ఢిల్లీ విజయం తర్వాత కేజ్రీవాల్ భావోద్వేగం.. మోడీజీ మీ ఆశీస్సులు కావాలి
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గండికొట్టింది. ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాల్లో ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తంగా 134 స్థానాలను, బీజేపీ 104 స్థానాలను, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విజయంపై ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ విజయాన్ని కట్టబెట్టినందుకు ఢిల్లీ ప్రజలు అభినందిస్తున్నానని.. మార్పు తీసుకువచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర ముఖ్యనాయకులతో కలిసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేయడానికి బీజేపీ, కాంగ్రెస్ సహకారాన్ని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుతున్నానని ఆయన అన్నారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్ధాలని ఆయన అన్నారు. ఈ రోజు ఢిల్లీ ప్రజలు యావత్ దేశానికి సందేశం ఇచ్చారని కేజ్రీవాల్ అన్నారు.
సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది.. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సీఎం జగన్‌కు భయం ఎందుకు? అని నిలదీశారు.. పోరాటం చేసి వైఎస్ జన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ, ఇప్పుడు జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందన్నారు.. అయితే, ఇప్పటికైనా ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై జగన్ పోరాటం చేయాలని సూచించారు ఉండవల్లి. సీఎం జగన్‌కు మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు .. కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రం రాజీ పడకూడదు అని హితవుపలికారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తుది విచారణ జరగనుంది.. ఆరోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వేయాలని సూచించారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్. విభజన బిల్లు పాస్ చేసే సమయంలో రాజ్యసభలో టెలీ కాస్టింగ్ ఆపివేశారు.. రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీర్మానించారు. ఆనాడు రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక డివిజన్ చేశామని వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు ఉండవల్లి..
ఆభూముల్ని లాక్కున్నారు.. ధరణిపై యుద్ధం చేస్తా
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇందిరా గాంధీ ఇచ్చిన భూములను పరిశ్రమల పేరుతో లాక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. ధరణిపై తాను గ్రామగ్రామాన యుద్ధం చేస్తానని హెచ్చరించారు. పంజాగుట్టలో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్నే తొలగించినప్పుడు.. రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉండవచ్చా? అని నిలదీశారు. అమలాపురం నుండి తాను అంబేద్కర్ విగ్రహాన్ని తెప్పించానని.. అయితే ఆ విగ్రహాన్ని జైల్లో పెట్టి, తనపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాగుట్టలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిందన్న ఆయన.. వైఎస్సార్ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంటే, ఆమెకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. షర్మిల గురించి వాళ్ళ అన్నతో ప్రధాని మోడీ మాట్లాడారని, షర్మిలతో మోడీ మాట్లాడటాన్ని బట్టి చూస్తుంటే.. ఆ బాణం వదిలింది జగనేనని స్పష్టమవుతోందని అన్నారు.
కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ కుట్ర
కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పన్నాగం పన్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లను ఈడీ ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిగినప్పుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రం ఎందుకు మినహాయింపు? అని నిలదీశారు. కవిత ఇంటికే వెళ్లి ఎందుకు విచారణ చేయాలి? సీబీఐ ఆఫీస్‌కు ఎందుకు పిలవడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని బట్టే.. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యారన్న విషయం స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో విద్య చాలా కాస్ట్లీ అయిపోయిందని, ఎంతోమంది విద్యార్థులు తన వద్దకు సహాయం కోసం వస్తున్నారని వెంకట్‌రెడ్డి అన్నారు. కేవలం నాలుగు ఫ్లైఓవర్‌లు, రెండు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి అయిపోదని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొని, అదే తమ బలంగా టీఆర్ఎస్ భావిస్తోందని మండిపడ్డారు. ఇకపోతే.. కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికే టికెట్ దక్కుదుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా.. కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చూస్తోందన్నారు.
ముదిరిన సరిహద్దు వివాదం…కర్ణాటకకు మహారాష్ట్ర బస్సులు బంద్
కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దు వివాదం రోజురోజుకు ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారింది ఈ వివాదం. ఇప్పటికే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, కర్ణాటక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య మాటల తూటాలు పేలాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యలకు బెలగావి కేంద్రంగా మారింది. అయితే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్ కోట్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాలు తమకు సరైన ప్రాథమిక సౌకర్యాలు లేవని.. తమను కర్ణాటక ప్రాంతంలో కలపాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం బొమ్మై ప్రస్తావించడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రాంతాలకు తమ బస్సులను నిలిపివేసింది. మహారాష్ట్ర ఆర్టీసీ బుధవారం కర్ణాటక ప్రాంతాలకు సేవలను రద్దు చేసింది. దాడులు జరిగేందుకు అవకాశం ఉందనే ఇంటెలిజెన్స్ నివేదిక వల్ల కర్ణాటక ప్రాంతాలకు బస్సులను నిలిపివేశారు. ప్రయాణికుల భద్రతపై పోలీసుల నుంచి హామీ వచ్చిన తర్వాతే బస్సులను పునరుద్ధరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే పూణేలోని కర్ణాటక నెంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ బస్సుపై శివసేన (ఉద్ధవ్) వర్గం దాడికి పాల్పడింది. ఇక కర్ణాటక బెలగావిలో మహారాష్ట్ర లారీపై ఆందోళనకారులు దాడులు చేశారు.
అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం
ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతం యొక్క ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి మరియు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాలను డిసెంబరు 08 ఉదయం నాటికి చేరుకుంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు తదుపరి 48 గంటలు కొనసాగుతుంది . రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ. ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గురువారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. రెండురోజుల తర్వాత తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అది జయహో బీసీ కాదు.. భయహో బీసీ సభ
వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన జయహో బీసీ సభపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన వైసిపి ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నామని బీసీ సభ పెట్టారు. జయహో బీసీ కాదు..భయహో బీసీ సభ పెట్టాలి. మా పాలనలో బీసీలను భయపెడతాం అని భయహో బీసీ సభ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. నిధులు,వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను మోసం చేశారు..50 శాతం పైగా ఉన్న బీసీలకు వైసిపి ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత, పద్మశాలి,యాదవులకు టికెట్లు ఇవ్వలేదు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుంది. రామచంద్రయాదవ్ పై దాడికి ముందు క్షమాపణలు చెప్పాలి. అలంకార ప్రాయమైన పదవులతో బీసీలకు ఒరిగింది ఏమి లేదన్నారు ఎంపీ జీవీఎల్. వైసీపీ పాలనలో భయ బ్రాంతులకు గురి చేసిన బీసీలకు క్షమాపణలు చెప్పాలి. ..లేదంటే భవిష్యత్ లో బీసీలు వైసీపీని నమ్మరన్నారు జీవీఎల్. ఏపీలో జగన్ ప్రభుత్వం ఇవాళ భారీ ఎత్తున బీసీ సభ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
15ఏళ్ళ బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీ మునిసిపోల్స్ లో జెండా ఎగరేసిన ఆప్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించి తన మార్క్‌ను చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 250 వార్డులకు గానూ మ్యాజిక్ ఫిగర్ అయిన 126 స్థానాల కన్నా ఎక్కువ వార్డులలో విజయం సాధించింది. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ ఘోర పరాభవం తప్పదు అని అంచనా వేసినా ఆప్‌కు కాస్త గట్టిగానే పోటీ ఇచ్చింది. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా.. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. 250 వార్డులు గల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈనెల 4న పోలింగ్ జరగగా 50.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఆప్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ పాలించింది.