మరపురాని ‘ఊర్వశి’ శారద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 25న మహానటి శారద పుట్టినరోజు)
ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాం. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ ద్వారా నర్గీస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే 1968లో మళయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా శారద తన తొలి ‘ఊర్వశి’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తరువాత 1972లో ‘స్వయంవరం’ మళయాళ చిత్రం ద్వారా రెండోసారి, 1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా మూడో సారి శారద జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచి ‘ఊర్వశి’ అన్న టైటిల్ ను తన పేరు ముందు గర్వంగా చేర్చుకున్నారు. ఆ రోజుల్లో అందరూ ఆమెను ‘ఊర్వశి’ శారద అంటూనే పిలిచేవారు. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే ‘మన ఊర్వశి’ అంటూ ఆరాధించేవారు. 1974లో శారద ప్రధాన పాత్రలో కె.బాపయ్య ‘ఊర్వశి’ అన్న చిత్రాన్నే రూపొందించారు. అలా ‘ఊర్వశి’ అవార్డుతో శారదలాగా పేరొందిన నటి మరొకరు కానరారు.
Also Read
పలు మలుపులు…
పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. యన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’లో బాలనటిగా ఓ పాటలో కనిపించారు శారద. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించిన శారద ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి చిత్రాలలో పద్మనాభం జోడీగా నటించిన శారద మాతృభాషలో కథానాయికగా మారడానికి కొంత సమయం తీసుకున్నారు. మళయాళ చిత్రసీమ మాత్రం శారదకు ఎర్రతివాచీ పరచి ఆహ్వానించిందనే చెప్పాలి. అక్కడే తనదైన అభినయంతో శారద మళయాళ వాసులను పరవశింపచేశారు. మళయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలవగానే, మనవాళ్ళ చూపు సైతం శారదవైపు సాగింది. మళయాళంలో ఆమెను ‘ఊర్వశి’గా నిలిపిన ‘తులాభారం’ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన ‘మనుషులు మారాలి’లోనూ శారద అభినయించారు. ఈ సినిమాతో తెలుగువారిని శారద విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచీ తెలుగు చిత్రాలలోనూ శారద అభినయం వెలుగులు విరజిమ్మింది. యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సైడ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకున్నారు. అయితే శోభన్ బాబుకు మాత్రం హిట్ పెయిర్ గా నిలిచారామె. వారిద్దరూ నటించిన “సిసింద్రీ చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు-దానవుడు, శారద, దేవుడు చేసిన పెళ్ళి, జీవితం, ఇదాలోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి.
యన్టీఆర్ తో అనుబంధం…
శారద అంటేనే శోకసముద్రం పొంగిపొరలుతుంది అనే పేరుండేది. ఎందుకంటే ఆమెకు ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నిటా అదే తీరున ఆమె అభినయం సాగింది. యన్టీఆర్ తో ‘జీవితచక్రం’లో సైడ్ హీరోయిన్ గా నటించిన శారద ఏ నాడూ ఆయన సరసన మెయిన్ హీరోయిన్ గా నటించలేకపోయారు. అలాంటి శారద తరువాతి రోజుల్లో ‘సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి’ చిత్రాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. ‘దానవీరశూర కర్ణ’లో తొలిసారి యన్టీఆర్ దర్శకత్వంలో నటించిన శారద, ఆ తరువాత ‘చండశాసనుడు’లో ఆయన చెల్లెలిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఆ సినిమా తరువాత శారద కెరీర్ మేలమలుపు తిరిగింది. ఆపై అనేక చిత్రాలలో రౌద్రరస పాత్రలలో శారద తనదైన అభినయంతో అలరించారు. ఇలా సాగుతున్న శారద కెరీర్ ను యన్టీఆర్ సొంత చిత్రం ‘అనసూయమ్మగారి అల్లుడు’ మరో మలుపు తిప్పింది. ఆ సినిమాలో శారద కామెడీని భలేగా పండించింది. అప్పటి నుంచీ పలు చిత్రాలలో హాస్యంతోనూ శారద ఆకట్టుకోవడం విశేషం! చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద ఆ తరువాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మగానూ నటించి మెప్పించారు.
యన్టీఆర్ ‘కన్యాశుల్కం’తో చిత్రసీమలో ప్రవేశించిన శారద, ఆయన తెలుగుదేశం పార్టీ తరపున తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇలా శారద జీవితంలోని పలు మేలుమలుపుల్లో యన్టీఆర్ ఉన్నారని ఆమె పదే పదే చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఈ నాటికీ ఆ నాటి అభిమానులు శారద పేరు వినగానే ‘ఊర్వశి’ శారద అని గుర్తు చేసుకుంటారు.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!