NTV Telugu Site icon

Top Headlines @5 PM: టాప్ న్యూస్

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

ప్రధాని మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు.. రోడ్ షోపై రచ్చ
గుజరాత్ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. ఈనెల 8న గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేసేందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారని.. నేను దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాని.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అభినందిస్తున్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

రాయలసీమ ప్రజల ఆకాంక్షలను జగన్ నెరవేర్చారు
రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్ ముందున్నారన్నారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రజలలో హై కోర్టు పెట్టాలని కోరిక చూసి ఆశ్చర్యపోతున్నాం. రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్ నెరవేర్చారు…వికేంద్రీకరణను అందరు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కర్నూలులో వచ్చి రాజధాని కావాలా అని హేళన చేశారు. రాయలసీమకు న్యాయం చేస్తాం అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు… తన మనుషులతో కోర్టులో కేసులు వేసి కర్నూలుకు హై కోర్టు రాకుండా చేయాలనీ చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. దేవుడు లాంటి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చేపట్టారు….అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరితే టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతిని, అని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేస్తాం. కావాలనే ఈ సభ దుష్ప్రచారం చేస్తున్నారు

రాయలసీమ గర్జన రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం
ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ గర్జన పేరుతో రాయలసీమ పై మరోసారి మోసానికి తెగబడుతోందని మండిపడ్డారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అన్నారు. వైసీపీ రాయలసీమను అభివృద్ధి చేయలేక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక రాయలసీమ గర్జన పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొత్త నాటకానికి తెర లేపడం సిగ్గుచేటన్నారు. అన్యాయానికి గురైన వాళ్ళు నిరసన తెలుపుతూ సభలు పెడతారు..! నేడు ” రాయలసీమకు అన్యాయం చేసినవాళ్లే సభలు పెట్టి నిరసన తెలపడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలిపింది మొదటగా బీజేపీయే అన్నారు. వైస్సార్సీపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలకు చెబుతూ మోసం చేస్తోంది. మీకు చిత్తశుద్ధి ఉంటే – హైకోర్టు కర్నూల్లో పెడతామని ఇంతవరకు ‘ కేంద్రానికి, సుప్రీంకోర్టుకు, మంత్రిత్వ శాఖకు కు గత 3 సంవత్సరాలలో ఎందుకు ప్రతిపాదనలు పంపలేదు. గత వారంలో సుప్రీంకోర్టు లో ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్ హైకోర్టు అమరావతిలోనే ఉండాలన్నది ప్రభుత్వ కోరిక’ అని చెప్పింది నిజం కాదా? అన్నారు. మీకు రాయలసీమ న్యాయ రాజధాని ఏర్పాటు పై చిత్తశుద్ధి ఉంటే కర్నూలు లో ఏర్పాటు కావలసిన జ్యుడీషియల్ అకాడమీని మంగళగిరికి ఎందుకు తరలించారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు ఊరట
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో ప్రారంభమైన విచారణ ప్రారంభమైంది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ జగ్గూ స్వామి వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. బీఎల్ సంతోష్ కి ఇచ్చిన 41 CRPC నోటీసులపై విచారణ కొనసాగుతోంది. నేటితో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై స్టే ముగియనుంది. దీంతో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి హైకోర్టుకి చేరుకున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన స్టేను హైకోర్టు ఈ నెల 13వరకు పొడిగించింది. బీఎల్ సంతోష్ నోటీసులఫై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే గడువు నేటితో ముగిసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గుస్వామి సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు నోటీసులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ‌్యంలో రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది.

జోగిపేటలో టెన్షన్ టెన్షన్.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వేడుకలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రాజనర్సింహ బర్త్ డే సందర్భంగా జోగిపేట బైపాస్ రోడ్డులో అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేశారు. అయితే ఈ ర్యాలీ తీస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను జెండా కర్రలతో చితకబాదారు. ఈ దాడిపై నిరసన తెలుపుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఒకరై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. పోటాపోటీగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రేపు ఆందోల్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు అంటిస్తున్న క్రమంలో.. రాజనర్సింహ బర్త్ డే ర్యాలీ అటువైపుగా వచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పోస్టర్లను చింపేసి, కార్యకర్తలపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఓ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి బైకును దగ్ధం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాని చేరి మంటలను అదుపులోకి తెచ్చారు.

కోవిడ్ మానవ నిర్మిత వైరస్.. సంచలన విషయాలు వెల్లడి
గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కోవిడ్ -19. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పాటు ఆరోగ్య వ్యవస్థలను సర్వనాశనం చేసింది. లక్షల సంఖ్యలో ప్రజల్ని బలి తీసుకుంది. ఇప్పటీకీ దాని ప్రభావం తగ్గలేదు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. వ్యాధి తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇకపై కోవిడ్-19తో సహజీవనం చేయాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, మళ్లీ ఓమిక్రాన్ లో సబ్ వేరియంట్లుగా రూపాంతరం చెందుతూనే ప్రజలపై దాడి చేస్తోంది. ఇదిలా ఉంటే యూఎస్ఏకు చెందిన సైంటిస్టు ఆండ్రూ హఫ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను రాసిన తాజా పుస్తకం ‘‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’’ అనే పుస్తకంలో ఈ విషయాలను తెలియజేశారు. కోవిడ్-19 ‘‘ మానన నిర్మిత వైరస్’’ అని అన్నారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిర్వహణలో, ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న పరిశోధనా కేంద్రం వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యుఐవి) లీక్ అయిందని.. ఆండ్రూ హఫ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. గతంలో ఆండ్రూ హఫ్ వ్యూహాన్ ల్యాబులో పనిచేశారు.

జొమాటో కీలక నిర్ణయం… వేలమందికి ఉద్వాసన
ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది. పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు, సోషల్ మీడియా సైట్లు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో జొమాటో సైతం అదే బాట పడుతోంది. పెర్ఫార్మెన్స్ ఆధారంగా తొలగిస్తుంది. జొమాటోలో ప్రస్తుతం మొత్తం 3 వేల 800 మంది ఉద్యోగులున్నారు. 30 శాతం మందిని.. అంటే.. కనీసం వెయ్యి మందిని ఇంటికే పరిమితం చేస్తారు. 2020వ సంవత్సరం మే నెలలో కూడా జొమాటో కొవిడ్ నేపథ్యంలో 520 మందిని కొలవుల నుంచి తీసేసింది.

తాబేలుకి 190వ బర్త్ డే.. ఘనంగా వేడుక
ఆ తాబేలు పేరు జోనాథన్ దాని వయసు అక్షరాల 190సంవత్సరాలు. భూమ్మీద అత్యధిక వయసున్న ప్రాణిగా జోనాథన్‌ పేరు ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ఇది మగ తాబేలు. ఇటీవలే అది తన 190వ పుట్టిన రోజు వేడుకలను వైభవంగా జరుపుకుంది. ఇక.. సౌత్‌ అట్లాంటిక్‌లోని మారుమూల ద్వీపం సెయింట్‌ హెలెనాలో జోనాథన్‌కు పుట్టిన రోజు వేడుకలకు వేదికైంది.  ఈ ప్రాంతంలోనే ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌.. తన ఆఖరిరోజుల్ని గడిపి 1821లో కన్నుమూశారు. అది ఎప్పుడు పుట్టిందనేది శాస్త్రీయంగా నమోదు చేయనప్పటికీ 1832లో ఇది గుడ్డు నుంచి బయటకు వచ్చి ఉంటుందని.. దానిపై ఉండే డొప్ప ఆధారంగా వయసుపై ఓ అంచనాకి వచ్చారు పరిశోధకులు. తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్ నుంచి యాభై ఏళ్ల వయసులో జోనాథన్‌ను.. యూకే ఓవర్సీస్‌ సరిహద్దులకు తీసుకువచ్చారు. 1882లో యాభై ఏళ్ల వయసున్న ఈ తాబేలును.. సర్‌ విలియమ్‌ గ్రే విల్సన్‌కు కానుకగా అందించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ద్వీపానికి గవర్నర్‌ అయ్యారు. అప్పటి నుంచి సెయింట్‌ హెలెనా గవర్నర్‌ అధికార భవనంలోని మొక్కల సంరక్షణ కేంద్రంలో ఇది ఉంచబడుతోంది.