మాండస్ తుఫాన్ ఎఫెక్ట్… చెన్నైలో పలు విమానాలు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను రోజురోజుకూ మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. నిన్న తీరం దాటుతుందని అంచనా వేయగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గరలో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట – పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉంటుందని చెబుతున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్‌ఎఫ్, నాలుగు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో తమిళనాడులో ఆరు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై నుండి సింగపూర్, ముంబై వెళ్ళాల్సిన 11 విమానాలను దారి మళ్లించినట్లు తెలుస్తోంది. తూత్తుకుడి, షిరిడీకి వెళ్ళే నాలుగు విమానాలు రద్దు చేశారు.
గుజరాత్ లో బీజేపీ భారీ విజయం.. కారణం అదేనట
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం దక్కడానికి పార్టీ ఇప్పటివరకు చేసిన పనులే కారణమని బీజేపీ వీరంగామ్ అభ్యర్థి, పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో 2019లో ఆర్టికల్ 370 రద్దును కూడా ఆయన హైలైట్ చేశారు. ఈ విజయం బీజేపీ చేసిన పనులకు నిదర్శనమన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్లే ఈ భారీ విజయం సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి బీజేపీలో చేరారు హార్దిక్ పటేల్. కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే వివాదాస్పద ‘ఆర్టికల్ 370’ని 2019 ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే 20 ఏళ్లలో చేయాల్సిన పనులపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో తమకు పోటీనే లేదన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు హార్దిక్ పటేల్‌ను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ కార్యక్రమాలు ప్రారంభం
ఏపీలో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన ఫిషరీస్ యూనివర్శిటీ కార్యకలాపాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని ప్రకటించారు మంత్రి సీదిరి అప్పలరాజు. యూనివర్శిటీ లోగోను ఆవిష్కరించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 2022-23 ఏడాదికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. ఆక్వాలో ఉత్పత్తి వ్యయం తగ్గించటానికి తగిన చర్యలు ఈ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో నిలబడగలిగే పరిస్థితులను కోసం ప్రయత్నిస్తున్నాం అన్నారు. ఈ మధ్యనే హైపవర్ కమిటి కూడా ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఎప్పటికప్పుడు మార్కెట్ రేటు, డిమాండ్లను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రజల అదృష్టం జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు సరైనవి కావన్నారు మంత్రి అప్పలరాజు. చంద్రబాబు హయాంలో కోవిడ్ వచ్చి ఉంటే రాష్ట్రాన్ని వల్లకాడు చేసి ఉండేవాడు. ఈక్వెడార్ వంటి దేశాల్లో అప్పట్లో ఆక్వానే లేదు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం స్ధాపనకు అడుగులు పడిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ తర్వాత ఇది దేశంలో మూడవ ఆక్వా విశ్వవిద్యాలయం కాబోతుంది. ఇందుకోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సరిపల్లి మరియు లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించడం జరిగింది.
ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ
అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు వాళ్ల జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అమెరికాలోని సిటాడెల్ సీఈఓ కెన్నెథ్ సి. గ్రిఫిన్ తమ కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు ఖరీదైన టూర్ ప్యాకేజీకి డబ్బులు చెల్లించారు. దాంతో, వాళ్లంతా ఫ్యామిలీతో కలిసి మూడు రోజులు ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీలో సరదాగా గడిపేందుకు అవకాశం కల్పించారు. అలాగని పదిమంది వందమందికి కాదు.. ఏకంగా 10వేల మంది ఉద్యోగులకు. అది కూడా సొంత డబ్బుతో. ఉద్యోగుల విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, పార్కింగ్ టికెట్లు అన్నిటికీ గ్రిఫిన్ ముందుగానే డబ్బులు చెల్లించినట్లు సిటడెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉద్యోగులు ఎంజాయ్ చేసేందుకు ఫేమస్ రాక్ బ్యాండ్ ఈవెంట్‌ను కూడా గ్రిఫిన్ ఏర్పాటు చేశారు. బ్రిటన్‌కు చెందిన కోల్డ్ ప్లే రాక్‌బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంది.
విశాఖలో రైలు కిందపడి గాయపడ్డ విద్యార్ధిని మృతి
విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో తీవ్రంగా గాయపడి గంటకు పైగా శ్రమించి కాపాడిన విద్యార్దిని ప్రాణాలు దక్కలేదు. రైలు దిగుతూ జారి పడి ట్రైన్ – ప్లాట్ ఫాం మధ్య చిక్కుకుని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శశికళ మృతిచెందింది. నడుము భాగంలో తీవ్రంగా ఒత్తుకుపోవడంతో అవయవాలు దెబ్బతిన్నాయి. అంతర్గత రక్త స్రావం కావడంతో నిన్నటి నుంచి హాస్పిటల్ లో అత్యవసర చికిత్స అందించారు. చివరి క్షణం వరకు పోరాడి మరణించింది శశికళ. ఫ్లాట్ ఫాం కు ట్రైన్ కు మధ్య ఇరుక్కుని బయటకు రాలేక ఆర్తనాదాలు చేసింది విద్యార్ధిని శశికళ. దాదాపు గంటకు పైగా ట్రైన్ ను ఆపేసి ఫ్లాట్ ఫాంను తొలగించి రక్షించారు రైల్వే సిబ్బంది. అయినా శశికళ ప్రాణాలు దక్కకపోవడం విషాదం నింపింది. విశాఖలో ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయి గంటల తరబడి నరకం చూసింది ఆ విద్యార్థిని.. విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ.. దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ అభ్యసిస్తోంది.. రోజులాగే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ లో దువ్వాడ చేరుకున్న ఆమె.. స్టేషన్‌లో రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి దిగుతోంది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపోయింది.. ఊహించని ఈ ఘటనతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన ఆ యువతి గంటల తరబడి నరకం చూసింది.
తిరుపతిలో నలుగురు చిన్నారులు మిస్సింగ్.. పోలీసుల గాలింపు
తిరుపతిలో నలుగురు స్కూల్ విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపుతోంది.. మంగళం జడ్పీ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్కూలుకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. దీంతో వారి తల్లిదండ్రులుభయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలకు బయలుదేరి వారు స్కూలుకు వెళ్లకుండా కపిల తీర్థం వెళ్లారు.అక్కడి నుంచి వారు లీలామహల్ సర్కిల్ కు వచ్చారు. ఆ తర్వాత నలుగురు విద్యార్థులు ఆచూకీ కనబడడంలేదని వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అలిపిరి పోలీసులు. విద్యార్థుల అదృశ్యం కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు . ఎక్కడైనా ఎవరికైనా విద్యార్థులు సమాచారం తెలిస్తే అలిపిరి పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేయాలన్నారు..అయితే ట్రైన్ లో వెళితే ఎలా ఉంటుందో చూడాలని అ సమయంలో కనిపించిన ఓ వార్డు వాలంటీర్ కు విద్యార్థులు చెప్పినట్లు సమాచారం.
కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్.. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం
Bandi Sanjay
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా సీఎం కేసీఆర్‌కు ఓ సవాల్ విసిరారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తేల్చి చెప్పారు. ఒకవేళ నిరూపించకపోతే.. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నట్టు.. మోటార్లకు మీటర్లు పెడతామని బీజేపీ చెప్పలేదని, ఒకవేళ పెడితే దానికి తానే బాధ్యత తీసుకుంటానని అన్నారు. లేని పక్షంలో ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను కేసీఆర్ సంక్షోభంలోకి నెట్టారని.. కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని ఆరోపణలు చేశారు. మేకిన్ ఇండియాపై కేసీఆర్ వేసిన సెటైర్లకు.. మేకిన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుండే చైనా బజార్లకు వస్తువులు వెళుతున్నాయని కౌంటర్ ఇచ్చారు.
క్రిప్టో కరెన్సీ కంటే వేగంగా పతనం.. భారత్‌పై సెహ్వాగ్ సెటైర్
కొంతకాలం నుంచి భారత క్రికెట్ జట్టు ఎంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్న ఆసియా కప్, నిన్న టీ20 వరల్డ్‌కప్, ఇప్పుడు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. ఈ మూడింటిలోనూ అత్యంత చెత్త పెర్ఫార్మెన్స్‌తో భారీ పరాభావాల్ని చవిచూసింది. మరీ ముఖ్యంగా.. బంగ్లా చేతిలో సిరీస్ కోల్పోవడం ప్రతి భారతీయుడ్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇంకో మ్యాచ్ మిగిలుండగానే, బంగ్లాకు సిరీస్‌ను అప్పగించేయడంతో.. టీమిండియాపై దుమ్మెత్తిపోస్తున్నారు. చెప్పుకోవడానికి జట్టులో ప్రతిభావంతులే ఉన్నప్పటికీ.. కనీస పోరాట పటిమ కనబర్చడం లేదంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో టీమిండియాపై సెటైర్ వేశాడు. ‘‘మన టీమిండియా ప్రదర్శన క్రిప్టో కరెన్సీ కంటే దారుణంగా పతనమవుతోంది. భారత జట్టుని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ మాటతో భారత అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. ఇది పురుషుల వన్డేల్లో టీమిండియాకు 436వ ఓటమిని, ప్రపంచంలోనే ఇది అత్యంత చెత్త రికార్డ్ అంటూ.. ఫ్యాన్స్ కొన్ని గణాంకాలకు షేర్ చేస్తున్నారు. మీలాంటి విధ్వంసకర ఆటగాడు జట్టులో లేని లోటు కనిపిస్తోందంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. సెహ్వాగ్ చెప్పినట్టు.. జట్టులో చాలా మార్పులు చేయాలని, ఆటగాళ్లు ఫిట్నెస్‌పై కూడా ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు