NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఏపీ, తెలంగాణ మధ్య వందేభారత్ రైలు.. నేటి నుంచే బుకింగ్స్

విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 15న ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైలుకు సంబంధించిన బుకింగ్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి. వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ కేటగిరీవి. మిగతావి ఎకానమీ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఎకానమీ క్లాస్‌లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయవచ్చు. అయితే విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలులో ప్రయాణించాలంటే ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ ధర రూ.3,170 గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అధికారికంగా టిక్కెట్ ధరలపై ప్రకటన రావాల్సి ఉంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ కౌంటర్లలోనూ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 5 స్టేషన్లలో ఆగుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్‌లలో ఆగుతూ విశాఖ చేరుకుంటుంది. అయితే తొలిరోజు ప్రారంభం సందర్భంగా ఈ రైలు 21 స్టేషన్లలో ఆగనుంది.

రామమందిర నిర్మాణ పనులు.. విగ్రహ ప్రతిష్ఠాపనకు వేళాయె

యావత్ భారత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆలయ కమిటీ టార్గెట్ నిర్దేశించింది. 2024 జనవరి నుంచి భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఆలయ నిర్మాణ పనులు అనుకున్న ప్రకారం సాగుతున్నాయన్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ 2023 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల హోంమంత్రి అమిత్ షా రామమందిరాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆలయ నిర్మాణం ఎంతో ఉన్నతంగా, ఆధ్మాత్మికత ఉట్టిపడేలా నిర్మిస్తున్నారు. పనులు అనుకున్న ప్రకారం ముందుకు సాగుతున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించారు. 2023 డిసెంబర్‌ నాటికి ఆలయ పనులు పూర్తయితే.. 2024 జనవరి నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరవాలని భావిస్తున్నారు.

సైకిల్ తొక్కిన ఫ్రెంచ్ ప్రెసిడెంట్, డెన్మార్క్ ఉప ప్రధాని

సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. గతంలో మన తాతముత్తాతలు బాగా సైకిల్ తొక్కేవారు. అందుకే వారికి ఎలాంటి వ్యాధులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు టూవీలర్ల వినియోగం బాగా పెరిగిపోయింది.చిన్నచిన్న దూరాలకు కూడా టూ వీలర్స్ వాడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా తియ్యరా బండి అనేలా తయారయ్యారు. అయితే వీఐపీలు కూడా ఇప్పుడు సైకిల్ యాత్రలు చేస్తున్నారు. తాజాగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ,డెన్మార్క్ ప్రధాన మంత్రి సైకిల్ పై సవారీ చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, డెన్మార్మ్ ఉప ప్రధానమంత్రి అలెగ్జాండర్ కుబెరకోవ్ సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ వీఐపీలిద్దరూ రోడ్లపై సైకిల్ తొక్కుతుంటే.. ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది వారిని అనుసరించారు. వీరిద్దరి సైక్లింగ్ వైరల్ అవుతోంది.

రైతులకు వ్యవసాయం పండుగైన నాడే.. దేశానికి సంపూర్ణ సంక్రాంతి

తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు.. ఇంటింటా భోగి మంటలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బోగి మంటలు మండుతున్నాయి. భోగి మంటలు ఆడుతూ చిన్నాపెద్దా సంబరాలు జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజల అతి పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి ప్రత్యేకత. ఆనందాలను పంచే తెలుగులో భోగి అంటే చల్లటి మంట మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటారు. చలికి టాటా చెప్పేది. ఈ మంటల్లో పాత పాత వస్తువులు, విరిగిన మంచాలు, కుర్చీలు, ఉపయోగించని వస్తువులు విసిరివేయబడతాయి. కాబట్టి.. ఇంట్లో దారిద్ర్యం వదిలిపోతుందని నమ్ముతారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు కొత్త రూపాన్ని పొందుతాయి. బంధు మిత్రులతో తెలుగు పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు, వరండాల్లో మామిడి తోరణాలు, చిన్నారుల తలపై రేగు పళ్లు, ఆకాశాన్ని రంగులమయం చేసే గాలిపటాలు.

భార‌త్ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ మృతి

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌డుతున్న భార‌త్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఇవాళ లుథియానాలో ఉద‌యం ర్యాలీ నిర్వహిస్తున్న స‌మ‌యంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్‌కు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఎంపీ సంతోక్ కు 77 ఏళ్ల వయసు. ఫిల్లౌర్‌లో వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఎంపీ సంతోక్ నీర‌సంగా ప‌డిపోయారు. దీంతో ఆయ‌న్ను ప‌గ్వారాలోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే.. కాంగ్రెస్ నేత‌లు రాణా గుర్జీత్ సింగ్‌, విజ‌య్ ఇంద‌ర్ సింగ్లాలు ఎంపీ మృతిని ద్రువీక‌రించారు. కాగా.. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేశారు. అయితే.. గ‌తంలో సంతోక్ పంజాబ్ మంత్రిగా చేశారు. సంతోఖ్ సింగ్ చౌదరి ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన జలంధర్ నుండి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. పంజాబ్ మాజీ క్యాబినెట్ మంత్రి. అతను 2014- 2019 భారత సాధారణ ఎన్నికలు రెండింటిలోనూ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి. చౌదరి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఉనికిని చాటుకున్న కొద్దిమందిలో ఒకరు. కాబట్టి ఇది పాత పార్టీకి భారీ నష్టంగా పరిగణించబడుతుంది.

హైదరాబాద్‌లో సంక్రాంతి వేడుకలు.. భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగ కావడంతో.. నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా భోగిని ఆశ్వాదిస్తున్నారు. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాత ఆలోచనలు భోగి మంటల్లో వేసి.. కొత్త ఆలోచనలకు నాంది పలకడం ఈ పండుగ ఉద్దేశమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాగా.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అందరం ఘనంగా జరుపుకుంటామన్నారు. ఇక.. హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీకి అనారోగ్యం

ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కరోనా అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యలు, న్యుమోనియాతో లలిత్ మోదీ బాధపడుతున్నాడు. దీంతో ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా సోకిందని.. న్యూమోనియా కూడా అటాక్ అవ్వడంతోనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని లలిత్ మోదీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు. మూడు వారాలుగా ఇద్దరు డాక్టర్లు రోజులో 24 గంటలు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాడు. దీంతో వాళ్లకు ధన్యవాదాలు తెలియజేశాడు. అటు లలిత్ మోదీ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సహా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితాసేన్ బ్రదర్ రాజీవ్ సేన్ కూడా లలిత్ మోదీ కోలుకోవాలని పేర్కొన్నారు. కాగా కరోనా సోకిన వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రతికూలంగా మారడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.

పండగపూట విషాదం.. తల్లిని చిత్రహింసలు పెట్టి చంపిన కొడుకు

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో నర్సవ్య, కొడుకు నర్సారెడ్డి కుటుంబం నివాసం ఉండేది. నర్సారెడ్డికి కొద్ది నెలల క్రితం పెళ్లి చేసింది నర్సవ్య. కానీ నర్సారెడ్డి భార్య తనని వదిలి వెళ్లిపోయింది. రోజు సైకోలా ప్రవర్తిస్తుండటంతో విసుగు చెందిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నర్సారెడ్డి, తల్లి నర్సవ్యతోనే ఉంటున్నాడు. కానీ భార్య వదిలి వెళ్లిపోయిన నర్సారెడ్డిలో మార్పు రాలేదు.. వ్యసనాలకు బాలిసై తల్లితో రోజు గొడపడేవాడు. నిన్నటి రోజు పండుగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ఫుల్ గా మద్యం సేవించి ఇంటి వచ్చాడు. తల్లితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్యం మాట మటా పెరిగి.. ఆగొడవ కాస్త చిలికి చిలికి గాలివానైంది. తల్లిపై అతికిరాతకంగా విరుచుపడ్డాడు.. తల్లిపై రాడ్డుతో తెగబడ్డాడు. చిత్రహింసలు చేశాడు.

భోగిరోజు బాలయ్య వదిలిన రామబాణం

ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో బాలయ్య చేస్తున్న సందడి మరింత పెరిగింది. సీజన్ 1 కన్నా ఎక్కువ జోష్ తో సాగుతున్న ఈ సీజన్ 2కి ఇటివలే ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా వచ్చారు. ‘ఆహా’ క్రాష్ అయ్యే రేంజులో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య, గోపీచంద్ నటిస్తున్న నెక్స్ట్ కి టైటిల్ ని ఫిక్స్ చేశాడు. గోపీచంద్ కి ఉన్న సెంటిమెంట్ ని బేస్ చేసుకోని టైటిల్ పెట్టాను, ఇక నుంచి నువ్వు ‘అన్ స్టాపబుల్’గా ఉండాలి అందుకే నీ సినిమా పేరు ‘రామబాణం’ అంటూ బాలయ్య అనౌన్స్ చేశాడు. ఈ సమయంలో గోపీచంద్ పక్కనే ఉన్న ప్రభాస్ “మీరు ముహూర్తం పెడితే సినిమా సూపర్ హిట్ సర్. రామబాణం టైటిల్ బాగుంది” అన్నాడు. భోగి రోజున ఈ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.