ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదు
రాయల తెలంగాణ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందని.. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ అభివృద్ధికి నిదర్శనమన్నారు. “తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టే సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని కేసీఆర్ గతంలోనే చెప్పారు. పరిపాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి. పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్రగా మార్చుకోండి. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.వెనుకబాటుకు కారణమైన పరిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలి. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలి.” అని మంత్రి జగదీష్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు సూచించారు.
కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అనంతరం సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. రైలులోని ఒక కోచ్‌లో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా రైలు లోపల విద్యార్థులతో సంభాషిస్తున్నప్పుడు ప్రధాని వెంట ఉన్నారు.చిన్నారులు మోదీ పెయింటింగ్స్, స్కెచ్‌లు, తాము రూపొందించిన వందే భారత్ రైలును చూపించారు. రైలును ప్రధాని జెండా ఊపి చూడడానికి వందలాది మంది ప్రజలు ఎదురుగా ప్లాట్‌ఫారమ్‌పై కూడా గుమిగూడారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాష్ట్ర రాజధానిని కేరళలోని ఉత్తర-అత్యంత కాసరగోడ్ జిల్లాతో కలుపుతుంది.
వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ?
కడప జిల్లా ప్రొద్దుటూరులో వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం అంటూ టిడిపి నేతలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. రాత్రి కి రాత్రి పట్టణంలో వాల్ పోస్టర్ల అతికించారు గుర్తు తెలియని వ్యక్తులు.పోస్టర్ లలో వై.యస్.వివేకా, చంద్రబాబు, ముఖ్య నేతల ఫోటోల ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. పట్టణంలోని ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి
హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు పులివెందులకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ అవినాష్. ప్రతి సోమవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ రోజు ప్రజాదర్బార్ లో వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొంటున్నట్లు కార్యకర్తలకు సమాచారం అందించారు సీఎం క్యాంప్ కార్యాలయం అధికారులు.ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతారా? లేదా? అనే సందిగ్థత తొలుత ఏర్పడింది. హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి…ఇవాళ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారించనుంది హైకోర్టు.హైకోర్టు విచారణ తరువాత సీబిఐకి వస్తారా లేక ముందే వస్తారా అన్న అంశంపై ఉత్కంఠకు తెరపడింది. ..మరోవైపు హైదరాబాద్ లోని అవినాష్ రెడ్డి ఉంటున్న ఇంటికి ఉదయం భారీగా చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు ఆయన పులివెందులకు బయలుదేరడంతో అక్కడినించి వెనుతిరిగారు. సోమవారం అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది సుప్రీంకోర్టు.. అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. మరోవైపు.. జూన్ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును ఈ సందర్భంగా పొడిగించింది సీజేఐ ధర్మాసనం.
28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భూమి పూజ
ఆంధ్రుల ఆరాధ్యదైవం, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడ సిద్ధమవుతోంది. ఈ నెల 28వ తేదీన విజయవాడకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలయ్య రానున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు రజనీకాంత్, బాలయ్య, చంద్రబాబు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేయనున్నారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ. కార్యక్రమం నిర్వహించే ప్రాంగణంలో పనులు ప్రారంభిస్తూ భూమి పూజ చేశారు కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్, టీడీపీ నేతలు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సావనీర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.ఈ నెల 28వ తేదీన జరిగే సభకు చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ వస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరిస్తాం అన్నారు. ఎన్టీఆర్ వెబ్ సైట్, సావనీర్ హైదరాబాద్ లో త్వరలోనే ఆవిష్కరిస్తాం అన్నారు. ఎన్టీఆర్ యాప్ ను నారా లోకేష్ ప్రారంభిస్తారు.రామారావు గారికి రామారావుగారే సాటి.సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు. ఎనిమిది నెలలుగా మా కమిటీ వీటి మీద పని చేసింది. నాజర్ అబ్బాయి బాబ్జీతో ఎన్టీఆర్ చరిత్ర పై బుర్ర కథ. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆరోజు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. సీనియర్ జర్నలిస్టు వెంకట నారాయణ ఈపుస్తకాన్ని రాశారు. టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటేనే ఒక చరిత్ర. సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక శైలి ఎన్టీఆర్ ది.
పచ్చబొట్టు చెరిగిపోదులే.. ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి నిరసన
ప్రేమించానని వెంటపడి.. తీరా ఓకే అన్నాక.. పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రేమ బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. ప్రేమ పేరుతో వెంటపడి.. సరే నన్నాక.. ఆరేళ్లకుపైగా కాలం కలసి మెలసి తిరిగి ఆ తర్వాత మొహం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రియుడితో పెళ్లి జరిపించే వరకు కదిలేది లేదంటూ ఏకంగా ప్రియుడి ఇంటి ముందే నిరసన పోరాటం ప్రారంభించింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు న్యాయపోరాటానికి దిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తూజాల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తూజాల్ పూర్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్, దోమకొండకు చెందిన మౌనికకు డిగ్రీ చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆరేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఒకరి పేరు మరొకరు పచ్చబొట్టు వేసుకునేంతగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామని మౌనిక నాగరాజును అడగడంతో అతన నిరాకరించాడు. తన ఆరేళ్ల ప్రేమను అర్థం చేసుకోమని అతడిని బతిమలాడింది. కానీ అతను ససేమిరా అన్నాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ప్రియుడు నాగరాజు గౌడ్ ఇంటి ఎదుట ప్రియురాలు మౌనిక బైఠాయించింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇలాగే ఇంటి ముందు నిరసన తెలుపుతానని బీష్మించుకు కూర్చుంది. కాబోయే భార్యా భర్తలుగా సమాజంలో చెలామణి అయ్యామని.. ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కంటతడిపెట్టుకుంది. బాధితురాలు చేపట్టిన న్యాయ పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.
పెళ్లైన మహిళకు మెసేజ్‌లు పంపిస్తున్నాడని..
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ముష్కి మహేష్ అదే గ్రామానికి చెందిన నలుగురు నడిరోడ్డుపై బండరాయితో కిరాతకంగా కొట్టి చంపేశారు. ముష్కి మహేష్(28) అనే వ్యక్తి బైక్‌లో పెట్రోల్ పోయించుకున్న వస్తున్న క్రమంలో అడ్డగించిన ఆ నలుగురు దాడికి దిగారు. గొంతు కోసి ఆపై బండ రాయితో తల పగలకొట్టారు. ఆ సమయంలో స్థానికులెవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. పైగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇందారం గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, మహేష్‌కు నడుమ గతంలో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ యువతి తల్లి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మహేష్ ఫోన్ ద్వారా అసభ్య మెసేజ్‌లతో వేధిస్తుండడంతో ఆ కుటుంబం భరించలేకపోయింది. వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో మాటువేసి ఈ ఉదయం మహేష్‌ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు మహేష్‌ను చంపిన నలుగురిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ నువ్వే మా హీరో
సచిన్ టెండూల్కర్.. ఆ తరం. ఈ తరం అని తేడా లేదు.. ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరుపొందిన టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రెండున్నర దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్ లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. పదేళ్లు గడిచినా వాటిలో ఇప్పటికీ కొన్ని చెక్కుచెదరకుండానే ఉన్నాయి. కొన్ని రికార్డులకు కొందరు చేరువైనా.. సచిన్ ను దాటలేకపోయారు. ఇప్పటి జనరేషన్ లో విరాట్ కోహ్లీ మాత్రమే కొన్ని రికార్డులపై కన్నేశాడు. 100 టెస్టులు ఆడటమే గొప్ప అనుకుంటే.. సచిన్ ఏకంగా 200 టెస్టులు ఆడాడు. ఈ విషయంలో ఎవ్వరూ దరిదాపుల్లో లేరు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రమే 168 టెస్టు మ్యాచ్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ అనేది పేరు కాదు.. ఒక ఎమోషన్..! సచిన్ సెంచరీకోసమే ఆడతాడు. సెంచరీ చేసిన మ్యాచ్ లు ఓడిపోతాం. సచిన్ పర్సనల్ కెరియర్ కోసమే ఆడేవాడు. స్వార్ధపరుడు.. అంటూ ఇలా కామెంట్స్ చేసే పిచ్చి పుల్కా గాళ్లకి అసలు క్రికెట్ చూడటం వచ్చా అనే సందేహం వస్తుంది. అత్యధిక సెంచరీల రికార్డు. వన్డేలు (49), టెస్టులు (51) కలిపి 100 సెంచరీలను సచిన్ సాధించాడు. ఈ విషయంలో ఎవ్వరూ సచిన్ దరిదాపుల్లో లేరు. టెస్టుల్లో జాకస్ కలిస్ (45), వన్డేల్లో విరాట్ కోహ్లీ (46) రెండో స్థానంలో ఉన్నారు.అత్యధిక పరుగుల రికార్డు. 463 వన్డేల్లో 18,426 పరుగులు, 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. రెండు ఫార్మాట్లలోనే సచినే తొలి స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 34,357 రన్స్ చేశాడు. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక ప్లేయర్ సంగక్కర 28,016 పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ 25,322 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు.అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ ఏకంగా 264 సార్లు 50, అంతకన్నా ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో వన్డేల్లోనే 145 సార్లు చేశాడు. ఈ జాబితాలోనూ రికీ పాంటింగ్ రెండోస్థానంలో ఉన్నాడు. పాంటింగ్ ఓవరాల్ గా 217 సార్లు 50 స్కోర్లు చేశాడు.
రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవి.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కోసం నిరసన తెలిపిన రెజ్లర్ల అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఈరోజు ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందనను కోరింది. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ మహిళా రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసిన పర్యవేక్షణ ప్యానెల్ కనుగొన్న విషయాలను ప్రభుత్వం బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సోమవారం (ఏప్రిల్ 24) బిజెపి ఎంపి అయిన సింగ్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులపై న్యాయమైన విచారణ కోరుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.