ఎన్.బి.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో తొలిసారి నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఆయనకు అసలు సిసలు నట వారసుడైన బాలకృష్ణకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ, అభిమానం అంతకు మించి గౌరవం. సందర్భం ఏదైనా తన తండ్రిని తనలో చూసుకోవడం ఆయనకు అలవాటు. ఆ మధ్య భీష్మ ఏకాదశికి గతంలో తాను తండ్రిని అనుకరిస్తూ వేసిన భీష్ముడి గెటప్ ను విడుదల చేశారు బాలకృష్ణ. అలానే ఎన్టీయార్ ‘జగదేకవీరుని కథ’లోని శివశంకరీ గీతాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఆలపించారు. తాజాగా యన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’ విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందట.
యన్టీఆర్ జయంతి అయిన మే 28న ఉదయం 9.44 గంటల తరువాత బాలకృష్ణ గానం చేసిన ‘శ్రీరామదండకం’ విడుదల కానుంది. యన్టీఆర్ పోషించిన శ్రీరాముని పాత్రల బొమ్మలపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం పోస్ట్ చేసి వీడియోను విడుదల చేయనున్నారు. శ్రీరామపాత్రలో అనితరసాధ్యంగా అభినయించిన రామారావు బొమ్మలు, వాటిపై బాలయ్య గానం చేసిన ‘శ్రీరామదండకం’ గద్యం నందమూరి అభిమానులకు ఆనందం పంచుతుందని ఆశించవచ్చు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ తెలియచేయడం విశేషం.