తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు చుక్కెదురు
తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు ..కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు…రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించిన కేంద్రం.. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు సోమేష్ కుమార్. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది. డి ఓ పి టి పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ ఏపీ కు వెళ్లిపోవాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. సమయం కోరిన సోమేశ్ కుమార్ కౌన్సిల్..అప్పీల్ కు సమయం కోరిన సోమేశ్ కుమార్ తరపు న్యాయవాదికి షాకిచ్చింది. సమయం ఇచ్చేది లేదని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
దేవినేని అవినాష్ కార్యక్రమంలో ఉద్రిక్తత
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రాణిగారితోట ప్రాంతంలో కార్పొరేటర్ రామిరెడ్డి, ఇతర నేతలతో కలిసి దేవినేని అవినాష్ వెళ్తుండగా పలువురు స్థానిక మహిళలు వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం పని చేశాం, మీ వెనుక తిరిగాం, మీరు మాకేం చేశారని నిలదీశారు. కార్పొరేటర్ రామిరెడ్డి తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా రమీజా అనే మహిళ ఇంటిపై టీడీపీ జెండా ఉండటాన్ని గమనించిన దేవినేని అవినాష్.. ఈ జెండా మనం పెట్టిందేనా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. మీరు గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ జెండాను పెట్టామని ఆమె చెప్పారు. దీంతో అవినాష్ మౌనంగా ఉండిపోయారు. మీ వెంటే తిరిగామని అయినా తమకు మోసం జరిగిందని కార్పొరేటర్‌ను చూపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గడప గడపకు కార్యక్రమంలో టీడీపీ మహిళలు సమస్యలు సృష్టిస్తున్నారంటూ వైసీపీ మహిళలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఈ ఘర్షణకు టీడీపీ కుట్రే కారణమని దేవినేని అవినాష్ ఆరోపించారు.
వరంగల్ జిల్లాలో నకిలీ చలాన్ల ముఠా గుట్టురట్టు
వరంగల్ జిల్లాలో నకిలీ చలాన్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎక్సైజ్ సీఐ ఫిర్యాదుతో అసలు భాగోతం బయటపయలైంది. ఆబ్కారీ శాఖకే కేటుగాళ్ళు మస్కా కొట్టారు. నకిలీ చాలన్లతో 11 మంది నిందితులు టెండర్లు వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎక్సైజ్ సీఐ పవన్ ఫిర్యాదుతో నకిలీ చాలన్ల భాగోతం బయటబయలైంది. అప్పట్లో లైసెన్స్ రెన్యువల్ కోసం కోటి రూపాయలకు పైగా నకిలీ చాలన్లు దుండగులు సృష్టించారు. నిందితుల్లో అసలు సూత్రధారిగా బ్యాంక్ క్యాషియర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మరో 22 లక్షల రూపాయల నకిలీ చాలన్లు బయటపడ్డంతో తీవ్ర కలకలం రేపుతుంది. 2019 -2021 వైన్ షాప్ టెండర్ల కోసం నిందితులు నకిలీ చాలన్లు వాడారని పోలీసులు దర్యాప్తులో తేలింది.
రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతిపెద్ద హవాలా లింక్ లు ఈదోపిడీ వెనుక ఉన్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. అయితే ఈ హవాలా లింక్‌లలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పటి వరకు ఎంత కాజేశారనే విషయంలో పోలీసులు విచారణచేపట్టారు. దోపిడీ జరిగిన సమయంలో వ్యాపారి వెంకట్ రెడ్డి వద్ద 50 లక్షలు వున్నట్టు పోలీస్ లు గుర్తించారు. 24 గంటల పాటు పోలీస్ లకు స్పష్టమైన సమాచారం వెంకట్ రెడ్డి ఇవ్వలేదు. మొదట వెంకట్ రెడ్డి పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదులో 50 లక్షలు పోయాయని వెంకట్ రెడ్డి చెప్పాడు. అయితే.. వెంకట్ రెడ్డి తో పాటు వున్న నరేష్ కోటిన్నర పోయిందంటూ పోలీస్ లకు సమాచారం ఇచ్చాడు. పోలీసుకు పొంతన లేని సమాచారంతో… అసలు దోపిడీ జరిగిందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. తరువాత 25 లక్షలు దోపిడీ జరిగిందని పోలీసుల తేల్చేశారు. దోపిడీ చేసిన నిందితులను పోలీస్ లు గుర్తించారు. హవాలా వ్యాపారంపై స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీకి చెందిన ఫరూక్ తో పాటు విదేశాల్లో వున్న ప్రవీణ్ అనే వ్యక్తికి హవాలా వ్యాపారంతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. దోపిడీకి ముందు వెంకట్ రెడ్డికి డబ్బు చేరవేసిన వ్యక్తుల పాత్రపై కూడా పోలీస్ ల దర్యాప్తు కొనసాగుతుంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణం.. మధ్యాహ్న భోజనంలో పాము
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో పాము వచ్చింది. దీన్ని తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిర్వాహకులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహిరించడం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో జరిగాయి. గతంలో పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం కలుషితం అయింది. బల్లులు ఇతర ప్రాణులు మధ్యాహ్నం భోజనంలో పడటంతో పలువురు పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు విన్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తాజాగా బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ బ్లాక్ లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వడ్డించిన పప్పులో పాము కనిపించింది. పప్పు ఉన్న పాత్రలో పాము కనిపించిందని సిబ్బంది కూడా పేర్కొన్నారు. ఈ ఆహారం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థతకు గురైనట్లు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని బ్లాక్ డెవలప్మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు.
ఐటీడీఏ ఆత్మీయ సమ్మేళనం.. ఇద్దరు ఐఎఎస్ ల డ్యాన్స్ వైరల్
ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులు.. ఐటీడీఏ ఆత్మీయ సమ్మేళనంలో వారు సందడి చేశారు. వారు చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పాడేరులో ఐటీడీఏ ఆత్మీయ సమ్మేళనంలో ఇద్దరు ఐ.ఏ.ఎస్ అధికారులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రాజెక్టు అధికారి గోపాల కృష్ణ,సబ్ కలెక్టర్ అభిషేక్ ల డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ మూవీ రవితేజ ధమాకా లోని హిట్ సాంగ్ కి వారంతా అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. అట్టాంటిట్టాంటి దాన్ని కాదు బావ పల్సర్ బైక్ సాంగ్ ఇప్పుడు ఊపు ఊపుతోంది. నేనట్టాంటి ఇట్టాంటిదాన్ని కాదు బావో అంటూ యువత డీజేలతో అదరగొట్టేస్తున్నారు.
నేటి నుంచి సఫారీ లీగ్.. ఐపీఎల్ తరహాలో ఆదరణ ఉండేనా?
టీ20 క్రికెట్‌లో మరో లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అభిమానులను టీ20 లీగ్‌లు అలరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్, ఇండియాలో ఐపీఎల్, పాకిస్థాన్ పీసీఎల్ వంటివి ఎంతో ఆదరణ పొందాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్ ప్రారంభం అవుతోంది. నేటి నుంచి ఎస్ఏ20 పేరుతో లీగ్‌కు తెరలేవనుంది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఈ లీగ్ కొత్త ఊపిరి పోస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఎస్ఏ20 లీగ్‌లో సత్తా చాటనున్నారు. సఫారీ టీ20 లీగ్‌లో దాదాపు ఐపీఎల్ ఫ్రాంచైజీలే జట్లను కొనుగోలు చేశాయి. ఈ మేరకు ఐపీఎల్ మాదిరే పేర్లు కూడా ఉన్నాయి. డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలి సీజన్ బరిలో దిగుతున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.