Ntv top-headlines-at-1 PM
రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆమె విజయవాడ చేరుకోగా గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడ పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం గొప్ప విషయం అన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. తమ గ్రామంలో డిగ్రీ వరకు చదువుకున్న తొలి మహిళగా ముర్ము నిలిచారని.. జూనియర్ అసిస్టెంట్‌గా ఆమె జీవితం ప్రారంభించారని గుర్తుచేశారు.
హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ….పోలీసుల అదుపులో 37 మంది
హైదరాబాద్ శివాలలో రేవ్ పార్టీ కలకలం రేపింది. పక్కాసమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాక్ తిన్నారు. 37 మంది గంజాయి మత్తులో ఉండడాన్ని గమనించారు. దీంతో 37 మందిని అదుపులో తీసుకున్నారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు. బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని చేస్తుండటంతో రాచకొండ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. 34 మంది విద్యార్థులతో పాటు ముగ్గురు గంజాయి అమ్మకం దారులను అదుపు తీసుకున్న పోలీసులు. బర్త్ డే పార్టీ పేరుతో విద్యార్థులు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. విద్యార్థులకు గంజాయి సప్లై చేసినా నలుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. సహితు చారి ,చరణ్ రెడ్డి ,హిమాచరణ్ రెడ్డి, విశ్వచరణ్ రెడ్డి లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. విద్యార్థుల రేవ్ పార్టీకి అనుమతించిన సన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే నిర్వాకులుగా గుర్తించారు పోలీసులు. విద్యార్థులు ఎంజాయ్ మెంట్ పేరు తో రేవ్ పార్టీ చేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చిన సమాచారంతో పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులను అదుపులో తీసుకొని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
నకిలీ మందులకు ఇక చెక్. బార్ కోడ్ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు ఔషధాలపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో 300 డ్రగ్ ఫార్ములేషన్స్‌పై కంపెనీలు బార్ కోడ్ కచ్చితంగా ముద్రించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం 2023 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ బార్ కోడ్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్, అడ్రస్ తేదీ, బ్యాచ్ నంబర్, డ్రగ్ జనరిక్ పేరు, కంపెనీ పేరు, గడువు తేదీ వివరాలను కంపెనీలు పేర్కొనాల్సి ఉంటుంది. దీన్ని మెడిసిన్స్ ఆధార్ కార్డుగా పరిగణిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 300 బ్రాండ్‌లపై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ముద్రించబడుతుంది. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ చేయడంతో ఔషధాలను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు తమ మొబైల్ నుంచి కోడ్‌ను స్కాన్ చేసి ఔషధం నిజమైందా లేదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో అమ్ముడవుతున్న నకిలీ మందులలో 35 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయి.
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. ఎండలో వానలో అయ్యప్పల అవస్థలు
అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతివ్వటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్పస్వాములు స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అయ్యప్ప దర్శనం వేళలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శబరిమలకు భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు కరోనా ఆంక్షలు లేకపోవడంతో రెండో భాగంలో దర్శన సమయాన్ని మార్చారు. ఇక నుంచి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకే స్వామి వారి దర్శనం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16న శబరిమల ఆలయం తెరవగా.. సోమవారం వరకు 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్టు చెప్పారు.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గోల్డ్ ఏటీఎం ప్రారంభం
ATM అంటేనే డబ్బు విత్‌డ్రా చేయడం గుర్తుకు వస్తుంది. అయితే ఇప్పుడు బంగారం కూడా డ్రా చేసుకోవచ్చు. ఏంటి బంగారం ఏటీఎం నుంచి డ్రా అనే అనుమానమే వద్దండోయ్. మీరు విన్నది నిజమే… దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. అంతేకాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో త్వరలో దండోయ్ ఏర్పాటు చేయనున్నారు. గోల్డ్ ATM లో ఇప్పుడు వినియోగదారులు తమ డెబిట్ , క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ATM నుండి స్వచ్ఛమైన బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్‌లోని బేగంపేటలోని రఘుపతి ఛాంబర్స్‌లో మొదటి గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. బంగారు ఏటీఎం కేంద్రాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. వినియోగదారులు 0.5 గ్రాముల నుండి 100 గ్రాముల వరకు బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వారి స్వచ్ఛత బరువును తెలిపే ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు. గోల్డ్ ఏటీఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్‌లో గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరికలు
ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైంది. జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్ధలైంది. 1.5 కిలోమీటర్ల మేర బూడిదను గాలిలోకి ఎగిసిపడింది. విస్పోటనం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు సూచించారు. అగ్నిపర్వతం నుంచి వస్తున్న లావకు దూరంగా ఉండాలని తెలిపింది. ఈ అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. అగ్నిపర్వతం ఆదివారం ఉదయం 2.46 గంటల నుంచి విస్పోటనం చెందడం ప్రారంభించింది. ఇండోనేషియా అధికారులు సమీప ప్రాంతాల ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఇండోనేషియాలో మొత్తం 142 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతాల చుట్టూ 10 కిలోమీటర్ల లోపల దాదాపుగా 86 లల మంది ప్రజలు నివసిస్తున్నారు.
ఒక్క ఎక్స్ రేతో గుండె జబ్బులు కనుక్కోవచ్చు
భవిష్యత్తులో ఒక్క ఎక్స్-రేతోనే గుండె జబ్బులను అంచనా వేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో గుండె స్ట్రోక్ డెత్ రేట్ రిస్క్ ను అంచానా వేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మరణిస్తున్న వారిలో గుండె జబ్బులే కారణం అవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధులతో ప్రతీ సంవత్సరం 1.19 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ వ్యాధులు నివారణకు పరిశోధకులు కొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. కేవలం ఒకే ఛాతీ ఎక్స్-రే ఉపయోగించి అథెరోస్కెలోరోటిక్ హృదయ సంబంధ వ్యాధులను, గుండె సంబంధిత వ్యాధుల వల్ల వచ్చే మరణాలను అంచానా వేయవచ్చు. 10 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ను కనుక్కునేందుకు నమూనాను అభివృద్ధి చేశారు. బీఆర్జీ.కామ్ ప్రకారం.. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని CXR-CVD రిస్క్ అని పిలుస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ క్యాన్సర్ ఇన్సిట్యూట్ దీన్ని రూపొందించింది. డీప్ లర్నింగ్ అనేది ఒక కొత్త ఏఐ ఉపయోగించి ఈ టెక్నాలజీని రూపొందించారు. సాధారణంగా ఒక రెేడియాలజిస్ట్ ఒక వ్యక్తి ఛాతీ చిత్రాలను తీసుకున్నప్పుడు.. గుండె, ఉపిరితిత్తులలోని ప్రాంతంలోని ఇతర అవయవాలను కూడా చూస్తారు. ఒకవేళ గుండె సైజు పెద్దదిగా ఉంటే ఏదో సమస్య ఉందని గ్రహించే అవకాశం ఉంటుంది. బృహద్దమని కూడా చూడవచ్చు. అది ఎన్ లార్జ్ అయి ఉన్నా, కాల్షియం పేరుకుపోయి ఉన్నా తెలిసిపోతుంది. ఉపరితిత్తుల్లో నీరు చేరడం, దాని కణజాలాన్ని చూడవచ్చు. గుండె వైఫల్యానికి సంబంధించిన లక్షణాలను గమనించవచ్చు.
తాడోబోలో వరుసగా పులుల మృత్యువాత.. ఏం జరుగుతోంది?
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని తాడోబో-అంధారి అభయారణ్యంలో కొన్ని రోజుల్లోనే 6 పులులు మరణించాయి. శనివారం తాడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ లో నాలుగు పులి పిల్లలు చనిపోయి ఉండటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. పులి పిల్లలపై కొరికిన గాయాలు ఉన్నట్లు అటవీ అధికారులు వెల్లడించారు. పెద్దపులి దాడిలో ఇవి చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం ఉదయం బఫర్ జోన్ లోని శివని ఫారెస్ట్ రేంజ్ వద్ద మూడు నుంచి 4 నెలల వయస్సు ఉన్న రెండు మగ, రెండు ఆడ పులిపిల్లల మృతదేహాలను కొనుగొన్నట్లు రిజర్వ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్‌కర్ తెలిపారు. టైగర్ రిజర్వ్ లోని మొహర్లీ పరిధిలోని కంపార్ట్మెంట్ 186 పరిధిలో 6-7 నెలల వయస్సు ఉన్న పులి గురువారం చనిపోయింది. దీని శరీరంపై కూడా గాయాలు ఉన్నాయి. బుధవారం శివని పరిధిలో ఓ పులి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. 15-16 ఏళ్ల వయస్సు ఉన్న పులిగా గుర్తించారు. వృద్ధాప్య కారణాల వల్ల పులి చనిపోయి ఉండవచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. శరీరంపై ఎలాంటా గాయాలు కనిపించలేదు. మృతదేహాలను శవపరీక్ష కోసం ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్ కు పంపారు. ఆ ప్రాంతంతో మగపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు అటవీ అధికారులు.