NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నవీన్ రెడ్డి సోదరుడు సందీప్ రెడ్డి అరెస్ట్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్‌ చేశారు పోలీసులు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్‌ చేశారని, గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసి మీడియాకు పంపారనే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావడంతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిలను అదుపులో తీసుకున్నారు. వైశాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ఆదిభట్ల పోలీసులు నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసుల సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు హెచ్చరించారు. ఇదిలా వుండగా వైశాలి కిడ్నాప్‌ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. భాను ప్రకాశ్‌, సాయినాథ్‌, ప్రసాద్‌, హరి, విశ్వేశ్వర్‌ లను ఒకరోజు కస్టడీకి అనుమతించింది ఇబ్రహీంపట్నం కోర్ట్‌. న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్లపల్లి జైలు నుంచి నిన్న (శుక్రవారం) ఐదుగురిని కస్టడీకి తీసుకున్నారు ఆదిభట్ల పోలీసులు.

మంచిర్యాలతో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

మంచిర్యాల జిల్లా మందమర్రి మం వెంకటాపూర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇంటి యజమాని శివయ్య (50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కూతురు మౌనిక (23), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమ బిందు (2), స్వీటీ (4), సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఉన్నట్లు గుర్తించారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈఘటనలో 6మంది సజీవదహనం అయ్యారు. ఈప్రమాదానికి గల కారణాలపై డీసీపీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ఇంట్లో షార్ట్ షర్య్కూట్ తో ఇలా జరిగిందా లేక ఎవరైనా ఈఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే మాసు శివయ్య భార్యతో సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఉన్నట్లు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిగా తెలిసింది. ఈవిషయం శివయ్యకు తెలియడంతో.. ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో వీరిద్దరిలో ఎవరైనా ఇంటిని తగలబెట్టారా? అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తమని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే ఎక్కువట

దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం కేసుల్లో ఏపీలోనే 39.86 శాతం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జాబితాలో ఏపీ తర్వాతి స్థానంలో బీహార్‌లోని పట్నా హైకోర్టు ఉంది. పట్నా హైకోర్టులో 6,554 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో 6,236 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా అత్యధిక కుక్కకాటు నమోదైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022లో నవంబర్ నెల నాటికి ఏపీలో 1,69,378 కుక్కకాటు కేసులు నమోదైనట్లు కేంద్ర సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వెల్లడించారు. తెలంగాణలో 80,282 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి.

రేజర్‌పే, క్యాష్‌ఫ్రీకి RBI షాక్.. తాత్కాలిక ఆంక్షలు

డిజిటల్ పేమెంట్స్ పెరిగాక అమ్మకాలు, కొనుగోళ్ళు సులభతరం అయ్యాయి. అనేక స్మాల్ ఫైనాన్స్, Pay Later సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేజర్ పే, క్యాష్ ఫ్రీకి షాకిచ్చింది. ఈ రెండు సంస్థలు కొత్త వినియోగదార్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా ఆపేయాలని ఆదేశించింది. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) mరేజర్‌పే, క్యాష్‌ఫ్రీ సంస్థలకు నోటీసులు జారీచేసిందని తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇవి తాత్కాలిక ఆదేశాలు మాత్రమేనని, దీని వల్ల రేజర్‌పే ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలు, వ్యాపార సంస్థలపై ఎలాంటి ప్రభావం పడదని అంటున్నారు. ‘చెల్లింపులను ప్రాసెస్‌ చేసేందుకు, పేమెంట్‌ గేట్‌వే లైసెన్సు కోసం జులైలో ఆర్‌బీఐ మాకు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తుది లైసెన్సు ప్రక్రియ కోసం ఆర్‌బీఐకి అదనపు వివరాలు సమర్పించాలి. ఈ వివరాలు సమర్పించే వరకు కొత్త వినియోగదార్లను చేర్చుకోవడాన్ని ఆపేయాల్సిందిగా ఆర్‌బీఐ కోరింద’ని రేజర్ పే ప్రతినిధులు వెల్లడించారు.

భారత్ సిరీస్ నెంబర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్‌ (బీహెచ్‌) సిరీస్‌ నంబర్లను పొందవచ్చని కేంద్రం పేర్కొంది. ఈమేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. బీహెచ్‌ సిరీస్‌ (BH Series) నిబంధనలను మార్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. బీహెచ్‌ సిరీస్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కొత్త వాహనాలు మాత్రమే బీహెచ్‌ సిరీస్‌ తీసుకోడానికి వీలుండేది. ‘అవసరమైన పన్ను చెల్లింపులు చేసి సాధారణ రిజిస్ట్రేషన్‌ మార్కు ఉన్న వాహనాలు సైతం బీహెచ్‌ సిరీస్‌కు మారొచ్చ’ని కేంద్రం పేర్కొంది. నివాసం ఉంటున్న లేదా పనిచేస్తున్న ప్రాంతంలో, తమ వాహనం కోసం బీహెచ్‌ సిరీస్‌ దరఖాస్తు సమర్పించేందుకు వీలుగా ‘రూల్‌ 48’ను సైతం సవరించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా ‘వర్కింగ్‌ సర్టిఫికెట్‌’ను ప్రైవేటు రంగ ఉద్యోగులు సమర్పించాల్సి ఉంటుంది. రవాణా శాఖ వాటిని పరిశీలించి బీహెచ్ సిరీస్ అందచేస్తుంది. ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి వ్యక్తిగత వాహనాల బదిలీ సులువుగా ఉండేందుకు, గతేడాది సెప్టెంబరులో సరికొత్త రిజిస్ట్రేషన్‌ ‘భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌ సిరీస్‌)’ను కేంద్రం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

కాలువలో దూకిన యువకుడి డెడ్ బాడీ లభ్యం

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట ఈ కోడిపందాల సందడి కనిపిస్తూనే వుంది. తిరుపతిలో కోడిపందేల రాయుళ్లు రెచ్చిపోతున్నారు. తిరుపతి జిల్లాలో పోలీసుల దాడులకు భయపడి పందెంరాయుళ్ళు కాలువలో దూకడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. కోడి పందెం రాయుళ్ల తీరుపట్ల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద మామిడి తోపులో జోరుగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారంతో రైడ్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు దాడి చేస్తారనే సమాచారం అందుకున్న పందెం రాయుళ్ళు పారిపోయారు. కోడిపందేలు ఆడుతున్న సమయంలో పోలీసులు రావడంతో కాలువలోకి దూకిన యువకుడు మనోహర్‌ మృతదేహం లభ్యం అయింది. దీంతో విషాదం నెలకొంది. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో కాలువలో దూకారు నలుగురు యువకులు. కాలువలో నుండి ఈదుకుంటూ బయటకు వచ్చారు ముగ్గురు యువకులు. అయితే, కాలువలో దూకిన వారిలో మనోహర్‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన వారు బయటకు వచ్చి నాలుగో వ్యక్తి గురించి వాకబు చేశారు. గల్లంతైన యువకుడు కోసం గాలించారు. చివరకు అతడి డెడ్ బాడీ లభ్యం అయింది. కోడిపందాల సరదా ఆ యువకుడి ప్రాణం తీసింది. సినిమా టిక్ గా కాలువలో దూకడం, ఒకరు గల్లంతు కావడం, అతడి మరణించడంతో విషాదం నెలకొంది.

కొండచరియలు విరిగిపడిన ఘటన.. 21కి చేరిన మృతులు
మలేషియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరుకోగా.. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు అక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. రోడ్డు పక్కనున్న ఫార్మ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేశారని.. క్యాంప్‌ వెనకాల ఉన్న కొండ సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి విరిగిపడిందని.. విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్‌ నరోజమ్‌ ఖామిస్‌ తెలిపారు. ఏడాది క్రితం ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, దాంతో సుమారు 21 వేల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున సెలంగోర్‌ రాష్ట్రం బటంగ్‌ కలి పట్టణ సమీపంలోని ఓ ఫార్మ్‌హౌస్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. 100 అడుగుల ఎత్తు నుంచి బురద, రాళ్లతో కూడిన మట్టి.. ఫార్మ్‌హౌస్‌లోని మూడెకరాల్లో 90 మంది పర్యాటకులు ఉన్న క్యాంప్ సైట్‌ను ఒక్కసారిగా ముంచెత్తింది. ఈ ఘటనలో 21 మంది బురద మట్టి కింద సజీవ సమాధి అయ్యారు. మరో 12 మంది జాడ తెలియకుండా పోయారు. అయితే.. ఇక్కడ క్యాంప్‌గ్రౌండ్ నిర్వహించడానికి యజమానుల వద్ద లైసెన్స్ లేదని అధికారులు స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన నుంచి డజన్లకొద్ది మంది సురక్షితంగా బయటపడ్డారని, ఏడుగురిని ఆసుపత్రిలో చేర్పించామని జిల్లా పోలీస్ చీఫ్ సుఫియాన్ అబ్దుల్లా చెప్పారు.

భారత్-చైనా సరిహద్దుపై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు

భారత్, చైనా సరిహద్దు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. సరిహద్దుల్లో భ్రదత పటిష్టంగా ఉందని తూర్పు ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రానా ప్రతాప్ కలిటా అన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో.. భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1971లో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న నిర్వహించే విజయ్‌ దివస్‌ సందర్భంగా అమరవీరులకు నివాళ్లు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తవాంగ్ సంఘటనపై స్పందించారు. వాస్తవాధీన రేఖ విషయంలో భారత్‌, చైనా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. భారత్‌లో అంతర్భాగమైన 8 ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఆర్పీ కలిటా పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకి వస్తాయని చైనా వాదిస్తోందని అన్నారు. ఇక తవాంగ్‌లో ఇరు దేశాల దళాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు పక్షాల వారికి గాయాలు అయ్యాయని చెప్పారు. చైనా సైనికులు సరిహద్దుని దాటి, భారత్‌వైపు దూసుకురావడంతో.. స్థానిక కమాండర్లు పరిస్థితుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలోనే చిన్నపాటి ఘర్షణ జరిగిందని అన్నారు. ఈ ఘర్షణకు ముందు గానీ, ఆ తర్వాత గానీ భారత్‌ భూభాగంలోకి చైనా చొరబడలేదని స్పష్టత ఇచ్చారు.