పులు చేయమన్నాడని, తాము చేయము అనేసరికి సెట్ లోనే అందరిముందు గొడవపడ్డాడని నిర్మాత చెప్పుకొచ్చాడు. అయితే తన కారణంగా సెట్ లో ఆ రోజు షూటింగ్ ఆగిపోయిందని ఆ కారణంగా తాను రూ. 17 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశాడు. దీంతో తనకు నష్టపరిహారం షిండే చెల్లించాలని కోరుతూ సదరు నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. ఈ నష్టం మొత్తం తనకు తిరిగి ఇప్పించాలని పోలీసులతో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్ లోనూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి ఈ వివాదంపై షాయాజీ షిండే ఎలా స్పందిస్తాడో చూడాలి.
క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో టీమిండియా మ్యాచ్ లు
తెలుగు రాష్ట్రాలలో క్రికెట్ ప్రియులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్, విశాఖలకు కూడా మ్యాచ్‌లను కేటాయించింది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి వన్డే ఆడనుండగా… మార్చి 19న విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాలలో రెండు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు స్వయంగా తమ అభిమాన క్రికెటర్లను వీక్షించే అవకాశం ఉంటుంది. జనవరి 3 నుంచి 15 వరకు శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 3న ముంబైలో తొలి టీ20, జనవరి 5న పూణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగుతాయి. జనవరి 10న గౌహతిలో తొలి వన్డే, జనవరి 12న కోల్‌కతాలో రెండో వన్డే, జనవరి 15న త్రివేండ్రంలో మూడో వన్డే జరగనున్నాయి.
వచ్చే ఐపీఎల్ నుంచి న్యూ రూల్.. భారత ఆటగాళ్లకు మాత్రమే…
వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో కొత్త నిబంధన ప్రవేశపెడుతున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ రూల్ భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో బీసీసీఐ కొత్త రూల్ తెచ్చింది. ఈ రూల్ ప్రకారం ఆట ప్రారంభం కావడానికి ముందే ప్రతి జట్టు నలుగురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఆడుతున్న 11 మందిలో ఒకరి స్థానంలో ఈ సబ్‌స్టిట్యూట్లలో ఒకరిని తీసుకోవచ్చు. వాళ్లు కేవలం సబ్‌స్టిట్యూట్‌లా కాకుండా పూర్తి ఆటగాడి తరహాలో ఆడతారు. అంటే సదరు సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే బీసీసీఐ నిబంధన ప్రకారం జట్టులో ఎవరైనా భారత ఆటగాడు లేదా విదేశీ ఆటగాడి స్థానంలో కేవలం భారత ఆటగాడినే సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడానికి కుదరదు. ఒక జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలన్న నిబంధన ప్రకారం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.