వైఎస్ వివేకా కేసు.. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంలో విచారణ
వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కాసేపటి క్రితం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు, సునీత రెడ్డి తరఫున న్యాయవాది సిద్దార్థ్ లోద్రా వాదనలు వినిపిస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేసే విచారణకు ఆటంకం కలిగించేలా ఉందనే అంశంపై వాదనలు వినిపించనున్నారు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్ద్ లోద్రా. గతంలో సుప్రీంకోర్టు పలు కేసుల్లో ముందస్తు బెయులు ఇవ్వడం, ఇవ్వకపోవడం పై ఇచ్చిన తీర్పులకు భిన్నంగా, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం దృష్టికి సునీతా రెడ్డి తరఫు న్యాయవాది తీసుకురానున్నారు. నిందితుల కుటుంబ సభ్యులు సిబిఐ అధికారులపైనే కేసులు నమోదు చేయడం బెదిరింపులకు పాల్పడ్డారనే అంశాన్ని ధర్మాసనం దృష్టి కి తీసుకురానున్నారు సునీతా రెడ్డి తరఫు న్యాయవాది. పిటీషనర్ సునీతారెడ్డి, ఆమె భర్తే వివేకానంద రెడ్డి హత్యకు కారకులని ఆరోపణలు చేయడం, వారినే విచారణ చేయాలని అవినాష్ కోరడం అభ్యంతరకరమని వాదనలు వినిపించనున్నారు సునీతా రెడ్డి న్యాయవాది. పైగా, తనను విచారణ చేయడాన్ని అవివాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం, విచారణకు సహకరించకపోవడమేనని విచారణ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ధర్మాసనం దృష్టికి తేనున్న పిటిషనర్ న్యాయవాది.
ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. మచిలీపట్నం – విజయవాడ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు ఢీ కొన్నాయి. అయితే, స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రయాణికులు. గూడూరు దగ్గర ఇంద్ర హైటెక్ బస్సు, మార్నింగ్ స్టార్ బస్సు వెనుక నుండి ఢీకొన్న ఘటన ఇది. ఆర్టీసీ బస్సు పూర్తిగా ధ్వంసం అయింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రైవేట్ బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఈ ప్రమాదంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రెండు బస్సులు రోడ్డు పైన ఉండిపోవడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు పోలీసులు. ఎలా జరిగిందనేది తేలాల్చి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవాళ, రేపు పాపికొండల యాత్ర రద్దు
పాపికొండలు అందాల ప్రాంతం.. పర్యాటకులు ఏడాదికి ఒక్కైసారైనా చూడాల్సిన అద్భుతమయిన ప్రాంతం. ఉభయ గోదావరి జిల్లాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలుల తరుణంలో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. ఇవాళ, రేపు విహారయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు పోశమ్మగండి కంట్రోల్ రూమ్ అధికారి ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక విహారయాత్రకు అనుమతి ఇస్తామని వెల్లడించింది.
పాపికొండలు…పర్యాటకులకు స్వర్గధామం
పాపికొండల పేరు చెప్పగానే పర్యాటకులు ఉల్లాసంగా ఫీలవుతారు. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఉన్నాయి. (తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మరియు ఖమ్మం జిల్లాల నడుమ ఉండేవి). ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ లోని భద్రాచలం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరానికి సుమారు 410 కిలోమీటర్ల దూరంలోను ఉన్న పాపికొండల ప్రాంతం జాతీయ పార్కుగా గుర్తించబడింది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము దీనిని ఆంధ్రా కాశ్మీరం అని పిలవకుండ ఉండనీయవు. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది.
తెలంగాణలో అకాలవర్షాలు.. రైతుకి అపార నష్టాలు
రాష్ట్రంలో అనుకోకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వడగళ్ల వర్షానికి పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వడగళ్లు పడటంతో రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పొలాల్లో, రోడ్డుపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కల్లాల్లోకి తీసుకువచ్చి నెల రోజులు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి ఆదివారాల కురిసిన వడగళ్ల వాన రైతులకు శాపంగా మారింది. రైతులకు చేతికొచ్చిన పంటను నేలపాలు చేసింది. ఇప్పటికే రెండు నెలల క్రితం కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను శని ఆదివారాలు కురిసిన వర్షంతో కోలుకోలేని స్థితికి రైతులు చేరారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆదివారం అంధకారం నెలకొంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో నర్సంపేట-నెక్కొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, ఖానాపురం మండలంలో వరిపంటలు తుడిచిపెట్టుకుపోయాయి. పదిహేను వేల ఎకరాల మేర భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది.
గాల్లో విమానం.. విమానంలో అకస్మాతుగా మంటలు
గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలో జరిగింది. గాలిలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం దారి మళ్లించారు. పక్షిని ఢీకొట్టడంతో విమానంలో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే… అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం ఓహియో విమానాశ్రయంలో పక్షిని ఢీకొట్టిన తర్వాత దాని ఇంజిన్ గాలిలో మంటలు వ్యాపించడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆదివారం విమానం బోయింగ్ 737 కమర్షియల్ జెట్ ఉదయం 7:45 గంటలకు టేకాఫ్ తర్వాత 30 నిమిషాల తర్వాత విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఫీనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి అప్పర్ ఆర్లింగ్టన్ మీదుగా ఎగురుతున్న విమానం పక్షిని ఢీకొట్టిన తర్వాత దారి మళ్లించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత విమానం జాన్ గ్లెన్ కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
ఖమ్మంలో నేడు కాంగ్రెస్ నిరసన ర్యాలీ
తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన ఉద్యమ కార్యాచరణ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు, దీక్షలకు పిలుపునిచ్చింది. పేపర్ లీకేజీలు, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యార్థి వ్యతిరేక విధానాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యం వంటి తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించింది. నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో జరగనున్న నిరుద్యోగ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నేటి నుంచి వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా నేడు ఖమ్మంలో, ఈ నెల 26న ఆదిలాబాద్… ఈ నెల 28న నల్గొండ, 30న తేదీన మహబూబ్‌నగర్… వచ్చే నెల ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల నాలుగైదు తేదీల్లో హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
సమంతకు మ్యాథ్స్ లో 100, ఫిజిక్స్ లో 95, ఇంగ్లీషులో 90..
సినిమాల్లో నటించే వాళ్లకు చదువు అబ్బదని విష ప్రచారం ఉంది. కానీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో కూడా చదువులో గొప్పగా రాణించిన వాళ్లు చాలామందే ఉన్నారు. నటి సాయి పల్లవి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఓవైపు చేస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చదువులోనూ ముందుండేవాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ మరీ సుశాంత్ సినిమాల కోసం ప్రయత్నించాడు. అంతే కాకుండా సుశాంత్ ఇంట్లో ఉండి కోడింగ్ నేర్చుకున్నాడు. అదేవిధంగాఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చదువులో టాలెంటెడ్ స్టూడెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత స్కూల్ మార్కుల రిపోర్ట్ కార్డు మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ రిపోర్ట్ కార్డులో సమంత సాధించిన మార్కులు చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. సమంత 10వ తరగతిలో 1000 మార్కులకు 887 మార్కులు సాధించింది. సమంత మ్యాథమెటిక్స్‌లో 100/100, ఫిజిక్స్‌లో 95/100 మార్కులు సాధించింది. ఇంగ్లీషులో 90, బోటనీలో 84, హిస్టరీలో 91, జాగ్రఫీలో 83 మార్కులు సాధించి తన భాష (తమిళం) పేపర్‌లో 88 మార్కులు సాధించింది. అన్ని సబ్జెక్టులను సమంతకు 80 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. సమంత 2001- 2002 లో చెన్నైలోని హోలీ ఏంజిల్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది. అంతే కాకుండా సమంత డిగ్రీ 2007లో పూర్తి చేసింది. సమంత చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్ లో బీకాం గ్రూప్ తీసుకుని డిగ్రీ పూర్తి చేసింది. ఇక పదవ తరగతి లోనే కాకుండా డిగ్రీలోనూ సమంత చదువులో రాణించింది. కానీ సమంత నటన పై ఉన్న ఆసక్తి తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చదువుకొనే కాదు నటనలోనూ తాను గ్రేట్ అని నిరూపించుకుంది.
మహిళలకు గర్భ నిర్ధారణ పరీక్షలు.. వివాహ పథకంపై తీవ్ర దుమారం
మధ్యప్రదేశ్‌లో వివాహ పథకంపై తీవ్ర దుమారం రేగుతోంది. లబ్ధిదారుల జాబితాలో కొంతమంది మహిళల పేర్లు లేకపోవడంతో వారి గర్భ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో వివాదం చెలరేగింది. వివాహ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేసేందుకు వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ విరుచుకుపడ్డాయి. దిండోరి జిల్లాలోని గడసరాయ్ పట్టణంలో జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 22న ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద 219 జంటలకు వివాహం చేసింది. అయితే ఈ సామూహిక కళ్యాణోత్సవంలో పెళ్లికి వచ్చిన కొందరు మహిళల పేర్లు జాబితాలో కనిపించలేదు. వారి ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు పాజిటివ్‌గా తేలడంతో వారి పేర్లను ప్రస్తావించలేదు.ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జంటకు రూ.55,000 చొప్పున మంజూరు చేస్తుంది. రూ.55,000 గ్రాంట్‌లో రూ.49,000 పథకానికి అర్హులైన మహిళలకు అందజేయగా, రూ.6,000 సామూహిక వివాహాల ఏర్పాటుకు ఖర్చు చేస్తారు. బచ్చర్‌గావ్ నివాసి అయిన ఒక మహిళ, తాను ముఖ్యమంత్రి కన్యాదన్ యోజన కింద వివాహం చేసుకోవడానికి ఫారమ్‌ను నింపినట్లు చెప్పింది. ఫారమ్‌ను పూరించిన తర్వాత, బజాగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆమెకు వైద్య పరీక్ష జరిగింది. వైద్య పరీక్షల సమయంలో గర్భ పరీక్ష కూడా జరిగింది. పరీక్ష సానుకూలంగా వచ్చిన తర్వాత, పథకం కింద నిర్వహించాల్సిన వివాహాల జాబితా నుండి ఆమె పేరు తొలగించబడిందని ఆమె పేర్కొంది.